
వరుస వెరైటీ చిత్రాలతో ఆకట్టుకుంటున్న అడివి శేష్ ప్రస్తుతం మూడు వినూత్నమైన ప్రాజెక్ట్ లతో బిజీ గా ఉన్న విషయం తెలిసిందే. మహేష్ బాబు నిర్మాణంలో మేజర్, నాని నిర్మాణంలో హిట్ 2 , గూఢచారి సీక్వెల్ గూఢచారి 2 సినిమాల్లో నటిస్తున్నాడు. వరుస థ్రిల్లర్ సినిమాలు తనకు హిట్ ఇస్తాయని అడివి శేష్ ఈ సినిమా పై భారీ నమ్మకం పెట్టుకున్నాడు.. అయితే మేజర్ సినిమా హిందీ హక్కులు భారీ రేటు కి అమ్ముడయ్యాయని తెలుస్తుంది.

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితచరిత్రగా ఈ సినిమా నిర్మితమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా 80 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుందని అంటున్నారు. కరోనా తీవ్రత తగ్గడం వలన, మళ్లీ సెట్స్ పైకి వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది. 'గూఢచారి' సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న శశికిరణ్ తిక్క ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

ఆ మధ్య వదిలిన ఈ సినిమా టీజర్ కి అనూహ్యమైన స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. సాధారణంగా దేశభక్తి నేపథ్యంలో రూపొందే సినిమాలు భాషతో సంబంధం లేకుండా ఆదరణ పొందుతూ ఉంటాయి. అందువలన ఈ సినిమాను తెలుగుతో పాటు ఇతర భాషల్లోను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా హిందీ శాటిలైట్ హక్కులు 10 కోట్లకు అమ్ముడైనట్టుగా చెబుతున్నారు. కథానాయకుడితో నడిచే పాత్రల్లో సయీ మంజ్రేకర్ .. శోభిత ధూళిపాళ్ల కనిపించనున్నారు. కీలకమైన పాత్రలను ప్రకాశ్ రాజ్ .. రేవతి పోషిస్తున్నారు.