పవన్ కళ్యాణ్ అనే ఒక్క పేరు చాలు: 'బ్రో' చిత్ర కథానాయిక కేతిక శర్మ!!

పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్  కలయికలో పి. సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'బ్రో'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే,  డైలాగ్స్ అందిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ఇతర ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన నటించిన కథానాయిక కేతిక శర్మ తాజాగా విలేకర్లతో ముచ్చటించి బ్రో సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

బ్రో మాతృక చూశారా? రెండింటికి వ్యత్యాసం ఏంటి?
చూశాను. ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి. మాతృకతో పోలిస్తే బ్రోలో కథానాయిక పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. వినోదంతో పాటు వివిధ హంగులు జోడించి, మాతృక కంటే మరింత అందంగా మలిచారు.

బ్రో సినిమా ఒప్పుకోవడానికి ప్రధానం కారణం?
పవన్ కళ్యాణ్ గారు. ఆయన పేరు వింటే చాలు.. సినిమా ఒప్పుకోవడానికి పెద్దగా కారణాలు అక్కర్లేదు. పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ లో నాకు సన్నివేశాలు లేవు. కానీ ఆయనతో కలిసి సినిమాలో నటించడం సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారిని అంతకముందు ఎప్పుడూ కలవలేదు. మొదటిసారి ఈ సినిమా ద్వారానే ఆయనను కలిసే అవకాశం లభించింది.

సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది?
ఈ సినిమాలో నేను సాయి ధరమ్ తేజ్ గారు పోషిస్తున్న మార్క్ కి ప్రేయసిగా కనిపిస్తాను. ఇది సినిమాకి ముఖ్యమైన, నటనకు ఆస్కారం ఉన్న పాత్ర. సినిమాలోని ప్రతి పాత్ర కథని ముందుకు నడిపించేలా ఉంటుంది. అనవసరమైన పాత్రలు గానీ, సన్నివేశాలు గానీ లేకుండా ఆసక్తికర కథాకథనాలతో ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమా సాగుతుంది. ఇదొక సందేశాత్మక చిత్రం. ఈ తరహా సినిమాలో నటించే అవకాశం రావడం నాకు ఇదే మొదటిసారి. నా గత చిత్రాలతో పోలిస్తే ఇది విభిన్న చిత్రం. నటిగా మరింత మెరుగుపడటానికి సహాయపడింది.

మీ గత చిత్రం వైష్ణవ్ తేజ్ తో చేశారు. ఇప్పుడు వెంటనే ఆయన సోదరుడు సాయి ధరమ్ తేజ్ తో నటించడం ఎలా ఉంది?
ఇది యాదృచ్చికం జరిగింది. 'రంగ రంగ వైభవంగా' చివరి దశలో ఉన్నప్పుడు నాకు ఈ అవకాశం వచ్చింది. ఎంతో ఆసక్తికర కథ, దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు, సాయి ధరమ్ తేజ్ గారి కలయికలో వస్తున్న మొదటి సినిమా. అందుకే ఈ అవకాశాన్ని అసలు వదులుకోకూడదు అనుకున్నాను.

సెట్స్ లో వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఎలా ఉంటారు?
ఇద్దరూ మంచి వ్యక్తులు, అందరితో సరదాగా ఉంటారు. వైష్ణవ్ కొంచెం మొహమాటస్తుడు. కానీ ఒక్కసారి పరిచయం అయ్యాక చాలా సరదాగా ఉంటారు. సాయి ధరమ్ తేజ్ అందరితో బాగా కలిసిపోతాడు.

మీ పాత్ర కోసం ఎలాంటి కసరత్తులు చేశారు?
మాతృకతో పోలిస్తే ఇందులో నా పాత్రకు ప్రాధాన్యం ఎక్కువ. ఫన్నీ డైలాగ్స్ ఉంటాయి. స్క్రిప్ట్ చక్కగా కుదిరింది. దానికి తగ్గట్టుగా నటిగా నా ఉత్తమ ప్రదర్శనను ఇవ్వడానికి కృషి చేశాను. సముద్రఖని గారు ఫాస్ట్ డైరెక్టర్. ఆయన ఎక్కువ టేక్స్ తీసుకోరు. తక్కువ టేక్స్ లోనే మన నుంచి బెస్ట్ అవుట్ పుట్ రాబడతారు. ఆయనకు ఏం కావాలో ఆయనకు స్పష్టంగా తెలుసు. ఆయన చాలా తెలివైన దర్శకులు. త్రివిక్రమ్ గారి అద్భుతమైన రచన కూడా ఈ సినిమాకి తోడైంది. కాబట్టి నేను ప్రత్యేకంగా కసరత్తులు చేయాల్సిన అవసరం రాలేదు.

జాణవులే పాటలో మీరు చాలా స్టైల్ గా కనిపిస్తున్నారు. ఆ పాట గురించి చెప్పండి?
నీతా లుల్లా గారు కాస్ట్యూమ్ డిజైనర్ గా చేశారు. నా డ్రెస్సింగ్ స్టైల్ విషయంలో ఆమెకే క్రెడిట్ దక్కుతుంది. జాణవులే పాట ఇచ్చిన అనుభూతిని ఎప్పటికీ మరిచిపోలేను. అద్భుతమైన విదేశీ లొకేషన్లలో చిత్రీకరించారు. ఈ సాంగ్ ద్వారా మొదటిసారి నాకు డ్యాన్స్ చేసే అవకాశం వచ్చింది. ఈ చిత్రంలో సంగీతం బాగుంటుంది.

పవన్ కళ్యాణ్ గారిని మొదటిసారి సెట్స్ లో కలవడం ఎలా ఉంటుంది?
పవన్ కళ్యాణ్ గారితో నేరుగా వెళ్లి మాట్లాడాలంటే కాస్త భయమేసింది. సాయి ధరమ్ తేజ్ గారికి చెప్తే నన్ను తీసుకెళ్లి ఆయనకు పరిచయం చేశారు. కాంబినేషన్ సీన్స్ లేకపోవడం వల్ల పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ కలవలేకపోయాను. కానీ ఆరోజు ఆయనతో మాట్లాడిన ఆ ఐదు నిమిషాలు మాత్రం మంచి అనుభూతిని ఇచ్చింది.

మీకు బ్రో రూపంలో మంచి అవకాశం వచ్చింది.. మీ భవిష్యత్ ప్రణాళికలు ఏంటి?
జయాపజయాలు మన చేతుల్లో ఉండవు. మన వరకు సినిమా కోసం ఎంత కష్ట పడగలమో అంత కష్టపడాలి. ఇలాంటి గొప్ప అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా తర్వాత మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గురించి?
ఈ బ్యానర్ లో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఆర్టిస్ట్ ని ఎంతో కేరింగ్ గా చూసుకుంటారు. ఈ ప్రొడక్షన్ లో చాలా కంఫర్టబుల్ గా పనిచేయగలిగాను.

మీ తదుపరి సినిమాలు.. మెగా హీరోలతో ఇంకా సినిమాలు ఏమైనా చేస్తున్నారా?
ఆహా స్టూడియోస్ తో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడే ఆ ప్రాజెక్ట్ వివరాలు చెప్పలేను. ప్రస్తుతానికి అయితే మెగా హీరోలతో కొత్త సినిమాలు చెయ్యట్లేదు. అవకాశం వస్తే మాత్రం సంతోషంగా చేస్తాను.

మీ డ్రీం రోల్ ఏంటి?
ఎవరైనా ప్రముఖుల బయోపిక్ లో నటించాలని ఉంది. అలాంటి నిజ జీవిత పాత్రలు ఛాలెంజింగ్ గా ఉంటాయి.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.