


అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతో అభిమానుల్ని గెలుచుకున్న లావణ్య త్రిపాఠి డిసెంబర్ 15, 1990 న జన్మించారు. ఆమె నటిగానే కాకుండా మోడల్ గా కూడా పని చేసారు. అలాగే లావణ్య 2006 లో మిస్ ఉత్తరాఖండ్ టైటిల్ గెలుచుకుంది.
జననం

లావణ్య త్రిపాఠి పుట్టింది ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో అయినప్పటికీ పెరిగింది మాత్రం డెహ్రాడూన్ లో. ఆమె తండ్రి హైకోర్టు, సివిల్ కోర్టులో ఒక న్యాయవాది, ఆమె తల్లి ఒక రిటైర్డ్ టీచర్. తనకి ఒక చెల్లి మ రియు తమ్ముడు ఉన్నారు. ఇక లావణ్య డెహ్రాడూన్లోని మార్షల్ స్కూల్ నుండి స్కూలింగ్ పూర్తి చేసి ఆ తర్వాత ముంబైకి వెళ్లి అక్కడ రిషి దయారామ్ నేషనల్ కాలేజీ నుండి ఎకనామిక్స్ లో డిగ్రీ పొందింది. లావణ్యకి ఎప్పటినుంచో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ లోకి రావాలని ఉండేదంట కానీ తన తండ్రి మాత్రం ముందు చదువు పూర్తి చేయమని చెప్పావారు. ఇక ఆమె చదువు అయిపోయిన వెంటనే మోడలింగ్ లోకి వచ్చి టీవీ యాడ్స్ లో నటించడం మొదలుపెట్టింది.

లావణ్యకి భరతనాట్యంలో అనుభవం ఉంది. ఆమె నాట్యాన్ని మనం ‘భలే భలే మగడివోయ్’ సినిమాలో చూడొచ్చు. అంతే కాకుండా లావణ్య త్రిపాఠి ఎలాంటి పారితోషికం తీసుకోకుండా తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్‌మెంట్ వారి ప్రకటనలో కూడా నటించింది. దీనితో పాటు ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్స్ లో కూడా లావణ్య కనిపించింది. తన ఫ్రెండ్ సలహా మేరకు లావణ్య అందాల రాక్షసి ఆడిషన్స్ కి వెళ్ళింది. అక్కడ దర్శకుడు హను రాఘవపూడి ఆమెని చూసి 2012 వచ్చిన ‘అందాల రాక్షసి’ సినిమాలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో లావణ్య తను చేసిన మిధునా పాత్రకి విమర్శకుల ప్రశంసలు అందుకోవటమే కాకుండా మా టివి నుండి బెస్ట్ డెబ్యూ అవార్డును గెలుచుకుంది. ఆ తర్వాత ఆమె చేసిన దూసుకెళ్తా సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఇక 2014 లో, ఆమె బ్రహ్మాన్ సినిమాతో తమిళంలోకి అడుగుపెట్టింది, ఈ సినిమాలో లావణ్య గాయత్రీ అనే జర్నలిస్ట్ పాత్ర పోషించింది. ఆ తర్వాత విజయ్ సేతుపతి హీరోగా నటించిన నానుమ్ రౌడీదాన్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చినప్పటికీ ఆ సినిమా వేరే ప్రొడక్షన్ హౌస్ చేతుల్లోకి వెళ్ళటంతో లావణ్య ఆ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం లావణ్య చావుకబురు చల్లగా చిత్రంలో నటిస్తోంది. మంచి పాత్రలతో ఆమె దూసుకేల్తోంది.


