
ప్రస్తుతం తెలుగులో దాదాపు అన్ని సినిమాలు ఓ.టి.టిలకే విడుదలవుతున్నాయి. లాక్ డౌన్ సమయంలో ఓ.టి.టిలకు ఆదరణ పెరిగిందన్న విషయం తెలిసిందే. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు, వెబ్ సిరీస్ లకు విశేష స్పందన లభిస్తోంది కాబట్టి థియేటర్ల కోసం ఆగకుండా చిన్న, పెద్ద చిత్రాలు దాదాపు ఓ.టి.టిలలోనే విడుదలవుతున్నాయి. ప్రస్తుతం 100% తెలుగు ఓ.టి.టిగా ప్రేక్షకులకు చేరువైన ఆహా ఎక్స్‌క్లూజివ్కంటెంట్ తో దూసుకుపోతోంది.
ఈ నేపథ్యంలో ఆహాలో విడుదలవుతున్న కొత్త చిత్రం ‘అర్థ శతాబ్దం’. కార్తీక్ రత్నం, నవీన్ చంద్ర, సాయికుమార్, కృష్ణ ప్రియ, శుభలేఖ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. రవీంద్ పుల్లె దర్శరకుడు. డైరెక్టర్ రవి సినిమాను అద్భుతంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్, పాటలకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. సాయి కుమార్, శుభలేఖ సుధాకర్, కార్తిక్ రత్నం, నవీన్ చంద్ర లాంటి ట్యాలెంటెడ్ యాక్టర్స్ నటిస్తుండటంతో ఈ చిత్రం పై అంచనాలు భారీగా పెరిగాయి.

ఒక దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు వేరే సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని ప్రేమించడం, వారి చుట్టూ ఉండే పరిస్థితులు వారిపై ఎలాంటి ప్రభావం చూపించాయి, ఆ సంఘటన తర్వాత వారి చుట్టూ జరిగిన మార్పులు ఏమిటి అనే విషయంపై చిత్రం ఉండబోతుంది అని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ఈ చిత్రం ఈ నెల 11న ఆహాలో విడుదల కానుంది. మరి ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాలి.