ఇప్పటిదాకా నేను చేసిన సినిమాలలో ఇదే ఉత్తమ చిత్రం:

-'బ్రో' చిత్ర దర్శకుడు సముద్రఖని
పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్  కలయికలో పి. సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'బ్రో'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విలేకర్లతో ముచ్చటించిన దర్శకుడు సముద్రఖని, బ్రో సినిమాకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఒక చిన్న ఆర్టిస్ట్ గా మొదలై, ఇప్పుడు పెద్ద స్టార్ ని డైరెక్ట్ చేసే స్థాయికి ఎదిగారు. మీ ప్రయాణం గురించి చెప్పండి?
నేను ఏదీ ప్లాన్ చేయలేదు. దర్శకుడిగా ఇది నా 15 వ సినిమా. ఈ 15 సినిమాలకు నేనేది ప్లాన్ చేయలేదు. 1994 లో అసిస్టెంట్ డైరెక్టర్ గా నా ప్రయాణం మొదలైంది. అప్పటినుంచి నా పని నేను చూసుకుంటూ, జయాపజయాలతో సంబంధం లేకుండా ముందుకు సాగుతున్నాను. బుల్లితెర మీద నా ప్రతిభ చూసి ఎస్.పి. చరణ్ గారు నాకు మొదటి సినిమా అవకాశమిచ్చారు. మన పని మనం సరిగ్గా చేస్తుంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయి. వచ్చిన అవకాశాలను మనం సద్వినియోగం చేసుకోవాలి.

రీమేక్ చేయడానికి కారణం?
ఈ కథని అన్ని భాషలకు చేరువ చేయాలి. 12 భాషల్లో చేయాలని సన్నాహాలు చేస్తున్నాము. వినోదయ సిత్తం చేయకముందు, తర్వాత ఏంటి అనే దానిపై స్పష్టత లేదు. వినోదయ సిత్తం చేశాక జీవితంలో సగం సాధించామనే భావన కలిగింది. ఇక ఇప్పుడు బ్రో చేశాక ఇంతకంటే సాధించడానికి ఏంలేదు, ఇప్పటినుంచి జీవితంలో వచ్చేదంతా బోనస్ అనిపిస్తుంది.

పవన్ కళ్యణ్ గారు లాంటి బిగ్ స్టార్ తో సినిమా అంటే ఏమైనా ఆందోళన చెందారా?
అవన్నీ ఏం ఆలోచించలేదు. కాలమే అన్నీ నిర్ణయిస్తుంది. అప్పటికి వినోదయ సిత్తం విడుదలై పది రోజులే అవుతుంది. ఒక 73 ఏళ్ళ పెద్దాయన సినిమా చూసి బాగా ఎమోషనల్ అయ్యి, నా ఫోన్ నెంబర్ సంపాదించి మరీ నాతో మాట్లాడారు. అంతలా మనుషులను ప్రభావితం చేసే చిత్రమిది. త్రివిక్రమ్ అన్నయ్య సహకారంతో ఇక్కడ ఈ సినిమా చేయగలిగాను. నేను సినిమా కథ చెప్పినప్పుడు క్లైమాక్స్ సంభాషణలు ఆయనకు బాగా నచ్చాయి. తమిళ్ లో చేసినప్పుడు కోవిడ్ సమయం కావడంతో ఎవరూ ముందుకు రాకపోవడంతో నేనే నటించాను అని చెప్పాను. ఈ కథని ఎక్కువ మందికి చేరువ చెయ్యాలని, కళ్యాణ్ గారితో చేస్తే బాగుంటుందని త్రివిక్రమ్ గారు చెప్పగానే ఒక్కసారిగా మాటల్లో చెప్పలేని ఆనందం కలిగింది. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలయికలో కొన్ని మార్పులతో చేస్తే బాగుంటుందని ఆయనే చెప్పారు. అలా కళ్యాణ్ గారికి కథ నచ్చడంతో వెంటనే సినిమా పని మొదలైంది. కాలమే త్రివిక్రమ్ గారిని, కళ్యాణ్ గారిని ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చింది.

ఈ సినిమాకి స్ఫూర్తి ఏంటి?
మా గురువు గారు బాలచందర్ గారితో కలిసి 2004 సమయంలో ఒక డ్రామా చూశాను. ఎలా ఉందని గురువుగారు అడిగితే, బాగుంది సార్ కానీ సామాన్యులకు చేరువయ్యేలా చేస్తే బాగుంటుంది అన్నాను. అప్పటినుంచి ఆ కథ నాతో పయనిస్తూనే ఉంది. దానిని స్ఫూర్తిగా తీసుకొని 17 ఏళ్ళ తర్వాత సినిమాగా తీశాను. అదే వినోదయ సిత్తం. ఆ స్టేజ్ ప్లే రచయిత డబ్బు ఇస్తానన్నా తీసుకోలేదు. సమాజానికి మనం మంచి సందేశం ఇవ్వాలని ప్లాన్ చేస్తే, సమాజం మనకి మంచి చేస్తుంది. ఈ సినిమా విషయంలో అదే జరిగింది.

మార్పులు చేయడం వల్ల మాతృక స్థాయిలో బ్రో ప్రేక్షకులకు అనుభూతిని పంచగలదు అనుకుంటున్నారా?
ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది. మాతృకలోని ఆత్మని తీసుకొని పవన్ కళ్యాణ్ గారి స్టార్డం కి తగ్గట్లుగా కొన్ని మార్పులు చేశాం. మాతృక కంటే గొప్పగా ఉంటుంది బ్రో.

మీరు రచయిత అయ్యుండి త్రివిక్రమ్ గారి సహకారం తీసుకోవడానికి కారణం?
నేను సమిష్టి కృషిని నమ్ముతాను. ఇక్కడ నేటివిటీ మీద త్రివిక్రమ్ గారికి ఉన్న పట్టు నాకుండదు. పైగా నన్ను నమ్మి ఇంత పెద్ద బాధ్యత నాకు అప్పగించడం నాకే ఆశ్చర్యం కలిగించింది. నేను ఆయనతో అల వైకుంఠపురములో నుంచి ట్రావెల్ అవుతున్నాను. కానీ ఆయనకు సునీల్ వల్ల నా గురించి ముందే తెలిసింది. శంభో శివ శంభో సమయంలో నా గురించి సునీల్ చెప్పేవారట. అలా దర్శకుడిగా త్రివిక్రమ్ నన్ను ముందు నుంచే నమ్మారు.

విజువల్ గా ఎలా ఉండబోతుంది?
విజువల్ ఫీస్ట్ లా ఉంటుంది. ఇది 53 రోజుల్లో చేశాం. కానీ విజువల్స్ చూస్తుంటే చాలా రోజులు చేసినట్లు ఉంటుంది. 53 రోజులు ఒక్క సెకన్ కూడా వృధా చేయకుండా పనిచేశాం. 150 రోజులు షూట్ చేసిన సినిమాలా అవుట్ పుట్ ఉంటుంది. ఇప్పటిదాకా నేను చేసిన 15 సినిమాల్లో ఇదే నా బెస్ట్ మూవీ. ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్ అన్నయ్య నాకు ఒక తండ్రిలా అండగా నిలబడ్డారు.

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ల కాంబినేషన్ ఎలా ఉండబోతుంది?
వాళ్ళ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. మనం ప్రత్యేకంగా ఏం చేయనక్కర్లేదు. కెమెరా పెడితే చాలు, వాళ్ళు స్క్రీన్ మీద మ్యాజిక్ చేసేస్తారు.

పవన్ కళ్యాణ్ గారి గురించి?
పవన్ కళ్యాణ్ గారిని కలిసి మొత్తం స్క్రిప్ట్ అంతా వినిపించాక, షూటింగ్ ఎప్పటినుంచి అనుకుంటున్నారు అని అడిగారు. మీరు రెడీ అంటే రేపటి నుంచే సార్ అనగానే ఆయన షాక్ అయ్యారు. అలా ఆయనను కలిసిన మూడు రోజులకే షూటింగ్ స్టార్ట్ చేశాం. ఆయన సెట్ లో అడుగుపెట్టగానే మొదట ఏం జరుగుతుందోనని మొత్తం గమనిస్తారు. దర్శకుడిగా నేను ఎంత క్లారిటీగా ఉన్నాను అనేది ఆయనకు మొదటిరోజే అర్థమైంది. ఆయన ఈ సినిమా కోసం ఎంతో చేశారు. సమయం వృధా చేయకూడదని సెట్ లోనే కాస్ట్యూమ్స్ మార్చుకున్నారు. షూటింగ్ జరిగినన్ని రోజులు ఉపవాసం చేశారు. ఎంతో నిష్ఠతో పనిచేశారు.

థమన్ సంగీతం గురించి?
థమన్ గురించి చెప్పాలంటే చెబుతూనే ఉండాలి. నేను తీసిన ఈ 15 సినిమాలలో మొదటిసారి థమన్ నేపథ్యం సంగీతం విని కంటతడి పెట్టుకున్నాను.

నిర్మాతల గురించి?
ఈ సినిమా విషయంలో నిర్మాతల సహకారం అసలు మర్చిపోలేను. సినిమాకి ఏది కావాలంటే అది సమకూర్చారు. వాళ్ళు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని అనుకుంటున్నాను.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.