ధనుష్

నువ్వు జీవితంలో ఏదొకటి సాధిస్తావన్న నమ్మకం నీకు లేకపోయినా పర్లేదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీకు ఆ నమ్మకం కలిగించినప్పుడు దాన్ని నువ్వు నమ్మితే చాలు. నువ్వు ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు. వెంకటేష్ ప్రభు కస్తూరి రాజాకు కూడా తాను జీవితంలో ఏది సాధించాలన్న క్లారిటీ లేదు. తాను హీరోను అవుతానని ఎప్పుడూ అనుకోలేదు కూడా. అయినా కానీ తన తండ్రి తనను నమ్మాడు. తన తండ్రిని నమ్మాడు వెంకటేష్ ప్రభు. కట్ చేస్తే ఇప్పుడు జాతీయ అవార్డులను సైతం అలవోకగా అందుకుంటున్నాడు.

ఇంతకీ ఈ వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా ఎవరు? ఎక్కడా వినలేదు ఏంటా అనుకుంటున్నారా? ఆ వెంకటేష్ ప్రభు ఎవరో కాదు రఘువరన్ బిటెక్ సినిమాతో మనందరికీ చేరువైన ధనుష్. అవును ధనుష్ అసలు పేరు అదే. మరి చూడటానికి పీలగా, కొంచెం నల్లగా ఉండే ధనుష్ సినిమాల్లో హీరోగా సక్సెస్ అవ్వగలనని ఎలా అనుకున్నాడు? తన జీవిత ప్రయాణం ఎలా మొదలైంది? సినిమాల్లో ఎలాంటి ఎదురుదెబ్బలు తిన్నాడు? ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నాడు? వాటిని దాటుకుని ఎలా విజయం సాధించాడు వంటి విషయాలు అన్నీ ఇప్పుడు తెలుసుకుందాం.

బాల్యం

కస్తూరి రాజా, విజయలక్ష్మి దంపతులకు 28 జులై 1982న జన్మించాడు ధనుష్. తన అసలు పేరు మనం చెప్పుకున్నట్లు వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా. కస్తూరి రాజాకు మొత్తం ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ధనుష్ కాకుండా మరో కొడుకు సెల్వరాఘవన్. పేరు పట్టి గుర్తుపట్టే ఉంటారుగా. ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, 7/జి బృందావన కాలనీ వంటి పాత్ బ్రేకింగ్ సినిమాలకు దర్శకుడు సెల్వ రాఘవన్, ధనుష్ కు అన్న.

కస్తూరి రాజా కోలీవుడ్ లో ప్రముఖ రచయిత, దర్శకుడు, నిర్మాత. తల్లి విజయలక్ష్మి గృహిణి. చిన్నప్పటి నుండీ ఇంట్లో సినిమా వాతావరణం ఉండేది. అయితే ధనుష్ బాగా చిన్నప్పుడు అంటే 5వ తరగతి వరకూ కుటుంబం మొత్తం పేదరికంలోనే బతికారు. కస్తూరి రాజా రచయిత అయినా కూడా తనకు పెద్దగా అవకాశాలు వచ్చేవి కావు. దీంతో రోజు గడవడమే కష్టంగా ఉండేది. కస్తూరి రాజా, విజయలక్ష్మి, వీళ్ళ నలుగురు పిల్లలు అంటే మొత్తం ఆరుగురు ఒకే రూమ్ లో ఉండేవారు. రోజుకి ఒక్క పూట మాత్రమే తినేవారు. చిన్నప్పుడు ధనుష్ కు ఆడుకోవడానికి ఒక్క బొమ్మ కూడా ఉండేది కాదు. పైగా తన తోటి పిల్లలు ఖరీదైన బట్టలు, కార్లలో తిరుగుతుంటే మన పరిస్థితి ఎందుకిలా ఉంది అని ధనుష్ చాలా సార్లు బాధపడేవాడట. ఆ తర్వాత కస్తూరి రాజాకు అసిస్టెంట్ దర్శకుడిగా అవకాశమొచ్చింది. దాంతో కుటుంబాన్ని కొంత మేర సెటిల్ చేయగలిగారు. మూడు పూట్ల తిండి పెట్టగలిగేవారు. ఇక దర్శకుడు అయ్యాక కుటుంబం మొత్తం గాడిలో పడింది. ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించాడు కస్తూరి రాజా. నిజానికి ధనుష్ ను హీరోగా ఇంట్రడ్యూస్ చేసింది కూడా కస్తూరి రాజానే. అది ఎలా జరిగిందో కూడా చిత్రంగానే ఉంటుంది.

ఇంటర్మీడియట్:

చిన్నప్పటి నుండి ధనుష్ మంచి స్టూడెంట్. స్కూల్ లో ఉన్నప్పుడు చాలా మంచి మార్కులే వచ్చేవి. అయితే ఇంటర్మీడియట్ లో జాయిన్ అయ్యాక ధనుష్ చదువు గాడి తప్పింది. ధనుష్ కు ఆ వయసులోనే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది. తన మనసు అంతా ఆమె చుట్టూనే తిరుగుతూ ఉండేది. ఆమెకు లవ్ లెటర్స్ రాయడం, ఆమెతో గంటలు గంటలు మాట్లాడడం చేస్తుండేవాడు. దీంతో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చాలా తక్కువ మార్కులతోనే పాస్ అయ్యాడు. అయితే ఇంటర్ లో ఉండగానే కస్తూరి రాజా, ధనుష్ లో నటుడ్ని గుర్తించాడు. ధనుష్ బాగా పేరున్న నటుడు కాగలడని అనుకున్నాడు.

అందుకోసమే 16 ఏళ్ల వయసులో ఇంకా ఇంటర్ కూడా పూర్తవ్వకుండానే ధనుష్ ను సినిమాల్లోకి తీసుకొచ్చారు వాళ్ళ నాన్న కస్తూరి రాజా. అయితే ధనుష్ కు సినిమాలు అస్సలు ఇష్టం లేదు. చూడటానికి అంతగా బాగోను, చాలా సన్నగా ఉంటాను, నేను సినిమాలు చేయడం ఏంటి అని భావిస్తుండేవాడు ధనుష్. ఎక్కువ మంది జనాల మధ్య ఉండడం కూడా ధనుష్ కు ఇష్టం లేదు. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే కూడా లోపల గదిలోకి వెళ్లి లాక్ చేసుకునేవాడు. అలాంటి ధనుష్ ను సినిమాల్లో బాగా రాణిస్తాడు అని తండ్రి భావించాడు.

"నాన్నా, అసలు నేను ఎలా నటుడిగా పనికివస్తాను. అసలు హ్యాండ్సం గా ఉండను. మిగతా హీరోల ముందు తేలిపోతాను, పైగా నాకు అసలు నటుడు అవ్వాలని లేదు. మీరు ఎలా నేను స్టార్ హీరో అవుతానని భావిస్తున్నారు" అని డైరెక్ట్ గా తండ్రినే అడిగితే "నువ్వేం భయపడకు. నాకు నీలో కనిపిస్తోంది. నువ్వు కచ్చితంగా ఈ రంగంలో రాణిస్తావు" అని సమాధానమిచ్చాడట. అయినా కూడా నేను చేయను అని ధనుష్ మొండికేసేసరికి కస్తూరి రాజా బలవంతంగా సినిమాల్లోకి తీసుకొచ్చాడు.

మొదటి సినిమా:

ధనుష్ ను హీరో చేద్దామని ఫిక్స్ అయిన కస్తూరి రాజా వేరే హీరో కోసం సిద్ధం చేసుకున్న తుల్లువదో ఇలమై చిత్రాన్ని ధనుష్ తోనే తీయాలని ఫిక్స్ అయ్యాడు. తనకు ఇష్టం లేకపోయినా తండ్రి కోసం తప్పక ఒప్పుకున్నాడు ధనుష్. ఇష్టం లేనిపని, అందులోనూ 16 ఏళ్ల తెలిసీతెలియని వయసు. ధనుష్ ఒక్కో సీన్ కు చాలా టేక్స్ తీసుకునేవాడు. దీంతో కస్తూరి రాజాకు కోపం వచ్చి ఇష్టమొచ్చినట్లు తిట్టేవాడట. ఒక్కోసారి కొట్టేవాడు కూడా. అందుకే నేను సినిమాలు చేయను అన్నాను ధనుష్ సెట్స్ నుండి కోపంగా వచ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎలాగైతేనేం మొత్తానికి ధనుష్ మొదటి సినిమా తుల్లువదో ఇలమై 10 మే 2002లో విడుదలైంది. ఈ సినిమా నిర్మాణానికి రెండేళ్లు పట్టింది. సొంత నిర్మాణ సంస్థ కావడంతో కస్తూరి రాజా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ధనుష్ చేత కావాల్సింది చేయించుకుని పూర్తి చేసాడు. ఈ సినిమా విడుదలకు కస్తూరి రాజా అండ్ ఫ్యామిలీ ఇబ్బంది పడింది. ఉన్న డబ్బులు అంతా పెట్టేసి ఈ సినిమాను పూర్తి చేసారు. విడుదల చేయడానికి డబ్బులు లేకపోతే దర్శకుడు, నిర్మాత అయిన ఆర్. మాదేష్ ఈ చిత్రాన్ని కొనుగోలు చేసారు. చిన్నగా ఓపెన్ అయిన ఈ సినిమాకు యూత్ ఆదరణ దక్కింది. క్రమంగా ఈ  సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.

అయితే ఈ చిత్రానికి బిజినెస్ కోసం కస్తూరి రాజా పేరు వేసి, తన పెద్ద కొడుకు సెల్వ రాఘవన్ డైరెక్ట్ చేసాడు. ఒకానొక ఇంటర్వ్యూలో సెల్వ రాఘవన్ ఈ విషయాన్నీ ధృవీకరించాడు. డిస్ట్రిబ్యూటర్లకు సంపాదించడం కోసం కొత్త దర్శకుడు అనేకంటే అప్పటికే దర్శకుడిగా పేరున్న కస్తూరి రాజా అయితే బెటర్ అని అలా చేసారు. ఏదేమైనా ధనుష్ మొదటి సినిమా సూపర్ హిట్ అయింది. అయితే సినిమా హిట్ అయినా కానీ ధనుష్ మీద ఓ రేంజ్ లో ట్రోల్స్ పడ్డాయి. వీడు హీరో ఏంట్రా బాబు అంటూ మీడియాతో జనాలు కూడా డైరెక్ట్ గానే కామెంట్స్ వేశారు. బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఎవరైనా హీరో అయిపోవచ్చు అని కూడా అన్నారు. అయితే వీటిని పట్టించుకోవద్దు, ఈరోజు నిన్ను చూసి సెటైర్స్ వేసిన వాళ్లే రేపు నిన్ను చూసి ఇన్స్పైర్ అవుతారు అని తండ్రి కస్తూరి రాజా కొడుకుకు సర్దిచెప్పాడు. ఈ సినిమాతోనే వెంకటేష్ ప్రభు కాస్తా ధనుష్ గా మారింది. ఈ సినిమాను తెలుగులో జూనియర్స్ పేరిట రీమేక్ చేసాడు అల్లరి నరేష్.

మొదటి సినిమా హిట్ అయినా ధనుష్ కు మంచి పేరు రాలేదు. బ్యాడ్ కామెంట్స్ బాగా వినిపించాయి. దీంతో కస్తూరి రాజా, సెల్వ రాఘవన్ కు చాలా కసి వచ్చింది. ధనుష్ కు మాత్రం ఇంకా తాను హీరో ఏంటి అనే ఉద్దేశంతోనే ఉన్నాడు. తనలో విషయం ఉందని, హీరోగా సక్సెస్ సాధించగలను అని ఒక్క శాతం కూడా నమ్మలేదు ధనుష్. మొదటి సినిమాకు తన పేరు వేసుకోలేకపోయిన సెల్వ రాఘవన్, తన రెండో సినిమాను కూడా ధనుష్ తోనే మొదలుపెట్టాడు. మరో బోల్డ్ కాన్సెప్ట్ తో కాదల్ కొండెయిన్ అనే చిత్రాన్ని చేసాడు. మొదటి సినిమాకు తండ్రి చేత చివాట్లు, దెబ్బలు తిన్న ధనుష్, రెండో సినిమాకు అన్నయ్య చేత కూడా చివాట్లు, దెబ్బలు తిన్నాడు.

సినిమా సరిగా రావడం కోసం సెల్వ రాఘవన్ తమ్ముడిని బాగా కష్టపెట్టాడు. ధనుష్ రెండో సినిమా కాదల్ కొండెయిన్ చాలా పెద్ద హిట్ అయింది. ధనుష్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. సెల్వ రాఘవన్ తో పనిచేయడానికి స్టార్ హీరోలు సైతం సిద్ధమైపోయారు. ఒక సైకో ప్రేమకథను చాలా హృద్యంగా చూపించాడు సెల్వ రాఘవన్. మొదటి సినిమాతో విమర్శలు అందుకున్న ధనుష్ స్టార్ లీగ్ లో చేరిపోయాడు. ఈ సినిమాలో నటించిన సోనియా అగర్వాల్ కు కూడా మంచి మార్కులే పడ్డాయి. తర్వాత నిజ జీవితంలో సోనియా అగర్వాల్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు దర్శకుడు సెల్వ రాఘవన్. ఈ చిత్రాన్ని కూడా తెలుగులో అల్లరి నరేషే రీమేక్ చేయడం విశేషం. నేను అనే టైటిల్ తో రీమేక్ అయిన ఈ చిత్రం తెలుగులో కూడా డీసెంట్ సక్సెస్ ను సాధించింది. తన రెండో సినిమా స్పెషల్ స్క్రీనింగ్ లోనే ధనుష్, ఐశ్వర్యను కలిసాడు. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ సినిమా చూసి బాగా ఇంప్రెస్ అయి ధనుష్ ను తన ఫామ్ హౌస్ కు పిలిపించుకుని మరీ అరగంట సేపు మాట్లాడాడు. అప్పటికి ఇద్దరికీ తెలీదు మామ-అల్లుళ్ళు అవుతారని.

తొలి రెండు సినిమాలు తండ్రి, అన్నయ్యతో చేసిన ధనుష్, మూడో సినిమాకు బయట వారితో చేసాడు. ధనుష్ నటించిన మూడో సినిమా తిరుడా తిరుడి కూడా మంచి విజయం సాధించింది. ఈ చిత్రాన్ని సుబ్రహ్మణ్యం శివ దర్శకత్వం వహించాడు. ఛాయా సింగ్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని తెలుగులో మంచు మనోజ్ దొంగ దొంగది పేరిట రీమేక్ చేసాడు. ఈ చిత్రం ద్వారానే హీరోగా మనోజ్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఇలా ధనుష్ నటించిన మొదటి మూడు చిత్రాలు కూడా తెలుగులో రీమేక్స్ అయ్యాయి. ఒకే ఏడాదిలో రెండు సూపర్ హిట్స్ సాధించడంతో ధనుష్ పేరు మార్మోగిపోయింది.

మూడు సినిమాల సూపర్ హిట్స్ తో పైపైకి వెళ్ళిపోయిన ధనుష్ కెరీర్ నాలుగో సినిమాతో కొంచెం కిందకు వచ్చింది. ధనుష్ నాలుగో సినిమాగా పుదుకొట్టేయిలిరుందు శరవణన్ చిత్రంలో ధనుష్ పోషించిన పాత్రకు యావరేజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం కూడా హిట్ అవ్వలేదు. ఎస్ ఎస్ స్టాన్లీ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.

ధనుష్ ఐదో సినిమా సుల్లన్ అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేదు. రమణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం క్రిటిక్స్ నుండి నెగటివ్ రివ్యూలను అందుకుంది. అలాగే ఆడియన్స్ కూడా ఈ సినిమా పట్ల పెదవి విరిచారు. దీనివల్ల ధనుష్ కు తొలిసారి ప్లాప్ వచ్చింది. అయితే ఈ చిత్రాన్ని తెలుగులో మౌర్య టైటిల్ తో డబ్ చేసి విడుదల చేసారు. ఈ సినిమా విడుదల తర్వాత ధనుష్ కు పెళ్లయిపోయింది. సూపర్ స్టార్ రజినీకాంత్ కు అల్లుడైపోయాడు ధనుష్. రజినీకాంత్ అల్లుడి హోదాలో చేసిన ఐదో సినిమా ధనుష్ కు చేదు ఫలితాన్ని మిగిల్చింది. తన తొలి చిత్రాన్ని డైరెక్ట్ చేసిన తండ్రి కస్తూరి రాజా దర్శకత్వంలో ధనుష్ తన ఆరో సినిమా చేసాడు. డ్రీమ్స్ పేరిట విడుదలైన ఈ సినిమా కూడా ప్లాప్ అయింది. వరసగా రెండు ప్లాపులతో ధనుష్ కెరీర్ కొంత డౌన్ అయింది.

ధనుష్ నటించిన ఏడో సినిమా నిజానికి తన మొదటి సినిమా తర్వాత సైన్ చేసింది. దేవతాయి కందెన్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కింది. శ్రీదేవి హీరోయిన్ గా నటించింది కానీ మొదట ధనుష్ తొలి హీరోయిన్ షెరీన్ ను హీరోయిన్ గా అనుకున్నారు. మొదటి సినిమా సక్సెస్ తర్వాత ధనుష్ వరసగా సినిమాలు సైన్ చేయడంతో ఈ ప్రాజెక్ట్ వెనక్కి జరుగుతూ వచ్చి మూడేళ్లకు పట్టాలెక్కింది. ఈ చిత్రం కమర్షియల్ గా వర్కౌట్ అయి ధనుష్ కెరీర్ మళ్ళీ పైకి లేచింది.

ఆ తర్వాత ధనుష్ తమిళ సినిమాల్లో లెజండరీ దర్శకుడు అయిన బాలు మహేంద్ర గారితో పనిచేసే అవకాశం వచ్చింది. ధనుష్ అప్పటిదాకా సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతున్నా కానీ నటుడిగా ఓ స్థాయికి రాగలనని ఎప్పుడూ అనుకోలేదు. అయితే బాలు మహేంద్ర గారు స్వయంగా ధనుష్ తో సినిమా తీయడం. ఆ ప్రొడక్షన్ లో ఉండగా ధనుష్ ను ఎంతగానో ప్రోత్సహించారు ఆయన. బాలు మహేంద్ర అంతటి వ్యక్తి తనను ప్రోత్సహించడంతో ధనుష్ లో కూడా కాన్ఫిడెన్స్ పెరిగింది. తాను కూడా మంచి నటుడు కాగలడు అని మనసులో ధృడంగా అనుకున్నాడు. బాలు మహేంద్ర గారు ధనుష్ తో తీసిన అదు ఒరు కన కాలం అనుకున్న స్థాయిలో ఆడలేదు. అయితే ధనుష్ కు కొత్త వెలుగులు చూపించింది ఈ చిత్రం.

ధనుష్ రెండో సారి తన అన్నయ్యతో జట్టుకట్టాడు. సెల్వరాఘవన్, ధనుష్ తో ఒక సినిమాను అనౌన్స్ చేసాడు. హీరోయిన్ గా సోనియా అగర్వాల్, బోల్డ్ రోల్ లో స్నేహను అనుకున్నారు. ఐతే కథ విషయంలో కాంప్రమైజ్ కాక ఈసారి గ్యాంగ్స్టర్ డ్రామాను ఎంచుకున్నారు. అదే కాస్ట్ అండ్ క్రూతో సెల్వరాఘవన్ తెరకెక్కించిన పుదుపెట్టై సినిమా యావరేజ్ సక్సెస్ ను సాధించింది. ఈ సినిమాలో వయొలెన్స్ శాతం ఎక్కువ ఉండడం దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా ధనుష్ నటనకు మాత్రం చాలా మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా విడుదలయ్యాక, అదే ఏడాది సోనియా అగర్వాల్ ను పెళ్లి చేసుకున్నాడు సెల్వరాఘవన్. పెళ్ళికి ముందు సెల్వరాఘవన్ తీసిన మూడు సినిమాల్లోనూ సోనియా అగర్వాల్ హీరోయిన్ కావడం విశేషం. పెళ్లి అయ్యాక మళ్ళీ ఇద్దరూ కలిసి పనిచేయలేదు.

బాలు మహేంద్ర శిష్యుడు వెట్రిమారన్ ధనుష్ కోసం సిద్ధం చేసిన కథ హీరోకు నచ్చడంతో పొల్లాదవన్ పట్టాలెక్కింది. ఈ చిత్రం ధనుష్ కెరీర్ లో అప్పటికి అతిపెద్ద హిట్ గా నిలిచింది. అటు విమర్శకుల ప్రశంసలను అందుకోవడమే కాకుండా, ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ గా కూడా నిలిచింది. ఈ సినిమాతో బజాజ్ పల్సర్ ను యూత్ వాడటం బాగా పెరిగింది. బైక్ చుట్టూనే ఈ సినిమా కథ మొత్తం తిరుగుతుంది. ఈ చిత్రాన్ని వరుణ్ సందేశ్ హీరోగా తెలుగులో కుర్రాడు పేరుతో రీమేక్ చేసారు కానీ తమిళ్ లో అందుకున్న సక్సెస్ తెలుగులో రిపీట్ కాలేకపోయింది.

అప్పటిదాకా తన సినిమాలను తెలుగులో, కన్నడలో, ఇంకా వేరే హీరోలు రీమేక్ చేసారు. కానీ మొదటిసారి ధనుష్ ఒక రీమేక్ సినిమాలో నటించాడు. తన అన్నయ్య సెల్వరాఘవన్ తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందించిన ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే చిత్రాన్ని తమిళ్ లోకి రీమేక్ చేసాడు. కథకు మాత్రం సెల్వరాఘవన్ కు క్రెడిట్స్ రాగా ఈ రీమేక్ ను యారాడి నీ మోహిని పేరుతో డైరెక్ట్ చేసాడు జవహర్. ఈ చిత్రం ఆ ఏడాది విడుదలైన తమిళ సినిమాల్లో అతిపెద్ద హిట్ గా నిలిచింది. వరస సక్సెస్ లతో ధనుష్ స్టార్ హీరోగా అవతరించాడు.

ఆ తర్వాత సూరజ్ దర్శకత్వంలో వచ్చిన పడిక్కడవాన్ ధనుష్ కెరీర్ లో మరో హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటించింది. ఇలా వరస సక్సెస్ లతో కోలీవుడ్ లో టాప్ 5 హీరోల్లో ఒకడిగా పేరు సంపాదించుకున్నాడు ధనుష్. ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే రీమేక్ తో సక్సెస్ సాధించిన ధనుష్ మరో తెలుగు సినిమాను రీమేక్ చేసాడు. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఆర్య చిత్రాన్ని కుట్టి పేరుతో రీమేక్ చేసాడు. యారాడి నీ మోహిని చిత్రాన్ని డైరెక్ట్ చేసిన మిత్రన్ జవహర్ ఈ చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేయడం విశేషం. శ్రియ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. కుట్టి మొదట మిక్స్డ్ టాక్ తో మొదలైనా కానీ ధనుష్ కెరీర్ లో మరో హిట్ గా నిలిచింది.

ధనుష్ - మిత్రన్ జవహర్ జోడి మరో చిత్రంతో హ్యాట్రిక్ కొట్టారు. తెలుగులో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన రెడీ చిత్రాన్ని ఉత్తమపుతిరన్ పేరుతో రీమేక్ చేసాడు ధనుష్. ఈ సినిమా కూడా మొదట మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా కానీ మొత్తానికి సూపర్ హిట్ గా నిలిచింది. ఒకే ఏడాది రెండు తెలుగు రీమేక్స్ తో ధనుష్ ఒకే దర్శకుడితో రెండు సూపర్ హిట్స్ ను సాధించాడు.

2011లో ధనుష్ కెరీర్ లో మరో ఛేంజింగ్ మూమెంట్ వచ్చింది. అదే వెట్రిమారన్ తో కలిసి మరోసారి పనిచేయడం. ధనుష్ - వెట్రిమారన్ జోడి కలిసి చేసిన ఆడుకాలం అతిపెద్ద హిట్ అవ్వడమే కాదు. అవార్డ్స్ లలో క్లీన్ స్వీప్ చేసింది. నేషనల్ అవార్డ్స్ లో ఈ చిత్రం ఏకంగా 6 విభాగాల్లో అవార్డులను అందుకుంది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీతో పాటు ఉత్తమ చిత్రం.. ఇలా మొత్తం 6 నేషనల్ అవార్డులను సొంతం చేసుకుంది. ధనుష్ రేంజ్ ఈ సినిమా తర్వాత ఆకాశాన్ని అంటింది.

తన అన్నయ్య సెల్వరాఘవన్ తో మళ్ళీ రెండేళ్ల తర్వాత చేతులు కలిపాడు ధనుష్. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మార్ చిత్రం మాయకమ్ ఎన్న. ఈ చిత్రం వీరి కాంబినేషన్ లో మరో హిట్ గా నిలిచింది. ఇప్పటివరకూ వీరిద్దరూ కలిపి చేసిన సినిమాలో ప్లాప్ అన్నదే లేకపోవడం నిజంగా విశేషమే. రిచా గంగోపాధ్యాయ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని mr. కార్తీక్ పేరుతో తెలుగులోకి డబ్ చేసారు.

ఆ తర్వాతి ఏడాది ధనుష్ కెరీర్ లో మరో స్పెషల్ చిత్రం విడుదలైంది. ధనుష్, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా ధనుష్ భార్య ఐశ్వర్య దర్శకురాలిగా మారుతూ చేసిన చిత్రం 3. వై దిస్ కొలవెరి డీ సాంగ్ తో భీభత్సమైన సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కూడా మంచి చిత్రంగా నిలిచింది. ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో విడుదల చేయగా ఇక్కడ మాత్రం అనుకున్న ఫలితాన్ని సాధించలేదు.

2013 కూడా ధనుష్ కు చాలా స్పెషల్ ఇయర్. ఎందుకంటే ధనుష్ ఈ ఏడాది బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ధనుష్ హీరోగా సోనమ్ కపూర్ హీరోయిన్ గా ఆనంద్ ఎల్. రాయ్ రూపొందించిన రంఝానా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం ద్వారా ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకున్నాడు ధనుష్.

ధనుష్ చేసిన పలు సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన వెల్ రాజ్ దర్శకుడిగా రూపొందించిన చిత్రం వేలఇల్లై పట్టాదారి. ఒక బిటెక్ చదివిన కుర్రాడు ఉద్యోగం రాక ఎన్ని అవస్థలు పడుతున్నాడు, ఇంట్లో తన పరిస్థితి ఎలా ఉంటుంది వంటివన్నీ కళ్ళకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు. ఈ చిత్రం తెలుగులో రఘువరన్ బిటెక్ పేరిట విడుదలవ్వగా తెలుగులో ధనుష్ కు బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తమిళ్ లో కూడా ఈ సినిమా మంచి సక్సెస్ ను అందుకుంది. ఈ సినిమా వచ్చిన మూడేళ్లకు ధనుష్ విఐపి2 పేరిట సీక్వెల్ ను రూపొందించగా దానికి అంత రిసెప్షన్ రాలేదు.

ధనుష్ ఆ తర్వాత చేసిన వై రాజా వై, పా పాండి, షమితాబ్, తొడరి, తంగ మగన్, కోడి, మారి చిత్రాలు ధనుష్ ను నటుడిగా మరో మెట్టు ఎక్కించాయి. బాలీవుడ్ లోనే కాక హాలీవుడ్ లో కూడా ధనుష్ సినిమా చేసాడు. ది ఎక్స్ట్రా ఆర్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్ పేరిట ఆ సినిమాను రూపొందించగా దురదృష్టవశాత్తూ అది ఫెయిల్ అయింది. 2018లో వడ చెన్నై చిత్రంతో సూపర్ డూపర్ హిట్ ను కొట్టాడు ధనుష్. 2019లో వెట్రిమారన్ తో మరోసారి పనిచేసిన అసురన్ ధనుష్ కెరీర్ లోనే అతిపెద్ద హిట్. ఈ చిత్రం దాదాపు 100 కోట్ల గ్రాస్ ను వసూలు చేయడం విశేషం.

ప్రస్తుతం ధనుష్ 5 సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో గ్రే మ్యాన్ అనే ఇంగ్లీష్ సినిమా కూడా ఉంది. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలోనే అత్రాంగి రే హిందీ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ మరో హీరోగా నటిస్తున్నాడు. తమిళ్ లో జగమే తందిరం, కర్ణన్ చిత్రాల్లో నటిస్తున్నాడు ధనుష్.

తెలుగులో:

ధనుష్ ప్రధానంగా తమిళ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ధనుష్ నటించిన కొన్ని సినిమాలు ఇక్కడ రీమేక్ అయితే మరికొన్ని తెలుగులోకి డబ్ అయ్యాయి. ధనుష్ సినిమా తెలుగులోకి మొదటగా డబ్ అయింది మౌర్య. ఆ తర్వాత ధర్మయోగి, అనేకుడు, మిస్టర్ కార్తీ, సింహ పుత్రుడు, నవ మన్మథుడు, దేవ్, రైల్, శౌర్య, 3, మరియన్, రఘువరన్ బిటెక్, విఐపి2, మారి, మారి 2 వంటి సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాయి. వీటిలో నవ మన్మథుడు, రైల్, 3, రఘువరన్, మారి, మారి 2, విఐపి2 ధర్మయోగి వంటి చిత్రాలు ధనుష్ కు తెలుగు ప్రేక్షకుల ముందు మంచి గుర్తింపుని తీసుకొచ్చాయి.

నిర్మాతగా:

ధనుష్ కు సినిమాల పట్ల మంచి అభిరుచి ఉంది. తను చేసే సినిమాలే కాకుండా మంచి కథలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ధనుష్ నిర్మాతగా మారాడు. తన భార్య ఐశ్వర్యతో కలిసి వండర్ బార్ ఫిలిమ్స్ అనే ప్రొడక్షన్ కంపెనీని ఏర్పాటు చేసాడు ధనుష్. ఈ నిర్మాణ సంస్థలో ఎన్నో మంచి చిత్రాలను మనకు అందించాడు. మొదటగా వండర్ బార్ ఫిలిమ్స్ నుండి 3 చిత్రం నిర్మితమైంది. ఈ చిత్రానికి ఐశ్వర్య దర్శకురాలు. అప్పటినుండి మొదలుపెట్టి ఈ నిర్మాణ సంస్థ ఇప్పటివరకూ 17 సినిమాల వరకూ నిర్మించింది. ఈ నిర్మాణ సంస్థ కాక ముట్టై, విసరణై... ఈ రెండు సినిమాలను జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. వండర్ బార్ ఫిలిమ్స్ వెళ్ళై ఇల్లై పట్టాదారి, షమితాబ్, కాకి సెట్టై, కాక ముట్టై, మారి, నానుమ్ రౌడీ దాన్, తంగమగన్, విసరణై, సినిమా వీరన్, పా పాండి, వడ చెన్నై, మారి 2 వంటి సినిమాలను నిర్మించింది. ప్రస్తుతం పలు సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి.

గాయకుడిగా:

ధనుష్ లో ఎప్పుడూ ఒక గాయకుడు ఉన్నాడు. దాన్ని తొలిసారి గుర్తించింది మాత్రం పుదుకొట్టేయిలిరుందు శరవణన్ సినిమాలోనే. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రంలో నాట్టు సరకు అనే సాంగ్ ను ఆలపించాడు ధనుష్. అప్పటి నుండి తన సినిమాల్లో కనీసం ఒక్క సాంగ్ అయినా పాడుతుండడం అలవాటుగా మారిపోయింది. 2011లో ధనుష్ రాసి, పాడిన వై దిస్ కొలవెరి డి సాంగ్ ఎంత పెద్ద సెన్సేషన్ అయిందో మనందరికీ తెలుసు. సౌత్ ఇండియా నుండే ఒక సాంగ్ కు ఈ రేంజ్ రిసెప్షన్ ఎవరూ చూడలేదు. ఆ కాలంలోనే ఈ పాట 10 మిలియన్ వ్యూస్ ను సాధించింది. అనిరుధ్ ఈ సాంగ్ ను కంపోజ్ చేసాడు. ఈ పాట గురించి మాట్లాడుతూ ధనుష్ నా జీవితంలో జరిగిన అతిపెద్ద యాక్సిడెంట్ ఈ సాంగ్ అని అంటుంటాడు. ఎందుకంటే ఏదో సరదా కోసం కేవలం ఒక్క పూటలో రాసుకుని, సరదాగా కంపోజ్ చేసి విడుదల చేసిన ఈ సాంగ్ అద్భుతమైన సక్సెస్ అయింది. తమిళ్ లోనే కాక కన్నడ, తెలుగులో కూడా పాటలు పాడాడు ధనుష్. కన్నడలో వజ్రకాయ చిత్రంలో ఒక పాట పాడగా, తెలుగులో సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన తిక్క సినిమాలో టైటిల్ సాంగ్ ను పాడాడు.

ఇక మారి 2 చిత్రంలో రౌడీ బేబీ సాంగ్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సాంగ్ కు సాహిత్యాన్ని అందించింది ధనుష్. మేల్ వెర్షన్ పాడింది ధనుష్. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సాంగ్ ఎవరూ ఊహించలేనంత సక్సెస్ అయింది. ఈ సాంగ్ కోసమే సినిమాకు వెళ్లిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ పాట యూట్యూబ్ లో కొత్త రికార్డులను తిరగరాసింది. 1 బిలియన్ వ్యూస్ ను సాధించి సౌత్ ఇండియా నుండి ఒక సినిమా పాటకు అత్యధిక వ్యూస్ సాధించడం ఒక రికార్డ్. ఇప్పటివరకూ మరో సౌత్ ఇండియన్ సాంగ్ కు ఈ ఘనత దక్కలేదు. అంత పెద్ద సక్సెస్ ఈ పాట. కేవలం గాయకుడిగానే కాకుండా ధనుష్ లిరికల్ రైటర్ గా కూడా సక్సెస్ సాధించాడు. ఇప్పటికే పదుల సంఖ్యలో పాటలకు సాహిత్యాన్ని అందించాడు. అయితే సింగర్ గా, లిరిసిస్ట్ గా ధనుష్ ఎక్కువగా తన సినిమాల వరకే పనిచేసాడు.

అవార్డ్స్:

ఏ నటుడికైనా కొలమానం అనదగ్గవి అవార్డ్స్. అవార్డ్స్ వస్తేనే మంచి నటుడా అంటే చెప్పలేం కానీ మంచి నటుడైతే కచ్చితంగా అవార్డ్స్ వస్తాయి. ఈ విషయంలో ధనుష్ అందరికంటే ఎక్కువ స్కోర్ చేసాడని చెప్పవచ్చు. ఎందుకంటే ధనుష్ తన కెరీర్ లో ఎన్నో అవార్డులను, సత్కారాలను, ప్రశంసలను అందుకున్నాడు. ఇండియన్ సినిమాలో అత్యున్నత పురస్కారం అంటే జాతీయ పురస్కారాలు. ధనుష్ ఈ అవార్డ్స్ ను మొత్తం నాలుగు సార్లు అందుకున్నాడు. రెండు సార్లు నటుడిగా, రెండు సార్లు నిర్మాతగా ధనుష్ ఈ అవార్డ్స్ ను పొందాడు. ముందుగా 2010 సంవత్సరంలో ఆడుకలం చిత్రంలో తన పెరఫార్మన్స్ కు గాను ధనుష్ కు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డ్ వచ్చింది. అలాగే 2014లో ఉత్తమ బాలల చిత్రంగా కాక ముట్టై చిత్రానికి జాతీయ స్థాయి పురస్కారం దక్కింది. అలాగే 2015లో విసరణై చిత్రానికి ఉత్తమ తమిళ చిత్రంగా నేషనల్ అవార్డ్ దక్కింది. రీసెంట్ గా 2019లో ధనుష్ అసురన్ లో తన నటనకు మరోసారి జాతీయ అవార్డ్ ను అందుకున్నాడు.

* జాతీయ స్థాయి ఫిల్మ్ ఫేర్ అవార్డును బాలీవుడ్ చిత్రం రంఝానాకు అందుకున్నాడు.

* ఫిలిం ఫేర్ సౌత్ అవార్డ్స్ ను పలుమార్లు అందుకున్నాడు ధనుష్. ముందుగా 2011లో ఆడుకలం ఉత్తమ హీరో, 2012లో వై దిస్ కొలవెరి డి సాంగ్ పాడినందుకు ఉత్తమ గాయకుడు, అదే 3 సినిమాకు ఉత్తమ నటుడు, మర్యన్ చిత్రానికి క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ అవార్డ్, వెళ్ళైల్లై పట్టాదారి, కాక ముట్టై చిత్రానికి ఉత్తమ చిత్రం, వడ చెన్నైకు మళ్ళీ ఉత్తమ నటుడు - ఇలా పలు ఫిల్మ్ ఫేర్ సౌత్ పురస్కారాలను ధనుష్ అందుకున్నాడు.

* ఇవి కాకుండా విజయ్ అవార్డ్స్, సైమా పురస్కారాలు, ఎడిసన్ అవార్డ్స్, వికటన్ అవార్డ్స్, ఐఫా, ఇలా వివిధ రకాల అవార్డులను ధనుష్ సొంతం చేసుకున్నాడు.

* 2011లో చెన్నై టైమ్స్ వారు అందించిన స్టైలిష్ స్టార్ ఆఫ్ సౌత్ సినిమా గౌరవాన్ని అందుకున్నాడు ధనుష్.

ఆర్ట్ కు భాషతో సంబంధం లేదు అని బలంగా నమ్మే వ్యక్తి ధనుష్. అందుకే వివిధ భాషల్లో విజయాలు సాధించాడు. తమిళంలో ఎక్కువగా సినిమాలు చేసిన ధనుష్, హిందీ, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో కూడా నటించాడు. అలాగే ధనుష్ పాడిన ఎన్నో పాటలు బోలెడంత గుర్తింపు తెచ్చుకున్నాయి. పాటలను రాయగలడు, కథలు రాసుకుంటాడు. దర్శకత్వం కూడా చేసాడు. నిర్మాతగా ఇప్పటికే విజయవంతమయ్యారు కూడా. ఇలా అడుగుపెట్టిన ఏ క్రాఫ్ట్ లో అయినా ధనుష్ విజయం సాధించడం ఆయన కష్టానికి ప్రతిఫలంగా చెప్పుకోవచ్చు.

రఘువరన్ బిటెక్ సినిమా తర్వాత ధనుష్ కు తెలుగులో కూడా మంచి మార్కెట్ వచ్చింది. ఈ నేపథ్యంలో ధనుష్ ఇలాగే మరిన్ని సంవత్సరాలు తను ఎంచుకున్న క్రాఫ్ట్ లో మనల్ని ఆనందింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.