
నటుడిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన వ్యక్తి రామ్ చరణ్. ఇప్పుడు అయన మెగా స్టార్ తనయుడు కాదు తనకంటూ ఒక సొంత గుర్తింపుని ఏర్పరచుకున్నారు. పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నారు. అంత గొప్ప నటుడైన చిరంజీవి గారికి వారసుడిగా రంగ ప్రవేశం చేసిన చరణ్ మొదట్లో నటన విషయంలో మాత్రం తన మార్క్ ను వేయలేకపోయారు. ఉలి దెబ్బ తగిలితేనే శిల్పం బయటపడినట్లు, తనకు తగిలిన ఎదురుదెబ్బలని మెట్లుగా మలచుకుని వాటిని దాటుకుంటూ తన గమనాన్ని సాగిస్తున్నాడు. అతనికి నటించడం రాదూ అన్న వారి నోళ్లను ఒక్క సినిమాతో మూతబడేలా చేసాడు.

కెరీర్ మొదట్లో మగధీర, ఆరెంజ్ మినహాయిస్తే ఆయన స్టోరి సెలక్షన్ లో కాస్త అటుఇటు అయినట్లు అనిపిస్తుంది. మగధీర రాజమౌళి మార్క్ తో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అయ్యింది కాని, ఆరెంజ్ అలా కాదు ఆ సినిమా ఫ్లాప్ అయినా అందులో ఒక నిజాయితీ ఉంటుంది. సీన్స్ కూడా చాలా ఫ్రెష్ గా ఉంటాయి. చరణ్ యాక్టింగ్ కూడా చాలా జెన్యూన్ గా ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన చాలా సినిమాల్లో అది కనిపించలేదు. చాలా సినిమాల తర్వాత ధృవ సినిమాతో మళ్ళీ జెన్యూన్ హిట్ కొట్టాడు. ఇక ఆ తర్వాత వచ్చిన రంగస్థలం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకే ఒక్క సినిమాతో తెలుగులో ఉన్న మేటి నటుల్లో స్థానం పొందాడు. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రను పోషిస్తున్నాడు. ఇలానే అయన మరిన్ని గొప్ప పాత్రలు పోషించాలని కోరుకుంటూ ఆయనకు media9 నుండి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.