
ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేయగలిగే నటులు కొందరే ఉంటారు. ఆ కొందరిలో ఆయన అగ్ర స్థానంలో ఉంటారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ అవసరం లేదు. మలయాళ ప్రేక్షకులు అమితంగా ఆదరించే మోహన్ లాల్ ఒక్క మలయాళ పరిశ్రమలోనే కాకుండా దేశమంతా అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. తన అభినయంతో కోట్లాది మందికి ఆరాధ్య నటుడిగా వెలుగొందుతున్నారు.


స్నేహితులతో కలిసి ఒక సినిమా తీయాలనుకుని మొదలుపెట్టిన ప్రయాణంలో ఆయన కృషి, పట్టుదల ఆయన్ను ఇంతటి వాడిని చేసాయి. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్, అశోక్ కుమార్, శశీంద్రన్ అంతా ఒకటే బ్యాచ్. మొదటి సినిమాని ఎంతో కష్టపడి పూర్తి చేసారు. కాని అది ఎవరూ కొనలేదు. సొంతంగా రిలీజ్ చేసేందుకు వారి దగ్గర డబ్బులు లేవు. అలా అని ఆయన ఆగిపోలేదు అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే తన సినిమాని విడుదల చేసేందుకు ప్రయత్నించారు.


ఆ సినిమా విడుదల కాలేదు కాని ఆ సినిమా చేసిన వారికి అవకాశాలు మాత్రం వచ్చాయి. మోహన్ లాల్ కి విలన్ గా ఒక అవకాశం వచ్చింది. ఇక అక్కడి నుండి ఆయన వెనుదిరిగి చూసింది లేదు. అవకాశలు వెల్లువెత్తాయి. వచ్చిన అవకాశాల్ని అంది పుచ్చుకుంటూ స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. ఆయన మొదటి సినిమా మాత్రం అప్పట్లో విడుదల కాలేదు. అందరూ దాని గురించి మర్చిపోయారు. ఎలాగైనా ఆ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. ఎట్టకేలకు 25 సంవత్సరాల తర్వాత ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మలయాళంలో చేస్తూనే మంచి పాత్రలోస్తే ఇతర భాషల్లో కూడా చేసారు. అలా చేసినవే ఇరువర్, కంపెని, ఆగ్, జనతగ్యారేజ్ లాంటి చిత్రాలు. కేవలం నటుడిగానే కాకుండా గాయకుడిగా, నిర్మాతగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. ఇప్పుడు దర్శకుడిగా మారి బరోజ్ అనే సోషియో ఫ్యాంటసీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 5 సార్లు నేషనల్ అవార్డ్లు అందుకున్న ఆయన రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ, పద్మ భూషణ్ పురస్కారాలను కూడా అందుకున్నారు. తన ప్రయాణాన్ని ఇలానే కొనసాగించాలని కోరుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకంక్షలు తెలియజేస్తున్నాం.