కన్నడ పవర్ స్టార్ పునీత్

కన్నడ సినిమాలో రాజ్ కుమార్ కుటుంబానిది ఒక అధ్యాయం. రాజ్ కుమార్ కన్నడ సినిమాలో ఒక శకం. ఆ కుటుంబం నుండి వచ్చిన ఏ వ్యక్తిపైనైనా అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో అందరికీ తెలుసు. రాజ్ కుమార్ కుటుంబం నుండి హీరోగా అరంగేట్రం చేసిన పునీత్ రాజ్ కుమార్ తనదైన శైలిలో హీరోగా ఎదిగాడు. రాజ్ కుమార్ అనే మహావృక్షం కింద చిన్న మొక్కలా మొదలైన పునీత్ ప్రయాణం ఈరోజు ఆయనకు లక్షలాది మంది అభిమానులను సంపాదించి పెట్టింది. పునీత్ రాజ్ కుమార్ అంటే పేరు కాదు అది ఒక బ్రాండ్ అని అందరూ ఒప్పుకునేలా చేసింది.

దీని వెనుక కేవలం బ్యాక్ గ్రౌండ్ ఒకటే ఉంది అంటే అది చాలా పెద్ద తప్పు. పునీత్ తనను తాను మలుచుకున్న విధానం, ట్రైన్ చేసుకున్న విధానం, హీరోగా ఎదురుదెబ్బలు తిన్నా ఎలా పైకి లేచాడు, ఎలా వాటిని అధిగమించాడు అన్నవి అన్నీ ఎందరికో స్ఫూర్తి దాయకం. పునీత్ రాజ్ కుమార్ తన కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలను చూసాడు. ఈరోజు ఈ స్థాయిలో పునీత్ ఉన్నాడంటే అది కచ్చితంగా అతని హార్డ్ వర్క్, నిబద్దత, క్రమశిక్షణ కచ్చితంగా ఉన్నాయి. మరి పునీత్ రాజ్ కుమార్ జీవితాన్ని ఒకసారి తెరచి చూస్తే...

బాల్యం

రాజ్ కుమార్, పార్వతమ్మ దంపతులకు మార్చ్ 17, 1975న చెన్నైలో జన్మించాడు పునీత్ రాజ్ కుమార్. రాజ్ కుమార్ దంపతులకు మొత్తం ఐదుగురు సంతానం. అందులో పునీత్ చిన్నవాడు. పునీత్ అసలు పేరు లోహిత్. పునీత్ కాకుండా మరో ఇద్దరు కొడుకులు ఉన్నారు రాజ్ కుమార్ కు. పెద్దబ్బాయి శివ రాజ్ కుమార్ కూడా కన్నడ ఇండస్ట్రీలో పెద్ద హీరో. రాఘవేంద్ర, లక్ష్మి, పూర్ణిమ మిగిలిన సంతానం. పునీత్ కు ఆరేళ్ళు వయసున్నప్పుడు రాజ్ కుమార్ దంపతులు కర్ణాటకకు తరలివచ్చారు. పునీత్ బాల్యమంతా మైసూరులోనే గడిచింది. చిన్నతనంలో పునీత్ ను, పూర్ణిమను రాజ్ కుమార్ సినిమా సెట్స్ కు తీసుకునివచ్చేవారు.

పునీత్ రాజ్ కుమార్ చదువు మిగిలిన వారికి కొంత భిన్నంగా సాగింది. చిన్న వయసులోనే సినిమాల్లో ఎక్కువ నటించడంతో స్కూల్ కు వెళ్ళేవాడు కాదు పునీత్. తన చదువంతా కూడా ఇంట్లోనే ప్రైవేట్ టీచర్ ఆధ్వర్యంలో సాగింది. సినిమాల్లో ఎక్కువ నటించినా కూడా రాజ్ కుమార్ ఎక్కడా తన చిన్న కొడుకు చదువుకు ఆటంకం కలగకుండా చూసుకున్నాడు. మొత్తానికి పునీత్ రాజ్ కుమార్ కంప్యూటర్ సైన్స్ లో డిప్లొమా చేసారు.

సినీ ప్రయాణం

పునీత్ రాజ్ కుమార్ చాలా చిన్న వయసు నుండే సినిమాల్లో నటించేవాడు. 1976వ సంవత్సరంలో దర్శకుడు వి.సోమశేఖర్ లోహిత్ (పునీత్ రాజ్ కుమార్)ను ప్రేమడ కనికే చిత్రంలో నటింపజేశాడు. అప్పటికి పునీత్ వయసు కేవలం ఆరు నెలలు. అంటే అంత చిన్న వయసు నుండే నటించడం మొదలుపెట్టాడు. దాని తర్వాతి ఏడాది పునీత్ రాజ్ కుమార్, బి. విజయ రెడ్డి తెరకెక్కించిన సనాడి అప్పన్న చిత్రంలో నటించాడు. కృష్ణమూర్తి పురానిక్ అదే పేరుతో రచించిన నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా అప్పటికి పునీత్ వయసు 1 సంవత్సరం. మరోసారి వి. సోమశేఖర్ దర్శకత్వంలోనే తాయిగే తక్క మగ చిత్రంలో నటించాడు పునీత్. 1980లో దొరై-భగవాన్ ద్వయం వసంత గీత చిత్రంలో పునీత్ ను నటింపజేశారు.

చైల్డ్ ఆర్టిస్ట్ గానే వరసగా భూమిగే బండ భగవంత, భాగ్యవంత, హోస బెళక్కు, చలిసువ మోడగులు, భక్త ప్రహ్లాద, ఎరాడు నక్షత్రగలు, యారీవను, బెట్టాడా హువు, శివ మెచ్చిడ కన్నప్ప, పరశురామ్ చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెరిశాడు. వీటిలో చివరి మూడు సినిమాలకు పునీత్ రాజ్ కుమార్ పేరు మాస్టర్ పునీత్ గా క్రెడిట్స్ లో ఉంటుంది. మిగిలిన సినిమాలకు మాస్టర్ లోహిత్ గా క్రెడిట్స్ ఇచ్చారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా పునీత్ రాజ్ కుమార్ విశేషమైన ప్రతిభ చూపించారు. చివరిగా చైల్డ్ ఆర్టిస్ట్ గా తండ్రి సినిమా పరశురామ్ లో నటించాడు పునీత్.  అంతకు ముందు సినిమా శివ మెచ్చిడ కన్నప్పలో తన అన్న శివ సినిమాలో యుక్త వయసు కన్నప్ప పాత్రలో నటించాడు పునీత్.

రెండు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అందించే అవార్డులు, ఒక నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నాడు పునీత్ రాజ్ కుమార్. చలిసువ మోడగులు, ఎరాడు నక్షత్రగలు చిత్రాలకు కర్ణాటక ప్రభుత్వ అవార్డులు వరించగా బెట్టాడా హువు చిత్రానికి నేషనల్ అవార్డు వరించింది. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రూవ్ చేసుకోవడంతో పునీత్ రాజ్ కుమార్ కు కెరీర్ పరంగా మంచి బేస్ వచ్చిందనే చెప్పాలి.

అరంగేట్రం

1989 తర్వాత సినిమాలకు బ్రేక్ తీసుకున్న పునీత్ మళ్ళీ 2002లో హీరోగా అరంగేట్రం చేసాడు. తన మొదటి సినిమాగా అప్పు చిత్రాన్ని ఎంచుకున్నాడు. తెలుగులో టాప్ దర్శకుల్లో ఒకరైన పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకుడు. అప్పటికే శివ రాజ్ కుమార్ తో యువరాజ సినిమాను డైరెక్ట్ చేసి సూపర్ హిట్ కొట్టాడు. తెలుగులో సూపర్ హిట్ సాధించిన తమ్ముడు చిత్రానికి రీమేక్ అది. యువరాజ సూపర్ హిట్ కావడంతో రాజ్ కుమార్ కుటుంబానికి పూరి జగన్నాథ్ మీద గురి ఏర్పడింది. అందుకే పునీత్ ను హీరోగా లాంచ్ చేసే అవకాశాన్ని పూరికే ఇచ్చారు. రక్షిత హీరోయిన్ గా, అప్పటికే సంగీత దర్శకుడిగా టాప్ స్థానాన్ని ఆక్రమించిన గురు కిరణ్ ను తీసుకుని అప్పు సినిమాను తెరకెక్కించారు రాజ్ కుమార్ భార్య పార్వతమ్మ. వారి సొంత బ్యానర్ లో తెరకెక్కిన అప్పు చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. పునీత్ కు హీరోగా మంచి ఆరంభాన్నిచ్చింది. డ్యాన్సులతో, యాక్టింగ్ తో కూడా పునీత్ రాజ్ కుమార్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాడు. తాలిబన్ అల్లా అల్లా అనే పాటను కూడా పాడాడు పునీత్ రాజ్ కుమార్. 26 ఏప్రిల్ 2002లో విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో 200 రోజులు ఆడింది. ఈ చిత్రం పలు భాషల్లోకి రీమేక్ అయింది. తెలుగులో రవితేజ హీరోగా ఇడియట్ టైటిల్ తో ఈ సినిమా రీమేక్ అయింది. తెలుగు వెర్షన్ కు కూడా పూరి జగన్నాథ్ దర్శకుడు కావడం విశేషం. తమిళ్ లో 2003లో దమ్ గా ఈ సినిమా రీమేక్ అయింది. బెంగాలీలో హీరో, బంగ్లాదేశీ బెంగాలీలో ప్రియా అమర్ ప్రియా చిత్రంగా రీమేక్ అయింది. మొత్తానికి పునీత్ రాజ్ కుమార్ కు తొలి సినిమా మంచి ఫలితాన్నిచ్చింది.

తొలి సినిమా అందించిన విజయాన్ని నిలబెట్టుకోవాలని, పునీత్ రాజ్ కుమార్ కొంత గ్యాప్ తీసుకుని తన రెండో సినిమాను కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఆ సినిమానే అభి. ఈ చిత్రంలో కూడా కాలేజ్ స్టూడెంట్ గానే నటించాడు పునీత్, తొలి చిత్రంలో రక్షిత హీరోయిన్ గా పరిచయమైతే, రెండో సినిమాతో రమ్య హీరోయిన్ గా పరిచయమైంది. దినేష్ బాబు ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రానికి కూడా గురుకిరణ్ సంగీత దర్శకత్వం వహించాడు. అభి సినిమాకు కూడా పార్వతమ్మ రాజ్ కుమార్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలో కూడా పునీత్ ఒక పాట పాడాడు. మామ మామ మజ మాడు అనే పాటను పునీత్ ఆలపించగా, తన తండ్రి రాజ్ కుమార్ విధి బరహా సాంగ్ ను ఆలపించారు. అభి చిత్రం కూడా తెలుగులోకి రీమేక్ అయింది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా అభిమన్యు పేరిట రీమేక్ అయింది. కన్నడలో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా తెలుగులో మాత్రం ప్లాప్ గా నిలిచింది.

తర్వాతి ఏడాది పునీత్ రాజ్ కుమార్ మరోసారి పూరి జగన్నాథ్ తో కలిసి పనిచేసారు. కన్నడలో రెండు సినిమాలను డైరెక్ట్ చేసిన పూరి జగన్నాథ్, ఆ తర్వాత తెలుగులో ఫుల్ బిజీ అయిపోయాడు. వరసగా స్టార్ హీరోలతో సినిమాలు లైన్లో పడ్డాయి. ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున ఎన్టీఆర్ హీరోగా ఆంధ్రావాలా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సమాంతరంగా కన్నడలో వీర కన్నడిగగా రూపొందింది. పూరి జగన్నాథ్ కు అసిస్టెంట్ గా పనిచేసిన మెహర్ రమేష్ ఈ చిత్రాన్ని కన్నడలో డైరెక్ట్ చేసాడు. మెహర్ కు ఇదే తొలి చిత్రం కావడం విశేషం. ఆంధ్రావాలా 2004 జనవరి 1న తెలుగులో విడుదలైంది. వీర కన్నడిగ జనవరి 2న విడుదలైంది. తెలుగులో ఈ చిత్రం భారీ అంచనాలను అందుకోలేక డిజాస్టర్ గా నిలవగా కన్నడలో యావరేజ్ తో సరిపెట్టుకుంది. ఈ చిత్రానికి చక్రి సంగీతం అందించాడు. పునీత్ నటించిన తొలి రెండు సినిమాలకు ఇద్దరు కొత్త భామలు కథానాయికలుగా పరిచయమయ్యారు. మూడో సినిమాకు కూడా కొత్త హీరోయిన్ పరిచయమైంది. అనిత ఈ చిత్రం ద్వారా హీరోయిన్ గా అరంగేట్రం చేసింది.

పూరి జగన్నాథ్ తో పునీత్ రాజ్ కుమార్ ప్రయాణం నాలుగో సినిమాకు కూడా కొనసాగింది. 2003లో పూరి జగన్నాథ్ తెరకెక్కించిన అమ్మ, నాన్న ఓ తమిళమ్మాయి చిత్రం ఆధారంగా కన్నడలో మౌర్య చిత్రం తెరకెక్కింది. ఎస్ నారాయన్ ఈ చిత్రానికి దర్శకుడు కాగా రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత. అప్పటికే హీరోయిన్ గా తమిళ్, మలయాళం, తెలుగులో సినిమాలు చేసిన మీరా జాస్మిన్ కన్నడలో తొలి సారి నటించింది. ఈ రకంగా తన నాలుగో సినిమా ద్వారా కూడా కన్నడలోకి మరో హీరోయిన్ ను పరిచయం చేసాడు పునీత్. మౌర్య 16 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. వరసగా పునీత్ నటించిన నాలుగు చిత్రాలు 100 రోజులు ఆడి రికార్డును క్రియేట్ చేసాయి. పునీత్ రాజ్ కుమార్ స్టార్ హీరోగా మారుతున్నాడు.

పునీత్ రాజ్ కుమార్ తన ఐదవ చిత్రంగా ఆకాష్ చిత్రాన్ని చేసాడు. మహేష్ బాబు ఈ చిత్రానికి దర్శకుడు. అభి చిత్రంలో పునీత్ తో నటించిన రమ్య మరోసారి తనతో కలిసి ఆకాష్ చిత్రంలో నటించింది. ఈ సినిమా కూడా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. మరోసారి పునీత్ తన సొంత బ్యానర్ లో ఈ చిత్రాన్ని చేసాడు. పార్వతమ్మ రాజ్ కుమార్ ఈ చిత్రానికి నిర్మాత కావడం విశేషం. ఆకాష్ చిత్రానికి ఎడిటర్ గా పనిచేసిన ఎస్. మనోహర్ కు బెస్ట్ ఎడిటర్ గా నేషనల్ అవార్డు రావడం విశేషం. ఆర్పీ పట్నాయక్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. అప్పటిదాకా ఏడాదికి ఒక్క సినిమానే చేస్తూ వచ్చిన పునీత్ రాజ్ కుమార్ 2005లో మాత్రం రెండు సినిమాలు చేసాడు. ఆకాష్ తర్వాత నమ్మ బసవ చిత్రం అదే ఏడాది విడుదలైంది. ఈ చిత్రం ద్వారా మరో హీరోయిన్ ను పునీత్ రాజ్ కుమార్ కన్నడ ఇండస్ట్రీకి పరిచయం చేసాడు. బన్నీ సినిమాలో నటించిన గౌరీ ముంజల్ నమ్మ బసవ చిత్రంలో పునీత్ సరసన నటించింది.

కొత్త హీరోయిన్స్ తో నటించడం పునీత్ తర్వాత కూడా కంటిన్యూ చేసాడు. తన 6వ చిత్రంగా అజయ్ ను చేసాడు పునీత్. తన కెరీర్ లో ఎక్కువగా సినిమాల్లో పోషించిన పాత్రల పేర్లనే టైటిల్స్ గా వాడుతుండడం జరిగేది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన ఒక్కడు చిత్రానికి రీమేక్ గా అజయ్ తెరకెక్కింది. తెలుగులో గుణశేఖర్ డైరెక్ట్ చేసిన చిత్రాన్ని కన్నడలో మెహర్ రమేష్ తెరకెక్కించాడు. పునీత్ సరసన హీరోయిన్ గా అనురాధ మెహతా నటించింది. అప్పటికే ఆర్య చేసిన అనురాధకు కన్నడలో అజయ్ నే తొలి చిత్రం కావడం విశేషం. అజయ్ కన్నడ ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. శాండల్ వుడ్ ఇండస్ట్రీ పవర్ స్టార్ గా పునీత్ రాజ్ కుమార్ ఈ చిత్రంతోనే అవతరించాడు. ఒక్కడు సినిమాకు సంగీతం అందించిన మణిశర్మ, అజయ్ కు కూడా సంగీత దర్శకుడిగా పనిచేసాడు.

ఆకాష్ సినిమాకు కలిసి పనిచేసిన పునీత్, మహేష్ బాబు మరోసారి అరసు అనే చిత్రానికి పనిచేసారు. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం పునీత్ ఇమేజ్ ను మరింత పెంచింది. పునీత్ నటనకు గాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును సొంతం చేసుకున్నాడు పునీత్. తన సొంత బ్యానర్ పైనే ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో హీరోయిన్లుగా రమ్య, మీరా జాస్మిన్ నటించారు. అదే ఏడాది అంటే 2007 లోనే పునీత్ రాజ్ కుమార్ మిలనా అనే మరో చిత్రాన్ని చేసాడు. ఈ చిత్రం ద్వారా పాపులర్ మలయాళ హీరోయిన్ పార్వతి కన్నడలో ఎంట్రీ ఇచ్చింది. ఆమెతో పాటు పూజ గాంధీ కూడా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. పునీత్ కెరీర్ లో అతిపెద్ద విజయాల్లో మిలనా కూడా ఒకటి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ చిత్రం ఏకంగా 500 రోజుల పాటు ఆడింది. 2013లో తమిళ్ లో విడుదలైన రాజా రాణి చిత్రం, 2007లో వచ్చిన ఈ మిలనా చిత్ర కాన్సెప్ట్స్ దాదాపుగా ఒకలాగే ఉండడం విశేషం. మిలనా చిత్రంలో పునీత్ నటనకు గాను ఉత్తమ నటుడిగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ అవార్డు, సువర్ణ ఫిల్మ్ అవార్డును కూడా గెలుచుకున్నాడు.

2008లో బిందాస్ చిత్రంలో నటించాడు పునీత్ రాజ్ కుమార్. ఈ సినిమా ద్వారా హన్సిక కన్నడ ఇండస్ట్రీలో అరంగేట్రం చేసింది. నిజానికి ఆమె చేసిన ఒకే ఒక్క కన్నడ చిత్రం బిందాస్. డి. రాజేంద్ర బాబు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా, ఎం. చంద్రశేఖర్ నిర్మించాడు. మరోసారి గురుకిరణ్ పునీత్ రాజ్ కుమార్ సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేసాడు. 2008లోనే పునీత్ వంశీ చిత్రంలో నటించాడు. మిలనా కాంబో మరోసారి రిపీట్ అయింది. ప్రకాష్ వంశీ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. ఈ సినిమా ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందింది. నిఖిత ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. క్రిటిక్స్ ఈ చిత్రానికి బిలో యావరేజ్ రేటింగ్స్ ఇచ్చారు. మిలనా మ్యాజిక్ ను మరోసారి క్రియేట్ చేయలేకపోయారని అన్నారు. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం వంశీ మంచి ఫలితాన్నే అందుకుంది. 12 కేంద్రాల్లో ఈ చిత్రం 100 రోజులు ప్రదర్శింపబడింది. ఈ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా సౌత్ స్కోప్ అవార్డును సైతం గెలుచుకున్నాడు పునీత్ రాజ్ కుమార్.

కెరీర్ ఇలా హై రేంజ్ లో సాగిపోతోన్న సమయంలో పునీత్ చేసిన సినిమా రాజ్ - ది షో మ్యాన్. పునీత్ కెరీర్ లోనే అప్పట్లో హయ్యస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఇది. పునీత్ అభిమానులు ఎప్పుడూ లేని విధంగా 5 రోజుల ముందు నుండే ఈ సినిమా టికెట్ల కోసం ఎగబడ్డారు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అయితే రాజ్ - ది షో మ్యాన్ అభిమానుల భారీ అంచనాలను అందుకోలేక యావరేజ్ గా నిలిచింది. ఈ చిత్రం ద్వారా ప్రియాంక కొఠారి హీరోయిన్ గా కన్నడ ఇండస్ట్రీకి పరిచయమైంది. అదే ఏడాది పునీత్ చేసిన మరో చిత్రం రామ్. తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన రెడీ సినిమాకు రీమేక్ ఈ రామ్. పునీత్ సరసన ప్రియమణి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని కె మాదేష్ డైరెక్ట్ చేసాడు. రామ్ కు పాజిటివ్ రివ్యూస్ వచ్చినా కానీ ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో లేదు. అయితే మూడో రోజు నుండి రామ్ కలెక్షన్స్ పుంజుకున్నాయి. దాదాపు 20 కోట్లు వసూలు చేసింది రామ్. ఏకంగా 25 వారాలు థియేటర్లలో సందడి చేసింది.

2010లో పునీత్ చేసిన ప్రిథ్వి చిత్రం పునీత్ కు వింత అనుభవం అనే చెప్పాలి. జాకబ్ వర్గీస్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి యావరేజ్ రేటింగ్స్ అందుకుంది. ఏ సెంటర్ ప్రేక్షకులు ఆదరించినా బి,సి సెంటర్స్ లో మాత్రం ఈ చిత్రం ఫెయిల్ అయింది. అయితే తర్వాత టివిలలో ప్రసారమైనప్పుడు మాత్రం కల్ట్ స్టేటస్ ను తెచ్చుకుంది. 2010ను యావరేజ్ తో ఆరంభించిన పునీత్ కు అదే ఏడాది బ్లాక్ బస్టర్ విజయం వరించింది. దునియా సూరి దర్శకత్వంలో వచ్చిన జాకీ చిత్రం ఆ ఏడాది సూపర్ హిట్స్ లో హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచింది. పునీత్ సరసన భావన ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా దాదాపుగా అన్ని రికార్డులను పటాపంచలు చేసింది. ఈ సినిమాలో తన పెర్ఫార్మన్స్ తో పలు అవార్డులను సొంతం చేసుకున్నాడు పునీత్. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పురస్కారం, సువర్ణ ఫిల్మ్ అవార్డు, ఉదయ ఫిలిం అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు.

2011లో పునీత్ రాజ్ కుమార్ మరోసారి మాదేష్ తో కలిసి పనిచేసాడు. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన నాడోడిగళ్ చిత్రం, (తెలుగులో శంభో శివ శంభో) హుడుగరు టైటిల్ తో రీమేక్ చేసాడు పునీత్ రాజ్ కుమార్. యోగేష్, శ్రీనగర్ కిట్టి ఈ సినిమాలో సపోర్టింగ్ రోల్స్ చేసారు. జాకీ సక్సెస్ ను హుడుగారుతో కంటిన్యూ చేసాడు పునీత్ రాజ్ కుమార్. పునీత్ తన కెరీర్ లో ఎక్కువగా విజయాలనే అందుకున్నాడు. వరసగా జాకీ, హుడుగారు చిత్రాలు పునీత్ కెరీర్ ను పీక్స్ స్టేజ్ కు తీసుకెళితే ఆ తర్వాత చేసిన పరమాత్మ చిత్రం దాన్ని కంటిన్యూ చేసింది. యోగరాజ్ భట్ దర్శకత్వంలో తెరకెక్కిన పరమాత్మ కల్ట్ స్టేటస్ ను సాధించింది.

వరస విజయాలతో ఊపు మీదున్న పునీత్ కెరీర్ అన్న బాండ్ చిత్రంతో కొంచెం డౌన్ అయింది. ఎందుకంటే ఆ ఏడాది వచ్చిన నిరుత్సాహకారమైన చిత్రాల్లో అన్న బాండ్ కూడా చోటు సంపాదించుకుంది. క్రిటిక్స్ నుండి, అభిమానుల నుండి కూడా విమర్శలు ఎదుర్కొన్న ఈ చిత్రం భారీ ప్లాప్ ను మూటగట్టుకుంది. ఆ తర్వాత తమిళంలో సముద్రఖని తెరకెక్కించిన పోరాలి చిత్రాన్ని రీమేక్ చేసాడు పునీత్ రాజ్ కుమార్. కన్నడ చిత్రానికి యారే కూగడలి అనే టైటిల్ ను ఫిక్స్ ఫిక్స్ చేసారు. కన్నడ వెర్షన్ కు కూడా సముద్రఖని దర్శకత్వం వహించడం విశేషం. ఈ చిత్రం 49 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది.

2014లో నిన్నిందలే చిత్రంలో నటించాడు పునీత్ రాజ్ కుమార్. ఈ సినిమాకు పాపులర్ తెలుగు దర్శకుడు జయంత్ సి పరాంజీ తెరకెక్కించాడు. ఎప్పటినుండో జయంత్ కన్నడలో చిత్రాన్ని చేయాలనుకున్నాడు. తన దగ్గర ఉన్న ఒక రొమాంటిక్ కామెడీ డ్రామాను పునీత్ తో తెరకెక్కించాడు. హోంబేలె ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. మిస్ ఇండియా ఫైనలిస్ట్ ఎరికా ఫెర్నాండేజ్ ను హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నారు. ఈమెకిదే తొలి కన్నడ సినిమా. 2014లో పునీత్ కెరీర్ లో మరో ముఖ్యమైన సినిమా విడుదలైంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన దూకుడు చిత్రాన్ని పవర్ పేరుతో రీమేక్ చేసాడు పునీత్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. పునీత్ సరసన హీరోయిన్ గా త్రిష నటించింది. పునీత్ కెరీర్ లోనే ఈ సినిమా హయ్యస్ట్ కలెక్షన్స్ ను సాధించింది. దాదాపు 45 కోట్ల రూపాయలను వసూలు చేసింది ఈ చిత్రం. పవర్ ట్యాగ్ ను పునీత్ రాజ్ కుమార్ సార్ధకం చేసుకున్నాడు.

2015లో పునీత్ రాజ్ కుమార్ మైత్రి అనే సినిమాలో కామియో పాత్రలో నటించాడు. ఇదే చిత్రంలో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ మరో కామియో పాత్రను పోషించడం విశేషం. మైత్రి చిత్రం ఆ ఏడాది విడుదలైన అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ చిత్రం కర్ణాటక రాష్ట్ర మూడో ఉత్తమ చిత్రంగా ఆ ఏడాది నిలిచింది. అదే ఏడాది పునీత్ రాజ్ కుమార్, పవన్ వడయార్ దర్శకత్వంలో చేసిన రణ విక్రమ యావరేజ్ గా నిలిచింది. ఈ సినిమాలో పునీత్ డబల్ రోల్ లో నటించాడు. అంజలి, ఆదా శర్మ హీరోయిన్లుగా నటించారు. ఆదా శర్మకు ఇదే తొలి కన్నడ చిత్రం కావడం విశేషం.

తర్వాతి ఏడాది ఎం. శరవణన్ దర్శకత్వంలో పునీత్ రాజ్ కుమార్ చక్రవ్యూహ చిత్రంలో నటించాడు. రచిత రామ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించాడు. ఈ చిత్రంలో మరో విశేషం ఏమిటంటే గెలయా గెలయా సాంగ్ ను మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆలపించాడు. అలాగే మరోపాట ఎనైతూ ను పునీత్ తో కలిసి కాజల్ అగర్వాల్ పాడటం విశేషం. విడుదలకు ముందే ఈ చిత్రం భారీ లాభాలను ఆర్జించింది. దాదాపు 30కోట్ల రూపాయలకు చక్రవ్యూహ థియేట్రికల్, శాటిలైట్ రైట్స్ ను అమ్మేసారు.

2016లో దొడ్డమనే హుడ్గా చిత్రంలో నటించాడు పునీత్ రాజ్ కుమార్. దునియా సూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది మూడో చిత్రం కావడం విశేషం. విడుదలకు ముందే బోలెడంత హైప్ క్రియేట్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సాగించింది. దొడ్డమనే హుడిగా ఏకంగా 50 కోట్ల మార్క్ ను దాటేయడం విశేషం. ఈ చిత్రంలో హీరోయిన్ గా రాధికా పండిట్ నటించింది. పునీత్ కెరీర్ లో ఒక సినిమాను మించిన సక్సెస్ దాని నెక్స్ట్ సినిమాతోనే కొట్టడం అలవాటు. ఇలా వరస సక్సెస్ లతోనే చాలా తక్కువ కాలంలోనే టాప్ పోజిషన్ కు చేరుకొని దాన్ని పదిలపరుచుకున్నాడు పునీత్ రాజ్ కుమార్.

2017లో పునీత్ నటించిన రాజకుమార అప్పటిదాకా నెలకొని ఉన్న రికార్డులను తుడిచిపెట్టేసింది. సంతోష్ ఆనందఱం ఈ చిత్రానికి దర్శకుడు కాగా హోంబేలె ఫిల్మ్స్ రాజకుమారను నిర్మించింది. ఈ చిత్రం భారీ సక్సెస్ ను అందుకుంది. 75 కోట్ల రూపాయలను రాబట్టి పునీత్ కెరీర్ లో హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచింది. విడుదలైన మొదటి ఆరు వారాల్లోనే ఏకంగా 6,000 షోస్ ను మల్టిప్లెక్స్ లలో పూర్తి చేసుకుంది ఈ చిత్రం. దీన్ని బట్టి ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించింది అనేది అర్ధం చేసుకోవచ్చు. రాజకుమారలో ప్రియా ఆనంద్ హీరోయిన్ గా నటించింది. ఆమెకు ఇదే తొలి కన్నడ చిత్రం.

తమిళంలో సూపర్ హిట్ సాధించిన మాస్ మసాలా చిత్రం పూజై (తెలుగులో పూజ)ను పునీత్ రాజ్ కుమార్ అంజనీ పుత్రగా రీమేక్ చేసాడు. ఈ సినిమాలో అప్పట్లో కన్నడలో కిరిక్ పార్టీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన రష్మిక హీరోయిన్ గా నటించింది. పక్కా మసాలా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం డీసెంట్ హిట్ గా నిలిచింది. 50 కోట్ల రూపాయల షేర్ ను సాధించింది ఈ చిత్రం. పునీత్ రాజ్ కుమార్ తన కెరీర్ లో మొత్తం నాలుగు చిత్రాల్లో కామియో పాత్రలు పోషించాడు. అందులో ఒకటి మైత్రి కాగా మిగతా మూడు చిత్రాలు హంబుల్ పొలిటీషియన్ నాగరాజ్, పడ్డే హులి, మాయాబజార్ 2016. 2017లో అంజనీ పుత్ర తర్వాత పునీత్ రాజ్ కుమార్ ఏడాది బ్రేక్ తీసుకున్నాడు.

ఆ తర్వాతి ఏడాది చేసిన చిత్రం నటసార్వభౌమ. ఈ నటసార్వభౌమ చిత్రాన్ని పవన్ వడయార్ డైరెక్ట్ చేసాడు. మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించి కన్నడ ఇండస్ట్రీలో డెబ్యూ చేసింది. ఈ సినిమా భారీ హైప్ మధ్య విడుదలైంది. తొలి రోజు ఏకంగా 1,394 షోస్ కేవలం కర్ణాటకలోనే పడ్డాయి అంటే పునీత్ స్థాయి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. నటసార్వభౌమ పునీత్ కెరీర్ లో మరో విజయాన్ని జమయ్యేలా చేసింది. 2019 తర్వాత పునీత్ కెరీర్ లో మరోసారి ఏడాది బ్రేక్ వచ్చింది. కోవిడ్ కారణంగా 2020లో పునీత్ సినిమా విడుదల కాలేదు.

2021 ఏప్రిల్ 1న విడుదలైన చిత్రం యువరత్న. సంతోష్ ఆనందఱం ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. ఎస్ థమన్ సంగీత దర్శకుడు. సయేశా సైగల్ ఈ సినిమా ద్వారా కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కోవిడ్ సెకండ్ వేవ్ భయాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాగానే పెర్ఫర్మ్ చేసింది. ఈ చిత్రం విడుదలైన కొన్ని రోజులకే కర్ణాటక ప్రభుత్వం థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ రూల్ ను తీసుకొచ్చారు కానీ ఇండస్ట్రీ మొత్తం దీన్ని వ్యతిరేకించింది. దీంతో కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో తర్వాతి వారం నుండి ఈ రూల్ అమలయ్యేలా కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇన్నేళ్ల తన కెరీర్ లో తొలిసారి పునీత్ తన సినిమాను తెలుగులో డబ్ చేసి కన్నడ వెర్షన్ తో పాటుగా విడుదల చేసాడు. ప్రస్తుతం జేమ్స్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు పునీత్. చేతన్ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో ప్రియా ఆనంద్ హీరోయిన్ గా నటిస్తోంది.

గానం

పునీత్ రాజ్ కుమార్ బహుముఖ ప్రజ్ఞాశాలి. సినిమాల్లో నటించడమే కాదు. పాటలు పాడటం కూడా ఆయనకు ఎంతో ఇష్టం. పునీత్ ఆరేళ్ళ వయసు నుండే సినిమాల్లో పాటలు పాడటం ప్రారంభించాడు. మొట్టమొదటి సారి 1981లో భాగ్యవంత చిత్రంలో రెండు పాటలు పాడాడు పునీత్ రాజ్ కుమార్. ఇక అక్కడి నుండి గాయకుడిగా పునీత్ ప్రస్థానం ఎక్కడా ఆగలేదు. వరసగా పాటలు పాడుతూ వచ్చాడు. సినిమా హీరో అయ్యాక కూడా సంగీతాన్ని విడిచిపెట్టలేదు. కేవలం తన సినిమాలే కాక తన అన్న శివరాజ్ కుమార్ సినిమాలు, ఇతర హీరోల సినిమాల్లో కూడా పునీత్ పాటలు పాడాడు. ఇప్పటివరకూ వందకు పైగా పాటలు పాడిన పునీత్ రాజ్ కుమార్, గాయకుడిగా పలు అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు.

* అధ్యక్ష చిత్రంలో అధ్యక్ష అధ్యక్ష పాట పాడిన పునీత్ కు జీ కన్నడ మ్యూజిక్ అవార్డ్ వరించింది.

* అంతే కాకుండా మూడు సార్లు ఫిల్మ్ ఫేర్, ఒకసారి ఐఫా అవార్డ్స్ కు కూడా ఉత్తమ గాయకుడిగా నామినేషన్స్ దక్కాయి.

పునీత్ రాజ్ కుమార్ పలు సినిమాలకు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాడు. తన కెరీర్ లో ఇప్పటివరకూ నాలుగు సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చాడు పునీత్. ఆ చిత్రాలే బహద్దూర్, అమోలి, రాజరాత, ఇండియా వెర్సస్ ఇంగ్లాండ్ సినిమాలకు వాయిస్ ఓవర్ అందించాడు.

నిర్మాత

పునీత్ రాజ్ కుమార్ నిర్మాతగా కూడా పలు సినిమాలకు వ్యవహరించాడు. 2019 నుండి పునీత్ నిర్మాతగా యాక్టివ్ గా ఉంటున్నాడు. 2019లో పునీత్ తొలిసారిగా కవలుదారీ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమాను హేమంత్ఎం రావు డైరెక్ట్ చేసాడు. కవలుదారి కన్నడ ఇండస్ట్రీలో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రీమేక్ చేసారు. తెలుగులో ఈ చిత్రాన్ని సుమంత్ హీరోగా కపటదారి టైటిల్ తో విడుదల చేసారు. కన్నడలో విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో మాత్రం పరాజయం పాలైంది.

పునీత్ రాజ్ కుమార్ తన బ్యానర్ లో విభిన్నమైన సినిమాలను నిర్మించడం మొదలుపెట్టాడు. మొదటి ప్రయత్నం విజయం సాధించడంతో రెండో ప్రయత్నంగా మాయాబజార్ 2016ను నిర్మించాడు. ఈ సినిమా కూడా విజయవంతంగా ప్రదర్శింపబడింది. ఈ చిత్రాన్ని తమిళంలో నాంగ రొంబ బిజీ పేరుతో రీమేక్ చేసారు. పునీత్ నిర్మాతగా చేసిన మూడో సినిమా లా. ఈ చిత్రం డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. తన నాలుగో సినిమా ఫ్రెంచ్ బిర్యానీ కూడా అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ రిలీజ్ అయింది. ప్రస్తుతం పునీత్ నిర్మాతగా రెండు సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఫ్యామిలీ ప్యాక్, వన్ కట్ టూ కట్ ఏన్ ఫ్లవర్ ఈజ్ కమింగ్ అనే రెండు చిత్రాలను నిర్మిస్తున్నాడు పునీత్.

పునీత్ రాజ్ కుమార్ స్మాల్ స్క్రీన్ లో కూడా కనిపించాడు. పలు షో లకు హోస్ట్ గా, కొన్నిటికి జడ్జిగా వ్యవహరించాడు పునీత్ రాజ్ కుమార్. కన్నడద కొట్యాధిపతి (తెలుగులో ఎవరు మీలో కోటీశ్వరులు) షో ను రెండు సీజన్స్ పాటు హోస్ట్ గా వ్యవహరించాడు. 2012, 2013లలో ఈ షో ను విజయవంతంగా నడిపించాడు. అలాగే యూపీ స్టార్టర్స్ కు జడ్జిగా వ్యవహరించాడు. వీకెండ్ విత్ రమేష్ అనే కార్యక్రమానికి గెస్ట్ గా విచ్చేసాడు. 2017, 2018 సంవత్సరాలలో ఫ్యామిలీ పవర్ షో ను హోస్ట్ చేసాడు. 2019లో మూడోసారి కన్నడద కొట్యాధిపతి షో కు హోస్ట్ గా వ్యవహరించాడు.

పునీత్ కు సామాజిక సేవా కార్యక్రమాలు అంటే కూడా చాలా ముక్కువ. ఎక్కువగా తన తల్లి పార్వతమ్మతో కలిసి సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటాడు పునీత్. మైసూరులో ఉన్న శక్తి ధర్మ ఆశ్రమం మంచి చెడ్డలు చూసుకుంటారు. అలాగే పలు మార్లు విపత్తు సమయాల్లో తన వంతు సహాయ సహకారాలు అందించి తన పెద్ద మనసు చాటుకున్నాడు.

ప్రచారకర్త

కన్నడలో టాప్ హీరో అవడంతో ప్రచారకర్తగా కూడా పునీత్ కు చాలా డిమాండ్ ఉంది. ఇప్పటివరకూ తన కెరీర్ లో ఎన్నో బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరించాడు పునీత్. నందిని మిల్క్ ప్రొడక్ట్స్, ఎల్ఈడి బల్బ్ ప్రాజెక్ట్, 7 అప్, ఎఫ్ స్క్వేర్, డిక్సీ స్కాట్, మలబార్ గోల్డ్, గోల్డ్ విన్నర్, జివోస్ మొబైల్, పోతీ సిల్క్స్, ఫ్లిప్ కార్ట్, మణప్పురం బ్రాండ్లను ప్రమోట్ చేసాడు పునీత్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలంజెర్స్ బెంగళూరు టీమ్ కు బ్రాండ్ అంబాసడర్ గా ఉన్నాడు. పునీత్ కు ఒక సొంత టీమ్ కూడా ఉంది. బెంగళూరు 5,ప్రీమియర్ ఫుట్సాల్.

పిఆర్కె ఆడియో లేబుల్ ను స్థాపించాడు పునీత్ రాజ్ కుమార్. యూట్యూబ్ లో ఈ ఛానల్ కు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ పైగా ఉన్నారు.

అవార్డ్స్

పునీత్ రాజ్ కుమార్ తన సుదీర్ఘమైన కెరీర్ లో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు.

* 1985లో బెట్టాడా హువు చిత్రంలో బాల నటుడిగా నేషనల్ అవార్డును గెలుచుకున్నాడు పునీత్ రాజ్ కుమార్.

* పునీత్ తన కెరీర్ లో మొత్తం నాలుగు సార్లు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డులను సొంతం చేసుకున్నాడు. 1982-83 కాలంలో చలిసువ మోడగలు, 1983-84 సమయంలో ఎరాడు నక్షత్రగలు, 2007-08 కాలంలో మిలనా, 2010-11లో జాకీ సినిమాలకు కర్ణాటక రాష్ట్ర పురస్కారాలు దక్కాయి. మొదటి రెండు సినిమాలు బాల నటుడిగా గెలుచుకున్న పునీత్, తర్వాతి రెండు చిత్రాలు ఉత్తమ నటుడిగా గెలుచుకున్నవి.

* తన కెరీర్ లో మొత్తం నాలుగు సార్లు సైమా పురస్కారాలను సొంతం చేసుకున్నాడు పునీత్ రాజ్ కుమార్.

* 2011లో హుడుగారు, 2012లో అన్న బాండ్, 2016లో రణ విక్రమ, 2017లో దొడ్డమనే హుడిగా, 2018లో రాజకుమార చిత్రాలకు ఉత్తమ నటుడిగా సైమా పురస్కారాలకు నామినేట్ అయ్యాడు. ఇందులో హుడుగారు, రణ విక్రమ, రాజకుమార చిత్రాలకు అవార్డులు సైతం గెలుచుకున్నాడు.

* ఫిలిం ఫేర్ అవార్డ్స్ సౌత్ కూడా మొత్తం 5 సార్లు గెలుచుకున్నాడు పునీత్ రాజ్ కుమార్. బెట్టాడా హువు, అరసు, హుడుగారు, రణ  విక్రమ, రాజకుమార చిత్రాలకు ఫిల్మ్ ఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నాడు.

* మిలనా, జాకీ, అన్న బాండ్ చిత్రాలకు సువర్ణ ఫిల్మ్ అవార్డ్స్ ను గెలుచుకున్నాడు.

* వంశీ, రాజ్ - ది షో మ్యాన్ చిత్రాలకు సౌత్ స్కోప్ అవార్డులను సొంతం చేసుకున్నాడు.

* ఇవన్నీ కాకుండా వివిధ సంస్థలకు చెందిన అవార్డులను అరడజనుకు పైగా పునీత్ గెలుచుకున్నాడు.

మనం ముందే మాట్లాడుకున్నట్లు ఎంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చాము అన్నది ముఖ్యం కానే కాదు. ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి మనం ఎలాంటి కసరత్తులు చేస్తున్నాం అనేదే ముఖ్యం. పునీత్ ఈ విషయంలో ఫుల్ మార్క్స్ సాధించాడు. తన తండ్రి వారసత్వం నుండి, ఇంట్లోనే తన అన్న నుండి పోటీ ఉన్నా కానీ పునీత్ రాజ్ కుమార్ తన ప్రత్యేకతను నిలుపుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్స్ గానే జాతీయ పురస్కారం గెలుచుకున్న వ్యక్తి నటన గురించి ఇక మనం కొత్తగా మాట్లాడుకునేది ఏముంటుంది? ఇప్పటికే ఎన్నో శిఖరాలు అధిరోహించిన పునీత్ రాజ్ కుమార్ మరిన్ని విజయాలను అందుకోవాలని, నేషనల్ వైడ్ గా కూడా స్టార్ గా వెలుగొందాలని కోరుకుందాం.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.