
తన నటనతో, అందంతో దేశవ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్న నటి ఊర్మిళ. బాల నటిగా పరిశ్రమలోకి అడుగుపెట్టి మంచి నటిగా గుర్తింపు సంపాదించుకున్నారు. ‘చాణక్యన్’ అనే మలయాళ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి, పలు హిందీ చిత్రాల్లో నటించింది. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన ‘అంతం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత గాయం, రంగీలా, దౌడ్, అనగనగా ఒక రోజు, సత్య, భూత్ లాంటి చిత్రాలతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. కేవలం ఆమె కోసం సినిమాకి వచ్చే అభిమానులు కూడా ఉన్నారు. కళ్ళతో మాయ చేయడం ఊర్మిళకు మాత్రమే సాధ్యం అనడంలో అతిశయోక్తి లేదేమో. పాత్ర ఏదైనా ఆమె అద్భుతంగా నటిస్తుంది. రంగీలా చిత్రంతో ఒక్కసారిగా ఆమె పేరు దేశం నలు మూలల మారోమోగిపోయింది. ఆ చిత్రంలో ఆమె నటన, హావభావాలు వేటికవే ప్రత్యేకం. ఇక డ్యాన్స్ గురించి చెప్పనక్కర్లేదు. ‘రంగీలా రే’ పాటకు ఆమె వేసిన స్టెప్స్ అప్పట్లో కొత్త ట్రెండ్ సృష్టించాయి. చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాక ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2019 మార్చ్ 27న కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె 2019 ఎలక్షన్స్ లో పాల్గొన్నారు. నార్త్ ముంబై నుండి లోక్ సభకు పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఉద్ధవ్ ఠాక్రే సమక్షంలో శివసేన పార్టిలో చేరారు. కెరీర్ పరంగా ఎన్నో అడ్డంకులను ఎదుర్కుని ఉన్నత స్థానంలో నిలదొక్కుకున్న ఊర్మిళ, రాజకీయాల్లోనూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఆవిడ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది మీడియా9.