

తన నటనతో, వైవిధ్యమైన పాత్రలతో కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా అభిమనులని సొంతం చేసుకున్న కార్తి మంచి కథలతో ప్రేక్షకుల్ని మెప్పిస్తూనే విమర్శకుల ప్రశంసలను అందుకుంటున్నాడు. ప్రముఖ నటుడు శివ కుమార్ కుమారుడిగా, హీరో సూర్య తమ్ముడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన కార్తి ఆనతి కాలంలోనే మంచి ఫాలోయింగ్ ను ఏర్పరచుకున్నాడు.

అసలు కార్తి దర్శకుడు అవ్వాలని సినిమాల్లోకి వచ్చారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ‘యువ’ చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేసారు. ఆ చిత్రంలో ఆయన అన్నయ సూర్య హీరో. అందులో ఒక చిన్న అతిథి పాత్ర కూడా చేసారు. ఆ సినిమా చేసిన తర్వాత అందరూ కార్తి నటన బాగుందని హీరోగా బావుంటాడని చెప్పడంతో శివకుమార్ ఆయన్ని నటుడిగా కెరీర్ ఎంచుకోమని సలహా ఇచ్చారు. ఆయన వినకపోవడంతో దర్శకుడిగా ఎప్పుడైనా చేయొచ్చు నటుడిగా వచ్చిన అవకాశం వదులుకోవటం ఎందుకు అని నచ్చచెప్పటంతో ఆయన ఒపుకున్నారు.

మొదటి సినిమా ‘పరుత్తివీరన్’ మొదలైన 2 సంవత్సరాలకు విడుదలైంది. 2005లో మొదలైన ఈ చిత్రం చాలా సార్లు ఆగిపోతూ, చివరికి 2007లో విడుదలైంది. మొదట సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. మెల్లగా సినిమా సూపర్ హిట్ అయింది. మొదటి సినిమాతోనే నటుడిగా ప్రత్యేకమైన ముద్ర వేసాడు కార్తి. అ తర్వాత వెనుదిరిగి చూసింది లేదు. ఆవారా, యుగానికి ఒక్కడు, శకుని, మద్రాస్ లాంటి సినిమాలతో స్టార్ స్టేటస్ ను అందుకున్నాడు.


ఆ తర్వాత వచ్చిన ఖాకీ, ఖైదీ సినిమాలు ఆయన ఇమేజ్ ను మరింత పెంచేశాయి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం ఆయనది. ఎదుటి వారికి ఎప్పుడూ సహాయం చేస్తూ ఉంటారు. ఈ మధ్యే అన్నదమ్ములు ఇద్దరూ కలిసి సి.ఎం స్టాలిన్ కి కోటి రూపాయలను విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన మరిన్ని మంచి చిత్రాలు చేయాలని కోరుకుంటూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.