తన నటనతో గిలిగింతలు పెట్టె ముద్దుల మావయ్య మన ‘బాలయ్య’..!

కోట్లాది తెలుగువారికి ఆరాధ్య నటుడు, తన విలక్షణమైన నటనతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసి, తెలుగు చిత్రసీమలో ఎన్నో విజయాలతో ఎన్నెన్నో రికార్డ్లను నెలకొల్పి, ఎందరో అభిమానులను సంపాదించుకుని తనకు తానె సాటి అని అనిపించుకునే నట రత్న, పరిచయం అవసరం లేని మన బాలయ్య.

నందమూరి వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన, స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారి అభినయాన్ని పుణికిపుచ్చుకున్నారు. క్రమశిక్షణకు మారుపేరైన ఎన్టీ రామారావు గారి పెంపకంలో పెరిగిన ఆయన క్రమశిక్షణకు పెట్టింది పేరుగా పెరిగారు. ఆయన నుండి అంకితభావం నేర్చుకున్నారు. చెన్నైలో పుట్టి పెరిగిన ఆయన అక్కడే ప్రాధమిక విద్యను పూర్తి చేసారు.

ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆయన సినీ రంగ ప్రవేశం జరగనే జరిగింది. ఎన్టీ రామారావుగారు తెరకెక్కించిన ‘తాతమ్మ కల’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమయ్యారు ఈ నందమూరి వారసుడు. తొలి చిత్రంతోనే తనదైన నటనతో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత హరికృష్ణ గారితో కలిసి రామ్ రహీమ్, ఎన్టీఆర్, మురళీమోహన్ లతో కలిసి చేసిన అన్నదమ్ముల అనుబంధం, తెలుగు తెరపై అద్భుత దృశ్య కావ్యంగా వర్ణించబడే దాన వీర సూర కర్ణ లాంటి చిత్రాల్లో సెకండ్ లీడ్ గా చేసారు.

సాహసమే నా జీవితం అనే చిత్రం ద్వారా సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూసింది లేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బస్టర్స్, ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ను ఆయన అందించారు. మంగమ్మగారి మనవడు, ఆదిత్య 369, భైరవ ద్వీపం, రౌడి ఇంస్పెక్టర్, సమరసింహా రెడ్డి, మరసింహ నాయుడు, సింహ, లెజెండ్ లాంటి చిత్రాలు ఆయన కెరీర్ లో మైలు రాళ్ళు అని చెప్పవచ్చు.

క్యాన్సర్ కారణంగా ఆయన తల్లిగారు మరణించారు. అలా ఇంకెవరికీ జరగకూడదని, తెలుగుగడ్డపై మరొకరు క్యాన్సర్ భారిన పడి చికిత్స లేని కారణం చేత మరణించ కూడదని బసవ తారకం ఇండో-అమెరికన్ హాస్పిటల్ ను నిర్మించి క్యాన్సర్ ట్రీట్మెంట్ కి అయ్యే ఖర్చుని భరించలేని వారికి ఉచింతంగా ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అంతే కాకుండా తన సన్నిహితులకు, అభిమానులకు, తన వద్ద పని చేసే వారికి ఎలాంటి అవసరం వచ్చినా ముందుంటారు మన బాలయ్య.

రాజకీయంగా కూడా తండ్రిగారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. రెండు సార్లు హిందూపురం అసెంబ్లీ స్థానం నుండి పోటి చేసి గెలిచారు. ఎమ్మెల్యే  అయిన తర్వాత కూడా ఆయన సినిమాలను కొనసాగిస్తున్నారు. హిందూపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మంచి నాయకుడిగా కూడా గుర్తింపును సొంతం చేసుకున్నారు. అలాంటి మన బాలయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన మరిన్ని మంచి చిత్రాలను చేసి, మంచి నాయకుడిగా వెలుగొందాలని మనసారా కోరుకుంటున్నాము.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.