తెలుగుతెరపై వెలసిన అభినయ నటశేఖరుడు..!

తెలుగు ప్రజలు దైవంలా పూజించే మరో ఆరాధ్య నటుడు సూపర్ స్టార్ కృష్ణ. ఘట్టమనేని శివరామకృష్ణగా మొదలయి సూపర్ స్టార్ కృష్ణగా ఉన్నత శిఖరాలను అందుకునే వరకూ ఆయన మజిలీలో మైలురాళ్ళు ఎన్నో, మలపులు మరెన్నో. రైతు కుటుంబంలో జన్మించిన ఆయన తెలుగు జాతి గర్వించే అంత ఎత్తుకి ఎదగడం మామూలు విషయం కాదు. ఆయన సినీ జీవితంలో ఎన్నో ప్రత్యేకతలు సాధించాడు. ప్రత్యేకించి తెలుగు సినీ రంగాన్ని సాంకేతికంగా ముందుకు తీసుకెళ్ళే విషయాల్లో మొట్టమొదటి అడుగులెన్నో కృష్ణవే కావడం ఒక విశిష్టత.

పలు హాలీవుడ్ తరహా జాన్రా చిత్రాలను తొలుత తెలుగు సినిమా తెరకు ఆయనే పరిచయం చేశాడు. తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ చిత్రం, హీరోగా అతను నటించిన మూడవ చిత్రం గూడచారి 116 కృష్ణ స్వంత నిర్మాణ సంస్థ పద్మాలయా మూవీస్ రెండో సినిమాగా నిర్మించిన ‘మోసాగాళ్లకు మోసగాడు’ తెలుగులో తొలి కౌబాయ్ చిత్రం. ఇక సాంతకేతికంగానూ పలు తొలి తెలుగు సినిమాలు కృష్ణవే. కొల్లేటి కాపురంతో తెలుగులో ఆర్.ఓ. సాంకేతికత పరిచయం చేశారు. మొదటి ఓఆర్‌డబ్ల్యు కలర్ సాంకేతికతతో తీసిన సినిమా ‘గూడుపుఠాణి’. తొలి తెలుగు ఫ్యూజీ కలర్ చిత్రం ‘భలే దొంగలు’. తెలుగులో 70 ఎంఎం సాంకేతికత ఉపయోగించిన తొలి సినిమా ‘సింహాసనం’. సింహాసనం సినిమా స్టీరియోఫోనిక్6 ట్రాక్ సాంకేతికతతో సౌండ్ టెక్నాలజీ వాడిన తొలి తెలుగు సినిమా.

కృష్ణకు సినిమాల విషయంలో చాలా మంచి జడ్జిమెంట్ ఉండేది. సినిమా వ్యాపారం మీద మంచి అవగాహన, పట్టు, అంచనా ఉన్న నిర్మాత అతను. విడుదలైన సినిమాల కలెక్షన్లైనా, సినిమా ఆడబోయే రోజులెన్ని అన్నదైనా మంచి అంచనా ఉండేది. తాను నటించిన సినిమాల ఫలితం ఏమవుతుందో తెలుసుకోవడానికి విడుదలయ్యాకా విజయవాడ వచ్చి సినిమా చూసి ప్రేక్షకుల స్పందన ఎప్పటికప్పుడు అంచనా వేసుకునేవాడు. ఏ థియేటర్ కెపాసిటీ ఎంత అన్న దగ్గర నుంచి సినిమా వ్యాపారానికి సంబంధించిన లెక్కలు, అంచనాలు కృష్ణ చెప్తుంటే తోటి నటులు, సాంకేతిక నిపుణులు ఆశ్చర్యంగా వినేవారు. సినిమా వ్యాపారంలో స్టూడియో అధినేత, నిర్మాత, పంపిణీదారు, ఎగ్జిబిటర్ వంటి అన్ని దశల్లోనూ కృష్ణ స్వంతంగానూ, భాగస్వామ్యంలోనూ వ్యాపారాలు చేసి అనుభవం గడించారు.

స్టార్ ఇమేజ్, భారీ సంఖ్యలో అభిమానుల బలం ఉన్నా కృష్ణ మొదటి నుంచీ కెరీర్ తుది వరకూ ఇతర పెద్ద హీరోలతో మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తూనే ఉన్నాడు. తర్వాతి తరం హీరోలు, రజనీకాంత్, మోహన్ బాబు, తాను అడుగు పెట్టేనాటికే పెద్ద హీరోలైన ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు సహా పలువురు హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేశాడు. వీటన్నిటికీ మించి కృష్ణ, శోభన్ బాబులు విడివిడిగా మంచి విజయాలు అందుకుంటూనే, కలిసిఎన్నో మల్టీస్టారర్ సినిమాలు చేశాడు. అతి ఎక్కువ మల్టీస్టారర్ సినిమాల్లో నటించిన స్టార్ హీరోగానూ కృష్ణకు ప్రత్యేకత ఉంది.

అలానే సంక్రాంతికి సినిమాలు విడుదల చేసే సంక్రాంతి పోటీ విషయంలోనూ కృష్ణ రికార్డు సృష్టించాడు. నాలుగు దశాబ్దాల సినీ కెరీర్‌లో 30సంక్రాంతులకు కృష్ణ నటించిన సినిమాలు విడుదల అయ్యాయి. సంక్రాంతి విడుదలల విషయంలో అక్కినేని నాగేశ్వరరావు (33 సంక్రాంతులు), ఎన్.టి.రామారావు (31 సంక్రాంతులు) తర్వాత మూడవ స్థానంలో నిలిచినా వరుసగా ప్రతీ ఏటా సంక్రాంతులకు సినిమాలు విడుదల కావడం (21 సంవత్సరాలు) విషయంలో కృష్ణ గారిదే రికార్డు.

ఆయన రాజకీయాలో కూడా చురుకైన పాత్రను పోషించారు. ఎన్టీ రామారావు గారు సీఎం అయిన తర్వాత వీరి మధ్య ఉన్న అనుబంధానికి కృష్ణ తెలుగుదేశంలో చేరుతారు అని అందరూ అనుకున్నారు. కాని ఆయన కాంగ్రెస్ లో చేరి ఏలూరు నుండి లోక్ సభకు పోటి చేసి విజయం సాధించారు. తనను రాజకీయాల్లో ప్రోత్సాహించిన రాజీవ్ గాంధీ హత్యకు గురవ్వడం అదే సమయంలో ఆయన ఏలూరు నుండి ఓటమి పాలవ్వడం వంటి కారణాల చేత ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పుకున్నారు. తన సినిమాలతో తెలుగులో ప్రత్యేకమైన ట్రెండ్ ను క్రియేట్ చేసిన కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.