మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ M.వెంకయ్యనాయుడు ముఖ్య అతిధి గా...జూన్‌ 11వ తేదీ ప్రముఖ సినీ దర్శకులు వి. మధుసూదనరావు శత జయంతి ఉత్సవం.

తెలుగు సినిమా పుట్టడానికన్నా తొమ్మిది ఏళ్ల ముందే పుట్టిన వ్యక్తి వీరమాచినేని మధుసూదనరావు గారు. సినిమా కంటే ముందుగా ఆయన పుట్టారు అని చెప్పడం కాదు కానీ, సినిమాతో సమానంగా ఆ వేగాన్ని అందుకుని ఎప్పటికప్పుడు తనను అప్డేట్‌ చేసుకుని తన వ్యక్తిగత ఆశయాలను ఏవైనా, ప్రజలను రంజింప చేయడమే తన జీవిత ధ్యేయంగా, అత్యధిక చిత్రాలు డైరెక్ట్‌ చేసిన మహా దర్శకులు వి. మధుసూదనరావు అలియాస్‌ విక్టరీ మధుసూదనరావు. జూన్‌ 14, 1923లో జన్మించిన ఆయన శత జయంతి ఉత్సవం జూన్‌ 11వ తేదీన హోటల్‌ దస్పల్లాలో జరుగనుంది. ఈ కార్యక్రమానికి మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతల మండలి కౌన్సిల్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ప్రముఖ దర్శకులు కోదండరామిరెడ్డి, నటుడు శివాజీరాజా, వి. మధుసూదనరావు గారి కుమార్తె,  శ్రీమతి వాణిదేవి, మధు ఫిల్మ్ ఇన్ట్సిట్యూట్ చైర్మన్ ప్రసాదరావు, ప్రిన్సిపల్ డా. జి కుమారస్వామి, ఆక్టింగ్ లెక్చరర్  గడ్డం ప్రశాంత్,ఆల్‌మండ్‌ అధినేత, మధుసూదనరావు గారి మేనల్లుడు నాని, దర్శకుడు కామేశ్వరరావు,  శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కోదండరామిరెడ్డిగారు మాట్లాడుతూ... "మధుసూదనరావు గారి వంటి మహానుభావుడి దగ్గర నేను శిష్యరికం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను చదువు మానేసి సినిమా పిచ్చితో మద్రాసు వెళ్లాను. అప్పుడు పి. చంద్రశేఖరరెడ్డి గారు మధుసూదనరావు గారి దగ్గర అసోసియేట్‌గా పనిచేసేవారు. ఆయన ద్వారా గురువుగారిని కలిసే భాగ్యం, అయన దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసే అదృష్టం దక్కాయి. నా చేతి రాత నచ్చడంతో ఆయన నా తల రాత మార్చేశారు. శోభన్‌బాబు గారు హీరోగా నటించిన ‘మనుషులు మారాలి’ నా తొలి సినిమా. గురువుగారు దర్శకులు, రాఘవేంద్రరావు గారు కో`డైరెక్టర్‌. ఆ సినిమాకు ఫస్ట్‌ క్లాప్‌కొట్టిన వెంటనే వెనుకనే ఉన్న లైట్‌ను చూసుకోకుండా వెళ్లి దానిమీద పడ్డాను. దాంతో నన్ను బయటకు పంపేశారు. ఆ తర్వాత రాఘవేంద్రరావు గారు మధుసూదనరావు గారికి సర్ధి చెప్పడంతో మళ్లీ రెండు రోజుల తర్వాత జాయిన్‌ అయ్యాను. ఆయన దగ్గర చేరిన కొత్తలో నా వల్ల జరిగిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఆయనకు నన్ను చూస్తే కోపం వచ్చేది. ఆ తర్వాత తర్వాత నేను లేనిదే షూటింగ్‌ కూడా స్టార్ట్‌ చేసేవారు కాదు. అంత ప్రేమించారు నన్ను. నేను ఏ పనిని అయినా సిన్సియర్‌గా చేస్తాను. అది ఆయనకు బాగా నచ్చింది. బయటకు వెళితే నన్ను కూడా తీసుకెళ్లేవారు. యన్‌టిఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు ఇలా చాలా మంది స్టార్‌ హీరోలకు సూపర్‌హిట్‌లు ఇచ్చారు. నాగార్జున తొలి చిత్రం ‘విక్రమ్‌’కు కూడా గురువుగారే దర్శకులు. అలాంటి మహానుభావుడి శతజయంతి అంటే చాలా సంతోషంగా ఉంది. మనిషిగా ఆయన మన ముందు లేకపోయినా దర్శకుడిగా ఆయన ప్రతిభ మరికొన్ని వందల యేళ్లు బతికే ఉంటుంది అన్నారు.

నటుడు శివాజీరాజా మాట్లాడుతూ... "మధు ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ తొలి బ్యాచ్‌లో నేను స్టూడెంట్‌ని, నాతో పాటు ఎందరో నటీనటులు, టెక్నీషియన్స్‌ను ఇండస్ట్రీకి ఇచ్చిన గొప్ప ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ను మధుసూదనరావు గారు స్థాపించారు. ఈ సంవత్సరం నందమూరి తారకరామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, సూర్యకాంతం గారు, వి. మధుసూదనరావు గారి శత జయంతి కావడం నిజంగా తెలుగు పరిశ్రమ పులకించి పోయే సంవత్సరం. ఆ మహానుభావులు మనమధ్య లేకపోయినా వారిలోని గొప్ప గుణాలను, వారు పరిశ్రమకు చూపించిన మంచి మార్గాన్ని ఇప్పటికీ, ఎప్పటికీ అనుసరిస్తూనే ఉంటాము. నాకు ‘ళ’ అక్షరం సరిగ్గా పలికేది కాదు.. ఇది గమనించిన మధుసూదనరావు గారు నాతో ‘కళ్లు’ అనే అక్షరాన్ని పదే పదే పలించేవారు. నా అదృష్టం ఆయన నాతో పట్టుబట్టి మరీ పలికించిన ‘కళ్లు’ నా తొలి సినిమా అయ్యింది. ఆయనతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరిదీ ఆత్మీయబంధమే. సినిమా పట్ల ఆయనకున్న కమాండ్‌ అద్భుతం. అందుకే అన్ని సూపర్‌హిట్‌ సినిమాలు ఇచ్చి ‘వీరమాచినేని’ని  ‘విక్టరీ’గా మార్చేశారు. మధు ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ను నిర్వహిస్తున్న వాణిదేవి గారికి మేం ఎల్లప్పుడూ సపోర్ట్‌గా నిలుస్తామని చెపుతున్నాను. ఆయన ఎక్కడున్నా తెలుగు పరిశ్రమను ఎప్పుడూ ఆశీర్వదిస్తూనే ఉంటారు. జూన్‌ 14వ తేదీ మధుసూదనరావు గారి శతజయంతిని సందర్భంగా భావితరాలు కూడా ఆయన గొప్పతనాన్ని తెలుసుకునేలా మీడియా మంచి ప్రచారం కల్పించాలని కోరుతున్నా అన్నారు.

మధుసూదనరావు గారి కుమార్తె శ్రీమతి వాణిదేవి మాట్లాడుతూ..."నాన్నగారి శతజయంతి సందర్భంగా ఆయన భావాలు కొంతవరకైనా జనాల్లోకి తీసుకెళితే బాగుంటుంది అని భావించాము. ఇది మీడియా వల్లనే సాధ్యం అవుతుంది. కాబట్టి మీడియా అందరూ సహకరించ వలసిందిగా కోరుతున్నాము. మా అమ్మా, నాన్నలు కమ్యూనిజం భావాలుగల వ్యక్తులు. ఇద్దరూ ప్రజానాట్యమండలిలో పనిచేశారు. అందుకే ఎప్పుడూ ప్రజలతోనే ఉండాలి అని కోరుకునే వారు. అందుకే వారికి ఆప్యాయతలు, ప్రేమలు తప్ప అంతస్తుల తారతమ్యాలు ఉండేవి కావు. ఆయన సినిమాల్లోని పాటలు కూడా ఎంతో అర్ధవంతంగా ఉండేవి. పాటల విషయంలో చాలా ఖచ్చితంగా ఉండేవారు. అవసరం అయితే ఆయనే కొన్ని పదాలు రాసేవారు. పరిశ్రమ మనుగడకు నిర్మాతే ప్రాణమని భావించారు. ఆయన 75వ పుట్టినరోజున తన నిర్మాతలను రవీంద్రభారతిలో సత్కరించారు కూడా. జూన్‌ 11వ తేదీన హోటల్‌ దస్పల్లాలో నాన్నగారి శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించటానికి ఏర్పాట్లు చేస్తున్నాం. మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు ముఖ్య అతిథిగా హాజరౌతారు. ఈ కార్యక్రమానికి  అందరూ హాజరవ్వాల్సిందిగా కోరుతున్నాం. సినీ పరిశ్రమకు మొత్తానికి ఇదే మా ఆహ్వానం అన్నారు.

మధుసూదనరావు గారి మేనల్లుడు నాని మాట్లాడుతూ..."మావయ్య విలువలతో జీవించారు. అదే విలువలను తన చిత్రాల ద్వారా పది మందికి పంచటానికి ప్రయత్నించారు. ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని చూసి చుట్టుపక్కల వారు సైతం ప్రభావితం అవుతారు. అలాగే ఆయన్ను చూసి మాలాంటి వాళ్లందరూ ఎంతో ప్రభావితం అయ్యాము అన్నారు.
ప్రిన్సిపల్ డా. జి కుమారస్వామి మాట్లాడుతూ "భావితరాలకు మధుసూదనరావు గారి సినిమాలు ఒక దిక్సూచిలా పనిచేస్తాయని ,ఆయన జీవితమే ఒక గొప్ప స్పూర్తి అని ఆయన శత జయంతి సందర్భంగా అందరూ మరోసారి ఆయన గొప్పతనాన్ని గుర్తు చేసుకునే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాము అని అన్నారు.
ఈ సందర్భంగా మధు ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ విద్యార్థులకు దర్శకులు కోదండరామిరెడ్డిగారి చేతులు మీదుగా సర్టిఫికెట్‌ల ప్రధానం జరిగింది.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.