
నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం.
ఈ మాటల్ని అన్నది ప్రముఖ దర్శకుడు, తన సినిమాలతో ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించిన హాస్య బ్రహ్మ జంధ్యాల గారు. హాస్యానికి పెద్దపీట వేస్తూ ఆయన రచించిన రచనలు, వేసిన నాటకాలు, తెరకెక్కించిన చిత్రాలు అజరామరమైనవి. చిత్ర పరిశ్రమలో తనదంటూ ప్రత్యేకమైన ముద్ర వేసి కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన జంధ్యాల గారి అసలు పేరు వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి.
వ్యక్తిగత జీవితం
జంధ్యాల గారు 1951 సంవత్సరంలో జనవరి 14వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురంలో జన్మించారు. పుట్టింది పశ్చిమ గోదావరి జిల్లాలో అయినప్పటికీ ఆయన చదువంతా విజయవాడలోనే సాగింది. చదువుకునే రోజుల్లో ఆయన రాసిన కథలు చదివి ఉపాధ్యాయులు మెచ్చుకునే వారు. జంధ్యాల గారి కథలను రేడియోలో వ్యాఖ్యాత ప్రేక్షకులందరికీ వినిపించేవారు. ఇలా చిన్న చిన్న కథలు రాస్తూనే బీ.కామ్ లో పట్టభద్రుడయ్యారు. జంధ్యాల గారికి పుస్తకాలు ఎక్కువగా చదవే అలవాటు ఉండేది. ఆయనే స్వయంగా రచించి, రంగస్థలం లో నటించి, నాటకాల ద్వారా జనాలను మెప్పించిన రోజులు చాలానే ఉన్నాయి. ఇలా 70 నాటకాలు, 15 నాటికలను ఆయన రచించారు. జంధ్యాల గారు రాసిన నాటకాల్లో ఆత్మాహుతి, గుండెలు మార్చబడును మరియు ఏక్ దిన్ కా సుల్తాన్ బాగా ప్రాచుర్యం పొందాయి. 1973 వ సంవత్సరంలో జంధ్యాలగారు అన్నపూర్ణ గారిని వివాహం చేసుకున్నారు. అన్నపూర్ణగారు ఆయన్ను ప్రోత్సహిస్తూ ఆయన విజయంలో కీలక పాత్ర వహించారు. వీరికి సంపద, సాహితీ అనే ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు.
సినీ ప్రస్థానం

డిగ్రీ పట్టా పొందిన తర్వాత వ్యాపారం చేస్తున్న ఆయన, C.A చేయాలన్న అభిలాషతో చెన్నై వెళ్లి C.A కి సంబంధించిన కోర్సులో జాయిన్ అయ్యారు. అలా ఒక సందర్భంలో ప్రముఖ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారితో ఆయనకు పరిచయం ఏర్పడింది. జంధ్యాల గారి గురించి తెలుసుకున్న గుమ్మడి, శాంతకుమారిలాంటి వారు ఆయన్ను సినిమాల్లోకి ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేరకు ఆయన చిత్రసీమలోకి అడుగుపెట్టారు. 1976వ సంవత్సరంలో ‘దేవుడు చేసిన బొమ్మలు’ చిత్రానికి సంభాషణలను రచించారు. అప్పుడే కె.విశ్వనాథ్ గారు పరిచయం అవ్వడంతో డైలాగ్ రైటర్ గా ఆయన తెరకెక్కించిన సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సప్తపది, ఆపద్భాందవుడు, సాగర సంగమం చిత్రాలకు సంభాషణలను అందించారు. వీటితో పాటు అడవిరాముడు, తాయారమ్మ బంగారయ్య, పదహారేళ్ళ వయసు, వేటగాడు, ఆఖరి పోరాటం, పసివాడి ప్రాణం, ఆదిత్య 369, గోవిందా గోవిందా లాంటి ఎన్నో గొప్ప సినిమాలకు ఆయన సంభాషణలను రచించారు. దర్శకత్వ అవకాశం వచ్చినా సినిమా తీయగలను అని నమ్మకం వచ్చినప్పుడే దర్శకత్వం వహిస్తానని చాలా మంది ప్రముఖులకు చెప్పేవారు.
దర్శకుడిగా తొలి అడుగు
దర్శకుడిగా జంధ్యాల గారి పయనం 1981వ సంవత్సరంలో ‘ముద్ద మందారం’ సినిమాతో మొదలయింది. ప్రదీప్ కథానాయకుడిగా పూర్ణిమ కథానాయికగా ఆయన రూపొందించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. v చక్కటి కథ, దానికి తోడు ప్రేక్షకులని అలరించే హాస్యం ఈ చిత్ర విజయంలో కీలక పాత్ర వహించాయి. ‘ముద్దమందారం’ చిత్రంలో నటించిన ప్రతీ ఒక్కరికి మంచి గుర్తింపు వచ్చింది. కథానాయకుడిగా నటించిన ప్రదీప్ గారిని అందరూ ముద్దమందారం ప్రదీప్ అని పిలిచేంతలా ఈ చిత్రం ఆయనకు గుర్తింపు తీసుకువచ్చింది. ఆ తర్వాత శ్రీవారికి ప్రేమలేఖ, సీతారామ కళ్యాణం, పడమటి సంధ్యారాగం, వివాహ భోజనంబు, ఆహ నా పెళ్ళంట, చూపులు కలిసిన శుభవేళ, జయమ్ము నిశ్చయమ్ము రా, బాబాయి-అబ్బాయి, చంటబ్బాయి, బాబాయ్ హోటల్ లాంటి చిత్రాలను ఆయన తెరకెక్కించారు.
లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, ప్రముఖ హాలీవుడ్ నటుడు థామస్ జేన్ జంటగా ఆయన తెరకెక్కించిన పడమటి సంధ్యారాగం చిత్రం వినూత్న కథాంశంతో తెరకెక్కించబడింది. కుల, మత, ప్రాంతీయ భేదాలతో మనుషులు ఎలా వేరు అవుతున్నారో తెలియజేస్తూ ప్రేక్షకులని ఆలోచింపచేస్తుంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన ప్రముఖ హాలివుడ్ నటుడు థామస్ జేన్ ఈ చిత్రంతోనే కథానాయకుడిగా తెరంగేట్రం చేసి ఆ తర్వాత మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. బాలకృష్ణ గారితో ఆయన తెరకెక్కించిన బాబాయి-అబ్బాయి చిత్రం డబ్బు పై వ్యామోహం ఎంత ప్రమాదమైనదో తెలియజేస్తుంది. చిరంజీవి గారు కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయి చిత్రం ఇద్దరి కెరీర్ లలో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రం. అనాధలుగా పెరిగే పిల్లలు ఎంతటి బాధను అనుభవిస్తారో, సంఘం వాళ్ళతో ఎలా వ్యవహరిస్తుందో ఈ చిత్రంలో విపులంగా చూపించారు. ప్రతీ కథను జంధ్యాల గారు అందులోని పాత్రలకు తగిన విధంగా హాస్యాన్ని జోడించి వాటిని మలచిన తీరు అద్భుతం. ఇప్పుడున్న ఎంతోమంది డైరెక్టర్స్ ఆయన్ను ఇన్స్పిరషన్ గా తీసుకున్న వాళ్ళే. ‘పెళ్లిచూపులు’ వంటి ఫీల్ గుడ్ చిత్రాన్ని తెరకెక్కించిన తరుణ్ భాస్కర్ గారికి కూడా జంధ్యాల గారే ప్రేరణ. బ్రహ్మానందం, సుత్తివేలు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, శ్రీ లక్ష్మి లాంటి గొప్ప నటులు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోవడంలో జంధ్యాల గారి చిత్రాలు ముఖ్య భూమిక పోషించాయి. రేలంగి నరసింహారావు, ఈ.వీ.వీ సత్యనారాయణ వంటి దర్శకులు జంధ్యాల గారి దగ్గర శిష్యరికం చేసిన వారే. ఆపద్బాంధవుడు చిత్రంలో హీరోయిన్ తండ్రి పాత్రను ఆయన పోషించి తనలో ఉన్న నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేసారు. సాహిత్యాన్ని అమితంగా అభిమానించే పాత్రలో ఆయన ఒదిగిపోయారు.
డబ్బింగ్ ఆర్టిస్ట్ గా
జంధ్యాల గారు డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా తన ప్రతిభను కనబరిచారు. పడమటి సంధ్యారాగం చిత్రంతో ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తన పయనాన్ని ఆరంభించారు. ఈ చిత్రంలో విజయశాంతికి బాబాయిగా నటించిన మీర్ అబ్దుల్లా కి ఆయన డబ్బింగ్ చెప్పారు. ఆ తర్వాత చూపులు కలిసిన శుభవేళ చిత్రంలో సుత్తి వీరభద్రరావు గారికి, భారతీయుడు చిత్రంలో పోలీస్ పాత్రదారి నెడుముడి వేణు గారికి, అరుణాచలం చిత్రంలో రంభ తండ్రి పాత్రధారి అయిన విసు గారికి, భామనే సత్య భామనే చిత్రంలో జెమిని గణేశన్ గారికి, ఇద్దరు చిత్రంలో ప్రకాష్ రాజ్ గారికి, దొంగ దొంగ చిత్రంలో సలీమ్ గౌస్ గారికి ఆయన తన గాత్రాన్ని అందించారు.
అందుకున్న పురస్కారాలు
‘శ్రీ వారి ప్రేమ లేఖ’ సినిమాకి గాను ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు, ‘ఆనంద భైరవి’ చిత్రానికి గాను ఉత్తమ కథా రచయితగా, ఉత్తమ దర్శకుడిగా, ‘పడమటి సంధ్యారాగం’ చిత్రానికి ఉత్తమ కథా రచయితగా, ఆపద్బాంధవుడు చిత్రానికి ఉత్తమ సంభాషణ రచయితగా నంది అవార్డ్ లను సొంతం చేసుకున్నారు. కళాసాగర్, ఆంధ్రప్రదేశ్ సినీ గోర్స్ అవార్డు, మద్రాస్ ఫిలిం ఫ్యాన్స్ అవార్డు, ఆంధ్రప్రదేశ్ ఫిలిం జర్నలిస్ట్ అవార్డు లాంటి ఇతర అవార్డులను కూడా ఆయన పొందారు.
డైలాగ్ రైటర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మరియూ స్క్రిప్ట్ రైటర్ గా చలన చిత్ర పరిశ్రమలో ఆయనకంటూ ఒక సుస్థిరమైన స్థానం ఏర్పరుచుకున్నారు. దాదాపు 80 నాటకాలు రచించిన ఆయన రంగస్థలంలో కూడా తనదైన ముద్ర వేశారు. 80 చిత్రాలకు సంభాషణలు అందించి, 38 చిత్రాలకు దర్శకత్వం వహించారు. కామెడి సినిమాలు తీయాలంటే జంధ్యాల గారే అనేంతలా ఆయన తన సినిమాలతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్రవేశారు. హాస్య కథాంశాలు తెరకెక్కించాలని ఎంతో మంది నూతన దర్శకులు ఆయన ఎర్పరచిన బాటలో పయనిస్తున్నారని ఘంటాపదంగా చెప్పవచ్చు. అంతటి గొప్ప చిత్రాలను మనకు అందించి, హాస్యపు జల్లులలో ప్రేక్షకులను ముంచెత్తిన ఆయన, జూన్-19- 2001వ సంవత్సరంలో హార్ట్ ఎటాక్ కారణంగా ఆస్పత్రిలో చేరి అక్కడే తుది శ్వాస విడిచారు.