దళపతి విజయ్

నాయకుడు అంటే ముందుండి నడిపించేవాడు. కోట్లాది మందిని తన వైపుకు తిప్పుకునేవాడు. తన మార్గంలో నడిపించేవాడు. అలాంటి నాయకుడు తన తెలుగు హీరోల్లో చాలా మందే ఉన్నారు. అయితే తమిళనాడులో కూడా ఒక తిరుగులేని నాయకుడు ఉన్నాడు. తమిళ్ కాబట్టి నాయకుడు అనే కంటే దళపతి అంటే కరెక్ట్. కెరీర్ స్టార్టింగ్ లో అనామకుడిగా ఉండి, ఆ తర్వాత నెమ్మదిగా యువనాయకుడు అంటే ఇళయదళపతిగా మారి దాన్నుండి దళపతిగా మారి తమిళ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న నటుడు గురించి మనం ఇప్పుడు. చెప్పుకోబోతున్నాం  ఆ నటుడు మరెవరో కాదు. విజయ్ అలియాస్ జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్.

బ్యాక్ గ్రౌండ్ నుండి రావడం చాలా సింపుల్ విషయం. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సక్సెస్ అవ్వడమే ఇండస్ట్రీలో చాలా కష్టమైన విషయం అని అందరూ అనుకుంటారు. నిజమే. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో నెగ్గుకురావడం అనేది అంత సులువైన విషయమేం కాదు. అయితే బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా ఆ ఒత్తిడిని తట్టుకుని నిలబడి నెగ్గుకురావడం కూడా కత్తి మీద సాము లాంటిదే. బ్యాక్ గ్రౌండ్ ఉన్నంత మాత్రాన సక్సెస్ అవ్వాలని రూల్ ఏం లేదు. బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా ఫెయిల్ అయినవారు చాలా మందే ఉన్నారు.

ఇప్పుడు ఇంతకీ ఈ బ్యాక్ గ్రౌండ్ గురించి  ఎందుకింత చర్చ అంటే మన జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ అదేనండీ విజయ్ కూడా బ్యాక్ గ్రౌండ్ తోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అలాగని సక్సెస్ ఏం వెన్నంటి వచ్చేయలేదు. ఒక్కో మెట్టూ ఎక్కుతూ, కిందా మీదా పడుతూ, ఫెయిల్యూర్ వచ్చిన చోటే సక్సెస్ ను సాధించి విజయ్ ఈరోజు కేవలం తమిళ్ లోనే కాదు సౌత్ ఇండియాలోనే నెం 1 హీరోగా పేరు సంపాదించుకున్నాడు. ఇండియాలోనే సూపర్ ఫేమ్ ను సంపాదించుకున్నాడు. అసలు విజయ్ ప్రస్థానం ఎలా మొదలైంది? తన బాల్యం ఎలా గడిచింది. కెరీర్ ఎలా మొదలైంది. అందులో ఎదుర్కొన్న కష్టాలు ఏంటి? వంటి విషయాలు అన్నీ ఇప్పుడు తెలుసుకుందాం.

బాల్యం:

22 జూన్ 1974లో జన్మించాడు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ అలియాస్ విజయ్. ప్రస్తుతం తను ఏలుతున్న చెన్నైలోనే విజయ్ జన్మించాడు. విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ కోలీవుడ్ లో పేరున్న దర్శకుడు, రచయిత. తల్లి శోభ ప్రముఖ సింగర్, కర్నాటిక్ వొకలిస్ట్, రచయిత్రి. విజయ్ చిన్నప్పటి నుండి అందరు పిల్లల మాదిరిగానే చాలా యాక్టివ్ గా ఉండేవాడు. చాలా ఎక్కువగా అల్లరి చేసేవాడు. విజయ్ అల్లరి భరించలేకపోయేవారు. అయితే అనుకోకుండా విజయ్ చెల్లెలు విద్య రెండు సంవత్సరాల వయసులో కన్నుమూయడంతో విజయ్ జీవితం ఒక్కసారిగా స్తంభించిపోయింది. అప్పటిదాకా ఆడుకున్న చెల్లెలు ఇక లేదు అన్న నిజాన్ని విజయ్ ఆ వయసులోనే జీర్ణించుకోలేకపోయాడు. దీంతో విజయ్ చాలా కామ్ గా మారిపోయాడు. అసలు అల్లరి అన్నదే మర్చిపోయి స్తబ్దుగా ఉండిపోయాడు. విజయ్ బాల్యమంతా కూడా అలా కామ్ గానే గడిచిపోయింది. తన చెల్లెలును చాలా మిస్ అవుతాడు విజయ్.

ఇక విజయ్ చదువు విషయానికి వస్తే ప్రాధమిక విద్య అంతా కోడంబాక్కంలోని ఫాతిమా మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో జరిగింది. సెకండరీ విద్య బాలలోక్ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో పూర్తయింది. ఇక డిగ్రీ కోసం లొయోల కాలేజ్ లో విజువల్ కమ్యూనికేషన్స్ లో జాయిన్ అయ్యాడు. అయితే ఆ చదువు మధ్యలో ఉండగానే సినిమాల్లో నటించాలన్న కోరికతో ఇటువైపు వచ్చేసాడు విజయ్.

బాల నటుడు:

విజయ్ తండ్రి చంద్రశేఖర్ కోలీవుడ్ లో ప్రముఖ దర్శకులు. విజయ్ కు చిన్ననాటి నుండే నటనపై ఆసక్తి కలిగేలా చేసారు చంద్రశేఖర్. విజయ్ కు పదేళ్ల వయసులో సినీ అరంగేట్రం చేయించారు. వెట్రి అనే సినిమాలో విజయ్ కాంత్ హీరోగా తెరకెక్కించగా అందులో విజయ్ తొలిసారి స్క్రీన్ ముందు మెరిశాడు. మళ్ళీ అదే ఏడాది విజయ్ కాంత్ హీరోగానే తెరకెక్కిన కుడుంబమ్ అనే చిత్రంలో విజయ్ రెండోసారి బాలనటుడిగా కనిపించాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా 1985లో నాన్ సిగప్పు మనిద్దాన్ లో విజయ్ చిన్నప్పటి రజినీకాంత్ రోల్ లో కనిపించాడు. ఇక 1986లో అంటే విజయ్ కు పన్నెండేళ్ల వయసులో విజయ్ కాంత్ హీరోగానే తెరకెక్కిన వసంతరాగం సినిమాలో మరోసారి బాలనటుడిగా కనిపించాడు. అలాగే 1987లో సట్టం ఒరు విలయట్టు, 1988లో ఇతు ఎంగల్ నీతి చిత్రంలో కూడా విజయ్ నటించాడు. ఈ సినిమా చేసేనాటికి తనకు 14 సంవత్సరాలు. ఈ సినిమాలు అన్నిటికీ దర్శకుడు చంద్రశేఖర్ కావడం విశేషం.

తండ్రి చంద్రశేఖర్ కెరీర్:

విజయ్ తండ్రి చంద్రశేఖర్ కోలీవుడ్ లో విజయవంతమైన కెరీర్ ను కొనసాగించాడు. తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్లు సాధించాడు. ఎక్కువగా హీరో విజయ్ కాంత్ తో సినిమాలు తీసాడు చంద్రశేఖర్. తన కెరీర్ మొత్తంలో దాదాపు 70 సినిమాలకు పైగా పనిచేసాడు చంద్రశేఖర్. తెలుగులో కూడా ఈయన సినిమాలు చేయడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా పలు సినిమాలకు దర్శకత్వం వహించాడు చంద్రశేఖర్.  చట్టానికి కళ్ళు లేవు, పల్లెటూరి మొనగాడు వంటి సినిమాలు చిరంజీవితో తెరకెక్కించాడు. ఇంకా బలిదానం, దోపిడీ దొంగలు, దేవాంతకుడు వంటి చిత్రాలను తెరకెక్కించాడు. విజయ్ తో కూడా చంద్రశేఖర్ పలు సినిమాలను తెరకెక్కించాడు.

తమిళ్, తెలుగులోనే కాక కన్నడ, మలయాళంలో కూడా సినిమాలను తెరకెక్కించాడు చంద్రశేఖర్. విజయ్ కాంత్ తో ఎక్కువగా 19 సినిమాలను తెరకెక్కించిన చంద్రశేఖర్, తన కొడుకు విజయ్ తో 9 సినిమాలను తెరకెక్కించడం విశేషం.

విజయ్ సినీ ప్రస్థానం:

బాలనటుడిగా బోలెడంత అనుభవం సాధించిన విజయ్ 18 ఏళ్ల ప్రాయంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన తల్లి శోభ తన మొదటి చిత్రానికి కథ అందించడం విశేషం. తన తండ్రి చంద్రశేఖర్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను వివి క్రియేషన్స్ సంస్థపై తెరకెక్కించారు. వివి క్రియేషన్స్ లో వివి అంటే విజయ్, విద్య. చంద్రశేఖర్, శోభల ఇద్దరు పిల్లలు. విజయ్ మొదటి సినిమా నాళయ తీర్పుకు మంచి సినిమా అని పేరు అయితే వచ్చింది కానీ కమర్షియల్ గా విజయం సాధించడంలో మాత్రం విఫలమైంది ఈ సినిమా.

18 ఏళ్ల వయసులో చదువు మధ్యలో ఉండగానే విజయ్ తన తండ్రి వద్దకు వచ్చి సినిమాల్లో నటిస్తాను అని చెప్పగానే చంద్రశేఖర్ మొదట ఆలోచనలో పడ్డాడు. తన కొడుకే అయినా కూడా ఆడిషన్ చేయాలి అనుకున్నాడు. తన కొడుకుని నచ్చిన సన్నివేశంలో నటించి చూపించమన్నాడు. విజయ్ స్వతహాగా సూపర్ స్టార్ రజినీకాంత్ కు వీరాభిమాని. అప్పటికే అన్నామలై సినిమాను చాలా సార్లు చూసేసిన విజయ్, ఆ సినిమాలో ఒక కీలకమైన సన్నివేశాన్ని నటించి చూపించాడు. రజినీకాంత్, శరత్ బాబును ఛాలెంజ్ చేసే సన్నివేశాన్ని నటించాడు విజయ్. అచ్చు గుద్దినట్లు రజినీకాంత్ ను డైలాగ్ తో సహా దించేయడంతో అప్పుడే చంద్రశేఖర్ ఫిక్స్ అయిపోయాడు. విజయ్ సినిమాల్లోకి రావాల్సిందే అని. ఈ సినిమా ఫలితం గురించి చంద్రశేఖర్ తర్వాత స్పందిస్తూ 18 ఏళ్ల వయసులో విజయ్ మొదటి సినిమాగా దీన్ని ఎంచుకోకుండా ఉండాల్సింది. ఈ సినిమా కాన్సెప్ట్ సరైనదే. అయితే టైమింగ్ సరిగ్గా లేదు అని స్పందించాడు చంద్రశేఖర్.

విజయ్ తన రెండో సినిమా కూడా తన తండ్రి దర్శకత్వంలోనే నటించాడు. 1993లో సెందూరపాండి చిత్రంలో నటించాడు విజయ్. ఈ సినిమాలో విజయ్ కాంత్ కామియో పాత్రలో నటించాడు. విజయ్ సరసన యువరాణి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి కూడా విజయ్ తల్లి శోభ కథ అందించడం విశేషం. అయితే విజయ్ తో పాటు విజయ్ కాంత్ వంటి స్టార్ హీరోను నటింపజేసినా కూడా ఈ సినిమా అంతంతమాత్రంగానే ఆడింది. తొలి రెండు సినిమాలు ప్లాప్ అవ్వడంతో మూడో సినిమాకు మరింత జాగ్రత్త తీసుకున్నారు.

మూడో సినిమాకు కూడా విజయ్ తల్లిదండ్రులు పనిచేసారు. తన కొడుకును హీరోగా నిలబెట్టాలని తీవ్రంగా కృషి చేసారు. శోభ మరోసారి కథ అందించగా, చంద్రశేఖర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో విజయ్ సరసన సంఘవి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు క్రిటిక్స్ నుండి అంత పాజిటివ్ రెస్పాన్స్ అయితే రాలేదు కానీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ ను అందుకుంది. ఈ చిత్రం థియేటర్లలో 175 రోజులు ఆడటం విశేషం. ఈ చిత్రంతోనే విజయ్ కు ఇళయదళపతి అనే టైటిల్ తో క్రెడిట్ ఇవ్వడం విశేషం. మొత్తానికి మూడో సినిమాతో విజయ్ హీరోగా మాస్ హిట్ ను అందుకున్నాడు.

హీరోగా కెరీర్ మొదలుపెట్టిన తొలి మూడేళ్ళలో కేవలం మూడు సినిమాలు మాత్రమే చేసిన విజయ్ నాలుగో సంవత్సరం అంటే 1995లో మాత్రం నాలుగు సినిమాలను చేసాడు. మూడో సినిమా సూపర్ హిట్ కావడంతో విజయ్ - చంద్రశేఖర్ - శోభ కాంబినేషన్ నాలుగో సినిమాకు కూడా రిపీట్ అయింది. 1995లో విడుదలైన దేవా కూడా మాస్ హిట్ గా నిలిచింది. అదే ఏడాది విడుదలైన రాజావిన్ పార్వైలై చిత్రంలో విజయ్ తో పాటు అజిత్ కూడా నటించాడు. ప్రస్తుతం కోలీవుడ్ లో టాప్ హీరోలుగా నిలిచిన విజయ్, అజిత్ కలిసి నటించిన ఒకే ఒక్క సినిమా ఇది. తొలిసారి తన తండ్రి దర్శకత్వంలో కాకుండా వేరే వారితో కలిసి పనిచేసాడు విజయ్. జానకి సౌందర్ ఈ సినిమాను తెరకెక్కించాడు.

విజయ్ మధ్యలో బ్రేక్ ఇచ్చినా కానీ మళ్ళీ శోభ ఇచ్చిన కథతో తన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వంలో విష్ణు సినిమాలో నటించాడు విజయ్. అదే ఏడాది చివర్లో నంబిరాజన్ దర్శకత్వంలో చంద్రలేఖ అనే రొమాంటిక్ ట్రాజెడీ చిత్రంలో నటించాడు విజయ్. ఈ సినిమాలో హీరో, హీరోయిన్లు ఇద్దరూ చనిపోతారు. పైగా ఈ సినిమా రజినీకాంత్ ముత్తుతో తలపడడంతో ఎబోవ్ యావరేజ్ గా ఆడింది.

తర్వాత ఏడాది సంక్రాంతికి సి. రంగనాథన్ దర్శకత్వంలో కోయంబత్తూర్ మాపిళ్ళై చిత్రంలో నటించాడు విజయ్. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఈ సినిమాతోనే విజయ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇళయదళపతి అనే టైటిల్ కు సార్ధకత ఏర్పడింది. విజయ్ కంటూ మంచి మార్కెట్ ఏర్పడింది ఈ చిత్రంతోనే.

అదే ఏడాది విజయ్ నుండి మరో నాలుగు సినిమాలు వచ్చాయి. అవి పూవే ఉన్నక్కాగ, వసంత వాసల్, మాంబుమిగు మానవన్, సెల్వ. వీటిలో పూవే ఉన్నక్కాగ చిత్రం విజయ్ లోని నటుడ్ని మరోసారి అందరికీ పరిచయం చేసింది. ఈ సినిమాతో నటుడిగా విజయ్ మరో మెట్టు ఎక్కేసాడు. విక్రమన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా విజయ్ సరసన సంగీత హీరోయిన్ గా నటించింది. ఈ సినిమానే తెలుగులో జగపతి బాబు హీరోగా శుభాకాంక్షలు పేరుతో రీమేక్ అయింది. తెలుగులో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. పూవే ఉన్నక్కాగ తమిళనాడులో 300 రోజులు ఆడి రికార్డులను సృష్టించింది.

వసంత వాసల్ కూడా డీసెంట్ విజయాన్ని అందుకుంది. ఏ. వెంకటేష్ దర్శకత్వంలో వచ్చిన సెల్వ సినిమా కమర్షియల్ విజయాన్ని సాధించింది. 1996లోనే ఈ చిత్రం 20 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసి విజయ్ స్టామినాను అందరికీ తెలియజేసింది. 96లో విజయ్ స్టార్ హీరోగా స్థిరపడిపోయాడు.

1997లో విజయ్ గ్రాఫ్ మరింతగా ఎదిగింది. ఈ ఏడాది కాలమెల్లమ్ కాతిరుప్పేన్, లవ్ టుడే, వన్స్ మోర్, నేరుక్కు నేర్, కాదలుక్కు మరియాదై వంటి చిత్రాల్లో నటించింది. ముందుగా నేరుక్కు నేర్ గురించి చెప్పుకుంటే ఈ సినిమా అనుకున్నంతగా విజయం సాధించలేదు. కానీ ఈ సినిమాలో విజయ్, సూర్యతో కలిసి తొలిసారి నటించాడు. సూర్యకు ఇదే తొలి సినిమా కావడం విశేషం. కాదలుక్కు మరియాదై కమర్షియల్ గా మంచి విజయం సాధించింది. ఫాజిల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మొదట ఈ సినిమాకు అబ్బాస్ ను అనుకున్నారు కానీ అప్పుడు అబ్బాస్ చాలా బిజీగా ఉండడం వల్ల డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయాడు. ఇక ఆ అవకాశం విజయ్ కు దక్కింది. దాన్ని రెండు చేతులా ఉపయోగించుకున్నాడు విజయ్. ఈ సినిమాలో పెర్ఫార్మన్స్ వల్ల విజయ్ కు తమిళనాడు స్టేట్ అవార్డు కూడా దక్కడం విశేషం.

ఈ సంవత్సరమే వాళ్ళ నాన్న ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వంలో వన్స్ మోర్ చిత్రంలో మరోసారి నటించాడు విజయ్. ఈ సినిమాతో జెమినీ గణేశన్ తో కూడా విజయ్ స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం. ఈ సినిమాను తెలుగులో డాడీ డాడీ పేరుతో రీమేక్ చేసారు. ఈ చిత్రం యావరేజ్ గా ఆడింది. అదే ఏడాది వచ్చిన లవ్ టుడే రొమాంటిక్ డ్రామా జోనర్ లో బెస్ట్ హిట్ గా నిలిచింది. బాలశేఖరన్ ఈ సినిమాను డైరెక్ట్ చేసాడు. ఈ చిత్రం చాలా కేంద్రాల్లో 150 రోజులకు పైగా ఆడి మంచి విజయం సాధించింది. తెలుగులో ఈ చిత్రం సుస్వాగతం పేరుతో రీమేక్ అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. తెలుగులో ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

1998 సంవత్సరం విజయ్ నటించిన మూడు చిత్రాలు విడుదలయ్యాయి. అవి నినైతేన్ వందాల్, ప్రియముడన్, నిలవే వా. వీటిలో ప్రియముడన్ మంచి విజయం సాధించింది. ఈ సినిమాను తెలుగులో ప్రేమించే మనసు టైటిల్ తో రీమేక్ చేసారు. తెలుగులో ఈ చిత్రం అంతగా ఆడలేదు. తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన రాఘవేంద్ర రావు సినిమా పెళ్లి సందడి చిత్రాన్ని నినైతేన్ వందాల్ పేరుతో రీమేక్ చేయగా తమిళ్ లో కూడా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.

1999వ సంవత్సరం మొదటగా ప్రస్తావించుకోవాల్సింది థుల్లదా మానముమ్ తుళ్ళుమ్ చిత్రం. ఎజ్హిల్ అనే నూతన దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం మంచి హిట్ సాధించింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. విజయ్ కు మరోసారి తమిళనాడు స్టేట్ అవార్డు వరించింది. అలాగే ఎంజీఆర్ గౌరవ పురస్కారం కూడా విజయ్ ను వరించింది. ఈ సినిమా  ద్వారా టాప్ లీగ్ లోకి చేరిపోయాడు విజయ్. ఈ చిత్రమే తెలుగులో నాగార్జున హీరోగా నువ్వు వస్తావని పేరిట రీమేక్ అయింది. ఎస్ఏ రాజ్ కుమార్ అందించిన పాటలు ఇప్పటికీ శ్రోతలను అలరిస్తాయి.

ఇదే సంవత్సరం మిన్సారా కన్న చిత్రం బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మన్స్ కంటే కూడా వివాదాలతో ఎక్కువగా వార్తల్లోకి వచ్చింది. ఒక థియేటర్లో సినిమా ప్రదర్శింపబడుతుండగా వీడియో రికార్డింగ్ ఎక్విప్మెంట్ దొరకడం, అది కె బాలచందర్ కంపెనీకి చెందింది కావడంతో విజయ్ తండ్రి చంద్రశేఖర్ రంగంలోకి దిగారు. బాలచందర్ కావాలనే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. అయితే చంద్రశేఖర్ తనను మానసికంగా హింసిస్తున్నారని అందుకే FEFSI ప్రెసిడెంట్ పదవికి బాలచందర్ రాజీనామా చేసారు. ఈ విషయంపై ఫిల్మ్ ఇండస్ట్రీ సభ్యులు ముందుకు వచ్చి విజయ్ మీద అనధికారికంగా బ్యాన్ విధించారు. అయితే ఈ సందర్భంలో విజయ్ కు పాజిటివ్ గా హీరో అజిత్ మాట్లాడారు. ఆ తర్వాత ఇరు వర్గాల మధ్య రాజీ కుదిరి బాలచందర్ రాజీనామా వెనక్కి తీసుకోవడానికి ఒప్పుకున్నారు.

కొత్త మిలీనియంలో విడుదలైన మొదటి తమిళ చిత్రం కన్నుక్కుళ్ నిలవు మంచి ఆరంభాన్ని ఇచ్చింది. ఈ సినిమాకు ఫాజిల్ డైరెక్ట్ చేయగా భిన్నమైన ప్రేమ కథగా గుర్తింపు తెచ్చుకుని సూపర్ హిట్ గా నిలిచింది.

ఇదే 2000వ సంవత్సరం విజయ్ కు బాగా కలిసొచ్చింది. జ్యోతిక హీరోయిన్ గా ఎస్జె సూర్య దర్శకత్వంలో రూపొందిన ఖుషి మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇదే టైటిల్ తో తెలుగులో పవన్ కళ్యాణ్ రీమేక్ చేసాడు. పవన్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచింది ఖుషి. తమిళ్ లో విజయ్, జ్యోతికల మధ్య కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

1996లో వెంకటేష్, సౌందర్యలు ప్రధాన పాత్రల్లో తెలుగులో వచ్చిన పవిత్ర బంధం చిత్రాన్ని 2000వ సంవత్సరంలో విజయ్, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించారు. తెలుగులో లానే తమిళ్ లో కూడా ఈ సినిమా సూపర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ రకంగా 2000వ సంవత్సరం విజయ్ కు బాగా కలిసొచ్చింది. మూడింటికి మూడు సూపర్ హిట్స్ తో విజయ్ హ్యాట్రిక్ ను సొంతం చేసుకుని తిరుగులేని హీరోగా అవతరించాడు. యువతరం హీరోల్లో చాలా ప్రామిసింగ్ గా కనిపించాడు.

2001లో ఫ్రెండ్స్ చిత్రం ద్వారా మరోసారి సూర్యతో కలిసి నటించాడు విజయ్. ఈ సినిమా యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇక ఇదే సంవత్సరం ఆ తర్వాత వచ్చిన బద్రి మాస్ యూత్ లో విజయ్ స్థానాన్ని సుస్థిరం చేసింది. తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన సూపర్ డూపర్ హిట్ చిత్రం తమ్ముడు చిత్రానికి రీమేక్ ఇది. తెలుగులో డైరెక్ట్ చేసిన అరుణ్ ప్రసాద్ తమిళ్ లో కూడా తెరకెక్కించాడు. 2001లోనే వచ్చిన షాజహాన్ చిత్రం ట్రాజెడీ ఎండింగ్ ఉన్నా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

2002లో వచ్చిన తమిళన్ విజయ్ కు యావరేజ్ విజయాన్ని అందించింది. అయితే ఈ చిత్రానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే బాలీవుడ్ టాప్ నటి, ఇప్పుడు హాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తోన్న ప్రియాంక చోప్రా ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయింది. విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన చిరునవ్వుతో చిత్రాన్ని యూత్ పేరుతో రీమేక్ చేసాడు విజయ్. అప్పటికే రొమాంటిక్ సినిమాల్లో ఆరితేరిపోయిన విజయ్ ఈ సినిమాను చాలా సులువుగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ చిత్రం కూడా విజయ్ ఖాతాలో మరో విజయాన్ని అందించింది.

ఇలా విజయ్ తన కెరీర్ లో జైత్రయాత్రను కొనసాగించాడు. తన కెరీర్ లో ఎక్కువగా రీమేక్స్ చేసిన విజయ్ వాటితో ఎక్కువగా విజయాలనే అందుకోవడం విశేషం. తెలుగులో క్లాసిక్ హిట్ గా నిలిచిన నువ్వు నాకు నచ్చావ్ చిత్రాన్ని తమిళ్ లో వసిగర పేరుతో రీమేక్ చేయగా తమిళ్ లో కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. 2003లో వచ్చిన తిరుమలై చిత్రం ద్వారా విజయ్ మరోసారి మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు.

2004లో వచ్చిన ఘిల్లి విజయ్ కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమాకు రీమేక్ ఈ ఘిల్లి. ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష నటించగా ధరణి రీమేక్ చేసాడు. విజయ్ కెరీర్ లో మాత్రమే కాకుండా అప్పటిదాకా ఉన్న కోలీవుడ్ రికార్డ్స్ అన్నిటినీ బ్రేక్ చేసింది ఈ సినిమా. ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 50 కోట్ల షేర్ మార్క్ ను దాటింది ఈ చిత్రం. ఘిల్లి చిత్రం మాస్ ఆడియెన్స్ లో విజయ్ స్థానాన్ని పదిలం చేసిందనే చెప్పాలి. అదే సంవత్సరం వచ్చిన మధురేయ్ విజయ్ కెరీర్ లో మరో హిట్ గా నిలిచింది.

2005లో వచ్చిన తిరుప్పాచ్చి విజయ్ కు మరో మాస్ హిట్ ను అందించింది. కెరీర్ మొదట్లో లవ్, రొమాంటిక్ సినిమాలతోనే గుర్తింపు తెచ్చుకున్న విజయ్, ఆ తర్వాత పూర్తిగా మాస్ రోల్స్ వైపు మారిపోయాడు. ఈ సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్ అన్నవరం పేరుతో రీమేక్ చేసాడు. ఇదే సంవత్సరం రవి కృష్ణ హీరోగా తన తండ్రి చంద్రశేఖర్ తెరకెక్కించిన శుక్రాన్ చిత్రంలో విజయ్ కామియో పాత్రలో నటించాడు. ఇదే సినిమాలో విజయ్ చెల్లి విద్య ఫోటోను వాడటం విశేషం. 2005లోనే సచేయిఁ చిత్రంలో నటించాడు విజయ్. ఈ సినిమా ద్వారా బిపాషా బసు కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఇదే ఏడాది వచ్చిన శివకాశి విజయంతో ఆ సంవత్సరాన్ని ఒక హై తో ముగించాడు విజయ్.

2006లో తెలుగులో సూపర్ హిట్ అయిన అతనొక్కడే చిత్రాన్ని రీమేక్ చేసాడు విజయ్. ఎస్ఏ చంద్రశేఖర్ ఈ సినిమాను డైరెక్ట్ చేసాడు. అయితే ఒరిజినల్ వెర్షన్ మంచి విజయం సాధించగా దీని రీమేక్ వెర్షన్ యావరేజ్ గా నిలిచింది. 2007లో విజయ్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ విజయం వచ్చి చేరింది. ఒక్కడు సినిమా ఘిల్లితో ఇండస్ట్రీ హిట్ ను అందుకున్న విజయ్ మరోసారి మహేష్ సినిమాను రీమేక్ చేసాడు. తెలుగులో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన పోకిరి చిత్రాన్ని పోక్కిరి పేరుతో రీమేక్ చేసాడు. పోక్కిరి దాదాపు 200 రోజులు విజయవంతంగా ప్రదర్శింపబడి హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

అళగియ తమిళ్ మగన్ అనే చిత్రంలో తొలిసారి విజయ్ హీరోగా,విలన్ గా డ్యూయల్ రోల్ లో నటించాడు. అయితే ఆ ప్రత్యేకత తప్పితే ఈ సినిమా ప్రత్యేకంగా సాధించింది ఏం లేదు. బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ ఫలితాన్ని అందుకుంది. 2008లో ధరణి దర్శకత్వంలో విజయ్ నటించిన కురువి యాక్షన్ డ్రామాగా మంచి విజయాన్ని అందుకుంది.

2009 నుండి 2011 మధ్య కాలంలో విజయ్ విల్లు, వేట్టైక్కారన్, సురా, కావలన్, వేలాయుధం చిత్రాల్లో నటించాడు. 2012లో తొలిసారి శంకర్ దర్శకత్వంలో విజయ్ నటించాడు. హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన 3 ఇడియట్స్ ను తమిళ్ లో నన్బన్ పేరుతో రీమేక్ చేసాడు శంకర్. తమిళ్ లో ఈ చిత్రం కొత్త రికార్డులను తిరగరాసింది. అదే సంవత్సరం మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ నటించాడు. తుపాకీ పేరిట వచ్చిన ఈ సినిమా కోలీవుడ్ లో చాలా పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా తెలుగులోకి డబ్ అయింది. విజయ్ కు తొలిసారి తెలుగులో మార్కెట్ ను ఓపెన్ చేసిన చిత్రంగా నిలిచింది తుపాకీ. ఈ సినిమా తర్వాతి నుండి విజయ్ చిత్రాలు క్రమం తప్పకుండా తెలుగులోకి కూడా డబ్ అవ్వడం మొదలుపెట్టాయి.

ఏఎల్ విజయ్ దర్శకత్వంలో వచ్చిన తలైవా చిత్రం రాజకీయ అనిశ్చితిలో చిక్కుకుంది. తమిళనాడు ప్రభుత్వం కావాలనే సినిమా విడుదలను అడ్డుకుంది అని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ సినిమాను తెలుగులో అన్న పేరుతో డబ్ చేయగా యావరేజ్ ఫలితాన్ని అందుకుంది. తమిళ్ లో విడుదల డిలే కావడం వల్ల అది బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మన్స్ పై ప్రభావం చూపించింది. ఆయినా కానీ ఈ చిత్రం పలు రికార్డులను బ్రేక్ చేసిందనే చెప్పాలి.

విజయ్ సినిమాల మార్కెట్ తో పాటు బడ్జెట్ కూడా పెరుగుతూ వచ్చాయి. అందుకే ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేసే విజయ్ తుపాకీ తర్వాత నుండి ఏడాదికి ఒక్క సినిమానే చేయడం మొదలుపెట్టాడు. తలైవా చిత్రం తర్వాత మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో కలిసి పనిచేసాడు విజయ్. నీసన్ జిల్లా చిత్రాన్ని డైరెక్ట్ చేయగా అది తమిళనాడులో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ ను వెంటనే విడుదల చేయలేదు. ఎందుకంటే ఈ చిత్ర రీమేక్ పై చిరంజీవి దృష్టి పెట్టాడు. తాను, రామ్ చరణ్ హీరోలుగా ఈ సినిమా చేద్దామని భావించాడు. అయితే అది ఎందుకో వర్కౌట్ అవ్వలేదు. తర్వాత నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ వద్దకు ఈ సినిమా రీమేక్ వెళ్ళింది. వాళ్ళు కూడా ఆసక్తి చూపలేదు. నందమూరి కళ్యాణ్ రామ్, బాలయ్యతో రీమేక్ చేద్దామని ప్రయత్నించి విఫలమయ్యాడు. చివరికి దర్శకుడు వీరు పోట్ల రవితేజ, వెంకటేష్ లతో జిల్లా రీమేక్ పనులు ప్రారంభించాడు కానీ ఏమైందో తెలీదు ఆ ప్రాజెక్ట్ అక్కడే నిలిచిపోయింది. చివరికి జిల్లా చిత్రాన్ని అదే పేరుతొ తెలుగులోకి డబ్ చేసారు.

తుపాకీతో మంచి విజయాన్ని అందుకున్న విజయ్, మురుగదాస్ తో మరోసారి కలిసి కత్తి చిత్రాన్ని చేసాడు. రైతుల సమస్యలు, తాగు నీటి కష్టాల నేపథ్యంలో రూపొందిన కత్తి ఎమోషనల్ డ్రామాగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం దాదాపు 130 కోట్ల రూపాయలను వసూలు చేయడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి తన రీఎంట్రీ కోసం 150వ చిత్రంగా ఈ సినిమాను ఖైదీ నెం 150 పేరుతో రీమేక్ చేయగా ఈ సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది.

2015లో చింబుదేవన్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో విజయ్ చేసిన పులి చిత్రం దారుణంగా ప్లాప్ అయింది. ఈ సినిమా ద్వారా భారీ నష్టాలు వచ్చాయి. వరస విజయాలతో మంచి ఊపు మీద ఉన్న విజయ్ కు ఈ సినిమా ఒక స్పీడ్ బ్రేకర్ అనే చెప్పాలి. అయితే దాని తర్వాతి సంవత్సరమే అదిరిపోయే విజయంతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు విజయ్.

రెండు డిఫరెంట్ షేడ్స్ లో విజయ్ నటించిన తేరి సినిమా అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా విజయ్ నటనను అంత త్వరగా ఎవరూ మరచిపోలేము. ఈ సినిమా పోలీసోడు పేరుతో తెలుగులోకి డబ్ అయింది. డీసెంట్ సక్సెస్ ను సాధించింది. ఆ తర్వాతి ఏడాది వచ్చిన భైరవ చిత్రానికి యావరేజ్ రేటింగులు వచ్చాయి కానీ బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ గా పెర్ఫర్మ్ చేసింది.

అదే ఏడాది మరోసారి అట్లీ దర్శకత్వంలో విజయ్ మరోసారి నటించాడు. మెర్సల్ టైటిల్ తో విడుదలైన ఈ సినిమాలో విజయ్ ట్రిపుల్ రోల్ పోషించాడు. తెలుగులో ఈ సినిమా అదిరింది పేరుతొ విడుదలై సూపర్ హిట్ ను సాధించింది. మెర్సల్ సినిమాలో విజయ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. మెర్సల్ తర్వాత మూడోసారి మురుగదాస్ దర్శకత్వంలో సర్కార్ చిత్రంలో నటించాడు విజయ్. ఈ సినిమా ఎన్నికల మీద, ప్రభుత్వం మీద వ్యంగ్యాస్త్రంలా అనిపిస్తుంది. తమిళ్ లో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచినా తెలుగులో మాత్రం యావరేజ్ సక్సెస్ తోనే సరిపెట్టుకుంది.

2019లో విజయ్ ఫుట్ బాల్ నేపథ్యంలో చేసిన బిగిల్, తెలుగులో విజిల్ పేరుతో విడుదలైంది. మూడోసారి అట్లీతో టీమప్ అయ్యాడు విజయ్. తండ్రీ కొడుకులుగా విజయ్ ఎమోషనల్ నటనకు ఫ్యాన్స్ నుండి నీరాజనాలు అందుకున్నాడు. కోలీవుడ్ చరిత్రలోనే బిగిల్ రికార్డు కలెక్షన్స్ ను సాధించింది. ఇక 2020లో విడుదల కావాల్సిన మాస్టర్ కోవిద్ కారణంగా 2021 సంక్రాంతికి విడుదలైంది. ఈ సినిమా థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రం నడిచినా కానీ అద్భుతమైన కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. తెలుగులో ఈ చిత్రం 10 కోట్ల షేర్ ను మించి వసూలు చేసింది. విజయ్ మార్కెట్ ఇప్పుడు తెలుగులో పదిలం. విజయ్ ఇప్పటివరకూ 64 సినిమాల్లో నటించాడు.

అవార్డ్స్:

* ఆర్ట్స్ రంగంలో ఇచ్చే అత్యుత్తమ తమిళనాడు రాష్ట్ర పురస్కారం కలైమామణి ని 1998వ సంవత్సరంలోనే సొంతం చేసుకున్నాడు విజయ్.

* డా! ఎంజీఆర్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 2007వ సంవత్సరంలో గౌరవ డాక్టరేట్ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది.

* 2018లో మెర్సల్ చిత్రానికి గాను నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ యూకేకు నామినేట్ అయ్యాడు.

* కాదలుక్కు మరియాదై చిత్రానికి తమిళనాడు రాష్ట్ర ఫిలిం అవార్డును సొంతం చేసుకున్నాడు.

* 2000వ సంవత్సరంలో ప్రతిష్టాత్మక ఎంజీఆర్ అవార్డును అందుకున్నాడు విజయ్.

* పొక్కిరి, వేట్టైకరన్, మెర్సల్, కత్తి, జిల్లా, తలైవా వంటి సినిమాలకు విజయ్ అవార్డ్స్ ను సొంతం చేసుకున్నాడు.

* తేరి చిత్రానికి అత్యుతమ ఎంటర్టైనర్ గా సైమా పురస్కారాన్ని అందుకున్నాడు.

* తేరి, మెర్సల్, సర్కార్ సినిమాలకు ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డ్స్ ను గెలుచుకున్నాడు.

వ్యక్తిగత జీవితం:

విజయ్ తన ఫ్యాన్ అయిన సంగీత సోర్ణలింగంను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. యూకేలో సంగీతను చూసిన విజయ్ ప్రేమలో పడ్డాడు. ఆమెది శ్రీలంక. 25 ఆగస్ట్ 1999న విజయ్, సంగీతల వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. కొడుకు జేసన్ సంజయ్ 2000వ సంవత్సరంలో లండన్ లో జన్మించగా, కూతురు దివ్య షాషా 2005లో చెన్నైలో జన్మించింది. జేసన్ 2009లో వచ్చిన వేట్టైకారన్ చిత్రంలో బాల నటుడిగా మొదటిసారి కనిపించాడు. తేరి చిత్రంలో దివ్య, విజయ్ కూతురి పాత్రలో కనిపించింది. ప్రస్తుతం జేసన్ సంజయ్ సినిమాల్లోకి రావడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు.

సంక్షేమ కార్యక్రమాలు:

2007 జూన్ 22న తన పుట్టినరోజు సందర్భంగా ఎగ్మోర్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో పుట్టిన పిల్లలకు బంగారపు ఉంగరాలు బహూకరించాడు విజయ్. అలానే 2008 సూర్య అగరం ఫౌండేషన్ కు మద్దతుగా హీరోవా, జీరోవా అనే షార్ట్ ఫిల్మ్ లో నటించాడు. ఈ షార్ట్ ఫిలింలో జ్యోతిక, మాధవన్ కూడా సూర్య, విజయ్ లతో కలిసి నటించారు. 2008లో శ్రీలంకన్ సివిల్ వార్ సందర్భంగా శ్రీలంక తమిళులకు మద్దతుగా పలుమార్లు నిరాహార దీక్షలో పాల్గొన్నాడు విజయ్.

విజయ్ మక్కల్ ఇయక్కం అనే సంస్థను స్థాపించి పలు సామాజిక కార్యక్రమాలలో పాలు పంచుకున్నాడు. థానే సైక్లోన్ ద్వారా నష్టపోయిన వారికి ఈ సంస్థ ద్వారా విజయ్ తనదైన సహాయాన్ని అందించాడు. 2017లో జల్లికట్టుకు మద్దతుగా విజయ్ తన గొంతును వినిపించాడు. అదే సంవత్సరం విజయ్ మక్కల్ ఇయక్కం వెబ్ సైట్ ను ప్రారంభించి తన ఫ్యాన్స్ ను ఒకతాటిపైకి తీసుకొచ్చాడు. దీని ద్వారా సామాజిక కార్యక్రమాలు మరింత ఎక్కువగా చేయించవచ్చని భావించాడు విజయ్. స్టెర్లైట్ కాపర్ ప్లాంట్ కు వ్యతిరేకంగా పోరాటం చేసిన తూత్తుకుడి బాధితులకు అండగా నిలిచాడు విజయ్. ఇవే కాకుండా జాతీయ విపత్తులు ఏవి సంభవించినా తన వంతుగా ఎన్నోసార్లు ఆర్ధిక సహాయాన్ని అందించాడు విజయ్. అందుకే విజయ్ అంటే తమిళనాడులోనే కాక ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల కోట్లాది మంది అభిమానులున్నారు.

తమిళనాడులో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ స్థాయికి చేరుకున్న విజయ్, కేవలం బ్యాక్ గ్రౌండ్ వల్లే ఇదంతా సాధించాడని చెప్పగలమా? తన సక్సెస్ లో తన కష్టం ఎంతో ఉంది. ఎన్నోసార్లు పడి లేచాడు విజయ్. తన సినిమాల్లో కాన్సెప్ట్ లు ఎక్కువగా ప్రభుత్వాన్ని విమర్శించేలా ఉండడంతో ప్రభుత్వం నుండే తన సినిమాలను విడుదల చేసుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఏదేమైనా విజయ్ అంటే ఇప్పుడు ఒక పేరు మాత్రమే కాదు. అది ఒక బ్రాండ్. మున్ముందు విజయ్ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుందాం.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.