
పాతికేళ్లుగా `పెళ్లిసందడి` పాటలు అందరినీ అలరిస్తున్నాయి. మళ్లీ దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, స్వరవాణి కీరవాణి కాంబినేషన్‌లో కొత్త ‘పెళ్లిసందD’ తొలిపాట ‘ప్రేమంటే ఏంటీ..` ఈ రోజు విడుదలై శ్రోతల్ని ఆకట్టుకుంటోంది. రోషన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా ఆర్కా మీడియా వర్క్స్, ఆర్.కె ఫిలిం అసోసియేట్స్ బ్యానర్‌లో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు అందిస్తున్న చిత్రం `పెళ్లిసందD`. గౌరి రోనంకి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలు. దాదాపుగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం నుండి ఫస్ట్ సోల్‌ఫుల్ సాంగ్ `ప్రేమంటే ఏంటీ`ని ఈ రోజు విడుదలచేసింది చిత్ర యూనిట్.

నువ్వంటే నాకు ధైర్యం.. అంటూ ఆహ్లాదకరంగా సాగే ఈ పాటకు కీరవాణి క్యాచీ ట్యూన్ ఇవ్వగా స్టార్ లిరిసిస్ట్ చంద్రబోస్ అద్భుతమైన సాహిత్యం అందించారు. హరిచరణ్, శ్వేత పండిట్ శ్రావ్యంగా ఆలపించారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘పెళ్లిసందD’ చిత్రంలోని `ప్రేమంటే ఏంటి` పాటతో కె. రాఘవేంద్రరావు, కీరవాణిల పాటల సందడి మళ్లీ మొదలైంది. ఈ సినిమాలోని పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలవుతున్నాయి.
రోషన్, శ్రీలీల, ప్రకాశ్‌రాజ్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిషోర్, సత్యంరాజేష్, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ రెడ్డి, శకలక శంకర్, అన్నపూర్ణ, జాన్సి, ప్రగతి, హేమ, కౌముది, భద్రం, కిరీటి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. పాతికేళ్ళ క్రితం విడుదలైన పెళ్ళిసందడి చిత్రం శ్రీకాంత్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మరి ఈ పెళ్ళి సందడి రోషన్ కి ఎలాంటి బ్రేక్ ఇస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.