నడిప్పిన్ నాయగన్... సూర్య శివకుమార్

సూర్య శివకుమార్ షార్ట్ గా సూర్య, విభిన్నమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ఉంటే అది కచ్చితంగా సూర్య అనే చెప్పవచ్చేమో. తన కెరీర్ లో ఎన్నో రకాల పాత్రలను, బోలెడన్ని జోనర్ లను టచ్ చేసారు సూర్య. తమిళ్ లోనే సూర్య సినీ ప్రయాణం మొదలైనా కానీ సూర్య తెలుగులో స్టార్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈరోజు తమిళ్ తో దాదాపు సమానంగా తెలుగులో కూడా క్రేజ్ తెచ్చుకున్న అతి కొద్దిమంది హీరోల్లో కచ్చితంగా సూర్య పేరు ముందు వరసలో ఉంటుంది.

సూర్య కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలను చూసాడు, ఎన్నో అవార్డులు, సత్కారాలు అందుకున్నాడు. సూర్యకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ అమ్మాయిల మనసు దోచిన స్టార్ హీరో సూర్య. పెర్ఫెక్ట్ హస్బెండ్ మెటీరియల్. ఇలా సూర్య గురించి క్వాలిటీస్ చెప్పుకోవాలంటే వాటికి అంతు ఉండదేమో. మరి కెరీర్ లో పీక్స్ ను చూస్తోన్న సూర్య అసలు ఎవరు? ఆయన నేపధ్యమేంటి? ఆయన సినిమాల్లోకి ఎంట్రీ ఎలా ఇచ్చారు? ఎలా స్టార్ గా ఎదిగారు? మధ్యలో ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి? వంటి ప్రశ్నలకు, సూర్య గురించిన మరింత సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

బాల్యం:

1975 జులై 23న జన్మించారు శరవణన్ శివకుమార్. అయితే శరవణన్ శివ కుమార్ - సూర్య శివ కుమార్ గా ఎలా మారారు అన్నది తర్వాత చూద్దాం. శివ కుమార్, లక్ష్మి దంపతులకు జన్మించారు శరవణన్. శివ కుమార్ నటుడు. ఆయన సినిమాలతో పాటు ఎక్కువగా తమిళ సీరియల్స్ లో నటించేవారు. కాబట్టి శరవణన్ చిన్నప్పటి నుండి సినిమా వాతావరణం ఉండేది. శరవణన్ బేసిగ్గా చాలా సిగ్గరి. బయట ఎవరితోనూ అంత త్వరగా కలిసేవారు కారు. అలా అని ఇంట్లో కూడా సిగ్గే అనుకుంటే మన పొరబాటే. ఎందుకంటే సూర్య తర్వాత శివకుమార్, లక్ష్మి దంపతులకు ఇద్దరు సంతానం. ఒకరు కార్తీక్,  మరొకరు బృంద.

బృంద, శరవణన్ కంటే ఐదేళ్లు చిన్నది అవ్వడంతో సూర్య తన పెత్తనం మొత్తం తమ్ముడు కార్తీ పైనే చూపించేవాడు. దానికంటే ముందు సూర్య చదువు గురించి తెలుసుకుంటే... తన ప్రాథమిక విద్య మొత్తం పద్మ శేషాద్రి బాల భవన్ స్కూల్ లో జరిగింది. ఇక సెకండరీ విద్య సెయింట్ బెడ్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో జరిగింది. చెన్నైలోనే సూర్య విద్య మొత్తం సాగింది. ఇక ఇంటర్ తర్వాత సూర్య బికామ్ చేరారు. చెన్నైలోనే ఫేమస్ లొయోల కాలేజ్ లో సాగింది. చిన్నప్పటి నుండి సూర్య చదువులో కొంచెం వీకే. సబ్జెక్ట్స్ ఫెయిల్ అవ్వడం జరుగుతూ ఉండేది.

మరో పక్క సూర్య తమ్ముడు కార్తీకు మంచి మార్కులు వస్తుండేవి. అలాగే చిన్నప్పటి నుండి కార్తీకి హీరోలా తయారవ్వడం అంటే ఇష్టం. సూర్య మాత్రం నాకు అంత సీన్ లేదు అన్న తరహాలో ఉండేవాడు. సూర్య పెద్దవాడు కాబట్టి బృంద, కార్తీలపై ఆధిపత్యం చెలాయించేవాడు. చిన్నప్పుడు కచ్చితంగా ఎక్కువగా దొంగ-పోలీస్ ఆట ఆడుకునేవారు. అందులో సూర్య ఎప్పుడూ పోలీస్, కార్తీ ఎప్పుడూ దొంగ. సూర్య పెద్దవాడు కాబట్టి కార్తీ మరోమాట లేకుండా అలాగే చేసేవాడు. అయితే ఆటలో కార్తీ దొరికిపోయాక సూర్య బాగా కొట్టేవాడు. అసలు అందుకనే దొంగ-పోలీస్ ఆట ఆడేవాడు సూర్య.

ఇక ఒకసారి కాలేజ్ స్థాయిలో కార్తీకి మంచి మార్కులు వచ్చాయని బైక్ గిఫ్ట్ గా ఇచ్చారు ఆయన మావయ్య. సూర్య దాదాపు అన్ని సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అవ్వడంతో తనకు బైక్ ఇవ్వలేదు. సూర్య కాలేజ్ ఏమో చాలా దూరం. అందుకని కార్తీ దగ్గర బైక్ లాగేసుకున్నాడు. తనకన్నా చిన్నవాడికి బైక్ ఏంటని సూర్య ఇక్కడా బాసిజం చూపించాడు. ఆ రకంగా కార్తీపై చిన్నప్పటి నుండి ఆధిపత్యం చేయలించాడు సూర్య. అలాగే చదువుకునే రోజుల్లో సూర్యకు ఒక అలవాటు ఉండేది. శుక్రవారం వేసుకునే షర్ట్ ను సోమవారం వరకూ స్నానం కూడా చేయకుండా అదే షర్ట్ తో ఉండిపోయాడు సూర్య. చిన్నప్పుడు ఆటలను బాగా ఎంజాయ్ చేసేవాడు.

ఇప్పటి తన పిల్లల పరిస్థితిని పోల్చుకుని సూర్య బాధపడ్డాడు. "ఇప్పటి పిల్లలకు కనీసం పక్క ఇంట్లో ఉండే పిల్లలు కూడా తెలీదు. ఇక గ్రౌండ్స్ సంగతి సరే సరి. మా కాలంలో అలా కాదు. వీకెండ్ మొత్తం గ్రౌండ్స్ లోనే గడిచిపోయేది. చుట్టుపక్కల వాళ్ళతో కలిసిపోయి ఆడుకునే వాళ్ళం" అని ఒక ఇంటర్వ్యూలో జాలి పడ్డాడు.

ఇక సూర్య గ్రాడ్యుయేషన్ ఎలాగోలా మొత్తానికి పూర్తి చేసాడు. జస్ట్ పాస్ మార్కులు వచ్చాయి. అయితే తన కొడుకు గ్రాడ్యుయేషన్ పాస్ అవ్వడంతో శివకుమార్ ఆనందానికి అవధుల్లేవు. తన కొడుకు డిగ్రీ సర్టిఫికెట్ పట్టుకుని సంతోషంతో అందరికీ చెప్పుకునేవారు. చిన్నప్పుడు కార్తీ కన్నా సూర్య హైట్ గా ఉండేవాడు. కానీ కాలేజ్ డేస్ లో కార్తీ బాగా పొడవు పెరిగాడు. సూర్య కన్నా ఎత్తు అయ్యాడు. దీంతో అన్నకి ఇగో ఫీలింగ్ వచ్చింది. కార్తీని దగ్గరకు రానిచ్చేవాడు కాదు. మినిమమ్ ఆరు అడుగుల దూరంలో ఉండమని చెప్పేవాడు కార్తీకి. ఆ రోజుల్లోనే సోషల్ డిస్టన్సింగ్ ను పాటించాడు.

చిన్నప్పటి నుండి కార్తీని బాగా ఇబ్బంది పెట్టిన సూర్య, కార్తీ ఇంటి నుండి వెళ్ళిపోయాక మాత్రం బాగా మిస్ అయ్యాడు. డిగ్రీ అయిపోయాక ఎమ్మెస్ చేయడానికి కార్తీ అమెరికా వెళ్ళిపోయాడు. సరిగ్గా అప్పుడే తమ్ముడి విలువ తెలిసింది. సూర్యకు ఎవరితో కొట్లాడాలో తెలిసేది కాదు. ఆ సమయంలో చాలా ఒంటరిగా ఫీలయ్యేవాడు సూర్య.

ఉద్యోగం:

అందరి కుటుంబాలలో ఎత్తుపల్లాలు ఉన్నట్లే శివకుమార్ కుటుంబానికి కూడా లో ఫెజ్ వచ్చింది. డబ్బులు ఎక్కువగా కార్తీ చదువుకే పంపాల్సి వచ్చేది. దీంతో శివకుమార్ కుటుంబం ఆర్ధికంగా చతికిలపడింది. కెరీర్ పరంగా శివకుమార్ కు అవకాశాలు తగ్గడంతో అనుకోని ఇబ్బందులు కార్తీ చుట్టుముట్టాయి. దీంతో సూర్య ఒక ఉద్యోగం వెతుక్కున్నాడు. ఒక గార్మెంట్ ఎక్స్పోర్ట్ కంపెనీలో పనికి కుదిరాడు. అక్కడ రకరకాల పనులు చేసేవాడు. రోజుకి 18 గంటల పాటు కష్టపడేవాడు. ఒక్కోసారి రోజులో 75 కిలోమీటర్ల పాటు ప్రయాణించేవాడు. తన తొలి ఉద్యోగం తనకెంతో నేర్పిందని చెప్తుంటాడు సూర్య. మొదటి జీతం 750 రూపాయల కవర్ యొక్క బరువు తనకు ఇంకా గుర్తుందని చెబుతాడు.

జీవితం గురించి సూర్య మాటల్లో:

సూర్య ఒక ప్రముఖ నటుడి కొడుకైనా కూడా ఎప్పుడూ సినిమాల్లోకి వస్తానని అనుకోలేదు. తాను అసలు హీరో మెటీరియల్ కాదనే అనుకున్నాడు. ఆ కాన్ఫిడెన్స్ తనకు లేదు. అయితే సూర్యకు ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చింది మణిరత్నం. కచ్చితంగా నువ్వు నటుడిగా రాణించగలవు అని మణిరత్నం చెప్పడంతోనే సూర్య సినిమాల్లోకి వచ్చాడు. జీవితం గురించి సూర్య ఒక చోట చెప్పిన మాట చాలా మంది యువతను కచ్చితంగా ఇన్స్పైర్ చేస్తుంది. "జీవితం మనకు ఎన్నో అవకాశాలను ఇస్తుంది. మనకు ఇష్టమైన రంగాలు కొన్ని ఉంటాయి. అయితే అందులో దిగడానికి మనం సంకోచిస్తాము. ఇందులోకి వెళితే మనం రాణించగలమా లేదా అన్న డౌట్ ఎప్పుడూ ఉంటుంది. కానీ అనుకున్న చోట రాణించాలంటే మాత్రం ఎక్కువ ఆలోచించకండి. ఫస్ట్ అందులోకి దిగండి. పరిస్థితులను బట్టి మనల్ని మనం మార్చుకోవచ్చు. కచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాం." అని చెప్పుకొచ్చాడు సూర్య. అక్షర సత్యాలు ఈ మాటలు అనిపిస్తున్నాయి కదా.

లవ్ లైఫ్:

ముందే చెప్పుకున్నట్లు చిన్నప్పటి నుండి సూర్య చాలా అల్లరిగా ఉండేవాడు. కార్తీ చాలా నెమ్మదస్తుడు. చదువులో ఎప్పుడూ వెనకబడి ఉండే సూర్య, అమ్మాయిల విషయంలో మాత్రం ఎప్పుడూ ముందుండే వాడు. సూర్యకు స్కూల్ డేస్ లో లవర్ లెటర్స్ వచ్చేవి. ఇక సూర్య ఇంటికి వచ్చే బ్లాంక్ కాల్స్ గురించైతే చెప్పాల్సిన పనిలేదు. అలాగే ఉదయం 5;30 నిమిషాల ప్రాంతంలో అమ్మాయిలు తమ ఇళ్లల్లో ముగ్గులు వేసే సమయంలో సైకిల్ మీద వెళ్లి వాళ్లకు లైన్ వేసేవాడు సూర్య.

సినిమా:

సూర్య సినిమాల్లోకి రాకముందు గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు అని చెప్పుకున్నాం కదా. ఆ ఫ్యాక్టరీలో తన కాళ్ళ మీద తను నిలబడాలి అని చెప్పి తాను శివకుమార్ కొడుకు అని రివీల్ చేయలేదు. అయితే ఆ ఫ్యాక్టరీ ఓనర్ తర్వాత తెలుసుకుని "ఎందుకు బాబు ఇక్కడ ఇంత కష్టపడతావ్. సినిమాల్లోకి వెళ్లొచ్చు కదా" అని అన్నాడు. సూర్యకు డిగ్రీ చదువుతున్నప్పుడే 1995లోనే దర్శకుడు వసంత్ సినిమా ఆఫర్ ఇచ్చాడు. ఆశై అనే సినిమాలో నటించమని అడిగాడు. అయితే సూర్యకు నటించడం అసలు ఇష్టం లేదు. పైగా అప్పుడు తనలో నటుడు కావొచ్చన్న కాన్ఫిడెన్స్ అసలు లేదు. దాంతో చేయనని చెప్పాడు. ఆ సినిమాలో అజిత్ హీరోగా నటించాడు.

అయితే గార్మెంట్ ఫ్యాక్టరీలో నుండి బయటకు వచ్చేసాక, సూర్యకు సినిమాల్లోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. శివకుమార్ కెరీర్ నెమ్మదించడం, ఖర్చులు పెరగడంతో కచ్చితంగా సూర్య ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ సమయంలోనే సినిమాల్లోకి రావాలని అనుకున్నాడు సూర్య. ఆ నిర్ణయం వెనుక మణిరత్నం హస్తం కూడా ఉంది. తనకు ఇంకా నటుడిగా సక్సెస్ అవ్వగలనన్న కాన్ఫిడెన్స్ లేని రోజుల్లో మణిరత్నం ఇచ్చిన ప్రోత్సాహంతో సూర్య ఫైనల్ గా డెసిషన్ తీసుకున్నాడు.

మణిరత్నం నిర్మాతగా మళ్ళీ వసంత్ దర్శకత్వంలోనే సూర్య మొదటి సినిమా నేరుక్కు నేర్ ప్రారంభమైంది. సూర్యకు 22 ఏళ్ల వయసులో 1997లో సినిమాల్లోకి అరంగేట్రం చేసాడు. అయితే అప్పటికే ఇండస్ట్రీలో శరవణన్ అనే నటుడు ఉన్నాడు కాబట్టి శరవణన్ శివ కుమార్ కాస్తా సూర్య శివకుమార్ గా మారాడు. మణిరత్నం ఈ పేరుని మార్చడం విశేషం. నేరుక్కు నేర్ లో సూర్య పాత్రలో నటించిన శరవణన్ కు చివరికి అదే పేరు కన్ఫర్మ్ అయింది. ఈ సినిమాలో విజయ్ తో కలిసి నటించాడు సూర్య. ఈ సినిమా మొదట విజయ్, అజిత్ తో కలిసి ప్లాన్ చేసారు. అజిత్ కు డేట్స్ సమస్య వల్ల ఈ సినిమా నుండి తప్పుకోవడంతో అవకాశం సూర్యకు వచ్చింది. అలా సూర్య హీరో అయ్యాడు. అయితే నేరుక్కు నేర్ యావరేజ్ గా ఆడింది. ఈ సినిమా ద్వారా సూర్యకు వచ్చిన గుర్తింపు అంటూ ఏం లేదు.

ఇక రెండో సినిమాగా ఏం చేయాలి అన్న ఆలోచనలో ఉన్న సమయంలో ఇంద్రన్ అనే దర్శకుడు హీరో ప్రశాంత్ తో ఒక సినిమా ప్లాన్ చేసి అది వర్కౌట్ అవ్వకపోవడంతో సూర్యను అప్రోచ్ అయ్యాడు. అప్పుడు ప్రశాంత్ శంకర్ దర్శకత్వంలో జీన్స్ చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ ఆలస్యమవ్వడంతో ఈ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయాడు ప్రశాంత్. ఈ సినిమాలో కూడా మరో హీరో మురళితో కలిసి నటించాడు సూర్య. ఈ చిత్రం కూడా అనుకున్నంత సక్సెస్ అవ్వలేకపోయింది.

మొదటి రెండు సినిమాలు యావరేజ్ టాక్ తో వెళ్లాయి. పైగా సూర్యకు వచ్చిన గుర్తింపు కూడా లేదు. ఈ నేపథ్యంలో సూర్య కొంత ఒత్తిడిలో ఉన్నాడు. దర్శకుడు ఇంద్ర కుమార్, సూర్య, ప్రీతా విజయ్ కుమార్ లు హీరో, హీరోయిన్లుగా సంధిప్పోమా అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా డిజాస్టర్ గా మారింది. అలాగే విమర్శకులు సూర్య నటనను, లుక్స్ ను చీల్చిచెండాడేసారు. బ్యాక్ గ్రౌండ్ ఉంది కాబట్టే సూర్య సినిమాల్లోకి రాగలిగాడు అని కామెంట్స్ చేసారు.

విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ రచయిత, దర్శకుడు. విజయ్ కాంత్ ను స్పెషల్ రోల్ లో విజయ్ హీరోగా ఒక సినిమా ప్లాన్ చేసాడు చంద్రశేఖర్. అయితే తండ్రి సినిమాకు కూడా డేట్స్ ఇవ్వలేనంత బిజీగా ఉన్నాడు విజయ్. ప్రాజెక్ట్ ఆలస్యం చేయలేక చంద్రశేఖర్ సూర్యను తన సినిమాలో తీసుకున్నాడు. ఈ సినిమా పేరు పెరియన్న. ఈ సినిమా కూడా హిట్ అవ్వలేదు. యావరేజ్ స్థాయి వద్దే మిగిలిపోయింది.

తనకు తొలి అవకాశం ఇచ్చిన వసంత్ తో కలిసి మరోసారి పనిచేసాడు సూర్య. ఈ సినిమా టైటిల్ పూవెళ్ళేం కేట్టుపార్. ఈ చిత్రం కూడా యావరేజ్ గా ఆడినా సూర్య కెరీర్ లో ఇది ఒక ముఖ్యమైన చిత్రం. ఎందుకంటే ఈ సినిమాలో తొలిసారి జ్యోతికతో కలిసి నటించాడు సూర్య. ఫుల్ లెంగ్త్ హీరోయిన్ గా ఆమెకు ఇదే తొలి చిత్రం. ఆ తర్వాత వీరి జోడి మరోసారి రిపీట్ అయింది. కెఆర్ జయ అనే దర్శకురాలు ఉయిరీలే కాలన్తతు తెరక్కించిన సినిమాలో సూర్య, జ్యోతిక కలిసి నటించారు. అయితే ఈ సినిమా కూడా అనుకున్న రీతిలో ఆడలేదు.

సూర్య హిట్ రుచి అన్నదే ఎరుగకుండా వరసగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సరిగ్గా అదే సమయంలో దర్శకుడు సిద్ధిక్ 1999లో మలయాళంలో తాను రూపొందించిన సూపర్ హిట్ సినిమా ఫ్రెండ్స్ కు రీమేక్ గా అదే టైటిల్ తో తమిళ్ లో సినిమా మొదలుపెట్టాడు. విజయ్, సూర్య మళ్ళీ ఈ సినిమాలో కలిసి నటించారు. మొదట హీరోయిన్లుగా జ్యోతిక, సువలక్ష్మిలను తీసుకున్నారు. అయితే అనుకోని కారణాల వల్ల జ్యోతిక, సువలక్ష్మి ఇద్దరూ సినిమా నుండి తప్పుకున్నారు. జ్యోతిక స్థానంలో సిమ్రాన్ ను తీసుకుంటే ఆమె కూడా డేట్స్ సమస్య వల్ల తప్పుకుంది. దీంతో దేవయానిని తీసుకున్నారు. అలాగే తొలిసారి విజయలక్ష్మిను మరో హీరోయిన్ రోల్ కోసం తీసుకున్నారు.

ఈ సినిమా విజయంపై సూర్య చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఆల్రెడీ సూపర్ హిట్ అయిన సినిమా కాబట్టి తమిళ్ లో మంచి ఫలితమే వస్తుందని ఆశించాడు. 14 జనవరి 2001, సంక్రాంతి సందర్భంగా విడుదలైంది ఫ్రెండ్స్. సినిమాకు టాక్ బాగా వచ్చింది. అయితే అదే రోజు అజిత్ నటించిన దీన విడుదలై సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా ద్వారానే స్టార్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసాడు. దీన పోటీగా రాకపోయి ఉంటే కచ్చితంగా ఫ్రెండ్స్ మంచి విజయం సాధించి ఉండేది.

మొత్తంగా అప్పటికే 7 సినిమాలు చేసి ఉన్నాడు. చూస్తే ఒక్క సక్సెస్ కూడా లేదు. పలు యావరేజ్ సినిమాలు, రెండు డిజాస్టర్స్ కొట్టి ఉన్నాడు. దీంతో నిర్మాతలే భయపడే పరిస్థితికి వచ్చాడు. అప్పుడు సీనియర్ నటుడు, శివకుమార్ తో అనుబంధం ఉన్న రఘువరన్ సూర్యకు సినిమా ఇండస్ట్రీ గురించి క్లాస్ తీసుకున్నాడు. "నువ్వు సినిమాలను సీరియస్ గా తీసుకోనంత కాలం ఇలాంటి ఫలితాలే నీకు వస్తాయి. కథను నమ్మి సినిమాలు చేయి, వచ్చిన సినిమానల్లా చేసుకుంటూ వెళ్ళకు" అని వార్నింగ్ టైప్ లో చెప్పుకొచ్చాడు.

సూర్య కెరీర్ ప్రథమార్ధమంతా ఎవరో కాదనుకున్న సినిమాలు తన వద్దకు వచ్చినవే చేసుకుంటూ వచ్చాడు. తన మొదటి సినిమా నేరుక్కు నేర్, అజిత్ కాదనుకుంటే తన వద్దకు వచ్చింది. అలాగే తన ఎనిమిదో సినిమా నంద కూడా అజిత్ వద్దు అనుకుంటే తన వద్దకు వచ్చింది. దర్శకుడు బాలా అజిత్ హీరోగా నంద అనే చిత్రం చేయాలనుకున్నాడు. అయితే దర్శకుడిగా బాలా స్టైల్ వేరు. ఫుల్ స్క్రిప్ట్ తన వద్ద రెడీగా ఉండదు. హీరోలకు లైన్ మాత్రమే చెబుతాడు. అజిత్ కు అలా ఉంటే కుదరదు, బౌండ్ స్క్రిప్ట్ ఇస్తేనే చేస్తా అని అడిగాడు. దీంతో బాలా సూర్యను తన సినిమాలో తీసుకున్నాడు. అలాగే శివాజీ గణేశన్ ను కీలక పాత్రకు తీసుకుందాం అనుకుని, అది కుదరక రాజ్ కిరణ్ గారిని తీసుకోవడం జరిగింది. అలా నంద సెట్స్ పైకి వచ్చింది. నంద సినిమా కోసం సూర్య పూర్తిగా ఫిజికల్ ట్రాన్సఫార్మ్ అయ్యాడు. నంద ఫస్ట్ లుక్ ను చూసిన అందరూ షాక్ తిన్నారు. అప్పటిదాకా చేయని రోల్ ను సూర్య చేయబోతున్నాడని అర్ధమైంది.

నంద సూపర్ డూపర్ హిట్ అయింది. సూర్యకు ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. ఈ చిత్రంలో తన పెర్ఫార్మన్స్ కు సూర్య తమిళనాడు స్టేట్ అవార్డును సైతం గెలుచుకున్నాడు. నంద చిత్రాన్ని తెలుగులో ఏకంగా మూడు సార్లు విడుదల చేసారు. మొదట 2006లో ఆక్రోశం పేరిట విడుదలైన ఈ చిత్రం తర్వాత 2009లో ప్రతీకారం టైటిల్ తో విడుదలైంది. ఇక 2011లో బాలా-సూర్య టైటిల్ తో విడుదల చేసారు.

నందతో సూపర్ హిట్ కొట్టి మంచి ఊపు మీదున్న సూర్య వద్దకు దర్శకుడు విక్రమన్ వచ్చాడు. విజయ్ తో 'ఉన్నై నినైటు' అనే ప్రాజెక్ట్ ను ఓకే చేసి కొద్ది రోజులు షూటింగ్ చేసాక ఆ సినిమా నుండి దర్శకుడితో విబేధాల కారణంగా విజయ్ తప్పుకున్నాడు. విజయ్ స్థానంలో ప్రశాంత్ ను తీసుకుందాం అని అనుకున్నా కానీ చివరికి సూర్యను ఓకే చేసారు. స్నేహ, లైలా హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. సూర్య కెరీర్ కు మరో టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఈ చిత్రాన్నే తెలుగులో వేణు హీరోగా చెప్పవే చిరుగాలి టైటిల్ తో తెరకెక్కించారు.

తర్వాత శ్రీ అనే సినిమాను చేసిన సూర్య, ఆ తర్వాత మౌనం పెసియాదే చిత్రాన్ని కొత్త దర్శకుడు అమీర్ తెరకెక్కించగా నటించాడు. ఈ సినిమా ద్వారా త్రిష హీరోయిన్ గా తమిళ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ చిత్రాన్ని తెలుగులో ఈవీవీ సత్యనారాయణ తన కొడుకు ఆర్యన్ రాజేష్ ను హీరోగా పెట్టి ఆడంతే అదో టైపు టైటిల్ తో తెరకెక్కించాడు. తెలుగు, తమిళ్ లో కూడా ఈ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ అవ్వలేదు.

రెండు సక్సెస్ లు వచ్చిన వెంటనే రెండు ప్లాప్ లు సూర్యను చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో సూర్య మళ్ళీ హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్న సమయంలో దర్శకుడు గౌతమ్ మీనన్ చెప్పిన పోలీస్ యాక్షన్ స్టోరీ సూర్యకు బాగా నచ్చింది. ఆ సినిమానే కాక్క కాక్క. ఈ సినిమాలో సూర్యతో కలిసి మరోసారి జ్యోతిక నటించింది. అప్పటిదాకా సూర్యకు జ్యోతిక అంటే ఇష్టం మాత్రమే ఉండేది. ఈ సినిమాలో ఆమెతో మరింత దగ్గరగా ట్రావెల్ అయ్యాక ఆమెపై రెస్పెక్ట్ పెరిగింది. ఇక కచ్చితంగా ఆమెనే పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చేసాడు. తమిళ్ లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో గౌతమ్ మీనన్ ఘర్షణ పేరుతో రీమేక్ చేసాడు. ఇక్కడ కూడా ఈ సినిమా మంచి విజయం సాధించింది.

తనకు తొలి బ్లాక్ బస్టర్ ఇచ్చిన బాలా దర్శకత్వంలో పితామగన్ చిత్రాన్ని చేసాడు. ఈ సినిమాలో విక్రమ్ మెయిన్ లీడ్ గా నటించగా సూర్య సపోర్టింగ్ క్యారెక్టర్ చేసాడు. ఈ సినిమాతో సూర్య, విక్రమ్ ఇద్దరికీ చాలా మంచి ప్రశంసలు దక్కాయి. సూర్యకు బెస్ట్ సపోర్టింగ్ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కింది. ఈ చిత్రాన్ని తెలుగులో శివపుత్రుడు పేరుతొ డబ్ చేయగా తెలుగులో కూడా మంచి పేరుని తెచ్చుకుంది. సూర్యకు తెలుగులో ఫస్ట్ సక్సెస్ తీసుకొచ్చిన సినిమా ఇదే.

ఈ సినిమా తర్వాత శశి శంకర్ దర్శకత్వంలో పెరళ్ళగన్ అనే చిత్రాన్ని సూర్య చేసాడు. జ్యోతిక, సూర్యతో మరోసారి జతకట్టింది. ఈ చిత్రంలో వీరిద్దరూ డ్యూయల్ రోల్స్ లో నటించడం విశేషం. ఈ సినిమా తర్వాతే వీరిద్దరి మధ్య బంధం మరింత బలపడింది. నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళడానికి శ్రీకారం పడింది.

తన కెరీర్ లో తొలిసారి మణిరత్నం దర్శకత్వంలో నటించే అవకాశం సూర్యకు వచ్చింది. హైదరాబాద్ ఒస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న జార్జ్ రెడ్డి ఇన్స్పిరేషన్ తో మణిరత్నం అల్లుకున్న ఆయత్త ఎళుత్తు చిత్రంలో నటించాడు. ఈ చిత్రాన్ని యువ పేరుతో తెలుగులో డబ్ చేసారు. తమిళ్ లో మంచి విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో యావరేజ్ గా ఆడింది. ఈ సినిమాలో మాధవన్, సిద్ధార్థ్, త్రిష, మీరా జాస్మిన్ కూడా నటించడం విశేషం.

సింగంపులి దర్శకత్వంలో సూర్య, జ్యోతిక మాయావి చిత్రంలో ఐదో సారి కలిసి నటించారు. అప్పటికే వారు రిలేషన్ లో ఉండగా, దీని తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే జ్యోతికతో పెళ్లి విషయాన్ని సూర్య ఇంట్లో చెప్పగా శివకుమార్ దంపతులు ససేమీరా అన్నారు. కానీ సూర్య మొండి పట్టు విడవలేదు. చేసుకుంటే జ్యోతికనే పెళ్లి చేసుకుంటాను అని భీష్మించుకుని కూర్చున్నాడు. దీంతో సూర్య, జ్యోతికను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ తమ తమ సినిమాలతో బిజీ అయ్యారు.

దీన సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఏఆర్ మురుగదాస్, అజిత్ తోనే మరోసారి గజిని చిత్రాన్ని చేయాలనుకున్నాడు. అజిత్ తో ఫోటోషూట్ కూడా చేసారు. అయితే కారణాలు తెలియదు కానీ అజిత్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. తర్వాత మాధవన్ ను తీసుకుందాం అనుకున్నారు. అది కూడా కుదర్లేదు. గజినీ స్క్రిప్ట్ పట్టుకుని మురుగదాస్ తమిళ్, తెలుగు కలిపి మొత్తం 12 మంది హీరోలను కలిసాడు. ఎవరూ కూడా ఈ సినిమా చేయడానికి ముందుకు రాలేదు. మురుగదాస్ 13వ హీరో సూర్యకు చెప్పగా విభిన్నమైన సినిమాలంటే ప్రాణం పెట్టే సూర్య వెంటనే ఒప్పుకున్నాడు.

గజినీ చిత్రం కోసం గుండు చేయించుకుని నటించాడు సూర్య. ముందు నుండీ ఈ సినిమాలో ఆసిన్ హీరోయిన్ కాగా మరో హీరోయిన్ పాత్రకు మొదట శ్రియను తీసుకున్నారు. విలన్ గా ప్రకాష్ రాజ్ ను అనుకున్నారు. అయితే ఆ ఇద్దరూ షూటింగ్స్ తో బిజీగా ఉండడంతో శ్రియ స్థానంలో నయనతార, ప్రకాష్ రాజ్ స్థానంలో ప్రదీప్ రావత్ వచ్చారు. 2005లో విడుదలైన గజినీ సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తెలుగులో కూడా ఇదే పేరుతో విడుదలైన ఈ చిత్రం ఇక్కడ కూడా సెన్సేషనల్ సక్సెస్ సాధించింది. తమిళ్ లో స్టార్ హోదా, తెలుగులో మార్కెట్ ఈ సినిమా ద్వారా సూర్యకు కలిగాయి.

ఈ సినిమా తర్వాత జూన్ ఆర్ అనే జ్యోతిక సినిమాలో సూర్య స్పెషల్ రోల్ లో నటించాడు. యాక్షన్ చిత్రాల దర్శకుడు హరి తెరకెక్కించిన ఆరు సినిమాలో సూర్య నటించాడు. తెలుగులో ఈ సినిమా మ్యూజికల్ గా వర్కౌట్ అయినా కానీ కమర్షియల్ గా ఫెయిల్ అయింది. అయితే తమిళ్ లో మాత్రం ఆరు మంచి విజయం సాధించింది.

మరోసారి సూర్య, జ్యోతిక కలిసి నటించిన సినిమా సిల్లును ఒరు కాదల్. ఈ చిత్రంలో భూమిక కూడా మరో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమానే తెలుగులో నువ్వు, నేను, ప్రేమగా డబ్ చేసి రిలీజ్ చేసారు. ఏఆర్ రహ్మాన్ స్వరపరిచిన మ్యూజిక్ సెన్సేషనల్ సక్సెస్ సాధించింది. 8 సెప్టెంబర్ 2006న ఈ సినిమా విడుదలవ్వగా, సరిగ్గా మూడు రోజుల తర్వాత సూర్య, జ్యోతికలు పెద్దల సమక్షంలో అధికారికంగా పెళ్లి చేసుకున్నారు.

మరోసారి హరి దర్శకత్వంలో చేసిన వేల్ మంచి విజయాన్ని అందుకుంది. కాక్క కాక్కతో తనకు సూపర్ హిట్ ఇచ్చిన గౌతమ్ మీనన్ దర్శకత్వంలోనే వారణం ఆయిరం చిత్రంలో నటించాడు సూర్య. ఈ సినిమా సూర్య సన్నాఫ్ కృష్ణన్ గా తెలుగులో డబ్ అయింది. అటు తమిళ్ లో, ఇటు తెలుగులో ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలోని ప్రతీ పాట ఇప్పటికీ చార్ట్ బస్టర్ అంటే ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ చిత్రంలో తన నటనకు గాను ఫిల్మ్ ఫేర్ అవార్డును సైతం అందుకున్నాడు సూర్య.

ఈ సినిమా సక్సెస్ తర్వాత తన తొలి సినిమా సినిమాటోగ్రాఫర్ కెవి ఆనంద్ దర్శకత్వంలో చేసిన అయాన్ సినిమా కూడా సక్సెస్ సాధించింది. ఈ సినిమా వీడొక్కడే పేరుతో తెలుగులో డబ్ అయింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా తమన్నా నటించింది. ఇక కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో చేసిన ఆధవాన్ తెలుగులో ఘటికుడు పేరుతో డబ్ అయింది. ఈ సినిమా కమర్షియల్ గా అంత విజయం సాధించలేదు.

హరితో అప్పటికే రెండు సక్సెస్ లు అందుకున్న సూర్య మరోసారి తనకు అచొచ్చిన పోలీస్ కథను ఎంచుకున్నాడు. సింగం టైటిల్ తో తెరకెక్కిన ఈ చిత్రం మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల నుండి మంచి రెస్పాన్స్ ను అందుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. సూర్య మాస్ హీరోగా ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సూర్య చెప్పిన పవర్ఫుల్ డైలాగులకు థియేటర్లో విజిళ్ల వర్షం కురిసింది. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈ సినిమా వసూళ్ల వర్షాన్ని సాధించింది.

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రక్త చరిత్ర 2లో నటించాడు సూర్య. ఈ సినిమాలో సూరి పాత్రలో నటించి మంచి ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత మన్మధన్ అంబు, కో, అవన్ ఇవన్ సినిమాల్లో కామియో పాత్రల్లో నటించాడు. తనకు గజినీ వంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన ఏఆర్ మురుగదాస్ తో కలిసి చేసిన 7యం అఱివు సినిమాలో డ్యూయల్ రోల్ లో నటించాడు సూర్య. అరవింద్, బోధి ధర్మ పాత్రల్లో నటించిన సూర్య తన పెరఫార్మన్స్ కు పూర్తి న్యాయం చేసాడు. ఈ సినిమా సెవెంత్ సెన్స్ పేరుతో తెలుగులో విడుదలైంది.

బ్రదర్స్, సింగం 2, అంజాన్, మాస్, పసంగా 2, 24, సింగం 3 సినిమాల్లో నటించాడు సూర్య. వీటిలో సింగం సిరీస్ సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయి. 24లో మూడు భిన్నమైన షేడ్స్ లో నటించిన సూర్య చాలా మంచి పేరును తెచ్చుకున్నాడు. విక్రమ్ కె కుమార్ ఈ సినిమాకు దర్శకుడు.

అయితే సింగం 3 తర్వాత నుండి సూర్య కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. వరసగా సూర్య నటించిన సినిమాలు అన్నీ ఫెయిల్ అయ్యాయి. తానా సెర్న్ద్ర కూట్రమ్, ఎన్జికే, కాప్పాన్ చిత్రం ఘోరంగా విఫలమయ్యాయి. ఈ సినిమాల ప్లాప్ వల్ల అటు తమిళ్ లో ఇటు తెలుగులో కూడా మార్కెట్ ను కోల్పోయాడు.

వరస ఫెయిల్యూర్స్ తో ఒత్తిడికి లోనైన సూర్య మహిళా దర్శకురాలు సుధ కొంగర తెరకెక్కించిన సూరారై పోట్రు చిత్రంలో నటించాడు. ఈ సినిమా ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీఆర్ గోపినాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కింది. కోవిద్ నేపథ్యంలో ఈ సినిమా డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా విడుదలైంది. తెలుగులో ఆకాశం నీ హద్దురా పేరుతో ఈ సినిమా డబ్ కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్బ్ రిసెప్షన్ వచ్చింది. సూరరై పోట్రు ఇప్పుడు ఆస్కార్స్ రేసులో నిలవడం నిజంగా విశేషమే.

ఈ సినిమా ద్వారా సూపర్బ్ కంబ్యాక్ ఇచ్చిన సూర్య తిరిగి ఉత్సాహంగా పనిచేయడానికి ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం పాండిరాజ్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్నాడు.

అగరం ఫౌండేషన్:

సూర్య తండ్రి శివకుమార్ కు ఎప్పటినుండో సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంది. 1979 నుండే శివకుమార్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అని ప్రారంభించి తనకు తోచినంతలో పేద విద్యార్థులకు చదువుకు కావాల్సిన సహాయసహకారాలు అందించే వాడు. సూర్య హీరో అయ్యాక ఈ ట్రస్ట్ కార్యక్రమాలను వేరే లెవెల్ లోకి తీసుకెళ్లాడు. 2006లో అగరం ఫౌండేషన్ ను స్థాపించి తమిళనాడులోని రూరల్ ప్రాంతాలకు చెంది, ఆర్ధిక స్థోమత సరిపోక చదువుకోకుండా ఉండిపోతున్న విద్యార్థులను గుర్తించి వారికి చదువుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తుంది ఈ ఫౌండేషన్. దాదాపు 2,000 మంది విద్యార్థులకు ఈ సంస్థ ప్రస్తుతం తమ సహాయాన్ని అందిస్తోంది. 2006 నుండి ఏడాదికేడాది ఫౌండేషన్ కార్యక్రమాలను పెంచుకుంటూ వెళ్తున్నాడు సూర్య. ఇప్పటికే చాలా మంది ఈ ఫౌండేషన్ ద్వారా చదువుకుని ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నారు.

శ్రీలంక నుండి వచ్చి తమిళనాడులో తలదాచుకుంటున్న శరణార్ధులకు సైతం ఈ అగరం ఫౌండేషన్ తమ సహాయాన్ని అందిస్తుంది. 2013లో ఈ సంస్థ ఉత్తరాఖండ్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కు 10 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించింది. సూర్య కుటుంబం 2017లో ఫౌండేషన్ కు తాము నివాసముంటున్న ఇంటిని రాసిచ్చేశారు. 2018లో తమిళనాడులో 400 ప్రభుత్వ పాఠశాలలను గుర్తించి వాటికి తగ్గ మరమత్తులు ఈ ఫౌండేషన్ చూసుకుంది. 2020 కోవిద్ సమయంలో తంజోర్ ప్రభుత్వ ఆసుపత్రికి మెడికల్ ఎక్విప్మెంట్ కొనుగోలు చేయడానికి సరిపడా అమౌంట్ ను స్పాన్సర్ చేసింది ఈ సంస్థ.

ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే అగరం ఫౌండేషన్ ద్వారా ఇన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి మెగాస్టార్ చిరంజీవి తనకు ఒక రకంగా ఇన్స్పిరేషన్ అని తెలియజేసాడు సూర్య.

సూర్య గురించి కార్తీ మాటల్లో:

అన్నదమ్ముల రిలేషన్ అనేది చాలా ప్రత్యేకమైనది. వారి మధ్య బాండింగ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మరి సూర్య గురించి కార్తీ ఏమనుకునేవాడో, వాళ్ళిద్దరి బాల్యం గురించి కార్తీ ఏమన్నాడో తన మాటల్లోనే.. "ఒకే ఇంట్లో పెరిగినా కూడా అన్నయ్య, నేను పూర్తిగా భిన్నంగా పెరిగాము. మా వ్యక్తిత్వాలు చాలా వ్యతిరేకం. అమ్మ, నాన్న ఏం చెబితే దాన్ని నేను పాటించేవాడ్ని. కానీ అన్నయ్య అలా కాదు, వాళ్ళు ఏం చెబితే దానికి వ్యతిరేకంగా చేసేవాడు. చిన్నప్పుడు నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. ఎప్పుడూ తను చెప్పిందే వినాలి అనేవాడు. లేదంటే కొట్టేవాడు కూడా. అయితే ఇంటర్ వచిన్నప్పటి నుండి కొట్లాటలు కొంత వరకూ తగ్గాయి. ఎందుకంటే నేను, అన్నయ్య కంటే కొంచెం ఎత్తుగా ఉండేవాడిని. దాంతో నన్ను దూరంగా నిలబడమనేవాడు. తనకు, నాకు 10 అడుగుల దూరం పాటించమనేవాడు. ఇదంతా నేను యూఎస్ కు వెళ్ళాక మారిపోయింది. ఒకళ్ళని ఒకరం బాగా మిస్ అయ్యేవాళ్ళం. ఏదైనా షేర్ చేసుకునే అన్నయ్య పక్కన లేకపోతే చాలా వెలితిగా అనిపించేది. అప్పటినుండి మా మధ్య ఎప్పుడూ గొడవ రాలేదు. సినిమాల్లోకి వచ్చాక అన్నయ్య మీద గౌరవం బాగా పెరిగింది" అని చెప్పుకొచ్చాడు కార్తీ.

బ్రాండ్స్:

సౌత్ ఇండియా వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించిన సూర్య తన కెరీర్ మొత్తంలో పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరించాడు. 2004లోనే మాధవన్ తో కలిసి పెప్సీ బ్రాండ్ కు తమిళనాడుకు ప్రచారకర్తగా ఉన్నాడు సూర్య. 2006లో సన్ ఫీస్ట్ బిస్కట్స్, ఎయిర్ సెల్, టీవీఎస్ మోటార్స్ కు సూర్య ప్రచారకర్తగా వ్యవహరించడానికి సైన్ చేసాడు. 2010 నుండి శరవణ స్టోర్స్, భారతి సిమెంట్స్, ఇమామి నవరత్న బ్రాండ్లకు పనిచేసాడు. 2011లో నెస్ కెఫె, జండూ బామ్, క్లోజప్ బ్రాండ్లకు ప్రచారం చేసాడు సూర్య. 2012లో మలబార్ గోల్డ్స్ కు సైతం ప్రచారకర్తగా వ్యవహరించాడు. 2013లో బెస్ట్ మేల్ ఎండోర్సేర్ గా సూర్య ఎంపికై ఎడిసన్ అవార్డ్స్ ను అందుకున్నాడు. 2012, 13, 15, 16, 17, 18 సంవత్సరాలకు ఫోర్బ్స్ ఇండియా టాప్ 100 లో స్థానం సంపాదించాడు. 2013లో ఫోర్బ్స్ టాప్ 100లో 33వ స్థానం సంపాదించిన సూర్య, 2017లో 25వ స్థానానికి చేరుకున్నాడు.

అవార్డ్స్ :

* సినీ'మా' అవార్డ్స్ - మాట్రన్ - తెలుగులో ఈ చిత్రం బ్రదర్స్ గా విడుదలైంది. ఈ చిత్రంలో తన నటనకు ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నాడు.

* 2002లో నంద చిత్రానికి బెస్ట్ పాపులర్ తమిళ్ యాక్టర్ అవార్డును సొంతం చేసుకున్నాడు సూర్య.

* 2004లో పితామగన్ చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును సొంతం చేసుకున్నాడు సూర్య.

* 2004లోనే ఖాక్క ఖాక్క చిత్రానికి అంతర్జాతీయ తమిళ్ ఫిల్మ్ అవార్డును గెలుచుకున్నాడు.

* 2005లో పెరాలగన్, 2007లో వారణం ఆయిరం, చిత్రాలకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారాన్ని గెలుచుకున్నాడు.

* 2001లో నంద, 2005లో గజినీ, 2008లో వారణం ఆయిరం చిత్రాలకు తమిళనాడు ప్రభుత్వ ఫిల్మ్ అవార్డ్స్ పురస్కారాలను అందుకున్నాడు.

* 2017లో 24 చిత్రానికి క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ కేటగిరీలో ఫిల్మ్ ఫేర్ అవార్డును సొంతం చేసుకున్నాడు సూర్య.

తనతో పాటు నటించిన నటి జ్యోతికను ఆయన ప్రేమ వివాహం చేసుకున్నది తెలిసిందే. ఇలా మొత్తంగా తన కెరీర్ లో దాదాపు 29 వివిధ రకాల అవార్డులను సూర్య గెలుచుకోవడాన్ని బట్టి ఆయన ఎంత ఉత్తమ, పరిణితి చెందిన, వెర్సటైల్ నటుడు అన్నది మనం అర్ధం చేసుకోవచ్చు.

నటుడిగా సూర్య గురించి మనం ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన పనిలేదు. మనిషిగా కూడా సూర్య ఎంతో ఉత్తమమైన వ్యక్తి. సూర్య ఎందరికో ఆదర్శమైన ఫ్యామిలీ పర్సన్ కూడా. సినిమా కోసం ప్రాణం పెట్టే వాళ్ళ గురించి విని ఉంటాం కానీ సూర్యను చూస్తే అది నిజమే అనిపిస్తుంది. పాత్ర ఎంత డిమాండ్ చేస్తుందో అంతా చేయడానికి సూర్య ఎప్పుడూ సిద్ధమే. సినిమా సినిమాకూ కొత్తదనం కోరుకునే సూర్య అటు కోలీవుడ్ లోనే కాక ఇటు టాలీవుడ్ లో కూడా కోట్లాది మంది అభిమానుల్ని గెలుచుకున్నాడు. సూర్య సాధించిన ఘనతలు చెప్పుకోవడానికి మాటలు సరిపోవు. ఇలానే సూర్య మరిన్ని ఎత్తుల్ని అధిరోహించి త్వరలోనే నటులకు దక్కే అత్యుత్తమ పురస్కారం ఆస్కార్ ను సైతం సాధించాలని కోరుకుందాం.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.