
కరోన దాహార్తికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. సామన్యుల నుండి సెలబ్రిటీల వరకూ ఈ మహమ్మారి ఎవ్వరిని వదలటం లేదు. సినీ పరిశ్రమలో ఎంతోమందిని కరోన పొట్టన పెట్టుకుంటోంది. ప్రముఖ పాత్రికేయుడు, వ్యాఖ్యాత, నటుడు తుమ్మల నరసింహ రెడ్డి (టి.ఎన్.ఆర్) గారు కరోన కారణంగా కన్నుమూసారు. ఫ్రాంక్లీ విత్ టి.ఎన్.ఆర్ అంటూ సినీ పరిశ్రమకు చెందిన వారి నుండి రాజకీయ నాయకుల వరకూ ఎంతోమందిని ఇంటర్వ్యూ చేసారు. పాత్రికేయుడిగానే కాకుండా నటుడిగా కూడా తన ప్రతిభను చాటారు.

టి.ఎన్.ఆర్ గారు ఇప్పటి మంచిర్యాల్ అప్పటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పావునూర్ అనే కుగ్రామంలో 1976 జనవరి 9న జన్మించారు. వ్యక్తిగత విషయాలను ఆయన ఎక్కాడా ప్రస్తావించకపోవడం గమనార్హం. సినీ పరిశ్రమలో స్థిర పడాలనే ఉద్దేశంతో ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ కు వచ్చిన ఆయన ప్రముఖ సినీ నటుడు, రచయిత, దర్శకుడు అయిన ఎల్.బీ శ్రీరాం దగ్గర సహాయ రచయతగా పనిచేసారు. ఆ తర్వాత ఈ టీవీలో ప్రసారమైన ‘నేరాలు ఘోరాలు’ సిరీస్ కి 4 ఏళ్ల పాటు దర్శకుడిగా పనిచేసారు. ఆ తర్వాత టి.ఎన్.ఆర్ ఇంటర్వ్యూస్ పేరుతో సినీ నటుల్ని, దర్శకులని ఇంటర్వ్యూస్ చేసారు. సెలబ్రిటీస్ తో చేసిన ముఖాముఖిలు ఆయనకు మంచి పేరును తీసుకు వచ్చాయి.

ఇక ఆకడి నుండి ఆయన వెనుదిరిగి చూసింది లేదు. సినీ దిగ్గజాలనే కాకుండా ఎందరో రాజకీయ నాయకుల్ని కూడా ఆయన ఇంటర్వ్యూస్ చేసారు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో దిగ్గజాలుగా పిలవబడే చాలామందిని ఆయన తన ముఖాముఖిలతో ప్రేక్షకులకు మరింత దగ్గర చేసారు. ఫ్రాంక్లీ విత్ టి.ఎన్.ఆర్ అంటూ సాగే ఆయన ఇంటర్వ్యూస్ కి మంచి ఆదరణ ఉంది. యూత్ లో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉండటం విశేషం.

కేవలం సెలబ్రిటీల పర్సనల్ విషయాలనే కాకుండా వారి క్రాఫ్ట్స్ గురించి ఆయన తన ముఖాముఖిల్లో ప్రస్తావించేవారు. ఆయన తన ఇంటర్వ్యూస్ లో ముఖ్యంగా దర్శకుల వర్కింగ్ స్టైల్ ను తెలుసుకోవటానికి ఆసక్తిని చూపిస్తుంటారు. రచయిలతో, దర్శకులతో ముఖాముఖీలు చేసేటప్పుడు వారి అనుభవాల్ని అడిగి తెలుసుకునే వారు. వారితో కథల గురించి చర్చించే వారు. ఏదైనా ఒక కథ గురించి మాట్లాడుతూ దానిలో ఉన్న లోపాలేమిటి ఒకసారి చేసిన పొరపాట్లని మరోసారి చేయకుండా ఎలా జాగ్రత్త పడాలి అనే విషయాలను ఆయన కథకులతో చర్చించేవారు.

దిగ్గజ దర్శకుల నుండి నటుల వరకు పరిశ్రమలో దాదాపు అందరినీ ఆయన ఇంటర్వ్యూ చేసారు. ఆయన ఇంటర్వ్యూలు ఎవైన సరే మినిమం 3 గంటలు ఉంటాయి. అంత సేపు వేరే ఎవరిదైన చూస్తే ఖచ్చితంగా బోర్ కొడుతుంది కాని టి.ఎన్.ఆర్ ఇంటర్వ్యూస్ అలా కాదు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకూ సరదాగా సాగిపోతుంటాయి. అందుకే ఆయన ఇంటర్వ్యూస్ కి జన్నాల్లో అంత క్రేజ్ ఏర్పడింది. ఒక విధంగా సినీ జర్నలిజం మారేందుకు ఎంతగానో సహకరించారు.

పాత్రికేయుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న ఆయన నటుడిగా కూడా మంచి పేరును తెచ్చుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో నటిస్తూ నటుడిగా కూడా తన ట్యాలెంట్ ను నిరూపించుకుంటున్నారు. ఇటీవలే వచ్చిన ప్లేబ్యాక్ చిత్రంలో ప్రతినాయక పాత్ర పోషించి ప్రేక్షకుల్ని మెప్పించారు. డైరెక్టర్ అవ్వాలనే కోరికతో పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన ఇటీవలే తన దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు కాని అనుకోకుండా ఇలా కరోన కారణంగా కాచిగూడలోనీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు.

టి.ఎన్.ఆర్ గారికి ఇద్దరు పిల్లలు ఒక కూతురు, కొడుకు ఉన్నారు. లాక్డౌన్ లో ఎక్కువగా పిల్లలతో గడుపుతూ బుక్స్ చదువుతూ కాలక్షేపం చేస్తున్న ఆయన రీసెంట్ గా ఒక వీడియోను కూడా షేర్ చేసారు. ప్రజలందరూ మాస్కులు వేసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలి, పిల్లలతో, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి అంటూ జాగ్రత్తలు చెప్పిన ఆయనకే ఇలా అవ్వటం చాలా బాధాకరం. ఆయన మృతి పట్ల సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనయింది. ఆయన మృతిని జీర్ణించుకోలేక పోతున్నామని పలువురు తమ సంతాపాన్ని తెలియజేసారు.