
భారతీయ సంగీతాన్ని ప్రపంచానికి చాటి చెప్పి ఆస్కార్ అవార్డ్ ని గెలుచుకున్న గొప్ప సంగీత దర్శకుడు ఎ.ఆర్ రెహ్మాన్. ఎన్నో అవార్డులు, మరెన్నో సంగీత సంచలనాలు ఆయన సొంతం. జనవరి 6 1967 న మద్రాస్ లో తండ్రి ఆర్. కె. శేఖర్, తల్లి కస్తూరికి రెహ్మాన్ జన్మించారు. అయితే ఎ.ఆర్ రెహ్మాన్ కి మొదటగా పెట్టిన పేరు మాత్రం ఎ. ఎస్. దిలీప్ కుమార్. ఇక ఆయన సంగీత జీవితాన్ని తెలుగు సంగీత దర్శకులు రాజ్ - కోటి వద్ద అసిస్టెంటుగా ప్రారంభించి, తర్వాత ప్రఖ్యాత తమిళ దర్శకుడు మణిరత్నం సినిమా రోజా ద్వారా మొత్తం భారతదేశమంతటా పేరు పొందాడు. ఇక ఎ.ఆర్ రెహ్మాన్ డైరెక్ట్ గా తెలుగులో చేసినవి తక్కువ సినిమలైన కూడా ఆయన డబ్బింగ్ సినిమాల పాటలకు తెలుగులో భారీగా ఆదరణ ఉంది. సఖి, బొంబాయి, రంగిలా, లాగాన్, దిల్ సే లాంటి సినిమాలు ఆయనకి దేశమంతట పేరు తెచ్చాయి. ఇక 2007లో ‘స్లమ్ డాగ్ మిలియనిర్’ అనే చిత్రంలో 'జై హో' అనే పాటకు సమకూర్చిన సంగీతానికి ప్రతిష్ఠాత్మకమైన ‘గోల్డెన్ గ్లోబ్ అవార్డు’ తో పాటు ‘ఆస్కార్’ అవార్డ్ ని కూడా కైవసం చేసుకున్న రెహ్మాన్ ఈ గౌరవం తనకు మాత్రమే దక్కలేదని, వంద కోట్ల భారతీయులందరికీ లభించిన అరుదైన గౌరవం అని ఆయన అన్నారు. ఈ అవార్డులను అందుకున్న తొలి భారతీయ సంగీత దర్శకుడు రెహ్మాన్ ఒక్కరే. ఆయన గొప్పతనాన్ని భారతీయ ప్రభుత్వం గుర్తించి పద్మ భూషణ్ తో సత్కరించింది. తన సంగీతంతో అందరి మనసులు దోచుకున్న ఆయనకు మీడియా9 తరపు నుండి జన్మదిన శుభాకాంక్షలు.