'తానా' వారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలను సన్మానించడం ఎంతో అభినందనీయం : మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు!!

ఉత్తర అమెరికాలో స్థిరపడ్డ  తెలుగు వారి కోసం ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఏర్పాటైన ప్రసిద్ధి సంస్థ 'ఉత్తర అమెరికా తెలుగు సంఘం' (Telugu Association of North  America  లేదా TANA). ఈ సంఘం1978లో అధికారికంగా ఏర్పాటైంది. అయితే తానా మొదటి జాతీయ సమావేశం ఒక ఏడాది ముందే 1977 లో జరిగింది. అమెరికాలో  నివసిస్తున్న తెలుగు వారికి ఏదైనా ఆపద వచ్చినా, సమశ్యలొచ్చినా... ఇండియా అమెరికా ప్రభుత్వాలకు వారధిగా వుంటూ తగిన పరిష్కరం చూపిస్తూ, ఉభయ తెలుగు రాష్ట్రాలవారికి అండగా పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తోంది. అమెరికాలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి, పరివ్యాప్తం చేయడానికి, తెలుగు ప్రజల, వారి సంతతి యొక్క గుర్తింపుని కాపాడడానికి, పెళ్లి సంబంధాలు కలపడానికి, అక్కడ ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే..ఆ భౌతిక కాయాన్ని వారి సొంత వూరికి చేర్చడంలో తమవంతు సహాయాన్ని అందిస్తూ, తెలుగు సాహిత్య, సాంస్కృతిక, కళా,  విద్యా, సాంఘిక, సేవా చర్చలకు ఓ వేదికగా నిలవడానికి ఈ సంఘం కృషి చేస్తోంది. అంతే కాకుండా అమెరికా లో వున్నాతెలుగువారందరిని ఒక చోటకు చేర్చి కుటుంబ వేడుకగా ప్రతీ సంవత్సరమ్ మూడు రోజులపాటు ఉత్సవాలు జరుపుకోడానికి తానా ఏర్పాటు చేస్తుంది. ఈ ఏడాది ప్రత్యేకంగా అక్కడ వారు చేసే కార్యక్రమాలను రెండు తెలుగు రాష్ట్రాలలో జరుపుకోవాలని షుమారు 10 కోట్ల రూపాయలతో డిసెంబర్ 2 నుండిజనవరి 4వరకు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా డిసెంబర్ 16న సాయంత్రం 'తానా కళారాధన' పేరిట  తెలుగు సినీ రంగంలో విశేష కృషి చేసిన సీనియర్స్ కి సన్మాన కార్యక్రమం హైదరాబాద్ శిల్ప కళా వేదిక పై ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  మాజీ ఉప రాష్ట్రపతి  శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు ముఖ్య అతిధి గా విచ్చేసి  సినిమా లెజెండ్ లను  సత్కరించారు.  ఈ కార్యక్రమంలో నాటి సినీ నటీనటులు కృష్ణవేణి, నటులు కోట శ్రీనివాసరావు, మురళీమోహన్‌, గిరిబాబు, గాయని సుశీల, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, దర్శకుడు కోదండరామిరెడ్డితోపాటు గాయని సునీత, మాజీ ఎంపి యార్లగడ్ల లక్ష్మీప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

తానా వారు కళా రంగానికి తగిన గుర్తింపునిచ్చారు
ఈ కార్యక్రమంలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ: ఖండాంతరాలు దాటి వెళ్ళినా జన్మభూమి ఋణం తీర్చుకొంటున్న తానా సంస్థ సేవలను అభినందించారు. ఈ రోజు ఇక్కడకు విచ్చేసిన కళామతల్లి ముద్దు బిడ్డలు కృష్ణవేణి,  కోట శ్రీనివాసరావు, మురళీమోహన్‌, గిరిబాబు, గాయని సుశీల, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, కోదండరామిరెడ్డి వంటి వారిని అమెరికా నుండి ఇక్కడకు వచ్చి వాళ్ళను తగినరీతిలో సత్కరించడం అనేది కళారంగాని వారు ఎంత ప్రాముఖ్యత నిచ్చారో ఈ సభను చూస్తే అర్ధ మౌతుంది.   మాతృ మూర్తిని, మాతృ భాషను, ఉన్న వూరిని, గురువులను ఎన్నటికీ మరువరాదని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోకన్నా అమెరికాలో తెలుగు వెలుగుతోందని, మాతృభాష అభివృద్ధి కోసం ప్రవాసులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నారని, ఇక్కడున్న తెలుగువారు వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని వెంకయ్యనాయుడు తెలిపారు.  ముందు మన భాషను నేర్చుకోవాలి, ఆ తరువాతే ఆంగ్లం నేర్చుకోవాలి అని చెబుతూ, పిల్లలు మాతృభాషలో మాట్లాడేలా చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలని కోరారు. ఇతర భాషలు నేర్చుకోవడంలో తప్పులేదు.. కానీ అమ్మభాషను మరిచిపోరాదని, మాతృభాషలో చదవడం వల్ల ఉన్నతపదవులు రావన్న భావన వద్దని అంటూ, ప్రస్తుత రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ మాతృభాషలోనే చదువుకుని ఉన్నత పదవులను చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా ఉదహరించారు. తానూ కూడా పల్లెటూరులో మాతృభాషలో చదువుకున్న విషయాన్ని గుర్తు చేశారు.  

పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ: "అమెరికా సంయుక్త రాష్ట్రాలనుండి ఇక్కడకు వచ్చి తెలుగు భాష మీద ప్రేమతో తెలుగు వారి మీద అభిమానంతో, ఈ కార్యక్రమాలను ఎంత అద్భుతంగా నిర్వహించడం తానా వారిని అభినందిస్తున్నాను. T A N A అంటే తెలుగు అసోసియేషన్ అఫ్ నార్త్ అమెరికా అనే కాదు 'తెలుగువారు అందరూ నా వారే' అనుకోవడం లాంటిది నాకు అనిపిస్తుంది." అన్నారు

మురళి మోహన్ మాట్లాడుతూ: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చిన్నప్పటినుండి కస్టపడి చదువుకుని ఉన్నత ఉద్యోగాల కోసం సప్త సముద్రాలూ దాటి అక్కడ ఉన్నతమైన   ఉద్యోగాలు చేస్తూ, మనం గర్వపడేలా అక్కడ నివసిస్తున్న మన తెలుగు వారందరికీ అభినందనలు. ఇక్కడ మన కళలను మరచి పోయాము కానీ అమెరికా లో ప్రతీ ఏడాది ఒక పండగలాగా ఇక్కడనుండి కళాకారులను ఆహ్వానించి మన కళలను ఆదరిస్తున్న తానా వారు ఇక్కడకు వచ్చి మమ్మలి సన్మానించడం తెలుగు వారి పట్ల వారికున్న అభిమానం ఎంతటిదో అర్ధమౌతుంది." అన్నారు.        

ఈ కార్యక్రమంలో అలనాటి సినీ నటి కృష్ణవేణి, నటులు కోట శ్రీనివాసరావు, మురళీమోహన్‌, గిరిబాబు, గాయని సుశీల, రచయిత పరుచూరి గోపాలకృష్ణ,  దర్శకుడు కోదండరామిరెడ్డి, గాయని శోభారాజు, సంగీత గురువు రామాచారి, సినీనటుడు బ్రహ్మానందం, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ తదితరులను సన్మానించారు. అంతకుముందు ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. గురు రామాచారి ఆధ్వర్యంలో వారి శిష్యులు దాదాపు 80 మంది చేసిన గణేశ వందనంతో కార్యక్రమాలను ప్రారంభించారు. సౌందర్య కౌశిక్‌ చేసిన నాట్య ప్రదర్శన ఆకట్టుకుంది. రమాదేవి శిష్యులు చేసిన నృత్య ప్రదర్శన కూడా ఆకట్టుకుంది. దాదాపు 85 మందికిపైగా కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వాతి అట్లూరి గారు ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడంలో సహకరించి విజయవంతం చేశారు.

ఈ కార్యక్రమంలో అమెరికాలో 20 సంవత్సరాలకు పైగా తెలుగు ఎన్నారైలకు ప్రింట్ అండ్ వెబ్ సైట్ ద్వారా సేవలందిస్తున్న‘తెలుగు టైమ్స్‌’ యూ ట్యూబ్‌ ఛానల్‌ను  ప్రముఖ గాయని సుశీల చేతుల మీదుగా దీనిని ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి సహకరించిన స్పాన్సర్లను కూడా ఘనంగా సత్కరించారు. స్కందన్‌షి గ్రూపుకు చెందిన సురేష్‌ రెడ్డి దంపతులను కూడా తానా నాయకులు శాలువా, మెమెంటోలతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, కాన్ఫరెన్స్‌ కమిటీ కన్వీనర్‌ రవి పొట్లూరి, తానా చైతన్యస్రవంతి కో ఆర్డినేటర్‌ సునీల్‌ పంత్ర, ఫౌండేషన్‌ కార్యదర్శి శశికాంత్‌ వల్లేపల్లి తదితర తానా నేతలు మాట్లాడారు.  

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.