
మురళి మోహన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. దాదాపుగా 5 దశాబ్దాల పాటు తెలుగులో నటుడిగా ఎన్నో పాత్రలు పోషించారు. ఒక్క నటుడిగానే కాకుండా నిర్మాతగా , రాజకీయ నాయకుడిగా , రియల్ ఎస్టేట్ కింగ్ గా ఆయన చక్రం తిప్పారు.80ఏళ్ల వయసులో ఎంతో యంగ్ గా కనిపించే మురళి మోహన్ గారికి సినిమాలంటే అమితమైన ఇష్టం.

మురళీ మోహన్ గారి అసలు పేరు రాజా రాంమోహన్ రావు. ఆయన 1940, జూన్ 24వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలోని చాటపర్రు గ్రామంలో మాగంటి మాధవరావు , వసుమతిదేవి దంపతులకి జన్మించారు. మురళి మోహన్ గారి తండ్రి మాగంటి మాధవరావు స్వాతంత్ర్య సమరయోధుడు.మురళి మోహన్ గారి విద్యాభ్యాసం అంత ఏలూరులో గడిచింది.చదువు ముగిశాక 1963లో ఎలెక్ట్రికల్ మోటార్లు, ఆయిల్ ఇంజన్ల వ్యాపారన్ని మురళి మోహన్ గారు ప్రారంభించాడు. ఆ వ్యాపారం చేస్తూ విజయవాడలో నాటకాలలో నటించడం మొదలు పెట్టాడు.
సినీ ప్రయాణం

మురళి మోహన్ కుటుంబ వ్యాపారం చూసుకుంటూ మద్రాస్ కి తరచూ వెళ్ళేవారు. అప్పట్లో ప్రముఖ స్టిల్ ఫోటోగ్రాఫర్ ‘మన’సత్యం దగ్గరకు ఓ మిత్రుణ్ణి ఫోటో తీయించడానికి మోహన్ గారు వెళ్ళారు. ఆ సమయంలో ‘నువ్వే హీరోలా ఉన్నావ్, సినిమాల్లో ట్రై చేయరాదూ’ అంటూ సత్యం ఆయనకి సలహా ఇచ్చారు. దాంతో మురళీమోహన్ కూడా సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టారు. అప్పటికే ఆయన మిత్రులు కొందరు చిత్రసీమలో ఉండడంతో మురళీమోహన్ కూడా ఉత్సాహంగా సినిమా రంగంవైపు పరుగులు తీశారు. 1973లో ‘జగమే మాయ’ చిత్రంలో తొలిసారి నటించిన మురళీమోహన్ ఆ తరువాత హీరో వేషాలే వేస్తాను అని కూర్చోలేదు. తన దగ్గరకు వచ్చిన ప్రతీపాత్రకు న్యాయం చేస్తూ పోయారు. దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, క్రాంతికుమార్, ఛటర్జీ, విజయబాపినీడు వంటివారు ఆయనకు మంచి పాత్రలు ఇచ్చి ప్రోత్సహించారు. కొన్నిసార్లు హీరోని చేస్తే, మరికొన్ని సార్లు క్యారెక్టర్ యాక్టర్ గానూ మంచి మంచి పాత్రలు ఇచ్చేవారు. అప్పట్లో ఆయన సినిమాల స్పీడ్ చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. మురళీమోహన్ నటజీవితంలో 1978వ సంవత్సరం మరపురానిది. ఆ సమయంలో ఎన్టీఆర్ గారు ఓ వైపు పదికి పైగా చిత్రాల్లో నటించారు. మరోవైపు ఏయన్నార్ కూడా ఐదు సినిమాలు విడుదల చేసారు. ఇక కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, చంద్రమోహన్ – ఇలా అందరూ వరుస సినిమాలు విడుదల చేశారు. ఆ సంవత్సరం అన్ని సినిమాలు విడుదలైన కూడా మురళీమోహన్ హీరోగా రూపొందిన ‘పొట్టేలు పున్నమ్మ’ అనూహ్య విజయం సాధించి, ఆ ఏడాది బ్లాక్ బస్టర్ గా నిలచింది. అందువల్ల ఆ సంవత్సరం మురళీమోహన్ కు మరపురానిది అని చెప్పవచ్చు.

మురళీమోహన్ హీరోగా నటించిన అనేక చిత్రాలు విజయం సాధించాయి. అయినా సైడ్ హీరో రోల్స్ ను మాత్రం వీడలేదు. ‘స్వీయ లోపంబెరుగుట పెద్ద విద్య’ అన్న మీర్జా గాలిబ్ సూక్తిని ఏయన్నార్ తు.చ తప్పక పాటించేవారు. ఆయన సలహాతోనే మురళీమోహన్ తన దరికి చేరిన పాత్రల్లో నటించారు. ఒక ఏడాదిలో మురళి మోహన్ గారివి ఏకంగా 26సినిమాలు విడుదలయ్యాయి. ప్రతి శుక్రవారం ఆయన కొత్త సినిమా ఒకటి రిలీజ్ అవుతూనే ఉండేది. హీరోగా మంచి స్థాయిలో ఉన్నప్పుడే ఆయన సోదరుడు గిరిబాబు తో ‘జయభేరి’ సంస్థ నెలకొల్పి తెరకెక్కించిన చిత్రాల్లో మురళీమోహన్ కీలక పాత్రలు పోషించారు. తరువాత అదే బ్యానర్ ను మురళీమోహన్ సొంతం చేసుకొని అనేక మరపురాని చిత్రాలను నిర్మించారు. కొన్నిట తానే హీరోగా నటించారు. మరికొన్నిటిలో ఇతరులను హీరోలుగా పెట్టి సినిమాలు తెరకెక్కించారు. ఆయన నూరవ చిత్రంగా రూపొందిన ‘పిచ్చి పంతులు’ కూడా జయభేరీ చిత్రమే. ఆ సినిమా మంచి విజయం సాధించింది. అదే సమయంలో ఎన్టీఆర్ రాజకీయప్రవేశం చేశారు. అందులో “రామయ్యా రావయ్యా…” అంటూ రూపొందించిన పాట ఆ రోజుల్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే మురళీమోహన్ హైదరాబాద్ మకాం మార్చారు. 90వ దశకంలో మురళి మోహన్ గారు మెల్లగా సహాయ నటుడి పాత్రలు చేయడం మొదలుపెట్టారు.అలా ఆయన చేసిన గ్యాంగ్ లీడర్ సినిమా ఆయన కెరీర్ లోనే కాకుండా

మెగాస్టార్ చిరంజీవి కెరియర్‌లో కూడా ఓ స్పెషల్ సినిమా. ఈ సినిమాలో చిరంజీవి అన్నయ్య గా ఆయన నటించారు. ఆయన పాత్రకి కూడా మంచి పేరు వచ్చింది. ఇక ఈ సినిమా నుంచే చిరంజీవీ అసలు సిసలు మెనియా స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాతోనే చిరంజీవి నటన, స్టైల్, డ్యాన్స్ కుర్రకారును ఉర్రూతలూగించింది. గ్యాంగ్ లీడర్‌లో ప్రతి సీను అదరిపోయింది. ఈ మూవీ అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులతో చెడుగుడు ఆడుకుంది. ఆయన కెరీర్‌లోనే బెస్ట్ మాస్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది గ్యాంగ్ లీడర్. నిర్ణయం, ఆవిడ మా ఆవిడే లాంటి సినిమాలు ఆయన ప్రొడక్షన్ లో సూపర్ హిట్స్ అయ్యాయి.

ఇక తమ జయభేరీ పతాకంపై ఆయన నిర్మించిన చివరి చిత్రం ‘అతడు’. ముందుగా ఈ సినిమాని పద్మాలయా బ్యానర్ పైనే సినిమా తీద్దామని వారు భావించారు హీరో కృష్ణ.. కానీ త్రివిక్రమ్ టాలెంట్ ని ముందే గుర్తించిన నటుడు, మురళీ మోహన్ తన జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఓ సినిమా చేయాలని అడ్వాన్స్ ఇవ్వడంతో ఈ సినిమా కృష్ణకి మిస్ అయింది మహేష్ బాబు పెళ్లి తర్వాత విడుదలైన ఫస్ట్ సినిమా అతడు.. ఇందులో నాజర్ పాత్రకి ముందుగా శోభన్ బాబు అనుకున్నారు మురళీమోహన్, త్రివిక్రమ్.. అందగాడిగా అందరు మెచ్చుకునే తానూ ముసలి పాత్రలో నటించడం ఇష్టం లేకా ఈ సినిమాని ఒప్పుకోలేదట. ఆ తర్వాత ఆ పాత్రను నాజర్ పోషించగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం డబ్బింగ్ చెప్పి ఆ పాత్రకి ప్రాణం పోశారు.

మురళి మోహన్ గారు నేషనల్ ఫిలిం డెవెలప్‌మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవెలప్‌మెంట్ కార్పొరేషన్లలో వివిధ హోదాలలో సేవలందించాడు. 2015 వరకు తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)కు గౌరవాధ్యక్షునిగా కూడా వ్యవహరించాడు.
వ్యక్తిగత జీవితం

మురళి మోహన్ గారి భార్య పేరు విజయలక్ష్మి.ఈ దంపతులకి మధుబిందు అనే కుమార్తె రామమోహన్ అనే కుమారుడు ఉన్నారు.

ఆయన తల్లి మాగంటి వసుమతిదేవి గారు 2019లో అనారోగ్యానికి గురికావడంతో ఆమె విశాఖపట్నంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమె మరణానికి కొన్ని రోజుల ముందే మురళీమోహన్ తన తల్లి వసుమతీదేవి శతవసంతోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు వసుమతీదేవి కుటుంబానికి చెందిన సుమారు 100 మందికి పైగా హాజరయ్యారు.

మురళీ మోహన్ నిర్మాతగా చాలా బిజీగా ఉన్న సమయంలో కూడా ఉన్నట్లుండి సినిమాలు తీయడం మానేసారు. అప్పటి వరకు రెగ్యులర్‌గా సినిమాలు నిర్మించిన మురళీ మోహన్.. అలా సినిమాలు మానేయడానికి కారణం చాలా మందికి తెలియదు. అతడు సినిమా వచ్చి 16 ఏళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ జయభేరిపై మరో సినిమా రాలేదు. అతడు సినిమా క్లాసిక్‌గా నిలిచిపోయింది కానీ నిర్మాతగా మురళీ మోహన్‌కు మాత్రం నష్టాలు తీసుకొచ్చిందనే వార్తలే ఇండస్ట్రీలో వినిపిస్తాయి. అయితే దానికంటే ముందు మురళీ మోహన్ చాలా సినిమాలు నిర్మించాడు. కొన్ని విజయాలున్నాయి.. మరికొన్ని ఫ్లాపులు కూడా ఉన్నాయి. అయితే సినిమాలు ఎందుకు తీయడం మానేసారంటే ఇప్పుడున్న పరిస్థితులు తనకు నచ్చట్లేదని చెప్పాడు ఈయన. ఈ రోజుల్లో సక్సెస్ అయితే అంతా కలిసే ఉంటారు.. కానీ సినిమా ఫెయిల్ అయితే మాత్రం మొత్తం నిర్మాత నెత్తిమీదే రుద్దే ప్రయత్నం చేస్తారని అన్నారు. అంతేకాదు ఈ రోజుల్లో పెద్ద హీరోలతో సినిమాలు చేయాలంటే వాళ్ళ చుట్టూ తిరగాలని.. కష్టపడి డేట్స్ తెచ్చుకుని కూడా మళ్లీ అలాగే ప్రదక్షిణలు చేయాలని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క సినిమా కానీ ఫ్లాప్ అయిందంటే అప్పటి వరకూ సంపాదించిన మొత్తం అంతా పోతుందని, తనకు కూడా అదే జరిగిందని.. ఒక్క సినిమాతోనే అప్పటి వరకు సంపాదించిన ఆస్తులన్నీ పోయాయని, ఈ తిప్పలు ఉండకూడదనే చిన్న సినిమాలు తీయడానికి ప్లాన్ చేస్తున్నామని మురళీ మోహన్ తెలిపారు. తమ నిర్మాణ సంస్థలో దాసరి, రాఘవేంద్రరావు, మధుసూదనరావు, విశ్వనాథ్, బాపు, కోడి రామకృష్ణ లాంటి దర్శకులతో కూడా లో బడ్జెట్ సినిమాలు చేసానని చెప్పాడు. అయితే అప్పటి వరకూ బాగానే ఉన్నా కూడా మణిరత్నం తెరకెక్కించిన ఇద్దరు సినిమాతో తన కెరీర్ తలకిందులు అయిపోయిందని చెప్పాడు. అప్పటి వరకు సంపాదించిన మొత్తం అంతా ఇద్దరుతో పోయిందని చెప్పాడు మురళీ మోహన్.

కరుణానిధి అపోజిషన్‌లో ఉన్నపుడు మణి ఈ సినిమాను మొదలు పెట్టాడు. జయలలిత అధికారంలో ఉండటంతో ఉన్నదున్నట్లు తీసాడు. కానీ సినిమా విడుదలయ్యే సమయం దగ్గర పడుతున్నపుడు కరుణానిధి అధికారంలోకి వచ్చాడు.. దాంతో సినిమా చూసి తనకు నచ్చని సన్నివేశాలన్నీ తీయించేసాడని.. దాంతో సినిమాలో కంటిన్యూటి లేకుండా పోవడంతో డిజాస్టర్ అయిపోయిందని చెప్పాడు. ఆ సినిమాను భారీ రేట్ పెట్టి కొంటే మ్యాట్నీకి జనాల్లేరని చెప్పాడు. అలా అప్పటి వరకూ తను సంపాదించింది అంతా ఒకే సినిమాతో పోయింది అని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

మురళి మోహన్ గారు ఆయన పేరుతో ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఇంజినీరింగ్ మరియు మెడిసిన్ చెయ్యాలి అనుకునే పేద స్టూడెంట్స్ కి సహాయం చేసేవారు. ఇప్పటిదకా 10వేలమంది స్టూడెంట్స్ కి ఆయన చదువు చెప్పించారు. ఓ వైపు సినిమాలు నిర్మిస్తూనే, మరోవైపు రియల్ ఎస్టేట్ లో కాలు మోపారు. ‘భూమిని నమ్ముకుంటే అది మనల్ని కాపాడుతుంది’ అన్న శోభన్ బాబు సూత్రాన్ని అనుసరిస్తూ మురళీమోహన్ తాను రియల్ ఎస్టేట్ లో అడుగు పెట్టానని చెబుతారు. నిజంగానే రియల్ ఎస్టేట్ లో ఆయన ‘జయభేరీ’ మోగించారు.
రాజకీయ జీవితం

మురళీమోహన్ 2009లో టీడీపీ నుంచి రాజమండ్రి ఎంపీగా పోటీచేసి ఉండవల్లి అరుణ్ కుమార్ చేతిలో ఓడారు. తర్వాత 2014లో తిరిగి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. 2019ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటమే కాకుండా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు ఏదైనా ఉంది అంటే అది రాజకీయాల్లోకి రావడమే అని మురళీ మోహన్ గారు భావిస్తారు. తనకు ఇష్టం లేదని చెప్పినా చంద్రబాబు కన్విన్స్ చేసి రాజకీయాల్లోకి తీసుకువచ్చారని.. ఆ పదేళ్ల టైంలో చాలా కోల్పోయని తన బాధను బయటపెట్టారు.

నేను ఇంకా పాలిటిక్స్ లోనే ఉన్నానని అందరూ అనుకుంటున్నారు. నేను నూటికి నూరు శాతం రాజకీయాలను వదిలేశాను. పాలిటిక్స్ నుంచి బయటకు వచ్చేశా. ఎందుకంటే నాకు బ్రహ్మాండమైన ఇండస్ట్రీ ఉంది.. సినిమాలు ఉన్నాయి.. హ్యాపీగా వీటిని చేసుకోకుండా.. జనంలో పడి పోటీ చేస్తే.. మన కష్టాన్ని గుర్తించి మెచ్చుకునే వాళ్లు ఉండరు. విమర్శించే వాళ్లు చాలామంది ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్నాం అంటే లేనిపోనివి మనపై వేసేస్తారు. అలాంటప్పుడు నా విలువైన సమయాన్ని ఎందుకు వేస్ట్ చేయాలి.

నేను రాజకీయాలు చేసినా.. చాలా నీతిగా నిజాయితీగా చేశా.. ఎక్కడా కూడా ఒక్క రూపాయి ఆశించలేదు.. నా సొంత డబ్బుల్ని ఖర్చు చేశా. అయినప్పటికీ కూడా నన్ను విమర్శల పాలు చేశారు. చివరికి నేను రాజకీయాలు వదిలేస్తున్నా అంటే కూడా విమర్శించారు. ఇప్పటివరకూ పాలిటిక్స్‌లో తిన్నదంతా కక్కి అప్పుడు పాలిటిక్స్‌కి గుడ్ బై చెప్పండి అంటున్నారు. నిజంగా నాకు డబ్బులు కావాలనుకుంటే.. నాకు వ్యాపారాలు లేవా?? సినిమాలు లేవా?? రియల్ ఎస్టేట్ లేదా?? ఇవన్నీ వదిలేసి నేను ఎందుకు వచ్చా.. నేనేదో కావాలని ఇంట్రస్ట్‌తో రాజకీయాల్లోకి రాలేదు.. ఒకప్పుడు రామారావు గారు నన్ను పాలిటిక్స్‌లోకి రమ్మని అడిగారు కాని నేను వెళ్లలేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే నన్ను ఎంపీగా పోటీ చేయమని పిలిస్తే.. నేను ఆయన దగ్గరకు వెళ్లి సారీ సార్.. నేను రాలేను.. నాకు అనుభవం లేదని చెప్పాను.

ఆ తరువాత చంద్రబాబు గారు వచ్చి.. మీరు గతంలో పిలిస్తే పార్టీలోకి రాలేదు.. సెటిల్ అవ్వలేదని అన్నారు.. ఇప్పుడు అన్నీ సాధించారు.. పిల్లల పెళ్లిళ్లు కూడా చేశారు. ఇప్పుడైనా పార్టీలోకి రండి అని చంద్రబాబు పిలిచారు. సారీ అండి నేను రాజకీయాల్లోకి రాలేనని చంద్రబాబుకి తెగేసి చెప్పా. కాని ఆయన అందరూ అలా అంటే ఎలా.. మీరు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు.. నిర్మాతగా ఉన్నారు.. డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నారు.. పొలిటీషియన్ ఎందుకు కాకూడదు.. మీరు రండి నేను చూసుకుంటా అన్నారు. నేను వద్దని చెప్పినా నన్ను బాగా బలవంత పెట్టి చివరికి కన్విన్స్ చేశారు. చివరికి కిందా మీదా పడి ఓసారి గెలిచా.. ఓ సారి ఓడా.. మొన్నటి ఎన్నికల్లో నేను పోటీ చేయనని చెప్పా.
అవార్డ్స్

మురళి మోహన్ గారికి 1985 లో వచ్చిన ఓ తండ్రి తీర్పు సినిమాకి ఉత్తమ నటుడిగా నంది అవార్డ్ లభించింది. ఆయన నిర్మించిన అతడు సినిమాకి ఉత్తమ నటుడిగా మహేష్ బాబుకి, ఉత్తమ డైలాగ్ రైటర్ త్రివిక్రమ్ కి నంది అవార్డ్స్ లభించాయి.