హాస్యనట ప్రపూర్ణ ఎమ్.ఎస్ నారాయణ

తెలుగు సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన హాస్య నటుడు, రచయిత మన ఎమ్మెస్ నారాయణ గారు. తనదైన శైలిలో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించే ఎమ్మెస్ గారు తన ఉపాధ్యాయ ఉద్యోగాన్ని వదిలేసి సినీ రంగంలో అడుగుపెట్టారు. తెలుగు సినిమాల్లో తాగుబోతు పాత్రలు చేయడంలో ఆయన్ని మించిన వారు లేరు అనేది అందరికి తెలిసిన వాస్తవం. 17 సంవత్సరాల నట ప్రస్థానంలో 700లకి పైగా సినిమాలు చేసి బ్రహ్మానందం గారి సినిమాల రికార్డ్ కూడా బద్దలు కొట్టారు ఎమ్మెస్ నారాయణ గారు.

జననం

1951 ఏప్రిల్ 16న పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడమర్రు అనే గ్రామంలో మైలవరపు బాపిరాజు రైతు, వెంకట సుబ్బమ్మ దంపతులకి ఎమ్.ఎస్ నారాయణ గారు జన్మించారు. ఆయన అసలు పేరు మైలవరపు సూర్య నారాయణ. వీరిది మధ్యతరగతి రైతు కుటుంబం. ఎమ్.ఎస్ నారాయణ గారికి ఆరుగురు సోదరులు, ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. ఇంతమంది పిల్లలు ఉండటం చేత వీరి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడేది. అందువలన కుటుంబం అంత ఖచ్చితంగా పొలంపనులకు వెళ్ళవలసి వచ్చేది. అయితే ఎమ్ ఎస్ నారాయణ గారు మాత్రం ఎంతో పట్టుదలతో తండ్రికి ఇష్టం లేకున్నా బడికి వెళ్లి చదువు కొనసాగించారు. చాలాసార్లు బడికి వెళ్లిన ఎమ్.ఎస్ నారాయణ గారిని ఆయన తండ్రి బడి నుంచి బలవంతంగా తీసుకొని వచ్చి పొలంలో పడేసేవాడు. కానీ ఎమ్.ఎస్ నారాయణ గారు తన తల్లిని బ్రతిమిలాడి మరి చదువుకునేవారు. ఎమ్.ఎస్ నారాయణ గారు చదువుకోడానికి చేసే ప్రయత్నాలు చూసి ఆయన తండ్రి ఒక షరతు పెట్టారు. అదేంటి అంటే పొలం పని ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం బడికి వెళ్లకుండా పొలం పనికి రావాలి అని అన్నారు. దానికి ఎమ్.ఎస్ గారు కూడా ఒప్పుకున్నారు. అయితే ఎమ్.ఎస్ నారాయణ గారు 4వ తరగతి చదువుతున్నప్పుడు ఆయన చదువును మెచ్చి ఒక ఉపాధ్యాయుడు ఆయన్ని 5వ తరగతి చదివే అవసరం లేకుండానే 6వ తరగతి లో వేశారు. అయితే ఈ విషయాన్ని ఒకతను ఎమ్.ఎస్ గారి తండ్రికి "మీ కొడుకుకి చదువువులో పునాది లేకుండా 4వ తరగతి నుంచి 6వ తరగతిలోకి వేశారు అని" తప్పుగా చెప్పారు. దానితో ఎమ్.ఎస్ గారి తండ్రి బడికి వచ్చి ఉపాధ్యాయుడుని కొట్టినంత పని చేసి మళ్ళీ ఎమ్.ఎస్ నారాయణ గారిని 5వ తరగతిలో వేసేలా చేశారు.

ఆయన పదవ తరగతి పూర్తి అయిన తరువాత నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న పత్తేపురంలోని ప్రాచ్య కళాశాలలో ఐదు సంవత్సరాల భాషా ప్రవీణ కోర్సు చేశారు. పత్తేపురంలోని మూర్తిరాజు కళాశాలలో సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ లెక్చరర్‌గా పని చేసేవారు. ఆయన వద్ద ఎమ్.ఎస్‌ శిష్యరికం చేశారు. అప్పుడే ఎన్నో డిటెక్టీవ్ నవలలు ఎన్నో పుస్తకాలు చదివే అలవాటు ఏర్పడింది. అది ఆయన జీవితంలో రచయితగా స్థిరపడడానికి పునాది వేసిందంటారు ఎమ్.ఎస్. పరుచూరి గోపాల కృష్ణ గారు లెక్చరర్ గా చేస్తూనే మ్యాగ్జైన్స్ కోసం చిన్న చిన్న కథలు రాసేవారు. అప్పటికి ఇంకా ఆయన కూడా సినిమాల్లోకి ప్రవేశించలేదు కానీ ఆయన అన్నయ్య పరుచూరి వెంకటేశ్వరరావు గారు మాత్రం సినిమాల్లో పని చేసేవారు. తన అన్నయ్యతో కలిసి పరుచూరి గోపాలకృష్ణ గారు కూడా సినిమా కథ చర్చల్లో పాల్గొనేవారు.

ఎమ్.ఎస్ గారికి కాలేజ్ చదువు అయిపోయాక ప్రభుత్వం తరపున తెలుగు ఉపాధ్యాయ ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం కొత్త కాలం చేశాక లెక్చరర్ అనిపించుకోవాలి అని 10వేల రూపాయలు ఉద్యోగం మానేసి కేవలం 250 రూపాయల జీతంతో పశ్చిమగోదావరి జిల్లా కె.జి.ఆర్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. ఎమ్.ఎస్‌ నారాయణ గారు ఖాళీ రోజుల్లో మాత్రం నాటకాలు వేస్తు గడిపేవారు. తన స్నేహితులతో కలిసి బాలనాగమ్మ, భట్టి విక్రమార్క వంటి పౌరాణిక నాటకాలు వేశారు. సాంఘిక నాటకాలకు తానే పాత్రలను ఎంపిక చేసుకుని దర్శకుడిగా నాటకాలు వేసి అందర్ని మెప్పించేవారు. భీమవరం కేజీఆర్‌ఎల్‌ కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా పనిచేస్తున్న సమయంలో దివిసీమ ఉప్పెన సంభవించగా తోటి కళాకారులతో కలిసి వివిధ ప్రాంతాల్లో నాటకాలు వేసి విరాళాలు సేకరించి దివిసీమ ప్రజలకు అందించారు. ఈ నాటకాల మీద ఆసక్తి ఆయన్ని సినిమాల వైపు మళ్లించింది.

ఎమ్.ఎస్‌.నారాయణ ఒక ఇంటర్వ్యూలో తన బాల్యం గురించి ఇలా చెప్పుకొచ్చారు. “16 ఏళ్లు ఉన్నప్పుడు ‘వీధిలో దొరలు’ అనే నాటికను రచించాను. రచించడమే కాకుండా పశువులు కాసే కుర్రాళ్లందరికీ నటించి చూపించాను. వాళ్లకి సైతం నేర్పించాను. ఎందుకంటే, అప్పట్లో నేను కూడా పశువులు కాసేవాడిని. ఆ తర్వాత దాన్ని స్టేజ్‌పై కూడా ప్రదర్శించాను. ఆ సమయంలో ముఖానికి ఉన్న మేకప్‌ చూసి అమ్మానాన్న ఎక్కడ తిడతారో అని భయపడి చీకటి పడిన తర్వాత ఇంటికి వెళ్లాను. అమ్మ వాళ్లు నిద్రించిన తర్వాత ఇంట్లోకి వెళ్లి దొంగచాటుగా భోజనం చేసి నిద్రపోయాను. ముఖానికి మేకప్‌ మాత్రం అలాగే ఉంచాను. అయితే, తెల్లవారేసరికి నా ముఖానికి ఉన్న మేకప్‌ దుప్పటికి అంటింది. దాంతో మా నాన్న నన్ను కొట్టారు. కానీ, ఆ కళామ్మతల్లే నన్ను ఇలా కరుణిస్తుందని.. ఒక హాస్యనటుడిగా నన్ను మీ ఎదుట నిలబెడుతుందని నేను అనుకోలేదు” అని ఆయన చెప్పుకొచ్చారు.

సినీ జీవితం

నాటక రంగంలో కథలు రాసే ఎమ్మెస్ గారికి సినిమా కథలు ఎందుకు రాయకూడదు అనే ఆలోచన వచ్చింది. అలా ఆయన తనంతట తానుగా కథలు రాసుకొని తన స్నేహితులకు వినిపించేవారు. ఆ కథలకి ఆయన స్నేహితుల దగ్గరనుంచి మంచి స్పందన వచ్చేది. సినిమా కథలు రాసుకున్న తర్వాత సినిమాలకి కథలు ఇవ్వాలని చెన్నైకి వెళ్ళాలి అని ఎమ్మెస్ గారు అనుకున్నారు. దానికి ఆయన భార్య కూడా ఒప్పుకున్నారు. దానితో ఆయన ప్రతి శనివారం ఉద్యోగం ముగించుకొని చెన్నై వెళ్లే ట్రైన్ ఎక్కి ఆదివారం అంత అక్కడ సినిమా ప్రయత్నాలు చేసేవారు. మళ్ళీ ఆదివారం సాయంత్రం రైలు ఎక్కి సోమవారం ఉద్యోగంకి వెళ్ళేవారు. ఇదంతా 1974 చివరి నుంచి జరిగింది. ప్రతి శనివారం ఒక సంచి తగింలించుకొని చెన్నై వెళ్లడం అక్కడ నిర్మాతలకి దర్శకులకి కథలు చెప్పడం చేసేవారు. ఒక్కో సారి ఎక్కువగా రోజులు సెలవులు దొరికితే చెన్నై రైల్వే స్టేషన్ దగ్గర చిన్న రూమ్ అద్దెకి తీసుకొని అక్కడే ఉండేవారు.

ఆ సమయంలోనే ఎమ్మెస్ గారికి మద్యం అలవాటు అయింది. రోజు ఆయనకి ఖచ్చితంగా మద్యం ఉండాల్సిందే. దానికోసం డబ్బులు ఒక్కోసారి ఆయన స్నేహితులు దగ్గర కూడా ఇప్పించుకునేవారు. ఇక అలా ఎన్ని రోజులు తిరిగినా సినీ పరిశ్రమలో అవకాశాలు రాకపోవడంతో ఇక ఇంటికి వెళ్లిపోదాం అని నిర్ణయించుకొని రైల్వే స్టేషన్ లో ఎమ్మెస్ గారు కూర్చున్నారు. అలా కూర్చొని ఆలోచిస్తే నా కథల్లో హీరో ఎన్నో కష్టాలు పడుతున్నారు కానీ నేను మాత్రం ఏ కష్టం లేకుండా సినిమాల్లో ఛాన్సులని పొందటం ఏమిటి అని ఆయన రిజర్వేషన్ టికెట్ చింపేసి ఆయన ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి పూర్తిగా సినిమా ప్రయత్నల్లో దిగారు. అలా అనుకున్న నాలుగు నెలలలోనే ఎమ్మెస్ గారికి డైరెక్టర్ సత్య రెడ్డి దగ్గర నుంచి తన దగ్గర ఉన్న కథని డెవెలప్ చేయాలని పిలుపు వచ్చింది. అలా ఎమ్మెస్ గారు మొదటి అవకాశాన్ని బాగా ఉపయోగించుకొని ఆ సినిమాకి కథని కొన్ని డైలాగ్స్ కూడా అందించారు. ఆ సినిమా పేరు వేగు చుక్క పగటి చుక్క. ఈ సినిమా 1988 జులై 8న విడుదలైంది. ఆ తర్వాత పరుచూరి గోపాలకృష్ణ గారి సహాయంతో ప్రయత్నం అనే సినిమాకి మూల కథని ఇచ్చారు. ఈ సినిమా మంచి హిట్ అయింది.ఈ సినిమా హిట్ అవ్వడంతో హలో గురు, నీకు నాకు పెళ్లయింది, పేకాట పాపారావు చిత్రాలకు అద్భుతమైన కథలు అందించి సినీ రంగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.

ఆ తర్వాత  దర్శకుడు రవిరాజా పినిశెట్టితో కలిసి ఆయన తీస్తున్న యమ్ ధర్మరాజు ఎమ్ ఏ సినిమాకి కామెడీ ట్రాక్ అంత ఎమ్మెస్ గారే రాసారు. ఆ తర్వాత నుంచి ఎమ్మెస్ గారు రవిరాజా పినిశెట్టి దగ్గరే పని చేసేవారు. ఆయన యమ్ ధర్మరాజు యమ్ ఏ లో ఎమ్మెస్ నారాయణ గారు ఒక చిన్న పాత్ర కూడా చేసారు.ఎమ్మెస్ నటించిన తొలి సినిమా యమ్.ధర్మరాజు ఎం.ఎ. ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా చిన్నది.

ఆ తర్వాత రవిరాజా పినిశెట్టి గారు పరుశురాం, ఎస్పీ పరుశురాం సినిమాలని తీశారు. 1995లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన పెదరాయుడు చిత్రం కథ చర్చల్లో ఉన్నప్పుడే ఎమ్మెస్ గారు ఆ సినిమాలో గుమస్తా పాత్ర ఆయన చేస్తాను అని రవిరాజా గారిని అడిగారు. కానీ రవిరాజా గారు తాగుబోతులగా కనిపేస్తావ్ నువ్వు నీకు ఆ పాత్ర సెట్ కాదు అని తిరస్కరించారు. అప్పుడు ఎమ్మెస్ గారు పేద రాయుడు సినిమా షూటింగ్ లో ఒక సీన్ ని రవిరాజా పినిశెట్టి మరియు మోహన్ బాబు గారి ముందు ప్రదర్శించారు. అది చూసి మోహన్ బాబు గారు లేచి ఎమ్మెస్ గారికి కౌగిలించుకున్నారు. రవిరాజా పినిశెట్టి గారు “నీలో ఇంతమంచి నటుడు ఉన్నాడా అని తెలుసుకోలేక పోయాను అని” వెంటనే ఆ గుమస్తా పాత్ర ఎమ్మెస్ గారికి ఇచ్చారు. తొలిసారిగా వెండి తెరపై పూర్తి పాత్రలో కనిపించారు.

పుణ్యభూమి నాదేశం, రుక్మిణి చిత్రాల్లో చిన్న పాత్రలు వేసినప్పటికి 1997లో ఈవీవీ దర్శకత్వంలో మా నాన్నకు పెళ్ళి సినిమాలో తాగుబోతు తండ్రి పాత్ర ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఆయనని షూటింగ్ లో చూసి నిజంగానే తాగి నటిస్తున్నదేమో అని అందరికి అనిపించేది. దర్శకులు తనకు ఇచ్చిన పాత్రకు తానే సంభాషణ రాసుకుని సినిమాల్లో పలికేవారు. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది. దాంతో మరి వెనుదిరిగి చూసుకోలేదాయన…ఇక అక్కడ నుంచి ఎమ్మెస్ కు అలాంటి పాత్రలే లభించసాగాయి. అయితే వాటిలోనూ వైవిధ్యం చూపించి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ఆయన చేసిన సమరసింహ రెడ్డి, రామసక్కనోడు లాంటి సినిమాల్లో ఆయనకి మంచి పాత్రలు వచ్చాయి.

ఇక 2000 సంవత్సరంలో వచ్చిన సర్దుకుపోదాం రండి సినిమాలో క్రమశిక్షణ గల తండ్రిగా మంచి పాత్రని చేశారు. ఈ సినిమాని 1958లో ఏ ఎన్ ఆర్ గారి పెళ్లి నాటి ప్రమాణాలు సినిమా కథని తీసుకొని చేశారు. జగపతిబాబు , సౌందర్య కలిసి నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ఎమ్మెస్ గారి పాత్ర పేరు సింగరాజు లింగరాజు.

అలానే 2001లో వచ్చిన  నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో ఎమ్మెస్ గారి కామెడీ బాగా పడింది. ముఖ్యంగా ఆయన డైలాగ్స్ " ఏం చేస్తున్నావ్ ... ఏం చేస్తున్నావ్ ... అని మాటిమాటికీ అడగొద్దు. ఏదో ఒకటి చేసేయగలను...మరియు అమ్మా ... నీ కళ్ళేవీ? లాంటి మాటలు చూస్తే ఇప్పటికి నవ్వు రాకుండా ఉండదు. త్రివిక్రమ్ అందించిన మాటలు అన్ని ఎమ్మెస్ గారి నోటి నుంచి అద్భుతంగా పండై. ఈ సినిమాలో పేకాట కి బానిస అయిన భర్తగా సినిమా విజయంలో భాగం అయ్యారు ఎమ్మెస్ గారు.ఆయనికి ఆ తర్వాత నుంచి ఎక్కువగా తాగుబోతు పాత్రలు మరియు లెక్చరర్ పాత్రలు , పనిమనిషిగా కొన్ని సినిమాలు వచ్చేవి.

2002 లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాలో సెకండ్ హాఫ్ లో కామెడీని ఎమ్మెస్ గారు ఆయన భుజం మీద వేసుకున్నారు. "అంత అస్సాం" అంటూ ఆయన చేసిన కామెడీ మాములుగా ఉండదు. ఈ సినిమా కూడా అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది.3.2 కోట్లతో నిర్మించిన ఈ సినిమా 20 కోట్ల వసూళ్లు రాబట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇదే సంవత్సరంలో వచ్చిన సొంతం కూడా ఎమ్మెస్ గారి కామెడీకి గొప్ప పెరు తెచ్చింది. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాలేజ్ ప్రిన్సిపాల్ గా ఎమ్మెస్ గారి హాస్య నటనకి అప్పటికి ఇప్పటికి ఎవరికైనా నవ్వు తెప్పించక మానదు. ముఖ్యంగా " జిహాద్ " అంటూ సైనికుల దగ్గర ఎమ్మెస్ గారు, సునీల్ గారి మంచి కామెడీ పండించారు. అలాగే తనని ఫొటోస్ తీయమని చెప్పి ఎమ్మెస్ గారు పెట్టె హావభావాలు ఇప్పటికి మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. ఈ సినిమా నుంచి డైరెక్టర్ శ్రీను వైట్ల ఎమ్మెస్ నారాయణ గారికి ప్రతి సినిమాలో కామెడీ సీన్స్ ఉండేలా చూసుకున్నారు. ప్రతి సంవత్సరం ఆయన ఏదో ఒక సినిమాలో హైలైట్ అయ్యే పాత్రలు చేస్తూ వచ్చారు.

అలా 2003లో వచ్చిన నాగార్జున గారి శివమణి సినిమాలో కూడా ఎమ్మెస్ గారికి మంచి పాత్ర దక్కింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఎమ్మెస్ గారి పాత్ర ఈ సినిమాకే హైలెట్ అని చెప్పాలి. " షేక్ ఇమామ్.. షేక్ ఇమామ్" అంటూ ఆయన చేసి కామెడీ సినిమాలో నవ్వులని పూయించింది. ఒక చిన్న డైలాగు తో ఆ రేంజ్ లో కామెడీని పుట్టించడం చాలా గొప్ప విషయం.ఇదే సంవత్సరంలో వచ్చిన ఒట్టేసి చెపుతున్న సినిమాలో అప్పట్లో బాగా ఫేమస్ అయిన ఫ్యాక్షన్ లీడర్ గా ఎమ్మెస్ గారి కామెడీ సినిమాకి పెద్ద హైలైట్. రేనా అన్న గా ఎమ్మెస్ గారి చేసే హాస్యం చూడటానికి చాలా హాయిగా ఉంటుంది.

అలాగే కాలేజ్ ప్రిన్సిపాల్ పాత్రలో ఆయన చేసిన సినిమాలు దిల్, బన్నీ సూపర్ హిట్ అవ్వడమే కాకుండా ఆయనకి మంచి పేరు తీసుకొని వచ్చాయి. ఈ సినిమాలలో ప్రిన్సిపల్ గా ఎమ్మెస్ గారు అటెండర్ గా బన్నీ సినిమాలో వేణు మాధవ్ దిల్ సినిమాలో ఎల్ బి శ్రీరామ్ గారితో మంచి కామెడీ చేసారు. బన్నీ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా చేసిన ఈ సినిమాలో బన్నీ పాత్రని చూసి భయపడే ప్రిన్సిపాల్ గా మంచి నటనని కనపరిచారు. "సోడా కొట్టడం అంటే పీజీ పాసైనంత వీజీ కాదు " అనే డైలాగు చాలా ఫేమస్ అయింది.

ఇక 2007లో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన దుబాయ్ సీను సినిమాలో ఎమ్మెస్ గారి బెస్ట్ కామెడీ మనం చూడొచ్చు. ఫైర్ స్టార్ సల్మాన్ రాజు గా ఎమ్మెస్ నారాయణ గారి హాస్యం ఈ సినిమా పెద్ద బలం. ఈ సినిమా క్లైమాక్స్ లో విలన్ తో ఎమ్మెస్ గారు చేసిన కామెడీ సినిమాని ప్లాప్ నుంచి కాపాడింది. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ లో రవితేజ, బ్రహ్మానందం గారి కాంబినేషన్ లో ఒక రకం కామెడీ అయితే సెకండ్ హాఫ్ లో ఎమ్మెస్ గారు ఏవిఎస్ గారు ఆడియెన్స్ ని కడుపుబ్బా నవ్వించారు. ఈ సినిమా విజయంలో ఎమ్మెస్ గారి పాత్ర చాలా ఉంది.

అలా 2010లో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ లో కూడా ఆయన సహా నటుడు బ్రహ్మనందంతో కలిసి అద్భుతమైన కామెడీని పండించారు. ఒక ఆత్మగా నటిస్తూ బ్రహ్మానందం గారికి హింసించే పాత్రలో ఎమ్మెస్ గారు చక్కని హాస్యం అందించారు.ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా సినిమాలో కామెడీకి గొప్ప స్పందన వచ్చింది.

ఇక 2011 లో వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సినిమా ఓవర్సీస్ లో మొదటిసారి 1 మిలియన్ డాలర్స్ అలాగే తెలుగు స్టేట్స్ లో భారీ కలెక్షన్స్ సంపాదించడానికి సూపర్ స్టార్ మహేష్ బాబు తో పాటు బ్రహ్మానందం గారు మరియు ఎమ్మెస్ నారాయణ గారు కూడా ముఖ్యమైన కారణం. ఈ సినిమాలో బ్రహ్మానందం గారు ఎమ్మెస్ నారాయణ గారిని చూసి చెప్పే కళ్ళ కింద క్యారి బాగ్స్ డైలాగు సినిమా విడుదల అప్పుడు విపరీతంగా ఫేమస్ అయింది. అలాగే ఈ సినిమాలో ఎమ్మెస్ గారు ఇతర హీరోస్ సినిమా నుంచి చేసే స్పూఫ్స్ ఆడియన్స్ ని బాగా అలరించాయి.సినిమాల పిచ్చి ఎక్కువగా ఉండి అప్పులపాలు అయిన హీరోగా ఎమ్మెస్ గారి పాత్ర ఆయన మునుపటి సినిమాల కన్నా కొత్తగా కనిపించారు.

ఈ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఎం.ఎస్.నారాయణ జీవితంలో జరిగిన సంఘటనను నటి హేమ గారు ఒకసారి ప్రస్తావిస్తూ ఇలా అన్నారు ‘‘నాకు ఎం.ఎస్.నారాయణ అన్నయ్య ఒకసారి చెప్పారు. ‘దూకుడు’లో కళ్ల కింద క్యారీ బ్యాగ్ సీన్ చేస్తున్నారట. బ్రహ్మానందం అన్నయ్య, నారాయణ అన్నయ్య కాంబినేషన్ సీన్. ఆ సమయంలో ఎం.ఎస్.నారాయణ భార్యకు అపోలో హాస్పిటల్‌లో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలట. ఆయన సంతకం పెడితే కానీ సర్జరీ చేయరు. ఆయనేమో రామోజీ ఫిలిం సిటీలో ఉన్నారు. హాస్పిటల్‌కు వెళ్లడం కుదరకపోతే ఆ లెటర్‌ను ఇక్కడికి తెప్పించుకుని సంతకం చేశారట. నవ్వుతూ కామెడీ సీన్ చేసిన ఆయన సీన్ అయిన వెంటనే బాత్‌రూంలోకి వెళ్లి బాగా ఏడ్చేవారట. మళ్లీ నీళ్లతో కళ్లు కడుక్కొని వెళ్లి నటించారట’’ అని హేమ చెప్పుకొచ్చారు. అంత బాధలో కూడా ఎమ్మెస్ గారు అలా కామెడీ పండించడం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.

ఇక ఆయన ఆ తర్వాత నటించిన బాద్ షా సినిమాలో కూడా ఎమ్మెస్ గారిని మనం కొత్త రకమైన పాత్రలో చూడొచ్చు. లొకేషన్స్ కోసం ఫారిన్ వచ్చిన డైరెక్టర్ గా ఆయన మంచి కామెడీ చేశారు. ముఖ్యంగా ఎమ్మెస్ గారికి మిగతా దర్శకులు అంత రొటీన్ గా తాగుబోతు పాత్రలు ఇస్తుంటే శ్రీను వైట్ల మాత్రం ఆయనకి వెరైటీ రోల్స్ ఇచ్చి ఆయనలోని కొత్త కోణంని చూపించారు. అదే సంవత్సరం వచ్చిన అత్తారింటికి దారేది సినిమాలో పాత్ర కూడా మంచి పేరు తెచ్చింది." ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గలో తెలిసినోడు గొప్పోడు " అని ఎమ్మెస్ గారి చెప్పే డైలాగు ఎప్పటికి అందరి మనసుల్లో గుర్తుండి పోతుంది. ఈ సినిమా కూడా అప్పట్లో రికార్డ్స్ బద్దలు కొట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలించింది.

2014 తర్వాత ఎమ్మెస్ గారు మెల్లగా సినిమాలని తగ్గించారు. ఆ సమయంలో ఆయన చేసిన రేసుగుర్రం సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత వచ్చిన కళ్యాణ్ రామ్ పటాస్ సినిమాలో వయసు అయిపోయిన హీరోగా ఎమ్మెస్ గారు చివరి రోజుల్లో కూడా హాస్యంన్ని అందిస్తూనే ఉన్నారు. ఆయన చివరి చిత్రం అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి. ఈ సినిమాలో ఆయన పాత్రకి డబ్బింగ్ కూడా వేరే వాళ్ళు చెప్పాల్సి వచ్చింది.

వ్యక్తిగత జీవితం

ఎమ్మెస్ నారాయణ గారు కాలేజ్ లో చదువే రోజుల్లో ఆయన తోటి విద్యార్థిని అయిన కళాప్రపూర్ణ గారిని ప్రేమించారు. వారికి పరుచూరి గోపాలకృష్ణ గారే దగ్గరుండి వివాహం చేశారు. వీరిది కులాంతర వివాహం. ఈ దంపతులకి కొడుకు విక్రమ్ నారాయణ, కూతురు శశి కిరణ్ నారాయణ అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎమ్మెస్ నారాయణ గారు తన కొడుకు విక్రమ్ ని హీరోగా పెట్టి ‘కొడుకు’ అనే సినిమాని తీశారు. ఈ సినిమాకి దర్శకత్వం మరియు నిర్మాత కూడా ఆయనే. ఈ సినిమా వల్ల ఎమ్మెస్ గారికి దాదాపుగా కోటి రూపాయల నష్టం వచ్చింది. ప్రస్తుతం ఆయన కొడుకు విక్రమ్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తున్నారు.

ఇక ఎమ్మెస్ గారి కూతురు శశి కిరణ్ 2014 లో సాహెబా సుబ్రహ్మణ్యం అనే సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా సరిగ్గా ఆడలేదు. ఆమె ఎక్కడ తన తండ్రి పేరు చెప్పుకోకుండా ఈ దర్శకత్వ అవకాశాన్ని పొందటం విశేషం.

ఎమ్మెస్ నారాయణ గారు 700లకి పైగా సినిమాలు చేస్తే అందులో 200 సినిమాల్లో తాగుబోతు పాత్రలు చేశారు. ఏ నటుడికైనా ఒకటే పాత్ర 10సినిమాలు చేస్తే చూసే ప్రేక్షకులకి విసుగు వస్తుంది. కానీ ఎమ్మెస్ గారిని మాత్రం 200 సినిమాల్లో తాగుబోతు పాత్రల్లో చూసిన కూడా ఆయన్ని చూసిన ప్రతి సారి నవ్వుకోవడం చాలా గొప్ప విషయం. ఎమ్మెస్ గారికి ఆయన సినీ కెరీర్ లో ఒకసారి ఆయన తాగుబోతు పాత్రల వలన సమాజానికి చెడు ప్రభావం ఉంటుందేమో అని అనిపించిందట కానీ ఆయన సినిమాల్లో తాగి గొడవలు చేయకుండా హాస్యాన్ని పడిస్తుండటంతో ఇతరులని నవ్వించడంలో తప్పులేదు అని ఎమ్మెస్ గారు భావించి ఆ ఆలోచనని ఆపేశారు అంట. ఇక ఆయన్ని ఒకసారి రాజమండ్రి లిక్కర్ సిండికేట్ ఓనర్స్ కలిసి సన్మానం చేస్తాం అని అడిగారట. ఎందుకంటే ఆయన తాగుబోతు పాత్రల వలన వారి ఆదాయం ఎక్కువగా పెరిగింది అని వారు చెప్పారట. అయితే ఈ సన్మానం విషయం చెప్పడంతో ఎమ్మెస్ గారు నవ్వి సున్నితంగా తిరస్కరించారు.

అవార్డ్స్

ఎమ్మెస్ నారాయణ గారికి రామసక్కనోడు, మా నాన్నకి పెళ్లి, సర్దుకుపోదాం రండి, శివమణి  వంటి సినిమాలకి గాను ఆయనకి రాష్ట్ర నంది అవార్డ్స్ లభించాయి.

అలాగే దూకుడు సినిమాలో ఆయన కామెడీ కి గాను నంది అవార్డ్ మరియు, ఫిలింఫేర్ అవార్డ్ కూడా లభించింది.

మరణం

2015లో ఆయన సొంతూ ఊరు నిడమర్రు గ్రామంలో సంక్రాంతికి పండగకి హాజరై అక్కడ అనారోగ్య కారణాలతో మొదట ఏపీలోని భీమవరం లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స పొందారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నగరం కొండాపూర్‌లో గల కిమ్స్‌లో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఎంఎస్ నారాయణ 2015 జనవరి 23న హైదరాబాద్‌లో ఓ ప్రముఖ ఆస్పత్రిలో మరణించారు. ఆయన శరీరంలోని వివిధ భాగాలు పనిచేయడం ఆగిపోవడం వల్ల ఆ రోజు ఉదయం 9.40 గంటలకు ఎంఎస్ నారాయణ కన్నుమూశారంటూ ఆయనకు చికిత్స అందించిన వైద్యులు వెల్లడించారు. ఎమ్మెస్ నారాయణ గారి మరణం తర్వాత ఆయన భార్య కళాప్రపూర్ణ గారు కూడా 2016వ సంవత్సరంలో గుండెపోటుతో మరణించారు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.