విక్టరీ వెంకటేష్

టాలీవుడ్ అగ్ర కథనాయకుల్లో ఒకరిగా ‘విక్టరీ’ని తన ఇంటి పేరుగా మార్చుకొని ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఎప్పుడు నవ్వుతూ ఉండే వ్యక్తి విక్టరీ వెంకటేష్‌ గారు. ఒక స్టార్‌ ప్రొడ్యూసర్‌ తనయుడైనా కూడా కొంచెం కూడా అహంకారం లాంటివి ఏమి లేకుండా తోటి నటీనటులతో స్నేహభావంతో మెలిగే స్వభావం ఆయనది. మన తెలుగులో మల్టి స్టార్ సినిమా 20 సంవత్సరాల తరవాత వచ్చింది అంటే దానికి ముఖ్య కారణం వెంకటేష్ గారు.  ఎమోషనల్ సన్నివేశాలలో ఆయన నటనకు ఎవరెనా జోహార్ అనాలసిందే. వెంకటేష్ తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించి ఇప్పటికి 34 ఏళ్లు అవుతున్నాయి ఇప్పటికీ వెంకటేష్ గారి మొదటి సినిమాలో ఉన్నంత చూరుకుగా ఉంటారు.

జననం

ప్రముఖ నిర్మాత డా. డి. రామానాయుడు గారి కుమారుడు అయిన దగ్గుబాటి వెంకటేష్ గారు 13 డిసెంబర్ 1960 ప్రకాశం జిల్లాలోని కారంచేడులో జన్మించారు. వెంకటేష్ గారు స్కూల్ చదువు మద్రాస్ లోని ఎగ్మోర్ లో ఉన్న డాన్ బాస్కో స్కూల్ లో సాగింది. ఆయన చదివే స్కూల్లో బాగా అల్లరి చేసేవాడు అని వెంకటేష్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. దాని తర్వాత మద్రాస్ లోనే లయోలా కాలేజీ నుండి బి.కామ్ లో పట్టబద్రులయ్యారు. తరవాత అమెరికాలోని మోన్టేరీ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంటర్ నేషనల్ స్టడీస్ నుండి యం.బి.ఏ పూర్తి చేసారు.

సినీ ప్రస్థానం

వెంకటేష్ గారు మొదట ‘ప్రేమ నగర్’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక చిన్న వేషం వేశారు. ఇక దాని తరవాత చదువు పూర్తి చేసుకొని మళ్ళీ తెలుగు పరిశ్రమలో అడుగు పెట్టారు. రామానాయుడుగారు దర్శకుడు రాఘవేంద్రరావు, హీరో కృష్ణ గారి కాంబినేషన్ లో ఓ సినిమా ప్లాన్ చేసారు కానీ ఆఖరి నిమిషంలో కృష్ణ గారి డేట్స్ సర్దుబాటు చేయలేక సినిమా చేయలేను అన్నారు. రాఘవేంద్రరావు గారు డేట్ లు వదులు కోవటం ఇష్టంలేని రామానాయుడు గారు వెంకటేష్ గారితో సినిమా మొదలు పెట్టారు. అదే 1986లో వచ్చిన ‘కలియుగపాండవులు’. ఈ సినిమా విడుదల అవ్వడంతోనే ఘనవిజయం సాధించడంతో వెంకటేష్ గారి పేరు ఆంధ్ర రాష్ట్రం అంత మరుమోగిపోయింది. ఈ సినిమాలో ఆయన నటనకు రాష్ట్ర నంది అవార్డు కూడా వెంకటేష్ గారు గెలుచుకున్నారు.

ఆ తర్వాత ‘బ్రహ్మరుద్రులు’, ‘అజేయుడు’, ‘భారతంలో అర్జునుడు’ సినిమాలు ఫ్లాప్‌ అవ్వడం తో వెంకటేష్ గారు కాస్త విరామం తీసుకున్నా తర్వాత మళ్లీ 1987లో ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాతో ప్రేక్షకులముందుకు వచ్చారు. దీనిని యువ చిత్ర ఆర్ట్స్ బ్యానర్‌లో కె. మురారి నిర్మించారు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. కె.వి.మహదేవన్ సంగీతం అందించారు. ఇందులో వెంకటేష్ గారు, భానుప్రియ గారు, గౌతమి గారు, మోహన్ బాబు గారు నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. 1988 లో వచ్చిన ‘బ్రహ్మ పుత్రుడు’తో వెంకటేష్ గారు ఇంకో సూపర్ హిట్ కొట్టారు. ఈ సినిమా దాసరి నారాయణ రావు దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై రామానాయుడు గారు నిర్మించారు. చక్రవర్తి సంగీతం అందించిన ఈ సినిమాలో వెంకటేష్, రజనీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది తమిళ చిత్రం ‘మైఖేల్ రాజ్’ కు రీమేక్. వెంకటేష్ గారు ఫిలింఫేర్ తెలుగు ఉత్తమ నటుడు పురస్కారం గెలుచుకున్నారు.

ఈ సినిమాతో వెంకటేష్ గారికి గొప్ప అవకాశం వచ్చింది.  నటుడిగా రెండేళ్ళ ప్రాయంలోనే, అగ్ర దర్శకుడు, కళాతపస్వి విశ్వనాధ్ గారు దర్శకత్వం వహించిన స్వర్ణకమలంలో నటించి ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. చిత్రకారుడైన యువకుడు తన పొరుగింటిలో ఉండే వృద్ధ బ్రాహ్మణ విధ్వంసుని కుమార్తెలో నాట్య కళా కౌశలం గుర్తించి ఆమెను ప్రోత్సహించి ఉన్నత శిఖరాలకు చేరేలా చేయడం కథాంశం. ఇళయరాజా స్వరాలు సమకూర్చిన ఈ చిత్ర సంగీతం, శ్రోతల ఆదరణ పొందింది. ‘‘ఆకాశంలో ఆశల హరివిల్లూ... ఆనందాలే పూసిన పొదరిళ్ళూ.. అందమైనా ఆ లోకం ఆందుకోనా ఆదమరిచీ కలకాలం ఉండిపోనా’’, ‘‘ఘల్లు ఘల్లు ఘల్లుమంటు.. మెరుపల్లే తుళ్ళు.. ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు’’ ఇలా ఎన్నో పాటలు ఈనాటికీ బుల్లితెరపైనా, ఎఫ్‌.ఎమ్‌ లలోనూ వినిస్తూనే ఉన్నాయి. సిరివెన్నెల గీతాలకు ఎస్పీ బాలు, సుశీల, జానకిలు గాత్రాలు తోడవ్వగా ఇళయరాజా సంగీతం తెలుగు ప్రేక్షకులను అలరించి మెప్పించింది. కె.ఎస్‌.రామారావు సమర్పణలో భాను ఆర్ట్ క్రియేషన్‌ పతాకంపై నిర్మితమైన ఈ సినిమాకి సి.హెచ్‌.వి.అప్పారావు నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రానికి మూడు నంది అవార్డులతో పాటు వెంకటేష్‌కి జ్యూరీ అవార్డు లభించగా, భానుప్రియ ఉత్తమనటిగా అవార్డు గెలుచుకుంది.


వెంకటేష్ గారికి తన కెరీర్ మొదటి నుంచి మంచి మంచి పాత్రలు లభించాయి అందులో ‘ప్రేమ’ సినిమా ఒకటి. 1989వ సంవత్సరంలో వచ్చిన ఈ చిత్రంలో వెంకటేష్ గారికి జంటగా రేవతి గారు నటించారు. సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో పాటలు అన్ని ఒక క్లాసిక్. ఇళయరాజా గారి సంగీతం ఈ సినిమాకి పెద్ద హైలైట్. ప్రియతమా నా హృదయమా అనే పాట ఇప్పటికి చాలామంది వింటూనే ఉంటారు.

ఆ సినిమా తర్వాత వెంకటేష్ గారికి కొన్ని పరాజయాల తప్పలేదు. అప్పుడు వెంకటేష్, బి.గోపాల్ గారి కాంబినేషన్లో సినిమా తీయాలనుకున్న రామానాయుడు గారు పరుచూరి సోదరులుని కథ చెప్పమన్నారు. పరుచూరి గోపాలకృష్ణ గారు పూర్తి రాజకీయ నేపథ్యం ఉన్న ఒక కథ చెప్పారు. ఒక కలెక్టరు కుటుంబం, వారికి మరో కుటుంబంతో గొడవ, కలెక్టరు కుటుంబంలోని అబ్బాయి, రెండో కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రేమించడం ఇందులో ప్రధాన కథాంశం. ఇందులో అటవీ నేపథ్యం ఏమీ లేదు. కానీ పరుచూరి వెంకటేశ్వరరావు గారు మాత్రం ఈ కథకు అంగీకరించలేదు. తర్వాత ఇద్దరూ కలిసి ఈ సినిమాకు కథను తీర్చి దిద్దారు. ఈ చిత్రంపై ‘ది గాడ్స్ మస్ట్ బి క్రేజీ’ అనే విదేశీ చిత్ర ప్రభావం ఉంది. ఇక బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన బొబ్బిలి రాజా సినిమాతో వెంకటేష్ గారికి గుర్తుండిపోయే భారీ విజయం లభించింది. సెప్టెంబరు 14, 1990న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. హైదరాబాద్‌ సుదర్శన్‌ థియేటర్‌లో 265 రోజులు ఆడింది. మొదట అనుకున్న ఒప్పందం ప్రకారం. 265 రోజుల తర్వాత సుదర్శన్‌లో నుంచి సినిమా తీసేయాల్సి వచ్చింది. ఆ తర్వాత శ్రీనివాస్‌లో వంద రోజులు ఆడింది. ఒప్పందం లేకపోతే ఒకే థియేటర్‌లో ఏడాదికి పైగా ఆడిన చిత్రంగా ‘బొబ్బిలి రాజా’ రికార్డు సృష్టించేది. ఈ చిత్రాన్ని తమిళంలో ‘వాలిబన్‌’గా, హిందీలో ‘రామ్‌పూర్‌ కా రాజా’గా డబ్‌ చేశారు. 1993లో ‘బాయ్‌ ఫ్రెండ్‌’ పేరుతో హిందీలో రీమేక్‌ చేశారు. ఈ సినిమాకు గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా ఇళయరాజా గారికి ఫిలింఫేర్‌ అవార్డు వచ్చింది. బొబ్బిలి రాజా సంగీతపరంగా కూడా మంచి విజయం సాధించింది. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘బొబ్బిలిరాజా’లో కనిపించే అటవీ ప్రాంతమంతా తమిళనాడులోని పొల్లాచి సమీపంలోనిది. అక్కడే దాదాపు 40 రోజులకు పైగా షూటింగ్‌ జరిగింది. కెమెరామెన్‌‌గా రవీంద్రబాబును తీసుకుంటే అందరూ ఆశ్చర్యపోయారు. కానీ, ఆయన ప్రతీ ఫ్రేమును అందంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా జంతువులు కనిపించే సన్నివేశాలు తీయడానికి ఎంతో కష్టపడ్డారు. ఇక ఈ చిత్రంలో క్లైమాక్స్‌ ఫైట్‌ హైలైట్‌ అని చెప్పాలి. సాధారణంగా క్లైమాక్స్‌ ఫైట్‌కు సంబంధించిన సన్నివేశాలను ఫైట్‌ మాస్టర్‌కు అప్పగించేస్తారు దర్శక, రచయితలు. కానీ, ఈ సినిమాకు ఫైట్స్‌ ప్రత్యేకంగా ఉండాలని అనుకున్నారు. అలా కదిలే రైలుపై యాక్షన్‌ సన్నివేశాలను తీర్చిదిద్దారు. ఒక్కో బోగీలో అడవి జంతువులను ఉంచి ఆ ఫైట్‌కు మరింత ఆకర్షణ తీసుకొచ్చారు. ఈ సన్నివేశాలను నల్లమల అటవీ ప్రాంతంలో తీశారు. షూటింగ్‌ జరిగినన్ని రోజులూ వెంకటేశ్‌ రైలులోనే ఉండటం విశేషం.

ఆ తరువాత వచ్చిన ‘శత్రువు’ సినిమాలో వెంకటేష్, న్యాయస్థానాల్లో అవినీతిని అరికట్టలేక, విసుగు చెంది, చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకునే ఒక ఆవేశపూరితుడైన యువ న్యాయవాది పాత్రను పోషించారు. ఇందులో వెంకటేష్, విజయశాంతి ముఖ్య పాత్రలు పోషించారు. సుమంత్ ఆర్ట్స్ పతాకం పై ఎం.ఎస్.రాజు నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ సంగీత ద్వయం  రాజ్-కోటి సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా ఘనవిజయం సాధించింది.

ఆ తర్వాత ‘శివ’ సినిమాతో సంచలనం సృష్టించిన రామ్‌ గోపాల్ వర్మ దర్శకత్వంలో, విజయవంతమైన చిత్రం ‘క్షణక్షణం’లో నటించారు. చిత్రకథ నిజ కాలం కొన్ని గంటలు లేదా రోజులుగానే తీసుకుని కొన్ని సంఘటనల కూర్పుతో కొత్త తరహా చిత్రీకరణను తెలుగు సినిమాకు పరిచయం చేసిన చిత్రం. శ్రీదేవికి వీరాభిమాని అయిన రాంగోపాల్ వర్మ, ఈ సినిమాను తను శ్రీదేవికి వ్రాసిన ప్రేమలేఖగా తన బ్లాగులో చెప్పుకున్నారు. ఈ సినిమా తొలివిడత విడుదలైన సమయంలో సరిగా ఆడలేదు. మలివిడత విడుదలైన తర్వాతే విజయం సాధించి ఇప్పటికీ ఎంతో మంది చూస్తున్నారు. శ్రీదేవి నటనా చాతుర్యం, ఆహార్యం, అందంతో అభిమానులను అలరించింది. వెంకటేష్ సరసన తొలిసారిగా, మలిసారిగా ఈ సినిమాలోనే నటించింది. ‘క్షణ క్షణం’ చిత్రాన్ని చూసినపుడు శ్రీదేవి నటన ఎంతో కష్టపడి చేసిందో అనిపిస్తుంది. ముఖ్యంగా కొన్నిచోట్ల ఆమె ముఖంలో పలికించే హావభావాలు బాగుంటాయి. అందుకేనేమో వర్మ ఈ చిత్రాన్ని ‘శ్రీదేవికి నేను రాసిన ప్రేమలేఖ’ అంటాడు. ఈ సినిమాలో హీరో వెంకటేష్‌ అయినా, శ్రీదేవే తెరపై ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అడవిలో బ్రిడ్జి దాటుతున్న సమయంలో వెంకటేష్‌ కాలు జారిన తరువాత ఆమె నవ్వుతూనే ఉండే సన్నివేశం ఉంది. అక్కడ ఆమె నటన చాలా సహజంగా ఉంటుంది. వెంకటేష్‌ కల్పిత కథ పాత్ర ఫ్లాష్‌ బ్యాక్‌ గురించి చెపుతుంటే, ‘ఈ సినిమా నేను చూసానంటూ’ శ్రీదేవి ఓ సన్నివేశంలో నవ్వులు పూయిస్తుంది. ఈ సినిమా పెడితే వెంకటేష్ గారి కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా. ఆ తరువాత ఆయన పలు చిత్రాల్లో నటించారు.

ఇక తమిళంలో విడుదలై ఘనవిజయం సాధించిన ‘చిన్న తంబి’ సినిమాకి రచయిత, దర్శకుడు పి. వాసు, సినిమాలో ప్రధాన పాత్రలు ధరించినది ప్రభు, ఖుష్బు. ఘనవిజయం సాధించిన ఈ తమిళ చిత్రం హక్కులు కొని తెలుగులో తీయాలని పలువురు భావించారు. బి.గోపాల్ తన దర్శకత్వంలో బాలకృష్ణతో తీయాలని భావించారు, అయితే అప్పటికే కె.ఎస్. రామారావు సినిమా హక్కుల్ని కొనేశారు, ఆయన వెంకటేష్ తో తీద్దామని నిర్ణయించుకున్నారు. అలా తెలుగులో పునర్నిర్మించి విడుదల చేసిన ‘చంటి’ సినిమా వెంకటేష్ సినీ వ్యాసాంగాన్ని ఒక మలుపుతిప్పిన చిత్రంగా భావించబడుతుంది. అప్పటిదాకా అవేశపూరిత యువకుని పాత్రలు ఎక్కువగా పోషించిన వెంకటేష్, చంటి పాత్రను చాలా శ్రమతో పండించారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కూడా బ్రహ్మాండమైన విజయం సాధించింది. ఆ తర్వాత హిందీలో అదే సినిమా తిరిగి తీసినప్పుడు (అనారీ) అందులో కుడా ప్రధాన పాత్రను వెంకటేషే పోషించారు. కాకపోతే ఈ సినిమా హిందీ లో అంత పెద్దగా ఆడలేదు. ఈ చిత్రంతో వెంకటేష్ కుటుంబ తరహా చిత్రాలు కూడా చేయగలడన్న ముద్ర ఏర్పడింది. మహిళా ప్రేక్షకులలో ఆదరణ కూడా పెరిగింది.

1992లో వెంకటేష్ కథానాయకునిగా కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం సుందరకాండ. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించాడు. లెక్చరర్ ను ప్రేమించిన ఒక అమ్మాయి కథ ఇది. ఇందులో వెంకటేష్ లెక్చరర్ గా నటించాడు. ఈ చిత్రం తమిళంలో కె. భాగ్యరాజా స్వీయ దర్శకత్వంలో నటించిన సుందరకాండం అనే చిత్రానికి రీమేక్. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది. ఈ చిత్రంలో వేటూరి రాసిన ‘ఆకాశాన సూర్యుడుండడు తెల్లవారితే’ పాటకు నంది పురస్కారం లభించింది.

విక్టరీ వెంకటేశ్ కెరీర్ లో చాలా ప్రత్యేకమైన చిత్రం ‘అబ్బాయిగారు’. సెప్టెంబర్ 30, 1993 న విడుదలైన ఈ సినిమా టాలీవుడ్ లో ఘన విజయం సాధించింది. రాశీ మూవీస్ బ్యానర్ పై నరసింహారావు నిర్మించిన ఈ సినిమాకి దర్శకుడు ఇ.వి.వి సత్యనారాయణ. దీనికి ఇ.వి.వి గురువు జంధ్యాల మాటలు రాయడం విశేషం. మీనా, జయచిత్ర, కోట శ్రీనివాసరావు, నూతన్ ప్రసాద్, బ్రహ్మానందం, బాబు మోహన్, మల్లికార్జురావు, ఏవియస్, శ్రీకాంత్, పియల్ నారాయణ, జీవా తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలన్నీ అప్పట్లో సూపర్ హిట్టు. ఇక ఈ సినిమా కథకి చాలా చరిత్ర ఉంది. ‘అబ్బాయిగారు’ చిత్రం వాస్తవానికి భాగ్యరాజా తమిళ చిత్రం ‘ఎంగ చిన్నరాజా’ సినిమాకి రీమేక్. అయితే కథ మాత్రం ‘మల్లమన పవాడా’ అనే కన్నడ నవలకి ఆధారం. ఆ నవలను అప్పట్లో అదే పేరుతో కన్నడలో రీమేక్ చేశారు. అయితే దాని స్ర్కీన్ ప్లే రాసింది మాత్రం మన దర్శకుడైన పి.పుల్లయ్య. దాని స్ర్కీన్ ప్లే ను స్వయం సిద్ధ అనే బెంగాలి నవల ఆధారంగా రాసుకున్నారు. అదే నవల ఆధారంగా పుల్లయ్య దర్శకత్వంలోనే అప్పట్లో  తెలుగులో అక్కినేని, సావిత్రితో ‘అర్ధాంగి’ గా తెరకెక్కింది. ఇక ఇదే ‘ఎంగ చిన్నరాజా’ చిత్రం ఆ తర్వాత హిందీలో అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్ జంటగా ‘బేటా’ గానూ, కన్నడలో రవిచంద్రన్ హీరోగా ‘అణ్ణయ్య’ గానూ రీమేక్ అయింది.

1996 సంవత్సరం నుంచి వెంకటేష్ దాదాపు గా చాలా సూపర్ హిట్స్ కొట్టాడు. అందులో ముఖ్యంగా ‘ఇంట్లో ఇల్లాలు వొంటింట్లో ప్రియురాలు’ సినిమా చాలా పెద్ద ఘన విజయాన్ని సాధించింది. తమిళంలో భాగ్యరాజా కథతో మురుగేష్ దర్శకత్వంలో పాండిరాజన్ హీరోగా నటించిన ‘తైకులమే తైకులమే’ సినిమాను ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ సినిమాగా రీమేక్ చేస్తే సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ పాటలు కూడా చాలా వినసొంపుగా ఉంటాయి. సౌందర్య గారి నటన వెంకటేష్ గారి కామెడీ అన్ని చక్కగా కుదిరి ఈ చిత్రాన్ని పెద్ద విజయం చేసాయి. ఇక అదే సంవత్సరంలో వచ్చిన ‘పవిత్ర బంధం’ చిత్రానికి ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించగా గీతా చిత్ర ఇంటర్నేషనల్ బ్యానర్‌లో సి. వెంకటరాజు నిర్మించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. అ చిత్రం ఆరు భాషల్లో పునర్నిర్మించబడింది. కన్నడలో మంగల్యం తంతునానేనా (1998), హిందీలో హమ్ ఆప్కే దిల్ మెయిన్ రెహతే హైన్ (1999), తమిళంలో ప్రియమానవలే (2000), బెంగాలీలో సాట్ పాకే బంధ (2009) ), ఒడియాలో సుహాగ్ సింధూరా (1996), మరియు బంగ్లాదేశ్‌లో ఇ బధోన్ జబెనా చిరే (2000). 2009లో, ఈ చిత్రం అనురాగ అరలితు (కన్నడ) మరియు కిరీడమ్ (మలయాళం) లో రీమేక్ చేసారు. “శీలం అనేది మనసుకు సంబంధించినది… శరీరానికి సంబంధించినది కాదు” అనే పాయింట్‌తో ‘పెళ్లి చేసుకుందాం’ సినిమా తెర‌కెక్కింది. ‘పవిత్రబంధం’ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం తరువాత వెంకీ, సౌందర్య జంటగా ముత్యాల సుబ్బయ్య రూపొందించిన‌ ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ కూడా ప్రేక్ష‌కుల‌ను విశేషంగా అలరించింది. లైలా మ‌రో నాయిక‌గా న‌టించిన ఈ సినిమాలో మోహన్‌రాజ్, దేవన్, స‌త్య‌ ప్ర‌కాశ్‌, తనికెళ్ళ భరణి, సుధాకర్, బ్రహ్మానందం, ‘శుభలేఖ’ సుధాకర్, అన్నపూర్ణ, సుమిత్ర, రజిత, మాస్ట‌ర్ మ‌హేంద్ర‌, బేబి సౌమ్య‌ త‌దిత‌రులు ఇతర ముఖ్య పాత్ర‌లు పోషించారు. భూపతి రాజా కథకి పోసాని కృష్ణ మురళి అందించిన సంభాష‌ణ‌లు సినిమాకు అద‌న‌పు బ‌లంగా నిలిచాయి. కోటి స్వరకల్పనలో రూపొందిన‌ పాటలన్నీ కూడా ప్రేక్ష‌కుల‌ను రంజింప‌జేశాయి. “కోకిల కోకిల”, “ఓ లైలా లైలా”, “ఘుమ ఘుమలాడే” “మనసున మనసై”, “ఎన్నో ఎన్నో”, “నువ్వేమి చేసావు” ఇలా ప్ర‌తీ పాట‌ విశేషాదరణ పొందింది. గీతచిత్ర ఇంటర్నేషనల్ పతాకంపై సి.వెంకట్‌రాజు, జి.శివరాజు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. 1996లో త‌క్దీర్ వాలా సినిమాతో హిందీలో రీమేక్ అయిన యమలీల సినిమా లో వెంకటేష్ గారు నటించారు. ఈ సినిమా అంతగా విజయం సాదించాకపోయిన కూడా వెంకటేష్ గారి నటనకు మంచి పేరు వచ్చింది. సురేష్ కృష్ణ దర్శకత్వంలో విడుదలైన  ధర్మచక్రం’  సినిమాలో వెంకటేష్, రమ్యకృష్ణ, ప్రేమ, గిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఇది మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో నటనకుగాను వెంకటేష్ కు నంది అవార్డ్ వరించింది. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. రామానాయుడు నిర్మించారు. తన సొంత నాన్న మీద పగ తీర్చుకునే కొడుకు గా వెంకటేష్ ఈ సినిమాలో చాలా గొప్పగా నటించారు.

1997 లో   ‘ప్రేమించుకుందాం రా’ సినిమాతో వెంకటేష్ మళ్ళీ తన ప్రస్థానం లో ఇంకో పెద్ద ఘన విజయం సాధించారు. ఈ సినిమా 1997 లో భారీ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సినిమా జయంత్.సి.పరంజి దర్శకత్వంలో తన సొంత సంస్థ  అయిన సురేష్ ప్రొడక్షన్స్ లో విడుదల చేసారు. ఓ మాములు మధ్యతరగతి కుర్రాడు రాయలసీమలోని ఓ ఫ్యాక్షన్ కూతురిని ప్రేమిస్తాడు. ఈ సందర్భంగా ఈ ఫ్యాక్షనిస్ట్ వాళ్ల కుటుంబాన్ని ఏ విధంగా హింసల పాలు చేస్తాడు,. చివరకు హీరో తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడనేదే ఈ సినిమా ఇతివృత్తం. మొత్తం మీద ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌తో తెలుగులో తెరకెక్కిన తొలి చిత్రంగా 'ప్రేమించుకుందాం రా' సినిమా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా అప్పటి వరకూ వచ్చిన ప్రేమకథల్లో ట్రెండ్ సెట్టర్‌ అయింది. ముఖ్యంగా హీరో వెంకటేష్, అంజలా ఝవేరి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేసాయి. ఇక ఈ చిత్రానికి మహేష్ అందించిన సంగీతం, మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి ప్రాణం పోశాయని చెప్పాలి.ఇందులోని పాటలు ఇంకా చాలా మంది వింటూనే ఉన్నారు. దాదాపుగా 50 సెంటర్స్ లో 100రోజులు ఆడింది. ఇది అప్పట్లో పెద్ద రికార్డ్.

ఈ సినిమా తర్వాత వెంకటేష్ ద్విపాత్రాభినయం చేసిన సూర్యవంశం సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ట్రెండ్ సృష్టించింది ఈ సినిమా. ఇక ఈ ‘సూర్యవంశం’ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ న కు వెంకటేష్ ను ఎంతగానో దగ్గర చేసింది. ఓవైపు తండ్రి పాత్రలో మరో వైపు కొడుకు పాత్రలో అందరికీ ఆదర్శంగా నిలిచే లా వెంకటేష్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో తన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు వెంకటేష్. అదే సమయంలో ఊరు నుంచి వెలివేయబడిన వెంకటేష్ ఎలాంటి చదువు లేకున్నా భార్య ప్రోత్సాహంతో పెద్ద బిజినెస్ మేన్ గా ఎలా ఎదిగాడు సినిమాలో చూపిస్తూ ఉంటారు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదు అంటూ నిరూపిస్తాడు ఈ సినిమాలో వెంకటేష్. ఇక ఫ్యామిలీ ఎమోషన్స్ పండించడంలో వెంకటేష్ కి ఎవరూ సాటి లేరు అనే చెప్పాలి. అందుకే సూర్య వంశం సినిమాలో వెంకటేష్ ద్విపాత్రాభినయం చేసి ఎంతగానో ఆకట్టుకున్నాడు. కాగా ఈ సూర్యవంశం సినిమా తమిళ రీమేక్. తమిళంలో కూడా ఈ సినిమాకు సూర్య వంశం అనే పేరు ఉంది. అటు తమిళంలో కూడా మంచి విజయం సాధించింది ఈ సినిమా.

1998 లో తిరుపతి స్వామి దర్శకత్వంలో వచ్చిన ‘గణేష్’ సినిమాలో వెంకటేష్, రంభ, మధుబాల ఇందులో ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకటేష్ సోదరుడైన డి. సురేష్ బాబు నిర్మించాడు. తన వృత్తిలో నీతి నిజాయితీగా ఉండే ఒక విలేకరి మెడికల్ మాఫియా వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడో చెప్పే కథ ఇది. ఈ సినిమాకు వెంకటేష్ కు నంది అవార్డు లభించింది. ఈ చిత్రంతో సహా తెలుగులో రెండు సినిమాలకు దర్శకత్వం వహించిన తిరుపతి స్వామి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆ సమయంలో తన కెరీర్లో చేసిన మంచి సినిమాల్లో దీన్ని ఒకటిగా వెంకటేష్ పేర్కొన్నారు. దీని తర్వాత వచ్చిన ప్రేమంటే ఇదేరా కూడా సూపర్ హిట్. బాలీవుడ్ నటి ప్రీతి జింటా నటించిన ఈ సినిమా పాటలు అప్పట్లో పెద్ద హిట్. అలాగే ఈ సినిమాని కన్నడంలో ‘ఓ ప్రేమవే’ పేరుతో పునర్నిర్మించారు. ఈ సినిమాలో కామెడీ సీన్స్ పెద్ద హైలైట్. ఇక మళ్ళీ ‘రాజా’ సినిమాతో వెంకటేష్ కి ఇంకో పెద్ద బ్లాక్ బస్టర్ వచ్చింది. త‌మిళ చిత్రం ఉన్నిడ‌త్తిల్ ఎన్నై కొడుత్తేన్  సినిమా ఆధారంగా తెర‌కెక్కిన ఈ రీమేక్ మూవీని ముప్ప‌ల‌నేని శివ తెర‌కెక్కించారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సూప‌ర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రంలో అబ్బాస్, సుధాక‌ర్, చంద్ర‌మోహ‌న్, బ్ర‌హ్మానందం, త‌నికెళ్ళ భ‌ర‌ణి, అన్నపూర్ణ‌, వై.విజ‌య‌, స‌న త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు ఎస్.ఎ. రాజ్ కుమార్ స్వ‌ర‌ సార‌థ్యంలో రూపొందిన పాట‌ల‌న్నీ విశేషాద‌ర‌ణ పొందాయి. ఏదో ఒక రాగం, క‌వ్వించ‌కే ఓ ప్రేమ‌, మ‌ల్లెల వాన‌, క‌న్నుల లోగిలో, ప‌ల్ల‌వించు తొలి రాగ‌మే ఇలా ప్ర‌తీ పాట సంగీత‌ప్రియుల‌ను మురిపించింది. 71 కేంద్రాల‌లో 100 రోజులు ప్ర‌ద‌ర్శిత‌మైన రాజా చిత్రానికి గానూ ఉత్త‌మ న‌టిగా సౌంద‌ర్య‌, సంగీత ద‌ర్శ‌కుడుగా ఎస్.ఎ. రాజ్ కుమార్ ఫిల్మ్ ఫేర్ పుర‌స్కారాల‌ను పొందారు. అలాగే ఉత్త‌మ చిత్రం విభాగంలో మ‌రో ఫిల్మ్ ఫేర్ ద‌క్కింది. ఇలా వెంకటేష్ వరసగా 6 సూపర్ హిట్ సినిమాలని తీసి రికార్డ్ సృష్టించారు. తన వరస హిట్స్ కి శీను సినిమా బ్రేక్ వేసింది. ఒక ముగా వాడిగా నటించే పాత్రలో వెంకటేష్ జీవించిన కూడా సినిమా మాత్రం సరిగ్గా ఆడలేదు. కానీ ఈ సినిమాలో పాటలు మాత్రం చాలా బాగుంటాయి.  

ఈ లోటుని ‘కలిసుందాం రా’ సినిమాతో వెంకటేష్ తీర్చేశారు. ఉదయ్‌ శంకర్‌ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. సిమ్రన్‌ కథానాయిక. కళాతపస్వి కె.విశ్వనాథ్‌ ముఖ్య పాత్ర పోషించారు. రాజ్‌ కూమార్‌ స్వరపరిచిన గీతాలు ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఇందులోని పాటలన్నీ సూపర్‌ హిట్టే. ప్రతి పాట కూడా కథానుగుణంగా సాగుతుంది. తెలుగు ప్రేక్షకుల్ని ఇంతగా అలరించిన ఈ చిత్రం హిందీ, కన్నడలోకి కూడా రీమేక్‌ అయ్యింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డును పొందింది. వెంకటేష్‌ ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నాడు.  బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టి ఈ చిత్రం 103 కేంద్రాల్లో శతదినోత్సవాన్ని జరుపుకొంది. అలాగే జయం మనదేరా కూడా మంచి విజయాన్ని సాధించింది. వెంకటేష్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో భానుప్రియ, సౌందర్య కథానాయికలుగా నటించారు. ‘జయం మనదేరా’ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్‌ సంగీతం అందించారు. అయితే ఈ సినిమా సంగీతం విషయంలో ఓ చిన్న సంఘటన ఉంది. ఎన్‌.శంకర్‌కి మొదటి చిత్రం నుంచి వందేమాతరం శ్రీనివాస్‌తో కలిసి పనిచేయడం చాలా ఇష్టం. అదే విషయాన్ని వెంకటేష్ గారికి చెప్పగా ‘ఆయన విప్లవ సినిమాలకు సంగీతం అందిస్తారు కదా! ఈ సినిమాకు చేయగలరా’ అని అడిగారట. అప్పుడు చిత్ర నిర్మాణ సంస్థ ఒక షరతు పెట్టింది. ‘ఈ సినిమాలో మీరిచ్చే పాటలు నచ్చితే సంగీత దర్శకుడిగా మీ పేరు వేస్తాం. లేకపోతే  వేయం’ అని చెప్పడంతో శ్రీనివాస్‌ దాన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకుని సినిమాకి మంచి పాటలు అందించారు. ‘జయం మనదేరా’ సినిమా జోష్ తో తరవాత కోడి రామకృష్ణ గారితో తీసిన దేవి పుత్రుడు లాంటి ఫిక్షన్ సినిమా తీశారు. ఇక 2001లో ఒక పక్క ఫ్యామిలీ హీరోగా మరోపక్క యాక్షన్ హీరోగా విక్టరీ వెంకటెష్ టాలీవుడ్ లో తన ప్రత్యేకతను చాటుతున్న సమయంలో చిన్న ఫ్యామిలీ డ్రామాకి లవ్ సెంటిమెంట్ పూత పూసి దానికి మాటల మసాలా కలిపి ప్రేక్షకులకు విందుభోజనం లాంటి అనుభూతిని ఇచ్చిన సినిమా ‘నువ్వు నాకు నచ్చావ్’ ఈ సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ వెంకటేష్ నటనకి ఎంతలా కనెక్ట్ అయిపోయారో త్రివిక్రమ్ మాటల మాయకీ అంతలా కనెక్ట్ అయిపోయారు. అందుకే రెండు దశాబ్దాలు కావస్తున్నా ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతూనే ఉంది. ‘నువ్వే కావాలి’ సినిమాకి గాను విజయభాస్కర్, త్రివిక్రమ్ వర్క్ నచ్చి నెక్స్ట్ సినిమాకి గాను ముందే అడ్వాన్స్ ఇచ్చారు స్రవంతి 'రవికిషోర్ '. ఆ సినిమానే నువ్వు నాకు నచ్చావ్! విజయభాస్కర్, త్రివిక్రమ్ కలిసి రెండు నెలల్లో స్క్రిప్ట్ కంప్లీట్ చేశారు. సినిమా సబ్జెక్టుని టీం మొత్తానికి వినిపిస్తే అందరు సినిమా స్క్రిప్ట్ కి వందకు వంద మార్కులు ఇచ్చేసారు. ఇక సినిమా 147 సెంటర్లలో 113 ప్రింట్లతో ఈ చిత్రం విడుదల చేస్తే సినిమాకి మొదటి ఆట నుంచే హిట్ టాక్ వెంకీ కామెడీకి త్రివిక్రమ్ పంచ్ లకి ఆడియన్స్ ఫిదా. ఈ సినిమాతోనే త్రివిక్రమ్ కి మాటల మాంత్రికుడు గా బిరుదు వచ్చింది. ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన మూడవ తెలుగు చిత్రంగా ‘నువ్వు నాకు నచ్చావ్’ నిలిచింది. ఈ చిత్రం 93 కేంద్రాలలో 50 రోజులు, 57 కేంద్రాలలో 100 రోజులు, మూడు కేంద్రాలలో 175 రోజులు ప్రదర్శించబడింది.

వెంకటేష్ సినీ కెరీర్ లో ఎక్కువ రీమేక్ సినిమాలు ఉన్నాయి. రీమేక్స్ అయినప్పటికీ వెంకటేష్ తన స్టైల్ లో వాటికి కొత్త జీవం పోసేవారు. 2002 లో తమిళంలో విక్రమ్ హీరోగా వచ్చిన ‘జెమినీ’ సినిమాని అదే పేరుతో వెంకటేష్ రీమేక్ చేశారు కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సరిగ్గా ఆడలేదు. కానీ ఈ సినిమాలో పాటలు ఇప్పటికీ పెద్ద హిట్. తల్లిదండ్రులు వారి కలలను పిల్లలపై రుద్దకూడదనే సందేశాన్ని తెలుపుతూ పూర్తి వినోదాత్మకంగా, మ్యూజికల్‌గా సాగిన చిత్రం ‘వాసు’. విక్టరీ వెంకటేష్‌, భూమిక జంటగా నటించిన ఈ చిత్రానికి కరుణాకరన్‌ దర్శకత్వం వహించారు. హారిస్‌ జయరాజ్‌ అందించిన పాటలు సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాయి. యూత్‌, ఫ్యామిలీ, మాస్‌ ఇలా అన్ని రకాల ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ఈ చిత్రం గొప్ప విజయాన్ని అందుకుంది. ‘వాసు’ సినిమా పేరు మదిలో మెదలగానే అందరికి గుర్తొచ్చేవి పాటలు. ప్రతీ ఒక్క పాట ఆణిముత్యమే. ముఖ్యంగా ‘పాటకు ప్రాణం పల్లవి అయితే..ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా’, 'ఓ ప్రేమా ఓ ప్రేమా’ అంటూ సాగే పాటలు సంగీత ప్రియుల్ని ముఖ్యంగా ప్రేమికులను ఎంతగానో అలరించాయి.

తర్వాత అయన  నటించిన మల్లీశ్వరి, వసంతం సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. ముఖ్యంగా మల్లీశ్వరి సినిమాలో వెంకటేష్ గారి కామెడీకి జనాలు అంతా హాయిగా నవ్వుకొన్నారు. ఈ సినిమాకి త్రివిక్రమ్ రైటర్. ఈ సినిమా అంతా కామెడీ సీన్స్ తో నింపేశారు.  ఈ సినిమాతో బాలీవుడ్ అందాల నటి కత్రినా కైఫ్ తెలుగులోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో తన యాక్టింగ్ కి పెద్దగా మార్కులు పడకపోయిన కూడా తన అందానికి అందరూ ఫిదా అయిపోయారు. ఈ సినిమాకి కత్రినా కైఫ్ ఏకంగా 70 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంది ఇది అప్పట్లో సౌత్ లో ఇంత రెమ్యునరేషన్ తీసుకున్న మొదటి హీరోయిన్ గా నిలిచింది.

2004లో రిలీజ్ అయిన ఘర్షణ సినిమాలో అసలైన పోలీసులా కనిపించడం కోసం వెంకటేష్ హైదరాబాద్ పోలీస్ అకాడమీకి వెళ్ళి వాళ్ళ నడవడిని గమనించాడు. శరీరాకృతిని కూడా దానికి తగ్గట్టు మార్చుకున్నాడు. ఈ సినిమాలో మొదటగా కథానాయిక పాత్రకు సోనాలీ బెంద్రేని అనుకున్నారు. తర్వాత ఆ అవకాశం ఆసిన్ కు దక్కింది. ప్రతినాయక పాత్ర పోషించిన సలీం బేగ్ కు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టడమే కాకుండా మరిన్ని సినిమాల్లో అవకాశం పొందేందుకు లాభించింది. ఈ సినిమా పాత్ర పేరు పాండాను తన పేరులో చేర్చుకున్నాడు. ఈ చిత్రానికి హరీష్ జైరాజ్ అందించిన పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి.

ఈ సినిమాతో కుటుంబ కథా చిత్రాలు అంటే తెలుగు పరిశ్రమలో వెంకటేష్ గుర్తొచ్చేవారు. అంతలా తెలుగు కుటుంబ ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా వెంకటేష్ ముద్ర వేశారు. సంక్రాంతి సినిమా విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో వెంకటేష్ గారి నటనకు అందరూ ఫిదా అయిపోయారు. అన్నదమ్ముల అనుబంధం ఈ సినిమా విజయానికి ముఖ్య కారణం. ఈ సినిమా తమిళ్ మూవీ ‘ఆనందం’ సినిమాకి తెలుగు రీమేక్.

దాని తర్వాత సంవత్సరంలో 2006సంక్రాంతికి వి.వి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ సినిమాతో వెంకటేష్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. సంక్రాంతి విడుదల అయిన లక్ష్మీ సినిమా మిగిలిన చిత్రాలన్నింటి కన్నా బాగా ఆడింది. వెంకటేష్ సినిమా సంక్రాంతికి వస్తుంది అంటే సూపర్ హిట్ అనుకునేల నమ్మకం తెప్పించిన చిత్రం ఇది. ఈ సినిమాలో నయనతార, ఛార్మి వెంకటేష్ గారికి జోడిగా నటించారు. 2007లో సెల్వ రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే సినిమాని శ్రీ సాయి దేవా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకం పై ఎన్.వి.ప్ర‌సాద్, శానం నాగ అశోక్ కుమార్ నిర్మించిచారు. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం బాల‌మురుగ‌న్ ఫోటోగ్ర‌ఫీ హైలైట్. వెంకీ అంత‌కుముందు చేయ‌ని పాత్ర‌నే లేదు. కానీ ప్రేమ‌క‌థ‌లు ఫ్యామిలీ ఎమోష‌న్స్ తో చేస్తే ఆ రేంజే వేరు. క‌ల్ట్ స్పెష‌లిస్ట్ సెల్వ రాఘ‌వ‌న్ ఓ స్టార్ హీరోతో తెలుగులో చేసిన ఏకైక సినిమా కూడా ఇదే. వెంకీ-త్రిష కాంబో ప్రేక్ష‌కుల‌కు విప‌రీతంగా న‌చ్చింది. అలాగే క‌ల‌ర్స్ స్వాతి, వెంకీ-కోట కాంబినేష‌న్ సీన్స్ బాగా పండాయి. 267 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద దాదాపు 30 కోట్లు వసూలు చేసింది. 200 కేంద్రాలలో 50 రోజులు ఆడింది. 21 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. ఈ చిత్రం లో పాటలు ఇప్పటికి చాలా మంది ఫోన్స్ లో రింగ్ టోన్స్ గా వినిపిస్తుంటాయి. ఇదే సంవత్సరంలో వచ్చిన తులసి కూడా పెద్ద విజయం సాధించింది.ఇలా వరసగా హట్రిక్ హిట్స్ కొట్టారు. అలాగే చింతకాయల రవి, నాగవల్లి, బాడీగార్డ్ వంటి వరస పరాజయాలు వెంకటేష్ గారి ఫాన్స్ ని కొంచెం దిగులు పడేలా చేసాయి. 2009 లో కమల్ హాసన్ గారితో చేసిన ‘ఈనాడు’ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేదు. కాకపోతే ఈ సినిమా వెంకటేష్ గారిని కొత్తగా చూడాలని అనుకునేవాళ్ళకి మంచి ఎంపిక.

ఈ ప్లాప్స్  అన్నిటిని ఒక్క సినిమాతో వెంకటేష్ గారు ఒక హిట్ సినిమాతో  తీసేసారు. అది 2013 లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం. ఈ చిత్రంలో ప్రముఖ తెలుగు సినీనటులు వెంకటేష్, మహేశ్ ‌బాబు ముఖ్య పాత్రలు పోషించారు. వీరితో పాటు ఇతర ముఖ్య పాత్రలలో సమంత, అంజలి, ప్రకాశ్ రాజ్, జయసుధ నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో వెంకటేష్, మహేశ్ ‌బాబు అన్నదమ్ములుగా నటించారు. ఈ సినిమాలో మహేష్ సరసన సమంత, వెంకటేష్ సరసన అంజలి నటించారు. వీరికి తండ్రి పాత్రలో ప్రకాశ్ రాజ్, అమ్మ పాత్రలో జయసుధ నటించారు. అమ్మమ్మ పాత్రలో ప్రముఖ హిందీ నటి రోహిణీ హట్టంగడి నటించారు.దాదాపు 20 యేళ్ళ తర్వాత నిర్మించబడిన మల్టీస్టారర్ చిత్రం కావడంతో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం సంచలనాత్మక విజయం సాధించడమే కాక ప్రపంచవ్యాప్తంగా 54.75 కోట్ల కలెక్షన్లను సాధించింది. తరవాత వచ్చిన మసాల, షాడో సినిమాలు భారీ అపజయాన్ని పొందాయి దానితో వెంకటేష్ గారి మీద కామెంట్స్ మొదలుపెట్టారు. వాటి అన్నిటికి దృశ్యం సినిమాతో చెక్ పెట్టారు వెంకటేష్ గారు. మలయాళంలో 2013లో మోహన్ లాల్, మీనా, ఆశా శరత్, సిద్ధిక్ ముఖ్యపాత్రలు పోషించిన దృశ్యం సినిమాకి అధికారిక రీమేక్. 1980లలో నటిగా వెలిగిన శ్రీ ప్రియ ఈ సినిమాకి దర్శకత్వం వహించగా దగ్గుబాటి సురేష్ బాబు, శ్రీ ప్రియ భర్త మరియూ నిర్మాత రాజ్ కుమార్ సేతుపతి ఈ సినిమాని సమ్యుక్తంగా నిర్మించారు. దగ్గుబాటి వెంకటేష్, మీనా, నదియా, నరేష్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాలో కృతిక జయకుమార్, ఎస్తర్, రవి కాలే, సమీర్, సప్తగిరి, చలపతిరావు, చైతన్య కృష్ణ, రోషన్ బషీర్ మొదలగువారు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాతో సురేష్ ప్రొడక్షన్స్ సినీరంగంలో 50 ఏళ్ళు పూర్తిచేసుకుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2014 జూలై 11న విడుదలైనా 2014 జూలై 9న ప్రత్యేకమైన ప్రీమియర్ షోలను ఏర్పాటు చేసారు. విమర్శకులను అమితంగా మెప్పించిన ఈ సినిమా భారీ విజయాన్ని కైవసం చేసుకుంది.

ఇక మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన వెంకటేష్ గారు వరుసగా ఇతర హీరోలతో కలిసి సినిమాలు చేయడం మొదలుపెట్టారు. అలా పవర్ స్టార్ పవన్ కల్యాణ్- విక్టరీ వెంకటేష్ ల కాంబినేషన్ లో రూపొందిన మల్టీస్టారర్ చిత్రం ‘గోపాల గోపాల’ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. హిందీ చిత్రం ‘ఓ మై గాడ్’ కు రీమేక్ గా నిర్మించిన ఈ చిత్రంపై తొలుత మిశ్రమ స్పందన వచ్చినా కలెక్షన్ల పరంగా మాత్రం దూసుకుపోయింది. ఈ చిత్రం మొదటి వారంలో రూ.48 కోట్లకు పైగా వసూలు చేసి డిస్ట్రిబ్యూటర్లకు కాసుల పంట పండించింది. 2018 లో హిందీలో నిర్మితమైన ‘సాలా ఖడూస్’ సినిమాకి రీమేక్ గా తెలుగులో వచ్చిన ‘గురు’ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో వెంకటేష్ గారు ఒక బాక్సింగ్ కోచ్ గా నటించారు. ఈ సినిమాకి సుధ కొంగర దర్శకత్వం వహించారు. ఇందులో వెంకటేష్ గారు ఒక పాట కూడా పాడటం విశేషం.

అలానే 2019లో వచ్చిన ఎఫ్-2 సంక్రాంతి అల్లుడ్లు సినిమా సంక్రాంతికి విడుదలై భారీ విజయాన్ని సంపాదించుకుంది. సంక్రాంతి కి విడుదలైన ఈ సినిమా మిగతా సినిమాలని దాటుకుని 100కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. వెంకటేష్, వరుణ్‌ తేజ్‌లు హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘ఎఫ్‌-2’ జాతీయ స్థాయి అవార్డును సొంతం చేసుకుంది. ఇండియన్ పనోరమా కేటగిరీ ఫర్ 2019లో ఫీచర్ ఫిలిం కేటగిరీలో ఎఫ్‌-2కు ఈ అవార్డు లభించింది. హిందీతో పాటు ప్రాంతీయ భాషల సినిమాలకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అవార్డులను ప్రకటించింది. ఈ క్రమంలో అవార్డు సాధించిన ఏకైక తెలుగు సినిమా ‘ఎఫ్‌-2’ కావడం విశేషం. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఎఫ్‌-2 తెరకెక్కింది. ఇందులో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించగా రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్‌ రాజ్, సుబ్బరాజు, ప్రగతి, నాజర్‌, ఈశ్వరీ రావు, అన్నపూర్ణమ్మ, వై. విజయ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. దిల్‌ రాజు నిర్మించిన ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అలాగే 2019 డిసెంబర్ లో తన మేనల్లుడు అయిన నాగ చైతన్య తో కలిసి చేసిన ‘వెంకీ మామా’ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకి మొదట్లో మిశ్రమ స్పందన వచ్చిన కూడా అవి ఈ సినిమా వసూళ్ల మీద ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాయి.

2021లో తమిళ సూపర్ హిట్ చిత్రం ‘అసురాన్’ రీమేక్ అయిన ‘నారప్ప’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించారు. ఈ చిత్రం అంతగా ప్రేక్షకాదరణ పొందలేకపోయినా ఆయన నటనకు మంచి స్పందన లభించింది

హాస్య ప్రధాన పాత్రలలో పోషిస్తూనే ఈయన ‘ఘర్షణ’ వంటి యాక్షన్ చిత్రాలను కూడా చేశారు. ఈయన నటించిన కుటుంబ ప్రధాన చిత్రాలు ఈయనకు అనేక మంది మహిళా అభిమానులను సంపాదించాయి. ఈయన సినిమాల ద్వారా చాలా మంది హీరోయిన్స్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఫరా, టబు, దివ్యభారతి, గౌతమి, ప్రేమ, ఆర్తీ అగర్వాల్, ప్రీతి జింతా, కత్రినా కైఫ్, అంజలా జవేరి మొదలగు వారిని వెంకటేష్ తెలుగులో పరిచయం చేసారు. సౌందర్యతో వెంకటేష్ ది హిట్ పెయిర్. సౌందర్యతో ఆయన ఏడు సినిమాలు చేసారు. మీనాతో నాలుగు సినిమాలు (చంటి, సుందరకాండ, అబ్బాయిగారు, సూర్యవంశం) చేసారు. ఆ నాలుగు విజయం సాధించాయి. ఆర్తీ అగర్వాల్తో మూడు సినిమాలు (నువ్వు నాకు నచ్చావ్, వసంతం, సంక్రాంతి) చేసారు. ఆ మూడు కూడా విజయం సాధించాయి.

వెంకటేష్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎక్కువ సినిమాలు చేసారు. పైగా రాఘవేంద్రరావు వెంకటేష్ ని కలియుగ పాండవులు సినిమాతో తెలుగు తెరకు కథానాయకుడుగా పరిచయం చేశారు.

వ్యక్తిగత జీవితం

1985లో ఆయన నీరజ గారిని వివాహమాడారు. వీరికి ఒక అబ్బాయి, ముగ్గురు అమ్మాయిలు సంతానం. అబ్బాయి పేరు అర్జున్, అమ్మయిల పేర్లు ఆశ్రిత, హయవాహిని, భావన. నేను వేదాంతిని కాను. సినిమా హిట్టయినా ఫ్లాప్‌ అయినా పొంగిపోను. కుంగిపోను. నా పని నేను చేశాను. చేసేటప్పుడు ఆనందంగా ఉన్నాను కదా అనుకుంటాను. కొన్ని పాఠాలు నేర్చుకుంటాను. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. అని వెంకటేష్ ఒక ఇంటర్వ్యూలో ఆయన గురించి చెప్పారు. మార్చిలో విక్టరీ వెంకటేష్‌ పెద్ద కూతురి వివాహం జైపూర్‌లో ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఆశ్రిత, వినాయక్‌లు పెళ్లి వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు. హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డి, ఆశ్రీతలు కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఇప్పుడు పెద్దల అంగీకారంతో ఈ ఇద్దరు ఒక్కటయ్యారు. విక్టరీ వెంకటేష్ చిన్ననాటి నుండే క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. ఇండియా మ్యాచులు స్వదేశంలో జరిగినా, విదేశాల్లో జరిగినా అస్సలు మిస్సవ్వడు. ఏకంగా క్రికెట్ స్టేడియంకు వెళ్లి మరీ మ్యాచులను చూస్తారు..అలాగే సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లోనూ చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. స్కూల్‌లో చదివేటప్పుడు ఏదో సరదాగా రమ్మంటే ‘ప్రేమనగర్‌’లో చేశానే తప్ప ఎప్పుడూ హీరోని కావాలని సినిమాల్లోకి రాలేదు. అమెరికా వెళ్లే ముందు నన్ను కొందరు సినిమాల్లో చేస్తావా? అని అడిగారు. అప్పటికి ఆసక్తి లేదు. కానీ ఇండియా తిరిగొచ్చాక వ్యాపారం చేద్దామని అనుకున్నా. కానీ నాన్నగారు రాఘవేంద్రరావు గారిని పిలిపించి ‘మా వాణ్ణి పరిచయం చేద్దాం’ అని చెప్పారు అలా సినిమాల్లోకి అడుగుపెట్టా అని వెంకటేష్ గారు ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు.

అవార్డ్స్

వెంకటేష్‌ ని నంది పురస్కారాలు ఏకంగా ఏడు సార్లు వరించాయి. ‘కలియుగ పాండవులు’కు బెస్ట్‌ మేల్‌ డెబ్యూగా ఒక నంది పురస్కారాన్ని, ‘స్వర్ణ కమలం’ సినిమాకి బెస్ట్‌ యాక్టర్‌ స్పెషల్‌ జ్యూరీగా మరొక నంది పురస్కారాన్ని, ‘ప్రేమ’, ‘ధర్మ చక్రం’, ‘గణేష్‌’, ‘కలిసుందాం రా’, ‘ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే’ చిత్రాలకు ఉత్తమ నటుడిగా నంది పురస్కారాలని అందుకొన్నారు. ‘గురు’ చిత్రానికి ఫిలింఫేర్‌ బెస్ట్‌ యాక్టర్‌ క్రిటిక్స్‌ పురస్కారాన్ని అందుకొన్నారు. 1988 బ్రహ్మపుత్రుడు చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా కిన్నెర పురస్కారం 1989 ప్రేమ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారలు ఇచ్చారు. 1990లో వచ్చిన బొబ్బిలి రాజా చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా సినీగోర్స్ పురస్కారం అందుకున్నారు. 1991 శత్రువు చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా భాగ్యనగర్ పురస్కారం ,1991 కూలీ నం. 1 చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా సినీగోయర్స్ పురస్కార అలాగే మద్రాస్ చిత్ర అభిమానుల పురస్కారం వచ్చింది. 1992 సుందరకాండ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా యువవాహిని పురస్కారం మరియు ఉత్తమ నటుడిగా సినీగోర్స్ పురస్కారం లభించింది. 1993లో అబ్బాయిగారు చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా కళాసాగర్ పురస్కారం, ఉత్తమ నటనకు సినీగోర్స్ పురస్కారం లభించింది.  1995 ధర్మచక్రం చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారం అలాగె ఉత్తమ నటుడిగా కళాసాగర్ పురస్కారం మరియు ఉత్తమ నటుడిగా వంశీ బర్కిలీ పురస్కారలతో సత్కరించారు. 1998 గణేష్ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారం అలాగే ఉత్తమ నటుడిగా కిన్నెర పురస్కారం లభించింది.

ఆయన ప్రస్తుతం f3 చిత్రంలో నటిస్తున్నారు ఎన్నో మధురమైన చిత్రాల్లో నటించి, మరెన్నో గొప్ప పాత్రలకు జీవం పోసిన విక్టరీ వెంకటేష్ గారు మరిన్ని చిత్రాలను ప్రేక్షకులకు అందించాలని మనస్పూర్తిగా కోరుకుందాం

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.