యాక్షన్ హీరో సుమన్

ఏ పాత్రలో అయిన ఒదిగిపోయే నటన సుమన్ సొంతం. ఆయన ఒక కరాటి ఫైటర్, డాన్సర్, యాక్టర్. ఒకప్పుడు ఆయన సినిమా వస్తుంది అంటే థియేటర్స్ లో జనాల కోలాహలం విపరీతంగా ఉండేది. మాస్ పాత్రల్లో ఫైట్స్ చేయడమే కాక అన్నమయ్య లాంటి సినిమాల్లో వెంకటేశ్వర స్వామిగా కూడా అందరి హృదయాల్లో నిలిచిపోయారు.

1959, ఆగష్టు 28న మద్రాసులో సుశీల్ చందర్, కేసరి చందర్ దంపతులకి జన్మించారు సుమన్ తల్వార్ చందర్. తల్లి కేసరీ చందర్ మద్రాసులోని ఎతిరాజ్ మహిళా కళాశాలకు ప్రిన్సిపాల్ గా పనిచేసింది. తండ్రి సుశీల్ చందర్ మద్రాసులోని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లో పనిచేసేవాడు. వీరి స్వస్థలము మంగుళూరు. సుమన్ మాతృభాష తుళు. సుమన్ పాఠశాల విద్య బీసెంట్ థియొసోఫికల్ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఆ తరువాత పచ్చయప్ప కళాశాలలో ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీ చేసారు. సుమన్ తుళు, ఇంగ్లిష్, తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ భాషలు స్పష్టంగా మాట్లాడగలడు. సుమన్ హెచ్.ఏ.ఎస్. శాస్త్రి వద్ద సంస్కృతం నేర్చుకున్నారు. ఇవేకాక  వీణ, గిటార్ లను కూడా వాయించగలడు అలాగే సుమన్ కి కరాటేలో బ్లాక్‌ బెల్ట్ ఉంది దానితో పాటు గోపాల్ గురుక్కళ్ వద్ద కలరిపయట్టు కూడా నేర్చుకున్నాడు. సుమన్ మొదట కరాటే మాస్టారు గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు.

సినీ ప్రయాణం

సుమన్ కుటుంబ స్నేహితుడు కిట్టూ సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తుండేవారు. ఆయనికి సినీ పరిశ్రమలో ఎన్నో పరిచయాలు కూడా ఉండేవి. అలా డైరెక్టర్ టీ రామన్న గారు తీస్తున్న సినిమాలో సుమన్ ని హీరోగా అవకాశం వచ్చింది కానీ సుమన్ తనకి ఇష్టం లేదు అని అలాగే అమ్మానాన్నలు కూడా ఒప్పుకోరు అని సున్నితంగా తిరస్కరించారు.కానీ కిట్టు వదలకుండా సుమన్ అమ్మ నాన్నల దగ్గర కూడా పర్మిషన్ తీసుకొని మరి ఒప్పించారు. కిట్టు సుమన్ ని తీసుకొని తర్వాతి రోజు డైరెక్ట్ గా షూటింగ్ కి వెళ్లి డైరెక్టర్ టి రామన్న గారికి పరిచయం చేశాడు. ఆయన సుమన్ ని చూసి ఇతనే నా హీరో అని రేపు ఆఫీస్ కి రమ్మని చెప్పాడట. సుమన్ కి ఇదంతా ఏమి అర్థం కాలేదు అసలు నేను ఏంటి హీరో ఏంటి అని ఆశ్చర్యపోయాదట. ఇంటికి వచ్చి సుమన్ తన తల్లి కి ఈ విషయం చెప్తే ఆమె ఎందరో కష్టపడితే కానీ రాని అవకాశం నీకు వచ్చింది మంచిగా వినియోగించుకో అని దివించింది. ఇక సుమన్ డైరెక్టర్ దగ్గరికి వెళ్లి తనకి తెలిసిన కరటీ విద్యని చూపించి మెప్పించారు. ఆ సినిమా కూడా వెంటనే మొదలైంది. మొదటిరోజు షూటింగ్ లో సుమన్ చాలా ఇబ్బంది పడ్డారట కానీ డైరెక్టర్ ఆయనకి చాలా ఫ్రీడమ్ ఇవ్వడంతో సుమన్ ఆ షూటింగ్ వాతావరణాన్ని అలవాటు చేసుకున్నాడు, కానీ సుమన్ సినిమాలో ఎమోషన్ సీన్స్ లో నటన కొంచెం కష్టంగా చేసేవాడు. అయితే నేను యాక్టింగ్ స్కూల్ కి వెళ్లి నటన నేర్చుకుంటాను అని సుమన్ కిట్టు కి చెప్తే అలాంటిది ఏమి వొద్దు రోజు షూటింగ్ అయిపోయిన వెంటనే మిగతా భాషల్లో ఉన్న సినిమాల్ని చూసి అందులో నటులు ఎలా నటిస్తున్నారో చూసి నేర్చుకో అని చెప్పారు. అలానే సుమన్ రోజు సినిమాలు చూడటం , నటనని నేర్చుకోవడం మొదలుపెట్టాడు. ఈ సినిమాలో ఫైట్ మాస్టర్ కన్నా సుమన్ కొత్తగా ఫైట్స్ డిసైన్ చేసుకొని చేసేవాడు. ఈ సినిమా షూటింగ్ లో ఆయన చేసిన రియల్ ఫైట్స్ విషయం ఇండస్ట్రీలో అంత పాకింది. దానితో ఇంకా మొదటి సినిమా విడుదల కాకముందే సుమన్ కి రెండు సినిమా అవకాశాలు వచ్చాయి. నీచల్ కులం అనే ఈ సినిమా 1979లో విడుదలై సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో ఆయన చేసిన కరాటే ఫైట్స్ కి మంచి పేరు వచ్చింది. ఒక హీరో మొదటిసారి ఎలాంటి డూప్ లేకుండా ఫైట్స్ చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక ఆ తర్వాత వేటుక్కు వీడు వసపడి, ఇలమై కొలం, థీ, కదాల్ మీంగాళ్, డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్ లాంటి సినిమాలతో ఆయన 3 సంవత్సరాల్లోనే తమిళంలో స్టార్ అయ్యాడు.

ఇక సుమన్ సినిమాల్లో హీరో భాను చందర్ విలన్ గా నటిస్తున్నప్పుడు  "ని ఫైటింగ్ స్టైల్ తెలుగువాళ్ళకి బాగా నచ్చుతుంది. ఒకసారి తెలుగులో కూడా సినిమాలు చెయ్యి" అని చెప్పారట. దానికి సుమన్ తెలుగు రాకపోవడం వలన నిరాకరించారు. కానీ భాను చందర్ ఆ మాట వినకుండా అప్పట్లో ప్రముఖ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ్ కి పరిచయం చేశాడు. తమ్మారెడ్డిగారు సుమన్ సినిమాలు అన్ని చూశాక సుమన్ తో ఒక సినిమా చేద్దాం అని రేలంగి నరసింహారావు డైరెక్షన్ లో ఇద్దరు ఖిలాడిలు సినిమా మొదలుపెట్టారు. మొదటి రోజు షూటింగ్ లో సుమన్ తెలుగు డైలాగ్స్ చెప్పలేక షూటింగ్ మధ్యలోనే వెళ్ళిపోయాడు. ఇక తర్వాత డైరెక్టర్ సుమన్ డైలాగ్స్ ఆయనకి అనుకూలంగా మార్చి ఫైట్స్ ఎక్కువగా పెట్టి తియ్యడంతో సుమన్ మొదటి సినిమాకి సులభంగానే పూర్తి చేశాడు.

ఈ సినిమా షూటింగ్ మధ్యలో గ్యాప్ వచ్చినపుడు సుమన్ కోడి రామకృష్ణ గారి డైరెక్షన్ లో తరంగణి సినిమా చేశారు. ఈ సినిమా 1982 లో విడుదలై సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. దీని తర్వాత ఇద్దరు ఖిలాడిలు సినిమా కూడా సూపర్ హిట్ అయింది. సుమన్ తెలుగులో మొదటగా నటించిన సినిమా ఇద్దరు ఖిలాడిలు కాగా మొదట విడుదలైన సినిమా తరంగని. సుమన్ తన ఫైట్స్ తో తెలుగులో సంచలనం సృష్టించాడు అనే చెప్పొచ్చు. 1983లో సుమన్ 6 తెలుగు సినిమాలు 4 తమిళ సినిమాలు చేసి తెలుగులో కూడా స్టార్ హీరోగా ఎదిగాడు. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి డాన్సులతో దూసుకెళ్తుంటే సుమన్ ఫైట్స్ తో ప్రేక్షకులను అలరించేవాడు. ఇద్దరు మంచి రేసులో ఉంటూ పోటా పోటీగా సినిమాలు చేసేవాళ్ళు. సినిమాల్లోనే కాదు రెమ్యూనరేషన్ విషయంలో కూడా సుమన్ కి చిరంజీవి కి బాగా పోటీ ఉండేది. ప్రతి పండగకి సుమన్ కొత్త సినిమాలు థియేటర్స్ లో ఆడేవి. 1984 నుంచి దాదాపుగా ఆయన తెలుగు సినిమాల్లోనే బిజీగా ఉండేవాడు. 1985 లో ఆయన తెలుగులో ఏకంగా 10 సినిమాల వరకు విడుదల చేసారు. అయితే ఈ సంవత్సరం సుమన్ కెరీర్ లో పెద్ద షాక్ తగిలింది.

1985 మే 18న సుమన్ ఇంటికి అర్ధరాత్రి పోలీసులు వచ్చి మీ ఇంట్లో బాంబ్ పెట్టారు అని వెతకడం మొదలుపెట్టారు. ఆ చెకింగ్ అంత అయిపోయాక సుమన్ ని స్టేషన్ కి ఒకసారి రావాల్సిందిగా అడిగి తీసుకెళ్లారు. పై ఆఫీసర్ రావాలి అని చెప్పి ఆ రాత్రి అంత అక్కడే ఉంచారు. తర్వాతి రోజు పై ఆఫీసర్ వచ్చి సుమన్ ని అరెస్ట్ చేశారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని సుమన్ గొడవ ఎందుకు అని మౌనంగా ఉన్నారు. వెంటనే సుమన్ మేనేజర్, లాయర్ వచ్చి ఎందుకు అరెస్ట్ చేశారు అని అడుగుతే అసలు విషయం చెప్పారు పోలీసులు. సుమన్ స్నేహితుడు దివాకర్ బ్లూ ఫిల్మ్ తీస్తున్నాడు, అందులో సుమన్ హస్తం కూడా ఉంది, ఆయన కార్ ని కూడా ఆ ఫిల్మ్ లో వాడారు, అందుకే ఆయన్ని అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం మీరు ఇక కోర్ట్ లో తేల్చుకోండి అని సుమన్ ని రౌడీలు ఉన్న సెల్ లో పెట్టారు. అదే పోలీస్ స్టేషన్ సెల్ లో ఉన్న కరుణానిధి గారు సుమన్ ని చూసి డేంజరస్ క్రిమినల్స్ ఉన్న సెల్ లో సుమన్ ని పెట్టరెంటి అని అడుగుతే పోలీసులు మళ్ళీ సుమన్ గారిని వేరే సెల్ లో వేశారట. అసలు జరిగిన విషయం ఏంటి అంటే సుమన్ స్నేహితుడు దివాకర్ కి ఒక కాస్సేట్ రెంట్ కి ఇచ్చే షాప్ ఉంది. ఆయన  దగ్గర సుమన్ అప్పుడప్పుడు సినిమా కాస్సేట్స్ తీసుకునేవారు. తన కార్ ని కూడా ఒకసారి సుమన్ దివాకర్ కి ఇస్తే దివాకర్ దాన్ని బ్లూ ఫిల్మ్ లో వడారట. ఇంత చిన్న విషయం అంత పెద్ద మేటర్ అవుతుంది అని ఎవరూ ఊహించలేదు అప్పుడు. ఈ విషయం వల్ల సుమన్ కెరీర్ కి బ్రేక్ పడింది. ఆయన మీద అంత నెగటివ్ ప్రచారం ఎక్కువైపోయింది. ఆ సమయంలో ఆయనకి అభిమానులు, తల్లి తండ్రులు సపోర్ట్ ఇచ్చారు. అలాగే అప్పట్లో హీరోయిన్స్ సుహాసిని, సుమలత, భానుప్రియ గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ సుమన్ కి మంచి ధైర్యాన్ని ఇచ్చారు.

ఇక సుమన్ జైల్ కి వెళ్లిన తర్వాత విడుదలైన మొదటి సినిమా కంచు కవచం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రేక్షకులలో ఆయన క్రేజ్ ఇంకా పడిపోలేదు అని ఈ సినిమా నిరూపించింది. ఈ సినిమా విడుదల సమయంలో నిర్మాతలు ఈ సినిమాని ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరించరు అని ఫిక్స్ అయిపోయారు. కానీ వాటిని తలకిందులు చేస్తే కంచు కవచం సినిమా పెట్టిన దానికన్నా 5 ,6 రేట్లు ఎక్కువ లాభలని తెచ్చింది. అప్పటిదకా విడుదల కాకుండా ఆగిపోయిన సుమన్ సినిమాలని నిర్మాతలు విడుదల చేయడం మొదలుపెట్టారు. ఇక మధ్యలో ఆగిపోయిన సినిమా షూటింగ్స్ అన్ని సుమన్ కోర్ట్ ని నుంచి అనుమతి ఇప్పించుకొని పూర్తి చేశారు. కానీ షూటింగ్స్ కూడా మద్రాస్ లోని జంగపట్నంలోనే జరగాలి. రోజు పోలీస్ స్టేషన్ లో సంతకం పెట్టాలని, కోర్ట్ ఆర్డర్స్ ఇచ్చింది. ఈ బెయిల్ కూడా సుమన్ కి ఒక సంవత్సరం జైల్ లో ఉన్న తర్వాత వచ్చింది. అయితే సుమన్ కి మెల్లగా హీరోగా సినిమాలు రావడం తగ్గిపోయాయి. ఆ తక్కువ సినిమాల్లో 1988లో వచ్చిన బందిపోటు సినిమా బ్లాక్ బస్టర్ అయింది.

తెలుగులో ఎన్టీఆర్-ఏఎన్ఆర్ ద్వయం తర్వాత సినిమాల్లో జోడిగా క్రేజ్ సంపాదించుకున్నారు సుమన్- భానుచందర్. ఇద్దరూ యాక్షన్ హీరోలు.. పైగా కరాటేలో బ్లాక్‌ బెల్ట్ సాధించినవారు. దీంతో వీరి కాంబినేషన్‌పై ఎప్పటికప్పుడు భారీ అంచనాలు ఉండేవి. అందుకు తగ్గట్టే వీరిద్దరు కలిసి 9 సినిమాలు చేయడం విశేషం. ఇందులో చాలా వరకు హిట్స్ అయ్యాయి. ఇక భాను చందర్ తో సుమన్ కి మంచి స్నేహబంధం ఉంది. 1982లో వచ్చిన ‘ఇద్దరు కిలాడీలు’ సినిమాలో సుమన్, భానుచందర్ తొలిసారి కలిసి నటించారు. భానుచందర్‌కి అప్పటికే తెలుగులో మంచి క్రేజ్ ఉండగా.. తమిళంలో అగ్రహీరోగా కొనసాగుతున్న సుమన్‌కి అదే తొలి తెలుగు చిత్రం. మార్షల్ ఆర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కిన తొలి తెలుగు సినిమా కూడా అదే. 1993లో యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ‘నక్షత్ర పోరాటం’ సినిమా సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. 1987లో విడుదలైన ‘డాకు’ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించింది. అయితే మరో ఆరేళ్ల వరకూ వీరి కాంబినేషన్‌ సెట్ కాలేదు. తిరిగి వీరి కాంబినేషన్లో 1995లో మరో సినిమా ప్రకటన వచ్చినా అది సెట్స్‌పైకి వెళ్లలేకపోయింది. ‘నక్షత్ర పోరాటం’ సినిమాకు సీక్వెల్‌ ట్రై చేసినా అది కూడా ఆగిపోయింది. కానీ తెలుగు తెరపై సుమన్, భానుచందర్ జోడీ మాత్రం ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోయింది.

సుమన్ హీరోగా శరత్ దర్శకత్వంలో వచ్చిన చిత్రాలన్నీ మంచి విజయాలు అందుకున్నాయి. ఆ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'పెద్దింటల్లుడు'. శ్రీ అన్నపూర్ణ సినీ చిత్ర బ్యానర్ పై టి.ఆర్ తులసి నిర్మించిన ఈ సినిమా 1991లో విడుదలైంది. ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోయిన్‌గా నగ్మా పరిచయం అయింది. ఈ సినిమా సక్సెస్ తరువాత నగ్మా తెలుగులో వరుస అవకాశాలు అందిపుచ్చుకుని స్టార్ హీరోయిన్ గా సౌత్ లో ఓ వెలుగు వెలిగింది. సుమన్ హీరోగా ఓ వైపు మాస్ యాక్షన్ సినిమాలు చేస్తూనే మరోవైపు ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తూ కుటుంబ కథా చిత్రాలపై ఎక్కువ ఆసక్తి చూపేవారు. అలాగే ఈ సినిమాలో ప్రముఖ నటుడు మోహన్ బాబు కూడా మరో కీ రోల్ పోషించారు. సీనియర్ నటి వాణిశ్రీ మరో భిన్నమైన పాత్రతో ఆకట్టుకున్న పెద్దింటల్లుడు సకుటుంబ సపరివారసమేతంగా చూడదగ్గ చిత్రంగా మంచి కథ, కథనాలతోపాటు కామెడీ ప్రధానాంశంగా సాగుతుంది. ఈ సినిమాతో సుమన్ కామెడీ కూడా చేయగలడు అని నిరూపించారు. అలా వెర్సటైల్ యాక్టర్ గా సుమన్ కి పేరు తెచ్చిన సినిమా ఇది.

సుమన్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాగా నిలిచిన అన్నమయ్య. ఈ సినిమాలో ఆయన నటన నిజంగా అద్భుతం అని చెప్పాలి. ఈ సినిమా కోసం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుగారు ఒకరోజు సుమన్ ఇంటికి వచ్చి సినిమా కథని, అందులో ఆయన పాత్ర గురించి చెప్పారట. అప్పుడు ఆయన వెంటనే జోక్ చేస్తున్నారా నేను దేవుడి ఏంటి అని అడగగా, ఆ పాత్ర మీరే చేయాలని రాఘవేంద్రరావు గారు అన్నారట. ఆ తర్వాత ఆ పాత్రని చేసేందుకు కొంచం సమయం తీసుకొని సుమన్ ఇంట్లో వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా ఒకే అన్నారు. అలా ఓ రోజు రాత్రి కలలో సుమన్ కి తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయం కనిపించింది. దీంతో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే ఇప్పటి వరకు మీసం లేకుండా ఎప్పుడూ నటించలేదు. ఎలా ఉంటానోనని ఆయన అనుకున్నారట. మీసంతో గెటవ్‌ వేసుకుని చూసుకున్నా పర్వాలేదనిపించింది సుమన్ కి. ఈ సినిమాకి మేకప్ వేసుకోడానికి దాదాపు నాలుగు గంటలు పట్టేది. ఉదయం 4 గంటలకు అన్నపూర్ణా స్టూడియోన్‌కు వెళితే, కిరీటం పెట్టుకుని సెట్‌లోకి వచ్చే సరికి ఉదయం ఎనమిది గంటలు అయ్యేది. ఇలా 8 నెలల పాటు ఆ మేకప్‌ వేసుకోని ఆ సినిమాని చేశారు. సుమన్ ఈ సినిమా చేస్తున్నన్ని రోజులు మాంసాహారం మానేశారు. ఫ్యామిలీ జీవితానికి దూరంగా ఉండేవారు. నేలమీద పడుకునేవారు. ఇక సినిమా విడుదలయ్యాక సినిమాలోని సుమన్ పాత్రకి మంచి పేరు వచ్చింది. సినిమా చేసిన తర్వాత చాలా మంది వచ్చి సుమన్ కాళ్లకు నమస్కారం చేసేవారు. సుమన్ జీవితంలో అలాంటిది ఊహించలేదని. ఇది ఆయనకి దేవుడు ఇచ్చిన ఓ వరం అని ఆయన అనుకుంటారు. ఇక అప్పటి భారత రాష్ట్రపతి శంకర్‌దయాళ్‌ శర్మగారు రాష్ట్రపతి భవన్‌కు ప్రింట్‌ తెప్పించుకుని సుమన్ ని పక్కన కూర్చొబెట్టుకుని మరీ చూడటం మరో విశేషం.

కొన్నిసినిమాలు ఎన్నేళ్లయినా గుర్తుండిపోతాయి. అలాగే ఎన్నిసార్లు చూసినా… మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. అలాంటి కోవలేకే వస్తుంది భక్తిరస మహాకావ్యం 'శ్రీరామదాసు'. పాటలతో మైమరపించి, భక్తి పారవశ్యంలో పొంగిపోయేలా చేస్తుంది. అక్కినేని నాగేశ్వరరావు, ఆయన తనయుడు నాగార్జున కలిసి నటించిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనమే క్రియోట్ చేసింది. ఈ చిత్రం 2006 మార్చి 30న రిలీజైంది. ఈ చిత్రంలో కబీర్ దాస్ పాత్రను ఏయన్నార్ పోషించారు. రామదాసు గా నాగార్జున జీవించారు. ఇక ఈ సినిమాలో శ్రీరామ, శ్రీమహావిష్ణువుగా మళ్ళీ సుమన్ అందంగా మెరిసారు. తెలుగులో అప్పుడు శ్రీరాముడి పాత్ర అంటే సుమన్ ముందుగా గుర్తొచ్చేవారు. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాను ఆదిత్య మూవీస్ పతాకంపై కొండా కృష్ణంరాజు నిర్మించారు. శ్రీరామదాసుగా నటించిన అక్కినేని నాగార్జునకు ఉత్తమ నటునిగా నంది అవార్డు దక్కింది. అలాగే మేకప్ మేన్ రామచంద్రరావుకు కూడా నంది అవార్డులు దక్కాయి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఉత్తమ గాయకునిగా, ఎస్.గోపాల్ రెడ్డికి ఉత్తమ ఛాయాగ్రహకునిగా ఫిలిమ్ ఫేర్ అవార్డులను అందించింది శ్రీరామదాసు. 'శ్రీరామదాసు' సినిమాకు ప్రాణం పోసింది అంటే సంగీతం, సాహిత్యాలే. ఈ సినిమాలో రామదాసు కీర్తనలతో పాటు, కొన్ని పాటలను వేటూరి, సుద్దాల, చంద్రబోస్, జె.కె. భైరవి ప్రత్యేకంగా రాసిన పాటలు తెలుగు నేలపై మారుమ్రోగాయి. ఇక కీరవాణి తన సంగీతంతో పాటలకు ప్రాణం పోశారు. "అంతా రామమయం... జగమంతా రామమయం…", "అల్లా… ", "ఏ మూర్తి ఆ మూర్తి…" పాటలు ప్రేక్షకులను భక్తిపారవశ్యంలో ముంచెత్తుతాయనండంలో సందేహం లేదు. ఇప్పటికీ రాములోరి కల్యాణం సందర్భంగా చాలా ఊర్లల్లో ఈ పాటు వినిపిస్తూనే ఉంటాయి. ఈ పాటలు వింటే మనసుకు చాలా ప్రశాంతత చేకూరుతుంది. 'శ్రీరామదాసు' మ్యూజిక్ తోనే ఆకట్టుకోవడం కాదు… సినిమా కూడా ప్రేక్షకులను రామదాసు కాలానికి తీసుకువెళ్లేలా చేస్తుంది. ఈ సినిమా అనేక కేంద్రాలలో శతదినోత్సవ సంబురాలను చేసుకుంది. అలాగే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించి, నిర్మాతలకు లాభాలను ఆర్జించి, మరిన్ని భక్తి సినిమాలు తీసేందుకు ప్రేరణగా నిలిచింది.

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా సంచలన దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో తొలిసారి వచ్చిన సినిమా శివాజీ. అంతకుముందే రజినీతో పని చేయాలని కొన్నిసార్లు అనుకున్నా కూడా కుదర్లేదు. దాంతో దర్శకుడిగా మారిన 15ఏళ్ల తర్వాత కానీ రజినీతో సినిమా చేసే అవకాశం రాలేదు శంకర్‌కు. రాకరాక వచ్చిన ఆఫర్‌ను రెండు చేతులా అంది పుచ్చుకున్నాడు శంకర్. ఈ సినిమాలో రజినిని ఢీ కొట్టే విలన్ గా సుమన్ నటనకి మంచి స్పందన వచ్చింది. పంచెకట్టుతో సుమన్ ఈ సినిమాలో తన విలనిజం ఎలా ఉంటుందో చూపించాడు. జూన్ 15, 2007లో విడుదలైంది ఈ చిత్రం సుమన్ కి దేశమంతా క్రేజ్ తెచ్చిపెట్టుంది. ఈ సినిమాలో సుమన్ నటన రజినీకాంత్ కి బాగా నచ్చి ఆయన సీన్స్ ని ఎక్కడ కట్ చేపించలేదట. తెలుగులోనూ శివాజీ సినిమా సంచలన వసూళ్లు సాధించింది. బాస్.. గుండు బాస్ అంటూ పిచ్చెక్కించాడు రజినీకాంత్. డబ్బింగ్ సినిమాల్లో అప్పట్లో హైయ్యస్ట్ వసూళ్లు సాధించింది ఈ చిత్రం. తెలుగు సినిమాకు ధీటుగా రజినీకాంత్ సినిమాలకు ఇక్కడ కూడా బిజినెస్ జరుగుతుంది. శివాజీ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. ఈ సినిమాను రికార్డు స్థాయిలో 15 కోట్ల బిజినెస్ చేసారు. శంకర్‌కు ఉన్న క్రేజ్.. రజినీ మార్కెట్.. అన్నీ శివాజీ సినిమాకు కలిసొచ్చాయి.

సుమన్ సుమారుగా 100 సినిమాల్లో హీరోగా ఇంకో 100 సినిమాల్లో సహాయ నటుడిగా నటించి మెప్పించారు. సుమన్ గారు అవార్డ్స్ అసలు ఆశపడరు కానీ అన్నమయ్య సినిమాకి మాత్రం అవార్డ్ వస్తే బాగుండు అనుకున్నారట.

వ్యక్తిగత జీవితం

సుమన్ ప్రఖ్యాత తెలుగు రచయిత డి వి నరసరాజు గారి మనవరాలు అయిన శిరీష గారిని పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ కుమార్తె అఖిలజ ప్రత్యూష గొప్ప నృత్యకారిని.

సుమన్ బ్లూ ఫిల్మ్ కేసులో ఇరుక్కున్నపుడు రకరకాల ప్రచారం జరిగింది. సుమన్‌ను ఇండస్ట్రీలో ఎదగనీయకుండా తొక్కేయడానికే ఆయన పోటీ దారులు ఆయన్ను కేసులో ఇరికించారని ప్రచారం జరిగింది. అందులో చిరంజీవి పేరు కూడా వినిపించింది. అయితే అనేక సందర్భాల్లో సుమన్ కూడా ఈ విషయాన్ని ఖండించారు. అలాంటిదేమీ లేదన్నారు. ఆయనపై బ్లూ ఫిల్మ్ ఆరోపణలు వచ్చినప్పటికీ ఆయనపై పెట్టిన కేసు మాత్రం వేరు. సుమన్‌పై ఏకంగా గూంఢా యాక్ట్ పెట్టారు. ఈ ఇష్యూలో ఓ స్టార్ హీరో పేరు ప్రముఖంగా వినిపించినా ఆరోపణల్ని బలపరిచే ఆధారాలు లేకపోవడంతో అవి రూమర్స్ గానే మిలిగిపోయాయి. అయితే ఆ తరువాత పరిణామాలతో హీరో సుమన్.. అన్నమయ్య లాంటి చిత్రాల్లో నటించి తన సత్తా చాటినప్పటికీ అప్పటికే ఆయనకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సుమన్ ఇరుక్కున్నారో.. పోటీదారుల కుట్రకు బలి అయ్యారో తెలియదు కాని.. సుమన్ జైలుకి వెళ్లడంతో తరువాత కాలంలో ఆయన చిన్న చిన్న పాత్రలకే పరిమితం అయ్యారు. ఇదంతా జరిగిపోయిన కథే అయినా.. సుమన్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి అయ్యో పాపం అనే వాళ్లు చాలామందే ఉన్నారు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సుమన్ మాట్లాడుతూ.. “నా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అనుకోకుండా నాపై కేసులు పెట్టారు.. జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. దీనంతటికీ కారణం నా స్నేహితుడు. ఆ వ్యక్తి పేరు అప్పట్లోనే నేను తమిళ మీడియాకి చెప్పాను. ఆ వ్యక్తి పేరు రహస్యం ఏం కాదు. అతని పేరు దివాకర్. అతనికి సినిమాలతో సంబంధం లేదు. సినిమా వాళ్లతో కూడా సంబంధం లేదు. ఇది జరిగింది బయట. కాని సినిమాకి దానికి కనెక్షన్ పెట్టింది మాత్రం సినిమా వాళ్లు. సినిమా వాళ్లకు సంబంధం లేని మ్యాటర్‌ని సినిమా వాళ్లతో సంబంధం ఉందని కనెక్ట్ చేసి అప్పట్లో కొంతమంది మీడియా వాళ్లు తప్పుడు రాతలు రాశారు. వాళ్లకు హైప్ రావాలని నిజాలు చెప్పకుండా స్వార్థానికి ఆలోచించుకున్నారు. దాని వల్ల నేను ఇబ్బందుల పాలయ్యాను. నిజానికి ఆ ఇష్యూ ప్రైవేట్ ఫ్యామిలీ ఎఫైర్. నేను ఎలాగూ జైలుకి వెళ్తానని నాకు తెలుసు. నా జాతకం ప్రకారం ఇది జరుగుతుందని నాకు ముందే తెలుసు. ప్రాబ్లమ్ ఉందని తెలుసుకాని.. మరీ ఇంత దారుణంగా అని అనుకోలేదు. నేను ఎలాగూ ఇబ్బందులకు గురవుతున్నానని తెలిసి.. నా వల్ల నా స్నేహితుడు భాను చందర్‌కి రిస్క్ అవ్వకూడదని అనుకున్నా. ఎందుకంటే నన్ను తెలుగు ఇండస్ట్రీకి తీసుకుని వచ్చింది భాను చందర్. తమిళ్ కంటే తెలుగులోనే నువ్వు బాగా క్లిక్ అవుతావని నన్ను ఇక్కడకు తీసుకువచ్చింది భాను చందర్. నాకు అంత క్రేజ్ వచ్చిందంటే కారణం భాను చందర్. ఆ టైంలో నేను మిగిలిన వాళ్లను ఇబ్బంది పెట్టకూడదని అనుకున్నా.. ముఖ్యంగా భాను చందర్‌కి రిస్క్ కాకూడదని అనుకున్నా. అందుకే అతన్ని కలిసి.. భాను నువ్వు నాకు ఫోన్ చేయొద్దు.. కలవొద్దు.. మ్యాటర్ సీరియస్‌గా ఉందని చెప్పా. తరువాత కలుద్దాం అని చెప్పిన మాట వాస్తవం. నేను ఇరుక్కున్నానని నాతో పాటు మిగిలిన వాళ్లు ఇరుక్కోవాలని అనుకోను. ఇంకో పదిమందిని ఇందులోకి లాగాలని కోరుకోను. ఒకర్ని సేవ్ చేయాలని అనుకున్నా.. దీనికి కారణం నాతో పాటు జర్నీ చేసిన నా మిత్రుడు దివాకర్. తమిళ్ పేపర్‌లో అతని గురించి నేను చెప్పినవన్నీ వచ్చాయి. ఆ పేరు నేను రహస్యంగా ఉంచలేదు. అయితే చాలా మంది చాలా పేర్లు అనుకున్నారు కాని.. వాటికి నేనేం చేయలేను. అనుకున్నవాళ్లు చెప్పాలి. నా విషయంలో ఆ హీరోల పేర్లు ఎందుకు తీసుకువచ్చారో.. నిజానికి ఈ కేసుకి ఆ హీరోకి సంబంధం లేదు. అన్నీ పుకార్లే. అసలు వాస్తవం వేరు. ఒక పెద్ద స్టార్.. మరో చెన్నై పోలీస్ కమీషనర్ దీని వెనుక ఉండి నడిపించారు అని చాలా రూమర్లు వచ్చాయి. ఇవన్నీ చెప్పడానికి అనుకోవడానికి బాగానే ఉంటాయి. ఇదంతా అవతల వాళ్లపై బురద చల్లే ప్రక్రియ మాత్రమే. కొందరికి శత్రువులు ఉన్నప్పుడు ఆ టైంలోనే వాళ్లపై ఎలా బురదచల్లుదాం.. రాళ్లు విసురుదాం అని చూస్తారు. ఆ సమయంలో ఆ పేర్లు వాడదాం అని ప్రయత్నిస్తుంటారు. కాని నేను జైలుకి వెళ్లడానికి ఓ స్టార్ హీరో కారణం అంటే నేను ఒప్పుకోను. జరిగిన మ్యాటర్ వేరు.. ప్రచారం వేరు. నా ఇష్యూలో గవర్నమెంట్, ఇతర అఫీషియల్స్ ఇన్వాల్వ్ అయ్యారంటే కారణం.. నేను ఒక సెలబ్రిటీ. పేపర్లో వచ్చిన ఆరోపణలు వేరే.. నాపై పెట్టిన కేసు వేరే. ఈ రెండింటికీ సంబంధమే లేదు. గూంఢా యాక్ట్ పెట్టాలంటే ఏడెనిమిదికేసులు ఉండాలి.. కత్తి పట్టుకుని తిరగడం.. పబ్లిక్‌ని ఇబ్బందులు పెట్టడం లాంటి చేస్తే ఈ యాక్ట్ పెడతారు. అందుకే అతన్ని గూంఢా అంటారు. అయితే నా విషయంలో ఇన్వాల్వ్ అయిన వాళ్లు ఇంపార్టెంట్ వీఐపీలు. ఎవరో చెప్పిన న్యూస్‌కి వాళ్లు రియాక్ట్ అయ్యి.. ఆ యాక్ట్ పెట్టించారు. కాని తరువాత వాళ్లకి నిజం తెలిసింది. కాని వాళ్లు నిబంధనల్ని కాల్ బ్యాక్ చేయడం కుదర్లేదు. ఒక కేసులో క్లియరెన్స్ వస్తే చాలా మంది ఆ కేసుని రిఫరెన్స్ గా తీసుకుంటారు. ఈ కేసు కూడా ఆలస్యం కావడానికి అదే కారణం. సుమారు ఆరునెలల్లో అసలు నిజం ఏంటన్నది వాళ్లు తెలుసుకున్నారు. కాని కేసు చాలా రోజులు జరగడంతో ఇష్యూ పెద్దది అయ్యింది. ఎవరికి నచ్చినట్టు వాళ్లు రాసేసుకున్నారు. చాలా టైం పట్టింది కాని.. చివరికి నేను అనుకున్నట్టుగానే నాపై ఆరోపణలు జీరోకి వచ్చి ఫినిష్ అయ్యింది” అంటూ ఆ నాడు తనపై జరిగిన కుట్ర కోణంలోని అసలు నిజాలను తెలియజేశారు సుమన్.

ఇక హీరో సుమన్ రీల్ హీరో మాత్రమే కాదు.. రియల్ హీరో అని పలు సందర్భాల్లో నిరూపించుకున్నారు. ఒకటి కాదు రెండు ఏకంగా 175 ఎకరాల భూమిని జవాన్లకు డొనేట్ చేసి అప్పట్లో తన మంచి మనసు చాటుకున్నారు సుమన్. ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సినిమా చేయాలని ఇప్పటికి సుమన్ కి కోరిక అంట .1999లో సుమన్ టీడీపీ పార్టీ లో చేరి కొన్ని ప్రాంతాల్లో ప్రచారం చేశారు.

అవార్డ్స్

ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ఆయన అందుకున్నారు.

సుమన్ కి 1993లో బావ బామారిది సినిమాకి గాను ఉత్తమ నటుడుగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వచ్చింది.

అలాగే ఆయనకి ఆసియనెట్ ఫిల్మ్ హనర్ స్పెషల్ జ్యూరీ అవార్డ్ 2009 సంవత్సరానికి గాను లభించింది.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.