
జ్ఞానతేశికణ్ అంటే బహుశా ఎవరికీ తెలియకపోవచ్చునేమో కాని ఇళయరాజా తెలియని వారు మన దేశంలోనే ఎవరూ ఉండరు. తన సంగీతంతో యావత్ భారత సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన సుస్వర మాంత్రికుడు ఆయన. ఆయన నరనరాల్లో సంగీతం ప్రవహిస్తూ ఉండవచ్చు అందుకేనేమో ఎటువంటి సంగీతన్ని అయినా, ఎటువంటి స్వరాలనైన వినసొంపుగా అందించగలరు. ఆయన వాడినట్లు ఇంస్ట్రుమెంట్స్ ఎవరూ వాడలేరేమో అనిపిస్తుంది.

14వ ఏటనే శాస్త్రీయ సంగీతాన్ని అవపోసన చేసుకుని ప్రపంచ సంగీతాన్ని నేర్చుకునేందుకు అన్వేషణ మొదలుపెట్టారు. లండన్ ట్రినిటి కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ నుండి గోల్డ్ మెడల్ ను సాధించారు. ఒక లయతో ఇంకో లయను ఇంటర్ లింక్ చేస్తూ అయన క్రియేట్ చేసే ట్యూన్స్ ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టాయి. మొట్ట మొదటిగా కర్నాటిక్ సంగీతంతో వెస్టర్న్ సంగీతాన్ని కలిపి ఫ్యూజన్ క్రియేట్ చేసింది ఇళయరాజ గారే. ఎలాంటి వాయిద్యమైన ఆయన చేతిలో బ్రహ్మాస్త్రమే అవుతుంది. విక్రమ్ చిత్రానికి మొదటగా ట్యూన్స్ ను కంప్యూటర్ లో రికార్డ్ చేశారు. ఇలా కంప్యూటర్ లో ట్యూన్స్ రికార్డ్ చేయడం దేశంలోనే మొదటిసారి.

భారతీయ సంగీతంలో ఇళయరాజాను విప్లవాత్మకమైన సంగీత దర్శకుడిగా అభివర్ణిస్తారు. వెస్టర్న్ మ్యూజిక్ లో ఉండే కౌంటర్ పాయింట్స్ ను తొలుత శాశ్త్రీయ సంగీతంలో వాడింది ఇళయరాజా గారే అని అంటుంటారు. ప్రముఖ సంగీత విధ్వాంసులు ధనరాజ్ మాస్టర్ దగ్గర ఇంస్ట్రుమెంట్స్ నేర్చుకునేటప్పుడు ఆయన ఇళయరాజా గారిని ‘రాజా’ అని పిలిచివారు. 70వ దశకంలో సినీ రంగప్రవేశం చేసిన ఆయన సలీల్ చౌదరి దగ్గర అసిస్టెంట్ గా పనిచేసారు. ఆ తర్వాత తన మొదటి సినిమా అన్నకిళి నిర్మాత పంచు అరుణాచలం రాజాకి ముందుగా ఇళయ అనే పదాన్ని యాడ్ చేస్తూ టైటిల్ కార్డ్స్ లో వేయించారు. అప్పటి నుండి ఆయన ఇళయరాజాగా ప్రసిద్ధి చెందారు.

భారతీయ సినిమా వందేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రఖ్యాత సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ చేసిన సర్వేలో దేశంలో ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎన్నికయ్యారు. టెస్ట్ ఆఫ్ సినిమా విడుదల చేసిన ప్రపంచ 25 మంది దిగ్గజ సంగీత దర్శకుల జాబితాలో ఆయన 9వ స్థానంలో నిలిచారు. ఈ ఘనత సాధించిన ఏకైక భారతీయుడు ఇళయరాజాగారు. రాయల్ ఫిల్ హార్మోనిక్ ఆర్కెస్ట్రా ఆయన్ను ‘మాస్ట్రో’గా అభివర్ణించింది. సంగీత రంగంలో ఆయన చేసిన కృషికి భారత ప్రభుత్వం పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. సంగీత ప్రేమికులచే ఇసాయిజ్ఞానిగా కొలవబడే ఇళయరాజా గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 1000కి పైగా చిత్రాల్లో 7000 పైగా పాటలు కంపోజ్ చేసిన ఆయన అలానే మనల్ని తన సంగీతంతో అలరించాలని కోరుందాం.