
కమెడియన్ గా సినిమాలు చేస్తూనే అప్పుడప్పుడు కథానాయకుడిగా కూడా అలరిస్తుంటారు ప్రముఖ హాస్యనటుడు శ్రీనివాస్ రెడ్డి. ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో ఎన్నో చిత్రాల్లో కమెడియన్ గా నటించి ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుక్కున్నారు. గీతాంజలి, జయమ్ము నిశ్చయమ్మురా వంటి సినిమాలతో హీరోగా విజయాలను అందుకున్న శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు తాజాగా ముగ్గురు మొనగాళ్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో చిత్రమందిర్ స్టూడియోస్ పతాకంపై అచ్యుత్ రామారావు ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డి మెయిన్ లీడ్ రోల్ చేస్తుండగా, దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. శ్రీనివాస రెడ్డి, దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు ఒకే పోస్టర్లో ఉన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది.

పోస్టర్లో కనపడుతున్నట్లుగా ‘ముగ్గురు మెనగాళ్లు’లో శ్రీనివాసరెడ్డికి వినపడదు, దీక్షిత్ శెట్టి మాట్లాడలేడు, వెన్నెల రామారావుకు కనపడదు. ఇలా ఈ ముగ్గురూ మొనగాళ్లు ఎలా అయ్యారో సినిమా చూసి తెలుసుకోవాలి. మంచి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా గురించిన మరిన్ని ఆసక్తికర విషయాలు, విశేషాలు తెలియాలంటే ట్రైలర్ విడుదల వరకూ వెయిట్ చేయాల్సిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.