భాను చందర్

తెలుగు తెరకి మార్షల్ ఆర్ట్స్ ని పరిచయం చేసిన హీరోగా భాను చందర్ గారికి గొప్ప పెరు ఉంది. ఇండస్ట్రీలోకి వచ్చిన అనతి కాలంలోనే 100కు పైగా సినిమాల్లో నటించి రికార్డ్ సృష్టించారు భాను చందర్ గారు. నటుడిగా, దర్శకుడిగా సంగీత దర్శకుడిగా భాను చందర్ గారు సినిమాకి సంబంధించిన వివిధ విభాగాల్లో మంచి ప్రతిభ ఉంది.

1952 జులై 2న మాస్టర్ వేణు, శకుంతల దంపతులకి భానుచందర్ గారు జన్మించారు. ఆయన అసలు పేరు మద్దూరి వెంకటసత్య సుబ్రహ్మణ్యేశ్వర భానుచందర్. సంగీత దర్శకుడు మాస్టర్ వేణు కొడుకైన భానుచందర్ చిన్నతనంలో తండ్రిలానే తానూ సంగీత దర్శకుడు కావాలనుకున్నాడు. గిటార్ నేర్చుకుని అవలీలగా వాయించేవాడు. భానుచందర్ నేషనల్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. కొద్ది కాలం పాటు సంగీత దర్శకుడు నౌషాద్ దగ్గర సహాయకుడిగా పనిచేశాడు. తల్లి కోరిక మేరకు నటుడు కావాలని యాక్టింగ్ స్కూల్లో చేరి నటనలో శిక్షణ పొందాడు. అతను శిక్షణ పొందిన సంస్థలో ముందు బ్యాచిలో రజనీకాంత్, తరువాత బ్యాచీలో చిరంజీవి శిక్షణ పొందారు. కొద్ది రోజులు డ్రగ్స్ కి బానిసైనప్పుడు అతని అన్నయ్య భాను గారిని మార్షల్ ఆర్ట్స్ లో చేర్పించాడు. అలా భానుచందర్ కరాటే లో కూడా శిక్షణ పొందాడు.

సినీ ప్రయాణం

భానుచందర్ మొదటి సినిమా బాలచందర్ గారి అసోసియేట్ శర్మ గారి డైరెక్షన్ లో వచ్చిన ‘నాలాగా ఎందరో’. ఈ సినిమాలో ఆయనకి చిన్న పాత్ర లభించింది. ఈ సినిమా అప్పట్లో పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత బాలు మహేంద్ర దర్శకత్వంలో వచ్చిన మూడుపాని అనే తమిళ సినిమాలో నటించాడు. తరువాత తమిళంలోనే నీంగళ్ కేటవాయ్ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా విజయవంతం కావడంతో తరువాత బాలు మహేంద్ర పరిచయంతో చాలా సినిమాల్లో నటించాడు. బాలు మహేంద్ర దర్శకత్వంలో అర్చన జంటగా నటించిన వీడు అనే తమిళ సినిమా జాతీయ పురస్కారం అందుకుంది. దిగ్గజ దర్శకుడు బాపుగారు తెరకెక్కించిన మనవూరి పాండవులు చిత్రంలో చేసిన పాత్రకు మంచి గుర్తింపు లభించింది.

1980-1990

భానుచందర్ గారు తెలుగు,తమిళంలో ఒకేసారి రెండు మూడు సినిమాలని చేసేవారు. హీరోగానే కాకుండా ఏ పాత్ర అయిన ఆయన అలవోకగా తన నట ప్రతిభను చూపించేవారు.

ఎన్టీఆర్-ఏఎన్నార్, కృష్ణ-శోభన్‌బాబు.. అప్పట్లో వీరి కాంబినేషన్లకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత అలాంటి క్రేజ్ సంపాదించుకున్న జోడి ఒకటుంది. అదే సుమన్- భానుచందర్ కాంబినేషన్. ఇద్దరూ యాక్షన్ హీరోలు.. పైగా కరాటేలో బ్లాక్‌ బెల్ట్ సాధించినవారు. దీంతో వీరి కాంబినేషన్‌పై ఎప్పటికప్పుడు భారీ అంచనాలు ఉండేవి. అందుకు తగ్గట్టే వీరిద్దరు కలిసి 9 సినిమాలు చేయడం విశేషం.

1982లో వచ్చిన ‘ఇద్దరు కిలాడీలు’ సినిమాలో సుమన్, భానుచందర్ తొలిసారి కలిసి నటించారు. భానుచందర్‌కి అప్పటికే తెలుగులో మంచి క్రేజ్ ఉండగా.. తమిళంలో అగ్రహీరోగా కొనసాగుతున్న సుమన్‌కి అదే తొలి తెలుగు చిత్రం. మార్షల్ ఆర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కిన తొలి తెలుగు సినిమా కూడా అదే. ఇదే ఏడాది వచ్చిన తరంగిణి సినిమాలో భాను చందర్ గారు నెగిటివ్ పాత్రలో కనిపించారు. ముందుగా నాలుగు సన్నివేశాలు వరకే ఉన్న భాను చందర్ గారి పాత్రను, డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు షూటింగ్ లో ఆయన నటన చూసి పాత్ర నిడివి, ఆయన సన్నివేశాలు పెంచుకుంటూ వెళ్లారు.

ఆ తర్వాత వీరిద్దరు కలిసి కుర్ర చేష్టలు అనే మూవీ చేశారు. ఈ సినిమా కూడా 1984లోనే రిలీజ్ అయి. యావరేజ్ గా ఆడింది. కానీ వీరిద్దరి కాంబినేషన్ పై జనాల్లో మరింత ఆసక్తి పెరిగింది. మొండి జగమొండి 1985లో రిలీజ్ అయిన ఈ సినిమా సైతం అద్భుత విజయం సాధించింది. మరుసటి ఏడాది 1986లో వచ్చిన ‘సమాజంలో స్త్రీ’ సినిమా యావరేజ్ గా ఆడింది. కానీ జనాల్లో మంచి టాక్ వచ్చింది.

‘డాకు’ సినిమా భారీ అంచనాల నడుమ 1987లో విడుదల అయ్యింది. మంచి సక్సెస్ సాధించింది. నక్షత్ర పోరాటం చిత్రం డాకు తర్వాత ఆరేండ్లకు 1993లో సినిమా నక్షత్రం పోరాటం సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమా సైతం సూపర్ హిట్ కొట్టింది.

భాను చందర్ కెరీర్ మలుపు తిప్పిన సినిమా నిరీక్షణ. ఒక ఫారెస్ట్ ఆఫీసర్ కి గిరిజన అమ్మాయి కి మధ్య జరిగిన అందమైన ప్రేమ కథ ఈ నిరీక్షణ. దిగ్గజ దర్శకుల్లో ఒకరైన బాలు మహేంద్ర డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా 1986లో విడుదలై గొప్ప విజయం సాధించింది. ఈ సినిమాలో భాను చందర్ గారు తన నటనతో అందరిని మైమరిపించారు. తెలుగులో వచ్చిన గొప్ప ప్రేమకథా చిత్రాల్లో ఈ సినిమాకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా కోసం భాను చందర్ గారు జైల్లో జరిగే ఒక సన్నివేశంలో నగ్నంగా కనిపిస్తారు. అలాగే ఇళయరాజా గారు అందించిన ఈ సినిమా పాటలు ఒక్కొక్కటి ఒక్కో ఆణిముత్యం అనే చెప్పాలి. ఈ సినిమా షూటింగ్ జైల్లో జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న ఖైదీలు భాను చందర్ గారికి మేము ఏ తప్పు చేయకుండా వచ్చాము అని తమ బాధల్ని చెప్పుకునేవారట. జైల్లో ఖైదీల మధ్య జరిగే ఎన్నో హృద్యమైన సన్నివేశాలు బాలు మహేంద్ర గారు అద్భుతంగా చిత్రీకరించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా అర్చన గారి నటనకి నంది అవార్డ్ కూడా లభించింది.

మహేంద్ర దర్శకత్వంలో భానుచందర్ హీరోగా తెరకెక్కిన ‘నిరీక్షణ’లో అర్చన హీరోయిన్. గిరిజన యువతి పాత్రలో నటించిన అర్చన. సినిమా అంతా జాకెట్ వేసుకోకుండా నటించడం అప్పట్లో సంచలనంగా మారింది. ఆ చిత్రంలో పాత్ర గురించి ఆమె మాట్లాడుతూ డిమాండ్ మేరకే జాకెట్ లేకుండా నటించినట్టు చెప్పుకొచ్చారు. గిరిజన మహిళ పాత్రలో నటించడం వలన జాకెట్ లేకుండా నటించాల్సి వచ్చిందని... అలా అని దాన్ని బోల్డ్ పాత్ర అని చెప్పలేమన్నారు. ఏది ఏమైనా ఆ పాత్ర తనకు మంచి పేరు తెచ్చిపెట్టిందని అర్చన తెలిపారు.

అలాగే బాలు మహేంద్ర గారి డైరెక్షన్ లో వచ్చిన తమిళ సినిమా ‘వీడు’కి భాను చందర్ గారికి విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అంత గొప్పగా అడకపోయిన అవార్డులు మాత్రం చాలానే గెలుచుకుంది. తమిళంలో వచ్చిన వరల్డ్ క్లాస్ సినిమాల్లో ఈ సినిమా ఒకటి. ఇందులో మెయిన్ పాత్రలో అర్చన నటించారు. ఈ సినిమాకి రెండు నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి.

తమ్మారెడ్డి భరద్వాజ్ గారు తెరకెక్కించిన అలజడి చిత్రం ఆయన కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రంగా నిలిచింది. ఉద్యమకారుడు జార్జ్ రెడ్డి కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఉస్మానియాలో విద్యార్ధి నాయకుడైన జార్జ్ రెడ్డిని కొంతమంది చంపేశారు. అప్పట్లో ఇది సంచలనం సృష్టించింది. తమ్మారెడ్డిగారు కూడా ఉస్మానియాలోనే చదువుకోవడం వల్ల జార్జ్ రెడ్డి గురించి బాగా తెలుసు. ఆయన పాత్రను చుట్టూ ఉండే పరిస్థితులను తీసుకుని కొన్ని మార్పులు చేసి ‘అలజడి’ చిత్రాన్ని తెరకెక్కించారు.

కొన్ని సినిమాలు ఒక ప్రత్యక ట్రెండ్ ని క్రియేట్ చేస్తాయి అలాంటి ఒక సినిమానే సూత్రధారులు. ఇది 1989లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా. గ్రామీణ నేపథ్యంలో హింసకు వ్యతిరేకంగా అల్లుకున్న కథ ఇది. అక్కినేని నాగేశ్వరరావు, మురళీ మోహన్, కైకాల సత్యనారాయణ, కె. ఆర్. విజయ, సుజాత, భానుచందర్, రమ్యకృష్ణన్ ప్రధాన నటులు. కె. వి. మహదేవన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకాదరణ పొందాయి. ఇందులో నాగేశ్వరరావు మరియు సుజాత మద్య సన్నివేశాలు అద్భుతంగా వుంటాయి.

1990-ప్రస్తుతం

ఆ తర్వాత 1991లో దాదాపు 5 సినిమాల్లో ఆయన నటించారు. అశ్విని, కీచురాళ్ళు, దేశద్రోహులు, గ్యాంగ్ వార్ చిత్రాలను ఆయన చేసారు. ఆ తర్వాత ఆయన ఎక్కువగా సహాయ పాత్రలు చేయడం మొదలుపెట్టారు. కృష్ణవంశి తెరకెక్కించిన సింధూరం సినిమాలో ఆయన చేసిన పోలిస్ ఆఫీసర్ పాత్రకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఆయన నటించిన దేవి సినిమాలో భాను చందర్ గారికి మంచి పాత్ర లభించింది. ఈ సినిమాలో ఆయనది సహాయ పాత్ర అనడం కన్నా ఇంకొక హీరో అనొచ్చు. ఈ సినిమాని కోడి రామకృష్ణ గారు తెరకెక్కించారు. దేవి సినిమాకు దేవి శ్రీపసాద్ సంగీతం అందించాడు. సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ కు ఇది మొదటి సినిమా. అప్పటికి అతని వయస్సు 19 సంవత్సరాలు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో బాక్సాఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన సినిమాల్లో సింహాద్రి ఒకటి. స్టూడెంట్ నెంబర్ 1లాంటి హిట్ సినిమా తర్వాత రాజమౌళి - జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన సినిమా సింహాద్రి. ఈ సినిమాలో భానుచందర్ గారికి చాలా కాలం తర్వాత మంచి పాత్ర లభించింది. భూమిక తండ్రి గా ఆయన నటనకి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. 9కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన సింహాద్రి సినిమా వరల్డ్ వైడ్ గా 46కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది. దాదాపు 28కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ అందినట్లు సమాచారం. అంతే కాకుండా అప్పట్లో అత్యదిక సెంటర్లలలో 100రోజులు ఆడిన సినిమాల్లో కూడా స్థానం సంపాదించుకుంది.

ఈ మధ్య కాలంలో భానుచందర్ గారికి మనసారా సినిమాలో  మంచి పాత్ర లభించింది. కేరళలో కలరీ మాస్టర్ గా భానుచందర్ ఈ సినిమాలో కనిపించారు. ఆ తర్వాత ఆయన విశ్వక్ సేన్ నటించిన హిట్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా పవర్ ఫుల్ నటన చూపించారు. తెలుగులో ప్రేమించొద్దు ప్రేమించొద్దు, దేశద్రోహులు అనే రెండు చిత్రాలకు భాను చందర్ గారు దర్శకత్వం కూడా వహించాడు.

వ్యక్తిగత జీవితం

భాను చందర్ గారి భార్య పేరు స్వప్న. స్వప్న గారి కన్నా భాను చందర్ గారు దాదాపుగా 14సంవత్సరాల పెద్దవారు. ఈ దంపతులకి జయంత్, నిశాంత్ అని ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆయన పెద్ద కొడుకు జయంత్ చెడుగుడు, నా కొడుకు బంగారం లాంటి సినిమాల్లో హీరోగా నటించాడు.

భాను చందర్ గారికి మెగాస్టార్ చిరంజీవి మంచి మిత్రుడు. ఈ ఇద్దరి మధ్య ఎలాంటి అనుబంధం ఉండేదో వివరిస్తూ పలు ఇంటర్వ్యూల్లో ఆయన చెప్పారు. చిరంజీవి గారు నేను ఒకే రూంలో ఉండేవాళ్లం. మన ఊరి పాండవులు మూవీ షూటింగ్‌ టైంలో మేం ఒకే రూంలో ఉండేవాళ్ళం. అసలు వాడే నాకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ డ్రైవ్ చేయడం నేర్పించాడు దోయకాయల పల్లిలో. రేయ్.. నీకు బైక్ తోలడం వచ్చా? అని అడిగాడు.. నాకు టూ వీలర్ రాదురా.. కారు తోలుతా అంటే.. ఛా!! రారా అని ఆ దగ్గర్లో ఎవరో రాజుగారో రెడ్డిగారో ఉండేవారు ఆయన బైక్ తీసుకుని నాకు డ్రైవింగ్ నేర్పించాడు.

మేం ఇద్దరం చాలా సరదాసరదాగా ఉండేవాళ్లం. రాజమండ్రిలో షూటింగ్ చేస్తుంటే.. గంట గంటకు వర్షం వచ్చేది. ఆ టైంలో బాపు గారు పిలిచి.. భాను నువ్వు కరాటే చేస్తావ్ అంట కదా.. చేయి అంటే చిరంజీవి, నేను స్లో మోషన్‌లో కరాటే చేసేవాళ్లం. మేం ఇద్దరం చాలా క్లోజ్. వాడికి నాకు స్నేహంలో ఎప్పుడూ మార్పులేదు. అప్పుడూ ఏరా ఏరా అనుకున్నాం ఇప్పుడూ ఏరా ఏరా అనుకుంటాం. వాడు చాలా సరదా మనిషి. దాన్ని గురించి చెప్పడం కంటే అనుభవిస్తే చాలా బాగుంటుంది. ప్రతి ఏడాది మేం అంతా కలుస్తూ ఉంటాం.. ఈ ఏడాది కూడా కలిశాం. నెక్స్ట్ ఇయర్ మేం అంతా కలిసి గోవా వెళ్లబోతున్నాం’ అంటూ చిరుతో ఉన్న అనుబంధాన్ని తెలియజేశారు భాను చందర్

సుమన్-భాను చందర్ మధ్య మంచి అనుబంధం ఉంది. ఒకరంటే ఒకరికి ప్రాణం. ఇద్దరికీ మార్షల్ ఆర్ట్స్ లో మంచి నైపుణ్యం ఉండటంతో యాక్షన్ సినిమాల్లో ఒక ట్రెండ్ సెట్ చేశారు. సుమన్ బ్లూ ఫిల్మ్ కేసులో చిక్కుకున్న విషయాన్ని తెలియజేస్తూ.. దాన్నుండి తనను ఎలా సేవ్ చేశాడో కూడా చెప్పారు భాను చందర్. ‘నేను ఒక కేసులో ఇరుక్కున్నాను.. నాతో ఎవరైనా ఫ్రెండ్ షిప్ చేస్తే వాళ్లు కూడా ఇరుక్కునే ప్రమాదం ఉంది.. వాళ్లని చిత్ర హింసలు చేసే అవకాశం ఉంది.. నువ్ దయచేసి నాకు ఫోన్ చేయకు.. రెండు నెలల పాటు మాట్లాడకు అని సుమన్ చెప్పిన విషయాన్ని బహిర్గతం చేశారు భాను చందర్. తనకు ఆ విషయం చెప్పిన మరుసటి రోజే సుమన్‌ని అరెస్ట్ చేసిన విషయాన్ని భాను చందర్ ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు.

భానుచందర్ వాళ్ల అమ్మ శకుంతల గారికి, పచ్చకామెర్లకు మందు ఇవ్వడంలో చాలా మంచి పెరు ఉంది. ఆవిడ శివాజీ గణేషన్ భార్య లాంటి వారికి కూడా మందు ఇచ్చి కామెర్లను తగ్గించారు. అలా ఆవిడ గురించి ఇండస్ట్రీ మొత్తం తెలిసింది. డే అండ్ నైట్ షూటింగ్ లు చేయడం వల్ల, సమయానికి సరిగా తినకపోవడం వల్ల ఎన్టీఆర్ గారికి కూడా పచ్చకామెర్లు వచ్చాయి. అప్పుడు భానుచందర్ వాళ్ళ అమ్మ దగ్గరికి ఎన్టీఆర్ వెళ్లి అక్క నాకిలా పచ్చకామర్లు వచ్చాయి. మీరు మందు ఇస్తారు అని తెలిసింది నాకు కూడా కొంచెం ఇవ్వండి అని చెప్పడంతో ఆవిడ పొద్దున తీసుకువచ్చి మందు ఇచ్చింది, దాంతో ఆయనకు పచ్చకామర్లు పోయి ఆరోగ్యం కుదుటపడింది.

సరిగ్గా అదే టైంకి భానుచందర్ సత్యం శివం సినిమా షూటింగ్ లో ఉన్నారు. అయితే ఎన్టీఆర్ గారు భానుచందర్ ని ఆ సినిమా షూటింగ్ లో చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు అని భానుచందర్ ఇప్పటికే చెబుతుంటాడు. ఎన్టీఆర్ భానుచందర్ వాళ్ళ అమ్మని సొంత అక్కలాగా భావిస్తాడు .ఎందుకంటే పచ్చకామెర్లకు ఎన్టీఆర్ గారికి మందు ఇచ్చి బాగు చేసింది అందుకే భానుచందర్ షూట్ లో ఉన్నప్పుడు ఇబ్బంది పడకూడదని ఎన్టీఆర్ అన్ని విషయాలు అడిగి తెలుసుకునేవాడు అని చెప్పాడు. అలాగే ఎన్టీఆర్ గారికి తగ్గిన తర్వాత ఒకసారి బాలకృష్ణ గారికి కూడా అలాగే పచ్చ కామెర్లు వచ్చాయి దాంతో బాలకృష్ణ హాస్పిటల్ కి వెళ్తాను అని చెప్తే ఎన్టీఆర్ ఆస్పత్రి కి వెళ్లడం వద్దని చెప్పి భానుచందర్ వాళ్ళ అమ్మ నాకు అక్క లాంటిది. ఆ అక్క నాకు మందు ఇచ్చి పచ్చకామెర్లు తగ్గించింది అలాగే నువ్వు కూడా ఆవిడ దగ్గరికి వెళ్ళి మందు తీసుకొని వాడు ఆ తర్వాత అదే తగ్గిపోతుంది అని చెప్పాడు.

అవార్డ్స్

నిరీక్షణ సినిమాలో భానుచందర్ గారి నటనకి గాను ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కి ఉత్తమ నటుడుగా నామినేషన్ లభించింది.అలాగే ఆయన హీరోగా నటించిన సూత్రధారులు సినిమాకి ఉత్తమ చిత్రంగా నేషనల్ అవార్డ్ లభించింది.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.