
దుల్కర్ సల్మాన్... అవ్వడానికి మలయాళం హీరో అయినా కూడా పరిచయం అవసరం లేని పేరు. భారీ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చాడు దుల్కర్. మలయాళం టాప్ హీరోల్లో ఒకరైన మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్. మలయాళంలో అరంగేట్రం చేసినా దుల్కర్ అన్ని భాషల్లోనూ పేరు సంపాదించుకోగలిగాడు. ముఖ్యంగా అర్బన్ యూత్ కు కనెక్ట్ అయ్యే సినిమాలను ఎంచుకుని దుల్కర్ చాలా త్వరగానే టాప్ రేంజ్ కు చేరుకున్నాడు. మలయాళంలో పాపులర్ అయ్యి ఆ తర్వాత తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో దుల్కర్ సినిమాలు చేసాడు. ఎంట్రీ ఇచ్చిన ప్రతీ భాషలో తనకంటూ అభిమానులను సంపాదించుకున్నాడు.

అన్ని భాషల్లో కలిపి దాదాపు 30 సినిమాల్లో నటించిన దుల్కర్ స్టైలిష్ ఐకాన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. మమ్ముట్టి కొడుకుగా హీరోగా ఎంట్రీ ఇచ్చినా కానీ తనకంటూ సొంత ఇమేజ్ ను కోరుకున్నాడు దుల్కర్. అందుకే తండ్రికి భిన్నమైన పాత్రలో నటించాడు. తండ్రిని మించిన తనయుడు అని ఇంకా అనిపించుకోలేదు కానీ ఆ స్థాయి తనకు కూడా ఉందని నిరూపించుకున్నాడు. మరి అంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చి దుల్కర్ తన ప్రయాణాన్ని ఎలా మొదలుపెట్టాడు. అసలు సినిమాల్లోకి రాకూడదు అనుకున్న వాడు ఈ రంగంలో ఈ రేంజ్ కు ఎలా ఎదిగాడు అన్నవి చాలా ఆసక్తికరంగా అనిపిస్తాయి. మరి అవేమిటో మనం కూడా ఒకసారి చూస్తే...
బాల్యం:

దుల్కర్ సల్మాన్ 28 జులై 1986న మొహమ్మద్ కుట్టి పనపరంబిల్ ఇస్మైల్, సల్ఫేత్ దంపతులకు రెండో సంతానం దుల్కర్ సల్మాన్. తండ్రి పేరు చూస్తే ఎవరో అనుకుంటారు కానీ మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి అసలు పేరు అదే. దుల్కర్ సల్మాన్ కు ఒక అక్క కుట్టి సురుమి కూడా ఉన్నారు. దుల్కర్ సల్మాన్ ప్రాధమిక విద్య అంతా టాక్-హెచ్ పబ్లిక్ స్కూల్ కొచ్చిలో జరిగింది. అయితే సెకండరీ విద్య కొరకు దుల్కర్ సల్మాన్ చెన్నైకు మూవ్ అయ్యాడు. అక్కడ శిష్య స్కూల్ లో స్కూలింగ్ ను పూర్తి చేసాడు దుల్కర్ సల్మాన్. ఆ తర్వాత ఉన్నత విద్య కోసం యూఎస్ వెళ్లి అక్కడి ప్రతిష్టాత్మక పర్డ్యూ విశ్వవిద్యాలయంలో బిజినెస్ మానేజ్మెంట్ ను పూర్తి చేసాడు. గ్రాడ్యుయేషన్ పూర్తైన వెంటనే యూఎస్ లోనే కొన్నాళ్ళు జాబ్ చేసాడు. ఆ తర్వాత దుబాయ్ వచ్చి ఐటి సంబంధిత జాబ్ ను చేసాడు. అక్కడ కార్ ట్రేడింగ్ కు సంబంధించిన వెబ్ పోర్టల్ ను ప్రారంభించాడు. చేస్తున్న వ్యాపారం బాగానే ఉన్నా కానీ దుల్కర్ కు ఇందులో సంతృప్తి లభించలేదు. జీవితం అంతా ఒక స్ట్రైట్ లైన్ గా ఏ మాత్రం ఎగ్జైటింగ్ గా అనిపించలేదు. దాంతో ఆ వ్యాపారాన్ని మూసేసి ఇంటికి వచ్చేశాడు.

దుల్కర్ సల్మాన్ క్రియేటివిటీ ఉన్న ఫీల్డ్ లోకి ఎంటర్ అవ్వాలని అనుకుని అందుకోసం సినిమా అయితేనే ఉత్తమమని భావించాడు. దుల్కర్ మొదట నుండీ దర్శకత్వంపై కొంత ఆసక్తి ఉంది. చాలా చిన్న వయసులోనే మమ్ముట్టితో కలిసి సరదాగా ఒక షార్ట్ ఫిల్మ్ ను కూడా చేసాడు. సినిమాల్లోకి రావాలని అనుకున్నప్పుడు మొదట దర్శకుడు కావాలన్న ఆలోచన కూడా వచ్చింది. కానీ చివరికి హీరో కావాలన్న నిర్ణయానికి వచ్చాడు.

మమ్ముట్టి కొడుకు హీరోగా లాంచ్ అంటే పెద్ద దర్శకులు క్యూ కడతారు. కానీ మమ్ముట్టికి అలా అవ్వడం ఇష్టం లేదు. దుల్కర్ ఒక పెద్ద హీరో కొడుకుగా లాంచ్ అవ్వాలనుకోలేదు. అలా అయితే రెగ్యులర్ జోనర్ లో సేఫ్ కథలు ఎంచుకుంటాడేమోనన్న భయం దుల్కర్ కు ఉంది. అందుకనే హీరోగా విభిన్నమైన సినిమాతో లాంచ్ అయ్యాడు. దీనికంటే ముందు దర్శకుడు శ్యామ్ ప్రసాద్, రీతూ అనే సినిమా కోసం దుల్కర్ ను అప్రోచ్ అయ్యాడు. దర్శకుడు లింగుస్వామి కూడా తన మలయాళ డెబ్యూ సినిమా కోసం దుల్కర్ ను అనుకున్నాడు. కానీ అనుభవమున్న దర్శకుల దగ్గర చేయడం, అందులోనూ సినిమా గురించి ఏ మాత్రం తెలీకుండా ముందుకు అడుగు వేయాలనుకోలేదు.

మమ్ముట్టి కూడా నువ్వు హీరో అవ్వాలనుకుంటే అది నీ ఇష్టం. కానీ నేనైతే ఎవరికీ ఫోన్ కాల్స్ చెయ్యట్లేదు. తండ్రిగా నా బాధ్యత నెరవేర్చడానికి మాత్రం ముంబైలోని బేరీ జాన్ యాక్టింగ్ స్టూడియోలో చేర్పించాడు. అక్కడ దుల్కర్ మూడు నెలలు యాక్టింగ్ స్కూల్ లో శిక్షణ తీసుకున్నాడు.
మొదటి అవకాశం:

యాక్టింగ్ స్కూల్ లో కోర్స్ పూర్తి చేసిన తర్వాత దుల్కర్ సల్మాన్ షార్ట్ కట్ లో హీరో అవ్వాలనుకోలేదు. తనకు తొలి సినిమా కావడంతో అనుభమున్న దర్శకుడి కంటే కొత్తవాళ్లతో పనిచేయడానికి ఆసక్తి చూపించాడు. ఈ క్రమంలోనే శ్రీనాథ్ రాజేంద్రన్ తో పరిచయమైంది. శ్రీనాథ్ తన స్నేహితుడు విని విశ్వలాల్ తో కలిసి సినిమా చేయడానికి ప్రయత్నాల్లో ఉన్నాడు. దుల్కర్ కు ఆ కథ చెప్పగా తనకు నచ్చింది. అయితే ఈ కథతో కొంత కాలం ట్రావెల్ అవ్వాలనుకున్నారు. కొన్ని నెలల ప్రయాణం తర్వాత మొత్తానికి సెకండ్ షో స్క్రిప్ట్ సిద్ధమైంది. మమ్ముట్టికు కూడా ఈ సినిమా కథ గురించి పెద్దగా తెలీదు. అసలు ఇండస్ట్రీలో అయితే మమ్ముట్టి కొడుకు హీరోగా లాంచ్ అవుతున్నాడు అని కూడా పెద్దగా తెలీదు.

సెకండ్ షో సినిమాలో దాదాపు 90 శాతం మంది కొత్తవాళ్లే పనిచేసారు. గౌతమి నాయర్ ను హీరోయిన్ గా పరిచయం చేసారు. ఈ చిత్రంలో హరిలాల్ అనే గ్యాంగ్స్టర్ పాత్రను పోషించాడు దుల్కర్ సల్మాన్. సెకండ్ షో సినిమా ఇండస్ట్రీను సర్ప్రైజ్ చేసింది. ఈ సినిమాకు మొదటి మూడు రోజులు యావరేజ్ టాక్ నడిచింది. అయితే ఆ తర్వాత నుండి ఊపందుకుని సెకండ్ షో మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో పనిచేసిన వారికి మంచి అవకాశాలు వచ్చాయి. దుల్కర్ కు బెస్ట్ డెబ్యూ హీరోగా ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చింది.

సెకండ్ షో సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు దుల్కర్ సల్మాన్. మమ్ముట్టి కొడుకు ఒక భిన్నమైన సినిమాతో లాంచ్ అయ్యాడని అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అయితే అప్పటికే దుల్కర్ తన రెండో సినిమాకు కమిట్ అయ్యాడు. అంజలి మీనన్ కథ అందించిన కథకు అన్వర్ రషీద్ దర్శకత్వంలో ఉస్తాద్ హోటల్ లో దుల్కర్ లీడ్ రోల్ ను పోషించాడు. అయితే ముందుగా ఈ సినిమాకు సిద్ధార్థ్ ను హీరోగా అనుకున్నారు కానీ సిద్ధార్థ్ కథను విని నచ్చలేదని చెప్పేసాడు. దీంతో అంజలి మీనన్, అన్వర్ రషీద్ లు మమ్ముట్టి కొడుకు ఏదో చిన్న సినిమాతో లాంచ్ అవుతున్నాడట అని విని తన ఫోటోలు తెచ్చి ఉస్తాద్ హోటల్ లో ఫైజీ పాత్రకు దుల్కర్ అయితే సరిగ్గా సరిపోతాడు అన్న నిర్ణయానికి వచ్చేసారు.

దుల్కర్ కు కథ చెప్పడం, తనకు నచ్చేయడంతో ఉస్తాద్ హోటల్ ప్రాజెక్ట్ లాక్ అయింది. 2012లో దుల్కర్ తొలి సినిమా సెకండ్ షో విడుదలైంది కానీ దానికంటే ముందే 2011 నవంబర్ లో దుల్కర్ సల్మాన్ తో ఉస్తాద్ హోటల్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసారు. అప్పటికి నిర్మాతల మండలి నిత్యా మీనన్ మీద బ్యాన్ ఉన్నా కానీ ఉస్తాద్ హోటల్ లో ఆమెనే హీరోయిన్ గా కన్ఫర్మ్ చేసారు. ఇందులో కీలకమైన కరీమ్ ఇక్కా పాత్ర కోసం తిలకన్ ను తీసుకున్నారు. అప్పటికి తిలకన్ కు ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నా కానీ కరీమ్ ఇక్కా పాత్రకు తిలకన్ తప్ప వేరే ఎవరినీ ఊహించలేదు.

2012 జనవరిలో ఉస్తాద్ హోటల్ చిత్రీకరణను ప్రారంభించారు. అయితే మొదటగా మే 11, 2012న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం అదే సంవత్సరం జూన్ 29న విడుదలైంది. విడుదల రోజు నుండే ఉస్తాద్ హోటల్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. తన రెండో చిత్రంతోనే దుల్కర్ సల్మాన్ నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకోవడమే కాకుండా కమర్షియల్ గా విజయాన్ని కూడా అందుకున్నాడు. ఉస్తాద్ హోటల్ అందరి అంచనాలను అధిగమించి మూడు నేషనల్ అవార్డులను అందుకోవడం విశేషం. బెస్ట్ పాపులర్ ఫిల్మ్, బెస్ట్ డైలాగ్స్, స్పెషల్ మెన్షన్ విభాగాలలో నేషనల్ అవార్డును అందుకుంది ఉస్తాద్ హోటల్. ఈ సినిమాను తెలుగులో జనతా హోటల్ పేరిట తర్వాత డబ్ చేసి విడుదల చేసారు.

దుల్కర్ సల్మాన్ మూడో సినిమాగా తీవ్రం అనే సినిమాను ఎంచుకున్నాడు. దీనికంటే ముందు జూన్ చిత్ర ఆఫర్ తన వద్దకు వచ్చినా వివిధ కారణాల వల్ల ఆ చిత్రాన్ని రిజెక్ట్ చేసాడు దుల్కర్. అదే సమయంలో తీవ్రం అనే సబ్జెక్ట్ తన వద్దకు రాగా దాన్ని దుల్కర్ వెంటనే ఓకే చేసాడు. అయితే ఈ చిత్రం మొదటగా ఫహద్ ఫాజిల్ వద్దకు వచ్చింది. కాకపోతే డేట్స్ క్లాష్ వల్ల ఫహద్ ఈ సినిమా చేయలేదు. దాంతో దుల్కర్ కు అవకాశం వచ్చిందన్నమాట. తన భార్య మృతికి కారణమైనవారిపై రివెంజ్ తీసుకునే కథాంశం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది.

2012 ఆగస్ట్ లో తీవ్రం సినిమా షూటింగ్ మొదలైంది. అదే సంవత్సరం నవంబర్ 16న ఈ సినిమా విడుదలైంది. తీవ్రం సినిమా విడుదలయ్యాక యావరేజ్ రివ్యూలను సాధించింది. సినిమా కథ బాగున్నా కానీ టేకింగ్ లో లోపాల కారణంగా తీవ్రం చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. మొత్తానికి తీవ్రం యావరేజ్ బిజినెస్ ను చేసిందని చెప్పాలి.

2013లో దుల్కర్ సల్మాన్ ఏబిసిడి: అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ చిత్రాన్ని ఒప్పుకున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ను 2013 మార్చ్ లో మొదలుపెట్టారు. కథను బట్టి మెజారిటీ షూటింగ్ ను యూఎస్ లో చిత్రీకరించారు. గోపి సుందర్ సంగీతం అందించాడు. మార్టిన్ ప్రక్కట్ తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయమే సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశారు. అల్లు శిరీష్ హీరోగా అదే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఐతే మలయాళంలో సాధించిన సక్సెస్ తెలుగులో రిపీట్ అవ్వలేదు.

డిజిటల్ మీడియా బాగా విస్తరించాక ఇప్పుడంటే అంతోలజి చిత్రాలు బాగా ఫేమస్ అవుతున్నాయి కానీ 2013లోనే దుల్కర్ సల్మాన్ ఒక అంతోలజి చిత్రంలో నటించాడు. 5 సుందరికల్ పేరుతో తీసిన 5 భిన్నమైన ఉపకథలను ఒక స్టోరీగా మార్చి ఈ చిత్రాన్ని విడుదల చేసారు. 5 సుందరికల్ చిత్రంలో కుళ్ళంటే భార్య ఉపకథలో నటించాడు దుల్కర్ సల్మాన్. ఈ స్టోరీకు గోపి సుందర్ సంగీత దర్శకత్వం వహించాడు. అలాగే దుల్కర్ తో ఉస్తాద్ హోటల్ తీసిన అన్వర్ రషీద్ కూడా ఈ సినిమాలో ఒక పార్ట్ ను డైరెక్ట్ చేసాడు. అన్వర్ డైరెక్ట్ చేసిన స్టోరీ పార్ట్ పేరు ఆమి.

2013లో దుల్కర్ సల్మాన్ నటించిన మరో సినిమా నీలాకాశం పచ్చకడల్ చువన్న భూమి. ఈ సినిమా ఒక రోడ్ ట్రావెల్ చిత్రం. సమీర్ తాహిర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 2013లో షూటింగ్ ను ప్రారంభించి జూన్ 2013లో పూర్తి చేశారు. ఈ చిత్ర షూటింగ్ మొత్తం 8 రాష్ట్రాల్లో చేయడం విశేషం. కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, సిక్కిం, నాగాలాండ్ రాష్ట్రాల్లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. 2013 ఆగస్ట్ లో ఈ సినిమా విడుదలైంది. కేరళ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత కేరళలో కల్ట్ ఫాలోయింగ్ ను తెచ్చుకుంది. ముఖ్యంగా యువత ఈ చిత్రం పట్ల బాగా ఆకర్షితులు అయ్యారు. ఈ సినిమా వల్లే కేరళలో టూరిజం, రోడ్ ట్రావెలింగ్ పెరిగిందని అంటుంటారు. అలాగే బులెట్ బైక్ ను కొనేవారు కూడా ఈ సినిమా తర్వాత కేరళ రాష్ట్రంలో బాగా పెరిగారు. దుల్కర్ సల్మాన్ అదే ఏడాది చేసిన పట్టం పోలె సినిమా ప్లాప్ గా మిగిలింది. దుల్కర్ సల్మాన్, నజ్రియా జంటగా నటించిన సలలాహ్ మొబైల్స్ కూడా అదే రిజల్ట్ ను అందుకుంది. ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది.

2014లో దుల్కర్ సల్మాన్ మొదటిసారిగా తమిళ సినిమాలో నటించాడు. తెలుగులో సిద్ధార్థ్ హీరోగా చేసిన లవ్ ఫెయిల్యూర్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన దర్శకుడు బాలాజీ మోహన్ తన రెండో సినిమాగా తమిళ్ లో వాయముడి పేసవుమ్. ఈ చిత్రాన్ని మలయాళంలో కొద్దిగా కాస్టింగ్ లో మార్పులు, చేర్పులు చేసి తెరకెక్కించారు. దుల్కర్ సరసన మరోసారి నజ్రియా హీరోయిన్ గా నటించింది. నవంబర్ 2013లో షూటింగ్ మొదలుపెట్టిన ఈ సినిమా తమిళ్, మలయాళంలో25 ఏప్రిల్ 2014లో విడుదలైంది. తమిళ్ వెర్షన్ కు సంసారం ఆరోగ్యతిను హానికరం టైటిల్ తో తెరకెక్కించారు. తమిళ్ లో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలవగా మలయాళంలో మాత్రం ప్లాప్ అయింది. తొలి సినిమాతోనే తమిళ్ లో సొంత డబ్బింగ్ చెప్పుకుని అక్కడి ప్రేక్షకులను మెప్పించాడు దుల్కర్ సల్మాన్.

ఇక ఇదే ఏడాది దుల్కర్ సల్మాన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ వచ్చింది. మలయాళంలో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచిన సినిమా బెంగళూర్ డేస్ విడుదలైంది. ఉస్తాద్ హోటల్ చిత్రానికి కథ అందించిన అంజలి మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మలయాళంలో ఒక సెన్సేషన్. నివిన్ పౌలీ, నజ్రియా, దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాలో పార్వతి, ఫహద్ ఫాజిల్, నిత్యా మీనన్ తదితరులు నటించారు. ఇంత భారీ కాస్టింగ్ తో వచ్చిన చిత్రం దానికి తగ్గ రేంజ్ లోనే సక్సెస్ ను సాధించింది. ఈ సినిమా విజయం సాధించడమే కాకుండా బోలెడన్ని అవార్డులను కూడా కొల్లగొట్టింది. బెంగళూర్ డేస్ కు మూడు కేరళ రాష్ట్ర అవార్డులు వరించాయి. నివిన్ పౌలీ, నజ్రియాలకు ఉత్తమ నటుడు, నటి అవార్డులు రాగా, అంజలి మీనన్ కు ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు వచ్చింది. ఈ చిత్రాన్ని 2016లో బెంగళూర్ నాట్కళ్ పేరుతో తమిళ్ లోకి రీమేక్ చేసారు. బొమ్మరిల్లు భాస్కర్ ఈ రీమేక్ ను డైరెక్ట్ చేయగా మన భల్లాలదేవ రానా దగ్గుబాటి ఒక కీలక పాత్రలో నటించాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తమిళ్ లో అనుకున్న రేంజ్ లో ఆడలేదు.

2014వ సంవత్సరంలోనే దుల్కర్ సల్మాన్ విక్రమాదిత్యన్ అనే మరో సినిమాను పూర్తి చేసాడు. ఈ సినిమాను లాల్ జోస్ డైరెక్ట్ చేయగా దుల్కర్ తో పాటు ఈ సినిమాలో ఉన్ని ముకుందన్, నమితా ప్రమోద్, నివిన్ పౌలీ కూడా నటించారు. 25 జులై 2014న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ రివ్యూస్ ను తెచ్చుకుంది. విక్రమాదిత్యన్ కేరళ బాక్స్ ఆఫీస్ వద్ద 15 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

విక్రమాదిత్యన్ వంటి సూపర్ హిట్ తర్వాత దుల్కర్ సల్మాన్ తన కెరీర్ లోనే ఛాలెంజింగ్ సినిమాలో నటించాడు. ఈ విషయాన్ని స్వయంగా దుల్కర్ సల్మాన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. ఆ సినిమా పేరే న్జాన్. ఈ చిత్రాన్ని రంజిత్ డైరెక్ట్ చేసాడు. ఈ సినిమాలో హీరోయిన్లుగా జ్యోతి కృష్ణ, శృతి రామచంద్రన్ నటించారు. 19 సెప్టెంబర్2014లో విడుదలైన ఈ సినిమా దుల్కర్ కెరీర్ లో మంచి సక్సెస్ ను అందుకుంది. స్వతంత్రం రాకముందు మన పరిస్థితులను కేరళలో పల్లెటూర్లను అత్యద్భుతంగా ఈ చిత్రంలో చూపించారు. దుల్కర్ నటన కూడా అటు విమర్శకులను, ఇటు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

2015 దుల్కర్ కెరీర్ కు అత్యంత ముఖ్యమైన సంవత్సరం. ఎందుకంటే ఈ ఏడాది దుల్కర్ మూడు సినిమాలను చేయగా ఈ మూడు చిత్రాలు కూడా ఒకదాన్ని మించి మరొకటి సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయి. ఈ ఏడాది నిత్యా మీనన్ తో రెండు సినిమాల్లో నటించాడు. అందులో మొదటిది 100 డేస్ ఆఫ్ లవ్. ఈ చిత్రం ఒక క్యూట్ రొమాంటిక్ ఎంటర్టైనర్. 20 మార్చ్ 2015న విడుదలైన 100 డేస్ ఆఫ్ లవ్ మంచి హిట్ గా నిలిచింది. అలాగే ఈ సినిమాను తెలుగులో కూడా డబ్ చేసారు. మలయాళంలో వచ్చినంత సక్సెస్ అయితే తెలుగులో రాలేదు.

ఈ ఏడాది రెండోసారి తమిళ చిత్రం చేసాడు దుల్కర్ సల్మాన్. అగ్ర దర్శకుడు మణిరత్నంతో కలిసి పనిచేసే అవకాశాన్ని పొందాడు. దుల్కర్, నిత్యా మీనన్ హీరోహీరోయిన్లుగా మణిరత్నం తెరకెక్కించిన ఓ కాదల్ కన్మణి. ఈ చిత్రం తమిళ్ లో మంచి సక్సెస్ ను సాధించింది. తెలుగులో ఈ చిత్రాన్ని ఓకే బంగారం, మలయాళంలో ఓకే కన్మణి పేరుతో విడుదల చేసారు. 2017లో హిందీలో ఈ చిత్రాన్ని ఓకే జాను టైటిల్ తో రీమేక్ చేసారు. ఓ కాదల్ కన్మణి చిత్రానికి దిగ్గజ సాంకేతిక నిపుణులు పనిచేసారు. ఏఆర్ రహ్మాన్ సంగీతం అందించగా ప్రతీ పాట కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. అలాగే పిసి శ్రీరామ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు.

దుల్కర్ సల్మాన్ కెరీర్ లోనే అతిపెద్ద హిట్ అనదగ్గ చార్లీ 2015లో విడుదలైంది. ఈ సినిమాను మార్టిన్ ప్రక్కట్ తెరకెక్కించాడు. దుల్కర్ సరసన పార్వతి, అపర్ణ గోపినాథ్ హీరోయిన్లుగా నటించారు. 2015లో డిసెంబర్ 24న విడుదలైన ఈ చిత్రం ఏకంగా 42 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేసి సూపర్ హిట్ స్టేటస్ ను అందుకుంది. ఈ చిత్రంలో నటనకు గాను దుల్కర్ కు ప్రశంసల వర్షం కురిసింది.

మోస్ట్ టాలెంటెడ్ అనదగ్గ దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి తొలిసారి కలిసి నటించిన చిత్రం కాళీ. ఈ సినిమా ఒక రొమాంటిక్ యాక్షన్ అడ్వెంచర్. యాంగర్ ఇష్యూ ఉన్న ఒక వ్యక్తికి పెళ్లి అయితే ఆ వచ్చిన అమ్మాయి ఎలాంటి ఇబ్బందులు పడింది. దానివల్ల ఎంతటి పరిణామాలు ఎదురయ్యాయి అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని సమీర్ తాహిర్ తెరకెక్కించాడు. 2016 మార్చ్ 26న ఈ చిత్రం విడుదలైంది. కాళి చిత్రం మలయాళ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఎఫెక్ట్ నే చూపించింది. ఈ చిత్రాన్ని తెలుగులో హే పిల్లగాడా పేరుతో డబ్ చేసారు.

దర్శకుడు రాజీవ్ రవి, దుల్కర్ సల్మాన్ తో ఒక హార్డ్ హిట్టింగ్ గ్యాంగ్స్టర్ డ్రామాను తెరకెక్కించాడు. కోచిలోని కమ్మటిపాదం అనే ప్రాంతంలో రియల్ ఎస్టేట్ మాఫియా వల్ల దళితులు ఎదుర్కొనే ఇబ్బందుల నేపథ్యంలో కమ్మటిపాదం సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని మలయాళ సినిమాలో ఆ సమయంలో వచ్చిన బెస్ట్ గ్యాంగ్స్టర్ ఫిల్మ్ గా అభివర్ణించారు. దుల్కర్ సల్మాన్, వినాయకన్ లీడ్ రోల్స్ పోషించిన ఈ సినిమా మరో మంచి సక్సెస్ఫుల్ సినిమాగా నిలిచింది.

దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య రాజేష్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా ఫాదర్ - సన్ సెంటిమెంట్ ప్రధానంగా తెరకెక్కిన సినిమా జొమంటే సువిశేశంగల్. కొడుకుగా దుల్కర్ నటించగా, తండ్రి పాత్రలో ముకేశ్ కనిపిస్తారు. ఈ సినిమా దుల్కర్ కెరీర్ లో మరో హిట్ గా నిలిచింది. వరస సక్సెస్ లతో దుల్కర్ కెరీర్ మలయాళం ఇండస్ట్రీలో పైపైకి వెళ్ళిపోయింది. ఈ చిత్రం ఏకంగా 43 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రం తెలుగులో అందమైన జీవితం పేరుతో డబ్ అయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమా తర్వాత దుల్కర్ చేసిన కామ్రేడ్ ఇన్ అమెరికా కూడా పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది.

2017లో దుల్కర్ సల్మాన్ మరో ప్రయోగం చేసాడు. 2017 అక్టోబర్ 5న ఈ సినిమా విడుదలైంది. తమిళ్, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నిజానికి సోలో ఒక అంతోలోజి సినిమా. నాలుగు భిన్నమైన కథలను ఒకే సినిమాలో చెప్పారు. ఈ నాలుగు కథలు పంచ భూతాలలో నాలుగు ఎలెమెంట్స్, నిప్పు, భూమి, నీరు, గాలిలకు చిహ్నాలు. ఈ నాలుగు కథలలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించగా మిగతా కాస్ట్ మారుతుంది. తెలుగులో ఈ సినిమా అతడే పేరుతో విడుదలైంది. సోలో సినిమా దుల్కర్ కెరీర్ లో మరో సూపర్ హిట్ చిత్రం. నటుడిగా తనలోని మరో కోణాన్ని ఈ చిత్రం ద్వారా ఆవిష్కరించుకోగలిగాడు దుల్కర్ సల్మాన్.

2018లో దుల్కర్ సల్మాన్ ఒక్క మలయాళ సినిమా కూడా చేయలేదు. దానికి బదులుగా తెలుగులో, హిందీలో అరంగేట్రం చేసాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో సావిత్రమ్మ జీవితం ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రంలో జెమినీ గణేశన్ పాత్రలో నటించాడు దుల్కర్. భాష రాకపోయినా దుల్కర్ సల్మాన్ అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. మహానటి ఎంత పెద్ద సక్సెస్ అయింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముందుగా జెమినీ గణేశన్ పాత్ర కోసం విజయ్ దేవరకొండనే తీసుకుందాం అని అనుకున్నారు. అయితే తమిళ్ టోన్ లో తెలుగు డైలాగులు చెప్పాల్సిన నటుడు కావాలి అనుకుని విజయ్ స్థానంలో దుల్కర్ ను తీసుకున్నారు. మహానటి తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లో కూడా విడుదలైంది.

ఇదే ఏడాది హిందీలో కార్వాన్ చిత్రం ద్వారా అరంగేట్రం చేసాడు దుల్కర్ సల్మాన్. ఇర్ఫాన్ ఖాన్ తో కలిసి దుల్కర్ సల్మాన్ నటించిన ఈ చిత్రం మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది కానీ దుల్కర్ మొదటి హిందీ ప్రాజెక్ట్ కాబట్టి తనకు ఇది ఎంతో స్పెషల్ అని చెప్పుకోవచ్చు. హిందీలో మొదటి సినిమా అయినా కూడా దుల్కర్ ఎక్కడా ఇబ్బంది పడలేదు. చదువుకునే రోజుల్లో తన సెకండ్ లాంగ్వేజ్ హిందీ కాబట్టి చాలా సులువుగా చేసేసానని ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. హిందీ డెబ్యూ కంటే తెలుగు డెబ్యూ సమయంలో భాష పరంగా ఎక్కువ ఇబ్బంది పడ్డానని తెలిపాడు.

దుల్కర్ సల్మాన్ 2019లో చేసిన రెండు సినిమాలు కూడా అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వలేదు. హిందీలో చేసిన రెండో సినిమా ది జోయా ఫ్యాక్టర్ క్రిటిక్స్ నుండి మంచి రివ్యూలనే పొందింది. ఐతే బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం ఈ చిత్రం పెద్ద ప్లాప్ గా నిలిచింది. అలాగే మలయాళంలో కొంత గ్యాప్ తర్వాత చేసిన ఒరు యమందన్ ప్రేమకథ కూడా అనుకున్నంత రేంజ్ లో ఆడలేదు. ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది ఈ చిత్రానికి.

2020లో దుల్కర్ సల్మాన్ నిర్మాతగా మారాడు. కేవలం నిర్మాత మాత్రమే కాకుండా దుల్కర్ ఈ సినిమాలో లీడ్ రోల్ ను కూడా పోషించడం విశేషం. సురేష్ గోపి, శోభన, దుల్కర్ సల్మాన్, కళ్యాణి ప్రియదర్శన్ లు నటించిన వరనే ఆవశ్యముండ్ చిత్రం పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ దుల్కర్ సల్మాన్ కు సక్సెస్ ను అందించింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం 31 కోట్ల రూపాయలను వసూలు చేయడం విశేషం.

ఇదే ఏడాది దుల్కర్ సల్మాన్ మరో తమిళ సినిమాలో నటించాడు. దేసింగ్ పెరియసామి దర్శకత్వం వహించిన కన్నుమ్ కన్నుమ్ కొల్లాయిదిత్తాల్ లో దుల్కర్ సల్మాన్ సరసన రీతూ వర్మ నటించింది. మోసం, ప్రేమ, డబ్బు అనే అంశాల చుట్టూ తిరిగే ఈ చిత్రంలో ప్రముఖ దర్శకులు గౌతమ్ మీనన్ కీలక పాత్రలో కనిపించాడు. ఈ సినిమా 28 ఫిబ్రవరి 2020న విడుదలైంది. ఈ చిత్రాన్ని తెలుగులో కనులు కనులను దోచాయంటే టైటిల్ తో డబ్ చేసారు. అటు తెలుగులో, ఇటు తమిళంలో ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా విడుదలై దాదాపు 15 రోజుల తర్వాత కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో థియేటర్లు దాదాపు ఎనిమిది నెలల పాటు మూతబడ్డాయి.

ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ వివిధ చిత్రాలతో మన ముందుకు వస్తున్నాడు. భారీ బడ్జెట్ తో దుల్కర్ లీడ్ రోల్ లో నటించిన కురుప్ త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు దాదాపు 5 భాషల్లో విడుదల చేయనున్నాడు. కురుప్ చిత్రానికి దుల్కర్ నిర్మాత కూడా. కురుప్ కాకుండా సెల్యూట్, హే సినామిక చిత్రాల్లో దుల్కర్ నటిస్తున్నాడు. ఇప్పటివరకూ తన కెరీర్ లో 30 సినిమాల వరకూ చేసాడు దుల్కర్. మొత్తం నాలుగు భాషల్లో నటించాడు. అత్యధిక సక్సెస్ రేట్ దుల్కర్ సొంతం.
అవార్డ్స్:


దుల్కర్ సల్మాన్ సినిమా సినిమాకూ భిన్నంగా కనిపించాలని, ప్రతీ కథ కొత్తగా ఉండాలని పరితపిస్తుంటాడు. అందుకే సినిమాలు ఫెయిల్ అయినా అందులో దుల్కర్ నటన మాత్రం ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. దుల్కర్ సినిమా అంటే ఏదో కొత్తదనం కచ్చితంగా ఉంటుందని భావించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇలా కొత్తదనం కోరుకోవడంతో దుల్కర్ కు తన కెరీర్ లో పలు అవార్డులు కూడా వచ్చాయి. అవేమిటో ఒకసారి చూసుకుంటే..
* సెకండ్ షో చిత్రానికి ఏషియా విజన్ అవార్డ్స్, ఏషియానెట్ ఫిలిం అవార్డ్స్ ఉత్తమ డెబ్యూ హీరోగా అవార్డ్స్ తో గుర్తించారు.
* ఉస్తాద్ హోటల్ కు వనితా ఫిల్మ్ అవార్డ్స్ తో పాటు ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా వరించింది.
* తన మొదటి సినిమా సెకండ్ షో కు సైమా వారు కూడా బెస్ట్ డెబ్యూ హీరో అవార్డును ఇచ్చి గౌరవించారు.
* 2013, 2014 సంవత్సరాలకి గాను దుల్కర్ సల్మాన్ ఏషియా విజన్ అవార్డ్స్ పెర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నాడు.
* అలాగే2014, 2015 సంవత్సరాలకు గాను ఏషియానెట్ ఫిలిం అవార్డ్స్ స్టార్ ఆఫ్ ది ఇయర్ బిరుదును ఇచ్చి గౌరవించారు.
* దుల్కర్ కెరీర్ లో చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన చార్లీ చిత్రం పలు అవార్డులను సొంతం చేసుకుంది. కేరళ ప్రభుత్వం ఇచ్చే రాష్ట్ర అవార్డు, నాఫా అవార్డు, ఫిల్మ్ ఫేర్, సైమా అవార్డులను చార్లీ సినిమాలో నటనకు గాను అందుకున్నాడు. సైమా అవార్డు మాత్రం చార్లీ సినిమాలో పాడిన పాటకు రావడం విశేషం.
* మహానటి సినిమాలో జెమిని గణేశన్ పాత్రలో నటించిన దుల్కర్ సల్మాన్ బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్, సైమా అవార్డ్స్ ను గెలుచుకున్నాడు.
* ఇవే కాకుండా వివిధ సినిమాలకు పలు అవార్డులను కూడా అందుకున్నాడు దుల్కర్ సల్మాన్.
గౌరవాలు:


* జిక్యూ అనే మెన్ మ్యాగజిన్ 50 ప్రభావిత యంగ్ ఇండియన్స్ లిస్ట్ ను ప్రకటిస్తే అందులో దుల్కర్ సల్మాన్ 4వ స్థానంలో నిలిచాడు. ఇది 2016 సంవత్సరానికి సంబంధించిన లిస్ట్.
* అదే జీక్యూ మ్యాగజిన్ బెస్ట్ డ్రెస్డ్ మెన్ ఇండియా 2016 సంవత్సరంలో తీసిన లిస్ట్ లో దుల్కర్ సల్మాన్ కు కూడా స్థానం దక్కింది.
* టైమ్స్ గ్రూప్ వారు ప్రతీ ఏటా నిర్వహించే మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ లో కోచి టైమ్స్ కు గాను 2013, 2014 సంవత్సరాలలో వరసగా మోస్ట్ డిజరైబుల్ గా నిలిచాడు దుల్కర్ సల్మాన్.
* వోగ్ ఇండియా కవర్ పేజ్ పై 2019 అక్టోబర్ ఎడిషన్ లో దుల్కర్ ఫీచర్ అయ్యాడు. కేరళ నుండి ఈ గౌరవం దక్కించుకున్న తొలి హీరో దుల్కర్ సల్మాన్.
గాయకుడిగా, నరేటర్ గా:

దుల్కర్ సల్మాన్ కేవలం నటించడమే కాకుండా గాయకుడిగానూ మలయాళ సినిమాల్లో ఫేమస్. అలాగే పలు సినిమాలకు నరేటర్ గా వ్యవహరించాడు దుల్కర్ సల్మాన్.
ఏబిసిడి, మంగ్లీష్, చార్లీ, కామ్రేడ్ ఇన్ అమెరికా, పరవా, కళ్యాణం, మలయాళ మనోరమ ఏడి, డియర్ కామ్రేడ్(మలయాళ వెర్షన్), షర్బత్ కథ, మానియారయిలే అశోకన్ సినిమాల్లో పాటలు పాడి అందరినీ అలరించాడు దుల్కర్ సల్మాన్.
* కూతర, ముదుగావ్, పొక్కిరి సైమన్, మార్గంకాలి, మానియారయిలే అశోకన్ సినిమాలకు నరేటర్ గా తన వాయిస్ ను అందించాడు.
వ్యక్తిగత జీవితం:

సినిమాల్లోకి రాకముందే, అంటే 2011లోనే దుల్కర్ సల్మాన్ వివాహం జరిగింది. పెద్దలు కుదిర్చిన సంబంధాన్ని చేసుకున్నాడు దుల్కర్ సల్మాన్. 22 డిసెంబర్ 2011లో ఆర్కిటెక్ట్ అమల్ సుఫియాను పెళ్లి చేసుకున్నాడు. అమల్ సుఫియా చెన్నైలో సెటిలైన నార్త్ ఇండియన్ ముస్లిం కమ్యూనిటీకి చెందిన వారు. వీరికి2017లో ఒక పాప జన్మించింది. ఆ పాపకు మార్యం అమీరహ్ సల్మాన్ అని పేరు పెట్టారు.

దుల్కర్ సల్మాన్ కు సామాజిక బాధ్యత కూడా ఎక్కువే. కేరళ మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ వారి సేఫ్ రైడింగ్ క్యాంపైన్ లో భాగంగా ఒక షార్ట్ ఫిల్మ్ లో నటించాడు దుల్కర్. చెన్నై గివ్స్ ఇనిషియేటివ్ లో భాగంగా బట్టలు, షూస్, స్కూల్ సామాన్లు, వంటింటి సామాన్లు, వంటి 150 వస్తువులను దుల్కర్ సల్మాన్ డొనేట్ చేసాడు.

దుల్కర్ కు పలు బిజినెస్ లు కూడా ఉన్నాయి. ట్రేడింగ్ కార్స్ కు సంబంధించిన వెబ్ పోర్టల్ ను నడుపుతున్నాడు. అలాగే బెంగళూరులో ఉన్న మదర్ హుడ్ ఆసుపత్రికి డైరెక్టర్ హోదాలో ఉన్నాడు దుల్కర్. అంతే కాకుండా చెన్నైలో డెంటల్ బిజినెస్ చైన్ కూడా దుల్కర్ కు ఉంది. చేసిన ప్రతీ భాషలోనూ తన మార్కును వేసిన దుల్కర్ సల్మాన్ భవిష్యత్తులో మరిన్ని అద్భుతమైన పాత్రలను పోషించాలని కోరుకుందాం.