అనుష్క శెట్టి

అనుష్క శెట్టి, టాలీవుడ్ లో పరిచయం అవసరం లేని పేరు. ఆమె ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దన్నర దాటింది. అయితే ఆమె ఇంకా క్రేజ్ పరంగా స్థాయిలో కొనసాగుతూనే ఉంది. అనుష్క శెట్టి 2005లో సినిమాల్లో అడుగుపెట్టింది. అప్పటి నుండి ఆమె వెనుతిరిగి చూసింది లేదు. ఆమె విజయాల సంగతిని పక్కనపెడితే వ్యక్తిత్వపరంగానూ అనుష్క ఎవరికీ అందనంత ఎత్తులో శిఖరాగ్రాన ఉంది. అగ్ర దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి అనుష్క తన ఫెవరెట్ నటి అని, బాగా పరిశీలించడం, తన పాత్రకు మరింత అందం, హుందాతనం తేవడం ఆమెకున్న మంచి లక్షణాలు అని పలుమార్లు కొనియాడాడు.

తెలుగు సినిమాల్లో ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రాల ప్రస్తావన రాగానే అనుష్క గుర్తుకువస్తుంది. అంతలా ఆమె ముద్రను మనం గమనించవచ్చు. ముఖ్యంగా రుద్రమదేవి, భాగమతి వంటి సినిమాలతో ఆమె ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ అయింది. అయితే వాటికంటే ముందు అరుంధతి అనే మైల్ స్టోన్ చిత్రం ఆమె కెరీర్ ను కొత్త మలుపు తిప్పింది.

7 నవంబర్ 1981న పుట్టింది స్వీటీ శెట్టి కానీ అందరికీ అనుష్కగానే తెలుసు. అనుష్క భారతదేశంలోనే అత్యంత ఎక్కువ పారితోషికం అందుకుంటున్న నటీమణుల జాబితాలో ముందు వరసలో ఉంటుంది. ఆమెను లేడీ సూపర్ స్టార్ అఫ్ సౌత్ ఇండియన్ సినిమాగా పరిగణిస్తారు. అయితే తన కెరీర్ లో ఎక్కువగా తెలుగు చిత్రాల్లోనే నటించింది అనుష్క.

బాహుబలి చిత్రంతో ప్యాన్ ఇండియన్ ఫేమ్ ను సాధించింది. అనుష్క హైట్ కు పొడుగ్గా ఉండే హీరోల సరసన సరిగ్గా సరిపోతుంది. ఆమె తన నటనతో, వ్యక్తిత్వంతో తెలుగు, తమిళ ప్రేక్షకులకు అత్యంత చేరువైంది. ఇక అవార్డుల పరంగానూ అనుష్క ఎక్కడా తీసిపోలేదు. ఆమె కెరీర్ లో ఎన్నో సినీ'మా', నంది, తమిళనాడు రాష్ట్ర పురస్కారం, ఫిల్మ్ ఫేర్ అవార్డులను గెలుచుకుంది. కర్ణాటకలో పుట్టి పెరిగింది అనుష్క. బెంగళూరులో తన స్కూలింగ్ పూర్తి చేసుకుని బ్యాచలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ను మౌంట్ కార్మెల్ కాలేజ్ నుండి పూర్తి చేసింది. ఆమె సినిమాల్లోకి రాకముందు యోగా టీచర్ గా పనిచేసింది. భరత్ ఠాకూర్ వద్ద యోగ నేర్చుకున్న ఆమె ప్రొఫెషనల్ యోగా ఇన్స్ట్రక్టర్. పలువురు సెలబ్రిటీలకు అనుష్క యోగాను నేర్పించేది.

ముంబైలో పూరి జగన్నాధ్ అనుష్కను చూడటం తన తర్వాతి సినిమా సూపర్ లో తీసుకోవడం చకచకా జరిగిపోయాయి. సూపర్ లో ఆమెది చాలా గ్లామరస్ పాత్ర. తొలి సినిమానే నాగార్జున వంటి స్టార్ హీరోతో చేసింది అనుష్క. సూపర్ లో అయేషా టాకియా మెయిన్ హీరోయిన్. సూపర్ తో తన గ్లామర్ తో కట్టిపడేసిన అనుష్క,

అదే ఏడాది సుమంత్ హీరోగా మహా నంది చిత్రంలో నటించింది. ఈ చిత్రం అనుకున్నంతగా ఆడకపోయినా అనుష్క మరోసారి పాజిటివ్ మార్కులు కొట్టేసింది.

ఇక 2006 ఆమె కెరీర్ కు వన్ ఆఫ్ ది టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన విక్రమార్కుడు చిత్రంలో అనుష్క హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా పెద్ద విజయం సాధించింది. ఈ చిత్రంలో అనుష్క గ్లామర్ షో ఓ రేంజ్ లో ఉంటుంది. ఈ సినిమాతో అనుష్కకు అవకాశాల వెల్లువ కనిపించింది.

అదే ఏడాది మంచు విష్ణు హీరోగా అస్త్రం చేసింది. బాలీవుడ్ సినిమా సర్ఫరోష్ కు అది రీమేక్ గా తెరకెక్కింది.

మెగాస్టార్ చిరంజీవి స్టాలిన్ చిత్రంలో ఒక ప్రత్యేక గీతంలో కనిపించింది. స్టాలిన్ తమిళ స్టార్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తొలి తెలుగు చిత్రం కావడం విశేషం. 2006లోనే ఆమె తమిళ డెబ్యూ కూడా జరిగింది. రెండు అనే చిత్రంలో నటించింది అనుష్క.

ఇక 2007లో ఆమె రెండు సినిమాలను చేసింది. గోపీచంద్ హీరోగా చేసిన లక్ష్యం మంచి విజయాన్ని అందుకుంది.

అలాగే నాగార్జునతో డాన్ చిత్రం ద్వారా మరోసారి నటించే అవకాశాన్ని సాధించింది అనుష్క. ఈ చిత్రంలో కూడా ఆమె గ్లామర్ పరంగా  మంచి మార్కులే వేయించుకుంది.

2008 ఆమె కెరీర్ కు మరో టర్నింగ్ పాయింట్. ఈ ఏడాది ఏకంగా ఆరు సినిమాలు విడుదలయ్యాయి. నందమూరి బాలకృష్ణ సరసన ఒక్క మగాడు సినిమా చేసింది.

అలాగే జగపతి బాబు హీరోగా స్వాగతం సినిమాలో కనిపించింది.

ఇక రవితేజతో రెండోసారి బలాదూర్ చిత్రంలో నటించింది. ఈ సినిమాలో కూడా ఆమె గ్లామర్ షో హైలైట్ అయింది.

శౌర్యం, చింతకాయల రవి సినిమాలు చేసిన అనుష్క, కింగ్ చిత్రంలో స్పెషల్ సాంగ్ లో కనిపించింది. ఇదిలా ఉంటే 2009 మాత్రం ఆమె కెరీర్ స్వరూపాన్నే మార్చేసింది.

ఆ సంవత్సరం ఆమె నటించిన అరుంధతి ఒక గేమ్ ఛేంజింగ్ సినిమా. అరుంధతి/జేజమ్మగా అనుష్క నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అరుంధతి కమర్షియల్ గా అతి పెద్ద విజయం సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. అనుష్క ఈ చిత్రం ద్వారా ఎన్నో అవార్డులను సైతం గెలుచుకుంది.

ఇదే ఏడాది ఆమె బిల్లా చిత్రంలో నటించింది. అరుంధతిలో అనుష్క హుందాగా రాణి పాత్రలో ఒదిగిపోతే బిల్లాలో అనుష్క వేసిన బికినీ అప్పట్లో ఒక సెన్సేషన్. ఈ రెండు చిత్రాల ద్వారా అనుష్క తను ఏ పాత్రకైనా సెట్ అవుతానని తెలియజేసింది. ఇదే ఏడాది వేట్టైకారన్ అనే మరో తమిళ సినిమా చేసింది అనుష్క.

2010లో నాగార్జున చిత్రం కేడిలో ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించిన అనుష్క, తమిళంలో సూర్య హీరోగా సింగంలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఆమెకు పెద్ద బ్రేక్ ను తీసుకొచ్చింది.  

ఇటు తెలుగులో వేదం చిత్రంలో వేశ్య పాత్రలో అనుష్క జీవించేసింది. ఈ సినిమా కూడా అనుష్క కెరీర్ లో చాలా ప్రత్యేకమనే చెప్పాలి.

అలాగే పంచాక్షరి చిత్రంలో డ్యూయల్ రోల్ లో కనిపించింది.

ఇదే ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు ఖలేజాలో నటించింది.

వెంకటేష్ హీరోగా నాగవల్లి,

నాగార్జున హీరోగా రగడ సినిమాలు చేసింది అనుష్క.వేదం తమిళ రీమేక్ లో కూడా అనుష్క తన పాత్రను తిరిగి పోషించింది.

విక్రమ్ హీరోగా తెరకెక్కిన దేవ తిరుమగళ్ చిత్రంలో నటించింది. శకుని, తాండవం, అలెక్స్ పాండియన్ వంటి తమిళ చిత్రాల్లో నటించింది. ఇక ప్రభాస్ తో మరోసారి మిర్చి సినిమాలో నటించింది. ఈ చిత్రంలో వీరిద్దరి కెమిస్ట్రీకు మంచి పేరొచ్చింది. అలాగే అదే ఏడాది సింగం 2లో కూడా నటించింది. ఇదే ఏడాది సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఇరండాం ఉళగం చిత్రం ఆమె కెరీర్ లో మరో చెప్పుకోదగ్గ పాత్ర. ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోయినా అనుష్క మాత్రం తన నటనతో మెప్పించింది.

అనుష్క సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన లింగా చిత్రంలో కూడా నటించింది. 2015లో ఆమె నటించిన ఎన్నై ఎరింధాల్ చిత్రం విడుదలైంది.

దాని తర్వాత వచ్చింది బాహుబలి 1. ఈ సినిమా భారతదేశంలోనే అత్యంత హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచింది. దేవసేనగా ఆమె పాత్రకు మంచి పేరొచ్చింది. ఆమె చెప్పిన పవర్ఫుల్ డైలాగులకు థియేటర్లలో విజిల్స్ పడ్డాయి. ఈ చిత్రం తర్వాత నుండే ఆమెను లేడీ సూపర్ స్టార్ అని సంబోధించడం మొదలుపెట్టారు.

బాహుబలి 1 విడుదల తర్వాత ఆమె రుద్రమదేవి చిత్రం చేసింది. మరో ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రంలో ఆమె మెప్పించింది.

సైజ్ జీరో చిత్రం కోసం చాలా బరువు పెరిగింది అనుష్క. ఇక ఊపిరి, సోగ్గాడే చిన్ని నాయన చిత్రాల్లో కామియో పాత్రల్లో అలరించింది. సూర్య ఫ్రాంచైజ్ సింగం మూడో సినిమా సి3 లో కూడా అనుష్క నటించింది.

2017లో ఓం నమో వెంకటేశాయ చిత్రంలో నటించింది. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు.

అయితే ఆ తర్వాత బాహుబలి 2 విడుదలైంది. ఈ చిత్రంలో అనుష్కకు చాలా పెద్ద పాత్రే దక్కింది. దేవసేనగా అనుష్క తన పాత్రలో జీవించేసింది. ఆమె పెర్ఫార్మన్స్ కు జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. బాహుబలి 2 తర్వాత నుండి అనుష్క సినిమాలను బాగా తగ్గించేసింది.

2018లో భాగమతి చిత్రంలో నటించింది.

2019లో సైరా నరసింహారెడ్డిలో చిన్న పాత్రలో కనిపించింది.

అలాగే 2020లో ఆమె నటించిన నిశ్శబ్దం విడుదలైంది. నిశ్శబ్దం విడుదలకు ముందు అనుష్క ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ ఇచ్చిన తొలి 16 గంటల్లోనే ఆమెకు 9 లక్షల ఫాలోయర్స్ రావడం విశేషం. అనుష్క కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, ఇంగ్లీష్ చక్కగా మాట్లాడగలదు.

ఉత్తమ నటిగా అరుంధతి, వేదం, రుద్రమదేవి చిత్రాలకు ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకుంది అనుష్క. అలాగే అరుంధతి చిత్రానికి గాను నంది ప్రత్యేక జ్యూరీ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. అలాగే అరుంధతి, వేదం, రుద్రమదేవి చిత్రాలకు సినీ'మా' అవార్డును కైవసం చేసుకుంది. భాగమతి చిత్రంలో ఆమె పెరఫార్మన్స్ సైమా అవార్డును తీసుకొచ్చింది. అలాగే 2019లో అనుష్క దాదా సాహెబ్ ఫాల్కే సౌత్ పురస్కారానికి ఎంపికైంది. సెక్సియస్ట్ ఆసియన్ విమెన్ ఆఫ్ ది డికేడ్ లిస్ట్ లో అనుష్కకు ఎనిమిదో స్థానం దక్కడం విశేషం.

అనుష్క ఇప్పటివరకూ కోల్గేట్, చెన్నై సిల్క్స్, హెడ్ అండ్ షోల్డర్స్, డాబర్ ఆమ్లా హెయిర్ ఆయిల్ వంటి ఉత్పతులకు ప్రచారకర్తగా వ్యవహరించారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనుష్కకు బాగా తెలుసు. "నా ముందు తరం వారితో పోల్చి చూసుకుంటే నేను కెరీర్ లో పెద్దగా ఏం సాధించలేదు అనే అనుకుంటాను. అయితే నేను ఈ మైలురాయిని ఒక బాధ్యతగా తీసుకుని మరింతగా హార్డ్ వర్క్ చేస్తాను. నాకు వచ్చిన స్క్రిప్టులకు, అవి నా వద్దకు తీసుకొచ్చిన దర్శకులకు, నిర్మాతలకు, నా కృతఙ్ఞతలు. వారి వల్లే నా కెరీర్ ఈ స్థాయిలో ఉంది. నాకు సినిమాల్లోకి వచ్చే ముందు అసలు ఏమీ తెలీదు. అయితే క్రమంగా అన్నీ స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నా. నా కెరీర్ గుడ్, బ్యాడ్ రెండూ జరిగాయి. కానీ ఇండస్ట్రీలో గడిపిన ఈ కాలాన్ని నేను ఆస్వాదించాను అనే చెబుతాను" అని ఒక సందర్భంలో తెలిపారు అనుష్క.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.