
ఆయన గొంతు సవరిస్తే కోయిల సైతం చిన్నబోతుంది. ఆయన స్వరం వింటే కోట్లాది మంది హృదయాలలో సప్త స్వరాలు రాగాలు తీస్తాయి. ఆయనే కళా ప్రపూర్ణ, గాన గంధర్వుడు, గాన విధూషి, సుస్వర మాంత్రికుడు శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం గారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, నిర్మాత ఐన ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారు, 04-06-1946. ఇప్పటి తిరువళ్ళురు జిల్లాలోని కోనేటమ్మపేట గ్రామంలో ఎస్పీ సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు జన్మించారు. సంగీతం మీద ఉన్న మక్కువతో ఇళయరాజా గారితో కలిసి ఒక మ్యూజిక్ ట్రూప్ ని ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాలలో సంగీత కచేరీలు ఇచ్చేవారు.

ఎస్పీ కోదండపాణి, ఘంటసాల గార్లు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన ఒక కచేరీలో వాళ్ళ దృష్టిని ఆకర్షించి కోదండపాణి గారి దగ్గర శిష్యరికం చేశారు. ఎస్పీ కోదండపాణి గారు స్వరపరిచిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న సినిమాతో అరంగేట్రం చేసి మొదటి సినిమాతోనే తనదైన ముద్ర వేశారు. కె. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం సినిమాలోని ఓంకార నాదం పాటకు గాను మొట్టమొదటి సారి జాతీయ పురస్కారం గెలుచుకున్న ఆయన ఆ తర్వాత సాగర సంగమం, స్వాతిముత్యం, రుద్రవీణ చిత్రాలకు జాతీయ పురస్కారాలు అందుకున్నారు. అలా ఆయన తన ప్రయాణంలో 16 భాషల్లో, నలభై వేల పైచిలుకు పాటలు పాడి గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం పొంది ఎన్నో మధురానుభూతులు అందించారు. కమలహాసన్, రజినీకాంత్ లాంటి ఎంతో మందికి గాత్ర దానం చేసిన గొప్ప డబ్బింగ్ ఆర్టిస్ట్.

సినీ రంగంలోనే కాకుండా టి.వి. రంగంలో కూడా ఆయన విశిష్టతను చాటుకున్నారు. పాడుతా తీయగా ప్రోగ్రాం ద్వారా ఎంతో మంది నూతన గాయకులను ఆయన ప్రోత్సహించారు. స్వరాభిషేకం కార్యక్రమం ద్వారా ఆయన అనుభవాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. దక్షిణాదిన మొదలుకొన్న ఆయన విజయ పరంపర దశాబ్దాల పాటు ఉత్తరాదిన కూడా కోనసాగింది. శంకరాభరణం , ఏక్ దూజే కే లియె, సాగర సంగమం, స్వాతిముత్యం, రుద్రవీణ, చిత్రాలకు జాతీయ పురస్కారాలను అందుకున్నారు. 25 పైగా చిత్రాలకు ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అవార్డులను గెలుచుకున్నారు. కళా ప్రపూర్ణ, గాన విదూషి, లాంటి బిరుదులూ పొందిన ఆయన, ఆంధ్రా విశ్వవిద్యాలయం, లాంటి మొదలగు విశ్వవిద్యాలయాల నుండి గౌరవ డాక్టరేట్ లను అందుకున్నారు.

కళా రంగంలో ఆయన విశిష్టతకు భారత ప్రభుత్వం 2001వ సంవత్సరంలో ఆయన్ను పద్మశ్రీతో సత్కరించగా, 2011వ సంవసత్సరంలో పద్మభూషణ్ తో, 2021లో పద్మవిభూషణ్ తో సత్కరించింది. అంతటి గొప్ప వ్యక్తి, గొప్ప కళాకారుడు, గాయకుడు అయిన ఎస్.పీ.బి గారి మరణం కేవలం దక్షిణాదివారికే కాకుండా యావత్ భారతీయ సినీ ప్రేక్షకులకు సంగీతాభిమానులకు జీర్ణించుకోలేని విషయం. ఎంతో మందికి దిశా నిర్దేశం చేసిన అంతటి స్పూర్తిప్రధాత జయంతి సంధర్భంగా ఆయన్ను స్మరించుకుంటూ ఘన నివాళి అర్పిస్తున్నాము.