
నాట్యంలో శిఖరాగ్రం... కూచిపూడి నాట్యానికి ఎన్నో సొగసులద్దిన నాట్యమయూరి డా. కట్టా శోభా నాయుడు(64) గారు ఇక లేరు. రాత్రి 1.44 నిముషాలకు హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు.
విశాఖ జిల్లా అనకాపల్లిలో వెంకటనాయుడు, సరోజినీ దేవి దంపతులకు 1956లో జన్మించిన ఆమె, చిన్నప్పటి నుండి కూచిపూడి దిగ్గజం దివంగత ‘వెంపటి చిన సత్యం’ గారి వద్ద కూచిపూడి నృత్య కళని అభ్యసించారు. దేశ విదేశాల్లో దాదాపుగా రెండు వేల మంది విద్యార్థులను కూచిపూడి నృత్య కళాకారులుగా తీర్చి దిద్దిన ఘనత ఆవిడది. 100 కు పైగా సోలో కొరియోగ్రఫీల సృష్టికర్త. పాతిక కూచిపూడి నృత్య రూపకాల సృజనశీలి. పద్మశ్రీ, సంగీత నాటక అకాడమీ పురస్కారం, నృత్య చూడామణి, ప్రతిష్ఠాత్మకమైన ఎన్టీఆర్ పురస్కారంతో పాటు వందలాది పురస్కారాలు ఆవిడను వరించాయి.
ప్రపంచ వ్యాప్తంగా వేలాది ప్రదర్శనలు ఇచ్చి కూచిపూడి నాట్యానికి ఔన్నత్యాన్ని తెచ్చారు శోభానాయుడుగారు. కూచిపూడి నాట్యం కోసమే జన్మించిన మహోన్నతమైన వ్యక్తి అనిపించుకున్నారు.హైదరాబాద్ దోమలగూడలో ‘కూచిపూడి ఆర్ట్ అకాడమీ’ స్థాపించి సేవలు అందిస్తున్నారు. గత 40ఏళ్లుగా కూచిపూడి తరగతుల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. ఆమె మరణం నృత్య ప్రపంచానికి తీరని లోటుని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
Rest in peace #ShobhaNaidu garu. pic.twitter.com/y3zgf4VrBM
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 14, 2020