
తన సంగీతంతో ప్రేక్షకభిమానుల్ని ఉర్రుతలూగించి, తన స్వరంతో కోట్లాదిమంది హృదయాలను గెలుచుకుని, ఎంతో మందికి మార్గ నిర్దేశం చేసిన మహనీయుడు, కళామతల్లి ముద్దు బిడ్డ శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఘంటసాల 1922 డిసెంబర్ 4 న గుడివాడ సమీపములోని చౌటపల్లి గ్రామంలో ఘంటసాల సూర్యనారాయణ, రత్నమ్మ దంపతులకు ఆయన జన్మించారు. సూర్యనారాయణ గారు ప్రముఖ మృదంగ విద్వాంసులు. అలా చిన్నప్పటి నుండే ఆయనకు కళల పట్ల, సంగీతం పట్ల ఆసక్తి ఏర్పడింది. చిన్నప్పటి నుండే కచేరీలలో పాల్గొనడం, విద్వాంసులతో పోటిలకు వెళ్ళడం అలా ఎన్నో అడ్డంకులను ఎదుర్కుని ఆయన సినీ రంగ ప్రవేశం చేసారు. పరిశ్రమలో ఎంతో మంది ప్రముఖులకు ఆయనే పాటలు పాడేవారు. ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్ ఎస్.వీ.ఆర్ లాంటి ఉద్దండులకు ఘంటసాల గారి గాత్రం మాత్రమే బాగుంటుంది అనేవారు అప్పటి నిర్మాతలు, దర్శకులు. అంతలా ఆయన తన స్వరంతో మంత్రముగ్ధుల్ని చేసేవారు. ఎన్నో చిత్రాలకు సంగీతం అందించి మరెన్నో చిత్రాల్లో పాటలు పాడి సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. సుమారూ 30 సంవత్సరాల పాటు ఉత్తమ నేపధ్య గాయకునిగా రాష్ట్ర ప్రభుత్వం నుండి పురస్కారాలు అందుకున్నారు. కళా రంగంలో ఆయన సేవకు గాను భారత ప్రభుత్వం ఆయనను ‘పద్మశ్రీ’ తో సత్కరించింది. ఆయన పేరు మీద పోస్టల్ స్టాంప్ కూడా విడుదల చేసింది. అంతటి ఉత్తమ కళాకారుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తోంది మీడియా 9.