
“అంతేనా”... “ఇంకేంకావాలి”... “వీలయితే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీ” ఈ డైలాగ్ వింటే మనకు ఒక నోస్టాల్జిక్ ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ ఎందుకు వస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా మొత్తం ఒక ఎత్తైతే సిద్ధార్థ్, జెనీలియాల నటన మరో ఎత్తు. లవర్ బోయ్ గా అమ్మాయిల మనసుల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు సిద్ధార్థ్. ప్రతీ అమ్మాయి తనకు కాబోయే వాడు ఇలా ఉండాలి అనుకునేలా ఒక సెపరేట్ మార్క్ ను క్రియేట్ చేసాడు.

క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన బాయ్స్ సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేసాడు సిద్ధార్థ్. అంతకంటే ముందు మణిరత్నం దగ్గర దర్శకత్వ శాఖలో సహాయ దర్శకుడిగా పనిచేసారు. బాయ్స్ సినిమా తర్వాత మణిరత్నం దర్శకత్వంలో సూర్య, మాధవన్ లతో కలసి అయాత్త ఎళుతు సినిమాలో నటించాడు. ఆ సినిమా తెలుగులో యువ పేరుతో విడుదలైంది. ఆ తర్వాత ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా! చిత్రంతో తెలుగులో విపరీతమైన ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు.

అక్కడి నుండి వరసగా బొమ్మరిల్లు, కొంచం ఇష్టం కొంచం కష్టం, ఓయ్ లాంటి హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నారు. కేవలం దక్షిణాది భాషల్లోనే కాకుండా రంగ్ దే బసంతి, స్ట్రైకర్, చష్మే బద్దూర్ లాంటి సినిమాలతో హిందీ పరిశ్రమలో కూడా ఆయన తన ప్రతిభను చాటుకున్నారు. కొన్ని ఫ్లాప్ సినిమాలతో హిట్ ట్రాక్ ను పోగొట్టుకున్న సిద్ధార్థ్ మళ్ళీ తెలుగు సినిమాలపై ఫోకస్ పెట్టారు. శర్వానంద్ తో కలిసి మహాసముద్రం సినిమాలో నటిస్తున్నారు. ఆయన మరిన్ని మంచి సినిమాలతో మన ముందుకు రావాలని కోరుకుంటూ ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.