
తెలుగులో సంవత్సరానికి 150 – 200 సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అందులో 10 సినిమాలు హిట్ అవుతాయి. అందులో రెండో మూడో బ్లాక్ బస్టర్స్ అవుతాయి. అలా బ్లాక్ బస్టర్స్ ఇచ్చే అతి తక్కువ మంది దర్శకులలో “త్రివిక్రమ్ శ్రీనివాస్” ఒకరు. నేడు ఆయన పుట్టినరోజు. అసలు పేరు “ఆకెళ్ళ నాగ శ్రీనివాస శర్మ”7 నవంబర్ 1971 న భీమవరం లో పుట్టారు. నటుడు సునీల్, త్రివిక్రమ్ ఒకే కాలేజ్ లో చదువుకున్నారు. ఆ తర్వాత సినిమా ప్రయత్నాల్లో ఉన్నప్పుడు కూడా ఇద్దరూ ఒకే రూమ్ లో ఉండేవారు. త్రివిక్రమ్ మొదట్లో టివి సీరియల్స్ కి రచయితగా పని చేశారు. మొదటి సారిగా “స్వయంవరం” అనే సినిమాకు కథా, మాటల రచయిత గా పనిచేశారు. తర్వాత సముద్రం, నువ్వే కావాలి, వంటి సూపర్ హిట్ సినిమాలకు డైలాగ్స్ రాశారు. అప్పటి వరకు తెలుగు ప్రేక్షకులకు అలవాటయిన పద్ధతిలో కాకుండా వీరి డైలాగ్స్ భిన్నంగా ఉండేవి. పేజీలు పేజీలు కాకుండా షార్ట్ గా హాస్యం, ఇంటెలిజెంట్ తో కలగలపి చివరిగా గట్టి పంచ్ లైన్ లతో ప్రతి డైలాగ్ భీభత్సమైన హ్యూమర్ ని పుట్టిస్తాయి. ఒక్క సారిగా అటు ప్రేక్షకులలోనూ, సినిమా వర్గాలలోనూ త్రివిక్రమ్ డైలాగ్స్ కి మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత చిరునవ్వుతో, నిన్నే ప్రేమిస్తే, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు, మల్లీశ్వరీ వంటి చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయంటే అందులో త్రివిక్రమ్ డైలాగుల పాత్ర చాలా ఉంది. అప్పటివరకూ కేవలం పెన్నుతో హాస్యాన్ని చిలికిస్తూ తెర వెనుక ఉండిపోయిన త్రివిక్రమ్ మొదటి సారిగా మెగాఫోన్ పట్టుకుని “నువ్వే నువ్వే” అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తర్వాత మహేష్ బాబుతో తీసిన ‘అతడు’ సినిమా సంచలనం సృష్టించింది. ఇప్పటికీ టివిలో ఈ సినిమా వస్తే సగం మంది తెలుగు ప్రేక్షకులు టీవిలకు అతుక్కుపోతారు. జల్సా – సూపర్ హిట్, ఖలేజా – కల్ట్ హిట్, జులాయి – క్లాసీ ఇంటెలిజెంట్ థ్రిల్లర్ హిట్, అత్తారింటికి దారేది – బంపర్ హిట్, S/O సత్యమూర్తి – ఎమోషనల్ హిట్, అ ఆ – ఫ్యామిలీ హిట్, అరవింద సమేత వీర రాఘవ – సూపర్ డూపర్ హిట్, అల వైకుంఠపురం – బ్లాక్ బస్టర్ ఇలా త్రివిక్రమ్ తీసిన ప్రతీ సినిమాకు ఆటోమేటిక్ గా హిట్ ట్యాగ్ వచ్చేస్తుంది. త్వరలో జూ. ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా కూడా తన హిట్స్ ఖాతాలో చేరాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీడియా 9 త్రివిక్రమ్ శ్రీనివాస్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతోంది.