కోట శ్రీనివాసరావు

ఏ పాత్రని అయిన అలవోకగా చేయగల విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు గారు. అటు కామెడీ , ఇటు ట్రాజెడీ , ఎంతటి ఎమోషన్ అయిన సత్తా అది కొద్దీ మంది నటుల్లో కోట గారు ఒకరు. తెలుగు సినీ పరిశ్రమలో కోట గారికి నటుడుగా ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది.కాలం మరీనా కానీ ఆయన లోని డైలాగు డెలివరీ నటన మారలేదు. విలన్ గా , హాస్య నటుడుగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి అభిమానులని సంపాదించుకున్నారు.

1945, జులై 10న కోట శ్రీనివాస రావు గారు  కృష్ణా జిల్లా కంకిపాడులోని తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. కోట గారికి ఒక అన్నయ్య నరసింహారావు గారు తమ్ముడు శంకర్ రావు గారు తో పాటు ఇద్దరు అక్కలు ఇద్దరు చెల్లాళ్ళు కూడా ఉన్నారు.  ఆయన తండ్రి కోట సీతారామాంజనేయులు కంకిపాడులో ప్రసిద్ధి చెందిన వైద్యుడు.కోట గారి ప్రాథమిక విద్య అభ్యాసం కంచిపడు లో జరిగింది. మాధ్యమిక విద్యాభ్యాసం విజయవాడలో జరిగింది.కాలేజ్ చదువు అంత మద్రాస్ లో జరిగింది. కోట గారి నాన్న గారు ఆయన పెద్ద కొడుకు అయిన నరసింహ రావు గారికి ఆయనలా డాక్టర్ చేయాలని అనుకున్నారు. కానీ నరసింహారావు గారికి నాటకాల మీద ఉన్న ఆసక్తి తో చదువు మీద ఎక్కువగా ధ్యాస చూపించలేదు. అయితే వాళ్ళ ఊర్లో వాళ్లంతా మీ పెద్ద కొడుకు ఎలాగో డాక్టర్ కాలేదు కనీసం రెండో కొడుకుని అయిన డాక్టర్ ఎలాగేనా చేయాలని అని అనేవారు. కోట గారి తండ్రి ఆలోచనలు కూడా అలానే ఉండేవి . ఈ విషయం కోట గారిని ఆయన తండ్రి అడుగుతే మనసులో నాటకాల మీద ఇష్టం ఉన్నప్పటికీ తండ్రి ని నొప్పించడం ఇష్టం లేక మెడిసిన్ చదవటానికి ఒప్పుకున్నారు.

అలా ఆయన ఎంబీబిఎస్ కోసం మద్రాస్ కి వెళ్లారు. కాలేజ్ లో చదివేటప్పుడు ఒకసారి కోట గారు సొంత ఊరికి వచ్చారు. అక్కడ ఆయన అన్న నరసింహ రావు గారు వేసిన నాటకం చూసి అందరూ ఆయన్ని మెచ్చుకున్నారు. అలా అన్న అందరి మన్ననలు పొందుతుంటే కోట గారికి కూడా నాటకాల్లో నటించాలని ఆసక్తి వచ్చింది. అలా వెంటనే ఆయన అన్నగారిని అడిగి కోట గారు నాటకంలో మెళకువలు అన్ని నేర్చుకున్నారు. అలాగే ఆయన కోట గారికి కొన్ని నాటకాల్లో వేషాలు కూడా ఇచ్చారు. అలా ఆయన నటనలో మెలకువలు కూడా నేర్చుకున్నారు. ఇలా నాటకాలు చేస్తూ చదువు మీద పూర్తిగా శ్రద్ధ తగ్గించేసి మెడిసిన్ చేయలేను అని బి కామ్ చేశారు.

అలా ఆయన డిగ్రీ పూర్తి చేసి ఒక పక్క నాటకాలు వేస్తూనే ఇంకో పక్క ఉద్యోగాలు వెతుకునేవారు. కొన్నాళ్ళకి కోట గారికి ఎస్ బి ఐ బ్యాంక్ లో ఉద్యోగం వచ్చింది. ఆయన ఉద్యోగం చేసుకుంటూనే నాటకాలు నాటికలు వేసేవారు.ఆ తర్వాత కోట గారు ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చారు.ఆయన ఒకసారి ప్రాణం ఖరీదు నాటకంలో చేసిన నటనని చూసి డైరెక్టర్ క్రాంతి కుమార్ గారు ఈ నాటకాన్ని ఎలా అయినా సినిమా చేయాలని నిర్మాతలని ఒప్పించి సినిమా మొదలుపెట్టారు. క్రాంతి కుమార్ గారు నాటకం చూసినప్పుడు ఈ నాటకంలో అందరికి సినిమాలో ఛాన్స్ ఇవ్వాలి అని ఫిక్స్ అయ్యారు. అలా కోట గారికి మొదటిసారి సినిమాల్లో ఛాన్స్ వచ్చింది.

సినీ జీవితం

1978లో విడుదలైన మెగాస్టార్ చిరంజీవి మొదటి సినిమా ‘ప్రాణం ఖరీదు’ తో తెరంగేట్రం చేసిన కోట గారికి ఆ సినిమాలో 100 రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చారు. ఆ డబ్బులని మళ్ళీ ప్రొడక్షన్ వాళ్ళకే ఇచ్చేసి కోట గారు హైదరాబాద్ కి వచ్చేసారు. ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా చిన్నది. క్లైమాక్స్ లో వచ్చే గుంపులో ఆయన కనిపిస్తారు . ఆ తర్వాత కోట గారు 3 సంవత్సరాల పాటు సినిమా అవకాశాలు వచ్చినా పెద్దగా పట్టించుకోకుండా ఉద్యోగం చేసుకుంటూ నాటకాలు వేస్తూ ఉండేవారు .అలా 1982 లో మీరైతే ఏమి చేస్తారు అనే నాటకం రవీంద్ర భారతిలో ప్రదర్శించారు. ఆ నాటకంలో కోట గారి నటనని డైరెక్టర్ టి కృష్ణ గారు చూసారు. ఆయన తీయబోయే ప్రతిఘటన అనే సినిమాలో కోట గారికి ఒక పాత్ర ఇవ్వాలని అనుకున్నారు. కానీ అ విషయం కోట గారికి చెప్పలేదు. అయితే ఆ తర్వాత కోట గారి నాటకాన్ని చూసిన జంధ్యాల గారు 1982లో వచ్చిన మూడు ముళ్ళు అనే సినిమాలో శాస్త్రి గా ఒక చిన్న పాత్రని ఇచ్చారు.ఆ తర్వాత చిరంజీవి గారి దేవంతకుడు సినిమాలో కూడా ఆయనకి ఒక చిన్న వేషం దొరికింది.

ఆ తరువాత అనుకున్నట్టుగానే టి కృష్ణ గారు ప్రతిఘటన సినిమాని మొదలుపెట్టి అందులో కోట గారికి పొలిటీషన్ కాశీ పాత్ర ఇచ్చారు. బ్యాంక్ వాళ్ళని సెలవులు అడిగి ఆయన మద్రాస్ లో జరుగుతున్న ప్రతిఘటన షూటింగ్ లో పాల్గొన్నారు. 1985 లో వచ్చిన ప్రతిఘటన బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలో ఆయన పాత్రకి కూడా మంచి ఆదరణ లభించింది. ఈ సినిమా చూసి తెలుగు సినిమా కి మరో విలన్ దొరికాడు అని అందరూ అనుకున్నారు.

ఈ సినిమా తో ఆయనకి విలన్ గా చాలా అవకాశాలు వచ్చాయి. అయితే లోపు జంధ్యాల గారు రామానాయుడు గారు కలిసి  ‘అహనా పెళ్ళంట’ చిత్రన్ని మొదలుపెట్టారు. ఈ సినిమాలో ఉన్న పిసినారి పాత్రకి రావు గోపాల్ రావు ని పెడదాం అని రామ నాయుడు గారు జంధ్యాల గారికి చెప్పారు.కానీ జంధ్యాల గారు మాత్రం ఆ పాత్రకి కోట గారే బాగుంటారు అని చెప్పారు.చివరికి కోట గారితో ఫోటో షూట్ చేశాక కోట గారు సరిగ్గా సరిపోతారని రామానాయుడు గారు , అలాగే రావు గోపాల్ రావు గారు కూడా ఒప్పుకున్నారు. 1987 లో వచ్చిన ఆహా నా పెళ్ళంటా   ఈయనకు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. అందులో పిసినారి ‘లక్ష్మీ పతి’ పాత్రలో ఈయన పరకాయ ప్రవేశం చేశారనే చెప్పొచ్చు. జంధ్యాల డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రాన్ని దివంగత స్టార్ ప్రొడ్యూసర్ డి.రామానాయుడు గారు నిర్మించారు.ఈ సినిమా తెలుగు కామెడీ సినిమాల్లో ఒక గొప్ప చిత్రం అని చెప్పుకోవచ్చు. ‘అహానా పెళ్ళంట’ చిత్రం కథ మొత్తం కోటా శ్రీనివాసరావు పాత్ర చుట్టూనే తిరుగుతుంది కాబట్టి.. ఈయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది అని చెప్పొచ్చు.ఈ పాత్ర కోట గారి కెరీర్ లోనే కాదు తెలుగు సినీ చరిత్రలో గుర్తుండిపోతుంది.ఇక ఆ చిత్రం తరువాత ఈయన వెనక్కు తిరిగి చూసుకోలేదు.

అయితే ఇదే సంవత్సరం ఆయనకి ఇంకొక చేదు అనుభూతి కూడా జరిగింది అదేంటి అంటే ఆయన నటించిన మండలాదీసుడు సినిమాలో అప్పట్లో తెలుగు ప్రజల్లో బాగా పాపులర్ అయిన ఎన్టీఆర్ గారికి వ్యతిరేకంగా నటించి విమర్శలని పొందారు. ఈ సినిమా చేయడం ఆయన ఒక పొరపాటుగా ఆయన భావిస్తారు. ఈ సినిమాకి కోట గారికి లక్ష రూపాయలు ఇస్తాం అన్నారు కానీ 30 వేలు మాత్రమే ఇచ్చారట. అయితే ఈ సినిమా వల్ల కోట గారు చాలా అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది.ఒకసారి ఎన్టీఆర్ గారి అభిమానులు కోట గారికి విజయవాడ రైల్వే స్టేషన్ లో  కొట్టారు కూడా. ఒక సంవత్సరం పాటు కోట గారికి ఈ సినిమా బెడద తప్పలేదు.ఈ సినిమాకి అటు రెమ్యూనరేషన్ సరిగ్గా లేక ఇటు ఎన్టీఆర్ అభిమానులతో కూడా అవమానం ఇలా ఆయన కెరీర్ లో  మండలదీసుడు సినిమా పెద్ద మచ్చ గా మిగిలిపోయింది. అయితే కొన్నాళ్ళకి ఈ విషయం చల్లబడటంతో ఆయన వరసగా సినిమాలు చేయడం మొదలుపెట్టారు.ఆ తర్వాత కోట గారు వరుస అవకాశాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతూ వచ్చారు. అగ్ర హీరోలందరితో ఈయన నటించారు. కమెడియన్ గా విలన్ గా, విలక్షణ నటుడుగా ఈయన పోషించినన్ని పాత్రలు మరే నటుడు చెయ్యలేడు అనడంలో అతిశయోక్తి లేదు.

ఇక అప్పుడే  కోట శ్రీనివాసరావు గారి బాబు మోహన్ గారి కాంబినేషన్ మొదలయ్యింది. వీరి ఇద్దరు కలిసి తొలిసారి నటించిన సినిమా వెంకటేష్ హీరోగా నటించిన ‘బొబ్బలి రాజా’. బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తొలిసారి కోట శ్రీనివాస రావు, బాబు మోహన్ కాంబినేషన్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అలా వీరి కాంబినేషన్ లో వచ్చిన సెన్సేషన్ చిత్రం మామగారు. ముత్యాల సుబ్బయ్య గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో బాబు మోహన్, కోట గారి కామెడి కి చాలా భాగం ఉంది. ఆ తర్వాత వీళ్లు ఎక్కువగా ఇవివి సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి వంటి దర్శకుల చిత్రాల్లో ఎక్కువగా కలిసి నటించారు. వీళ్లిద్దరు కలిసి దాదాపు 60 పైగా సినిమాల్లో జోడిగా నటించారు. ఒకప్పుడు కోట శ్రీనివాస రావు, బాబు మోహన్ జోడి లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు.అలా ఆయన చేయలేని పాత్ర అంటూ ఉండేది కాదు.1993 లో వచ్చిన జాంబలకడి పంబ సినిమాలో కోట గారు స్త్రీ లాగా నటించి అందరిని ఆయన కామెడీ తో కడుపుబ్బా నవ్వించారు.

ఇక 1993 లో రామ్ గోపాల్ వర్మ గారి డైరెక్షన్ లో వచ్చిన గాయం సినిమా ఆయనకి విలన్ గా మంచి పేరుని తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో ఆయన యాస కూడా కొత్తగా ఉంటుంది.అలాగే రామ్ గోపాల్ వర్మ ఇంకొక చిత్రం గోవిందా గోవిందా , మనీ లాంటి సినిమాలో కూడా కోట గారికి కొత్త తరహా పాత్రలు ఇచ్చి ఆయన లోని నటుడుని బయటపెట్టారు. ఇక కోట గారు నటించిన ఆమె సినిమాలో ఆయన క్లైమాక్స్ లో ఇచ్చే ట్విస్ట్ కి చాలా మంది షాక్ అవుతారు. ఈ సినిమాలో మొదటి నుంచి మంచి మామయ్య లాగా కనిపించిన ఆయన చివరికి అలా మారిపోవడం అందరిని షాక్ చేస్తుంది.

ఆయన చేసిన బెస్ట్ విలన్ పాత్రల్లో గణేష్ సినిమా ముందు వరుసలో ఉంటుంది. తన వృత్తిలో నీతి నిజాయితీగా ఉండే ఒక విలేకరి మెడికల్ మాఫియా వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడో చెప్పే కథ ఇది.ఈ సినిమాలో హెల్త్ మినిస్టర్ గా కోట గారి నటన అద్భుతం అని చెప్పాలి. విలనిజం అంటే ఏంటో ఆయన ఈ సినిమా ద్వారా చూపించారు. గుండుతో మేకప్ వేసుకొని కోట గారిని ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో చూస్తే కచ్చితంగా భయం వేస్తాది. అంతలా పాత్రలో ఆయన ఇమిండిపోయారు. ఈ పాత్ర ఆయన చేసిన విలన్ పాత్రల్లో బెస్ట్ అని చెప్పొచ్చు.

అలాగే కోట శ్రీనివాసరావు గారు తండ్రి పాత్రలు చేయడంలో దిట్ట అని చెప్పొచ్చు . ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో కొడుకు బాధపడటం చూడలేని తండ్రి గా , ఇడియట్ సినిమాలో ఒక రకం తండ్రిగా , బద్రి సినిమాలో ఇంకొక రకం తండ్రిగా ఆయన ఒకటే పాత్ర ని తన నటనతో వివిధ రకాలుగా నటించ గల గొప్ప నటుడు  కోట గారు.ఇక 2005 లో వచ్చిన అతడు సినిమా బాజి రెడ్డి గా సినిమాలో తక్కువ సేపు ఉన్నప్పటికీ ఆయన ఇంపాక్ట్ మాత్రం చాలా ఉంటుంది.ఈ సినిమాలో ఆయన వ్యంగ్యంగా చెప్పే డైలాగ్స్ చాలా బాగా పండాయి.

ఇక ఆయన తండ్రి గా నటించిన బొమ్మరిల్లు మూవీ ఓ సెన్సేషన్. యూత్, ఫ్యామిలీ, చిల్డ్రన్స్ అనే తేడా లేకుండా అందరికీ ఇష్టమైన, నచ్చిన చిత్రంగా బొమ్మరిల్లు నిలిచింది. హీరో సిద్దార్ధ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ బొమ్మరిల్లు. నచ్చింది చేస్తూ, ఇష్టం వచ్చినట్టుగా హ్యాపీ లైఫ్ అనుభవించే హాసినిగా జెనీలియా తెలుగు ప్రేక్షకుల తెగనచ్చేసింది. హాసిని-సిద్ధుల రొమాంటిక్ లవ్ ట్రాక్, ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్ కలగలిపిన పర్ఫెక్ట్ బ్లెండ్ బొమ్మరిల్లు మూవీ. ఈ చిత్రానికి దేవిశ్రీ అందించిన సాంగ్స్ మంచి ఆదరణ దక్కించుకున్నాయి. బొమ్మరిల్లు ఫాథర్ అనే ఒక బ్రాండ్ నేమ్ ఈ సినిమాతో ఏర్పడింది.అలాగే జెనీలియా తండ్రిగా కోట గారు కూడా మంచి నటనని కనబరిచారు.

కుటుంబ క‌థా చిత్రాల‌కు చిరునామాగా నిలచిన క‌థానాయ‌కుడు విక్టరీ వెంకటేష్‌. ఆయ‌న న‌టించిన ప‌లు కుటుంబ కథా చిత్రాలు విశేషాద‌ర‌ణ పొందాయి. వాటిలో ‘ఆడవారిమాటలకు… అర్థాలేవేరులే!’ ఒకటి.ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు గారి నటనకి ఎవరెనా ఫిదా అవ్వాల్సిందే. వెంకటేష్ కోట గారి మధ్య సన్నివేశాలు చాలా గొప్పగా వచ్చాయి. కొడుకు మీద ప్రేమని బయటకి చెప్పలేని తండ్రిలా ఆయన గొప్ప నటనని ఈ సినిమాలో చూడొచ్చు.  ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో వెంకీ సరసన త్రిష కథానాయికగా న‌టించ‌గా… ఇత‌ర ముఖ్య పాత్రల్లో శ్రీరామ్, కె.విశ్వనాథ్, సునీల్, జీవా, క‌ల‌ర్స్‌ స్వాతి, రాజ్యలక్ష్మి, ప్రసాద్ బాబు తదితరులు నటించారు. సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎన్.వి.ప్రసాద్, ఎస్.నాగ అశోక్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. యువన్ శంకర్ రాజా స్వరకల్పనలో రూపుదిద్దుకున్న పాటలన్నీ చార్ట్‌బ‌స్ట‌ర్స్‌గా నిలిచాయి. 2007 ఏప్రిల్ 27న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.

ఆ తర్వాత శ్రీను వైట్ల రెడి సినిమాలో కామెడీ ని పండించిన కోట గారు బుజ్జిగాడు, లీడర్, రగడ, రక్త చరిత్ర లాంటి సినిమాల్లో విలన్ గా మెప్పించారు. అలాగే దూకుడు, మీరపకాయ్ లాంటి సినిమాల్లో విలనిజంలో కామెడీ ని కలిపి నవ్వించారు. ఇక 2012 లో వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో మొదటిసారి కోట గారు పాట కూడా పాడారు. ఆయన పడిన మందు బాబులం మేము మందు బాబులం పాట అప్పట్లో సెన్సేషన్ సృష్టించింది. ఈ పాటలో కోట గారు , పవన్ కళ్యాణ్ గారు కలిసి డాన్స్ వెయ్యడం ఇంకొక హైలైట్. ఇక ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇక ఇదే సంవత్సరంలో వచ్చిన జులాయి సినిమా లో కూడా కోట శ్రీనివాసరావు గారికి మంచి పాత్ర దక్కింది. ఈ సినిమాలో త్రివిక్రమ్ రాసిన ఆయన డైలాగ్స్ కి చాలా క్రేజ్ వచ్చింది. "నీకె తలనొప్పి తెప్పిస్తున్నాడు అంటే వాడు అమృతాంజన్ అమ్మ మొగుడు అయ్యుంటాడు" అని చెప్పే కోట డైలాగ్స్ చాలా ఫేమస్ అయ్యాయి.

కోట శ్రీనివాసరావు గారికి ప్రధాన పాత్రలు ఇవ్వడంలో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందు ఉంటారు. ఆయన 2013 లో వచ్చి ఇండస్ట్రీ హిట్ అయిన అత్తారింటికి దారేది సినిమాలో కోట శ్రీనివాసరావు గారికి సిద్ధప్ప అనే గుర్తుండిపోయే పాత్ర ఇచ్చారు. ఈ సినిమా తర్వాత ఈ సిద్ధప్ప పెరు కి బాగా క్రేజ్ వచ్చింది. ఈ సినిమాలో చూడప్ప సిద్ధప్ప అనే డైలాగు కి ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే కోట గారి పాత్ర సినిమాతో మంచి గుర్తింపు పొందింది.

ఇక ఆయన చేసిన కృష్ణం వందే జగద్గురుమ్, ప్రతినిధి లాంటి సినిమాల్లో పాత్రలకు మంచి పేరు వచ్చింది.అయితే కోట గారికి వయసు పెరిగే కొద్దీ సినిమాలో పాత్రలు రావడం తగ్గాయి. ఆయన ఈ మధ్య చేసిన చిత్రాల్లో కోట గారికి పెద్దగా నటించే అవకాశం రాలేదు. 2019లో వచ్చిన మహర్షిలో ఒక్క సీన్ లో కనిపించి మాయమయిన ఆయన మళ్ళీ ఆ తర్వాత ఏ సినిమాలోనూ పెద్ద పాత్రలో కనిపించలేదు. గ‌త 30 ఏళ్లుగా రోజుకు 20 గంట‌లు ప‌ని చేస్తూ వ‌చ్చిన ఈయ‌న‌ ఇప్పుడు ఖాళీగా ఉండ‌టం అస్స‌లు న‌చ్చ‌డం లేదట. ఇదే విష‌యాన్ని గతంలో మీడియా ముందు వచ్చి కూడా చెప్పాడు. త‌న‌ను ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేదో.. అస‌లెందుకు అవ‌కాశాలు ఇవ్వ‌డం లేదో త‌న‌కు కూడా అర్థం కావ‌డం లేదని ఆయన చెబుతున్నారు.

వ‌య‌సు అయిపోయింద‌ని ఇక న‌డ‌వ‌లేడ‌ని ముందే నిర్ణ‌యించుకుని త‌న‌ను ప‌క్క‌న‌బెట్టేసారేమో అని కూడా ఆయన ఆ సభలో చెప్పుకొచ్చాడు. ఆయన అప్పుడు చెప్పినట్టుగానే ఆయన పరిస్థితి ఇప్పుడు కదలలేనంత దారుణంగా ఉందని అంటున్నారు. అందుకే సినిమాలు కూడా ఎవరూ ఇవ్వడంలేదని అంటన్నారు. అయితే 700 లకి పైగా సినిమాలు చేసిన కోట గారు మన తెలుగు సినీ పరిశ్రమలో గొప్ప నటుల్లో ఒకరని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు.

కోట శ్రీనివాసరావు  తెలుగు నటులకు జరుగుతోన్న అన్యాయంపై చాలా సార్లు గట్టిగా మాట్లాడారు. తెలుగు నటులకు కాస్త పనిదొరికేలా చూడాలని ‘మా’ అసోసియేషన్ కూడా చాలా సార్లు కోరారు. ఒకసారి కోట గారు మా సమావేశంలో తాను పరభాషా నటులకు బద్ధ వ్యతిరేకినని చాలా మంది అంటుంటారని, అది తప్పని కోట పునరుద్ఘాటించారు. తెలుగు నటులకు సినిమాల్లో అవకాశాలు దొరికేలా ‘మా’ చర్యలు తీసుకోవాలని కోట కోరారు. కనీసం నెలలో 10నుంచి 15 రోజులు తెలుగు ఆర్టిస్టులకు పని దొరికితే పింఛన్లు తీసుకునే గతి వాళ్లకు పట్టదని కోట గారు ఫైర్ అయ్యారు. ఇలా ఆయన తెలుగు నటుల కోసం కూడా చాలా పోరాడారు.

కోట గారు తెలుగులోనే కాకుండా హిందీలో అమితాబ్ తో కలిసి సర్కార్ లాంటి సినిమాలని కలిపి 10సినిమాల్లో నటించారు. తమిళంలో 34 సినిమాలు మలయాళంలో ఒక సినిమాలో నటించి మెప్పించారు.

వ్యక్తిగత జీవితం

1968లో కోట శ్రీనివాసరావు గారికి రుక్మిణి గారితో వివాహమయ్యింది. వీరికి ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు.ఆయన పేరు కోట ఆంజనేయ ప్రసాద్. 2010 జూన్ 21 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు.

గాయం 2సినిమాలో ఆంజనేయ ప్రసాద్ గారు విలన్ గా నటించాడు. జగపతిబాబు హీరోగా వచ్చిన ఈ సినిమా అంతగా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. అయితే ఇందులో కోట శ్రీనివాస రావు కొడుకు ఆంజనేయ ప్రసాద్ నటనకు మాత్రం ప్రశంసలు దక్కాయి. తెలుగు ఇండస్ట్రీకి మరో మంచి విలన్ దొరికాడని అప్పట్లో అంతా సంబరాలు కూడా చేసుకున్నారు. అయితే ఇక్కడే అసలు విషయం దాగి ఉంది. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఆంజనేయ ప్రసాద్ ను చంపి పాడి మీద పడుకోబెట్టే సీన్ ఉంటుంది. పైగా కోట శ్రీనివాసరావు తన కొడుకుకు తల కొరివి పెట్టాలి. ఆ సన్నివేశం చేస్తున్నప్పుడు కోట బాగా ఎమోషనల్ అయిపోయాడు. ఇదే విషయం హీరో జగపతిబాబుకు కూడా చెప్పానని కోట తెలిపాడు. ఎంతైనా వాడు నా కొడుకు.. వాన్ని అలా పాడే మీద నేను చూడలేకపోతున్నా.. ఈ సన్నివేశం నేను చేయలేను అంటూ జగపతిబాబుకు చెప్పాడు కోట శ్రీనివాసరావు. ఆయన ఎమోషన్ అర్థం చేసుకున్న హీరో ఈ ఒక్క సన్నివేశాన్ని డూప్ తో చేసేద్దాం అని చెప్పాడు. అయితే ఈ సన్నివేశాన్ని చిత్రీకరించిన వారం రోజుల తర్వాత నిజంగానే రోడ్డు ప్రమాదంలో ఆంజనేయప్రసాద్ చనిపోయాడు. తన కళ్ళ ముందే ఎదిగిన కొడుకు చనిపోవడంతో కోట శ్రీనివాసరావు బాగా కృంగిపోయాడు. ఇలాంటి దారుణమైన స్థితి ఎవరికీ రాకూడదని కోరుకుంటున్నారు కోట గారు.

ఇక కోట శ్రీనివాస రావు 1999లో బీజేపీ తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కోట గారికి సొంత ఊరు అంటే చాలా ఇష్టమట. కోట గారు ఆయన కొడుకుని కూడా ప్రయోజకుడిని చేసి… తన సొంత ఊరుకి వెళ్ళి సెటిల్ అవుదామని అనుకున్నారట కానీ అది జరగలేదు. ప్రస్తుతం ఆయన మనువడి కోసమే కోటా గారు హైదరాబాద్ లోనే ఉంటున్నట్టు తెలుస్తుంది.

అవార్డ్స్

కోట శ్రీనివాస రావు గారు చేసిన ప్రతిఘటన, గాయం, తీర్పు, లిటిల్ సోల్జర్స్, గణేష్, చిన్న, పృథ్వీ నారాయణ,  ఆ నలుగురు, పెళ్లైన కొత్తలో సినిమాల్లో నటనకి గాను ఉత్తమ విలన్ గా మరియు ఉత్తమ సహాయ నటుడుగా 9 నంది అవార్డ్స్ లభించాయి. అలానే 37 సంవత్సరాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో విజయవంతమైన నటుడిగా కొనసాగుతున్న కోట గారిని పద్మ అవార్డులలో భాగంగా పద్మశ్రీ అవార్డ్ తో భారత ప్రభుత్వం సత్కరించింది. అలాగే ఆయనకి అల్లు రామలింగయ్య గారిపురస్కారం కూడా దక్కింది.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.