చియాన్ విక్రమ్

వైవిధ్యమైన పాత్రలు చేయడంలో తమిళంలో కమల్ హాసన్ తర్వాత అంత గొప్పగా నటించే హీరో చియాన్ విక్రమ్. సినిమాలో పాత్ర కోసం ఎంత దూరం అయిన వెళ్లే విక్రమ్ నటనని మెచ్చి చాలా అవార్డ్స్ వచ్చాయి. శివ‌పుత్రుడు, అప‌రిచితుడు సినిమాలతో తమిళంతో పాటు విక్రమ్ తెలుగులో కూడా అభిమానులని సంపాదించుకున్నారు. ఈ సినిమాల్లో విక్రమ్ నటనను చూస్తే ఎవ్వరైనా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. విక్రమ్ నటుడిగానే కాకుండా గాయకుడిగానూ పాటలు పాడటం విశేషం.

జననం

1966 ఏప్రిల్ 17న విక్రమ్ తమిళనాడులో జన్మించాడు. తండ్రి జాన్ వాకర్ అలియస్ వినోద్ రాజ్. తల్లి రాజేశ్వరీ. విక్రమ్ తండ్రి వినోద్ రాజ్.. పలు తమిళ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసేవాడు. విక్రమ్ అసలు పేరు కెనడీ జాన్ విక్టర్. సినిమాల్లోకి వచ్చిన తర్వాత తన పేరులో విక్టర్ మొదటి పదం 'వి', కెనడీలోని 'కే', తన తల్లి రాజేశ్వరీ పేరు మీదుగా 'రా' తో కలిపి విక్రమ్ గా పేరు మార్చుకున్నాడు. తమిళనాడు లోని రామనాథపురం జిల్లా పరమకుడి ఆయన స్వస్థలం. ఇదే ఊరు నుంచి మరో ముగ్గురు జాతీయ ఉత్తమ నటులుండటం విశేషం. వారే చారుహాసన్, కమల్‌హాసన్, సుహాసిని. విక్రమ్ యార్కాడ్ లో చదువుకున్నాడు.

చెన్నై లోని లయోలా డిగ్రీ కళాశాల నుంచి ఆంగ్ల సాహిత్యంలో బి.ఎ పట్టా కూడా పుచ్చుకున్నాడు. ఆయన ఎం.బి.ఎ కూడా అక్కడే చదివాడు. చదువు కోసం చెన్నైలో ఉన్నప్పుడు హాలీవుడ్ సినిమాలు ఎక్కువగా చూసేవాడు. చిన్నప్పటి నుంచి చదువు మీద కన్నా విక్రమ్ సినిమాల మీద ఎక్కువగా సమయం గడిపేవాడు. కరాటే, ఈత పోటీల్లో ఆయన టాప్ గా నిలిచేవాడు. విక్రమ్ గిటార్, పియానో కూడా వాయిస్తాడు. విక్రమ్ తండ్రి వినోద్ నటుడు కావాలనుకున్నారు కానీ చివరకు ఇంజనీరుగా స్థిరపడ్డారు. దానితో విక్రమ్ ఎలాగైనా నటుడు కావాలని సినిమాల్లోకి వచ్చారు.

సినీ జీవితం

మొదట్లో విక్రమ్ కి తమిళ సినిమా అంతగా కలిసిరాలేదు. ఆయన నటించిన తమిళ సినిమాలన్నీ వరసగా ప్లాప్స్ అవ్వడంతో కొన్ని సంవత్సరాలు తెలుగులో కూడా నటించాడు. తెలుగులో విక్రమ్ మొదటి సినిమా దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన అక్క పెత్తనం చెల్లెలి కాపురం. ఇందులో రాజేంద్రప్రసాద్ స్నేహితుడి పాత్రలో నటించాడు విక్రమ్. హీరోగా చేసిన చిరునవ్వుల వరమిస్తావా అనే సినిమా కొన్ని కారణాల వలన ఇప్పటికీ విడుదల కాలేదు. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన బంగారు కుటుంబం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి నటించడం ఒక గొప్ప అనుభూతి నిచ్చిందని చెప్తారు విక్రమ్.

కాగా 1999లో వచ్చిన సేతు సినిమా విక్రమ్‌ కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌గా నిలిచింది. నటుడిగా విక్రమ్‌కు ఈ సినిమా బిగ్‌ బ్రేక్‌ను అందించింది. ఉత్తమ తమిళ చిత్రంగా జాతీయ అవార్డును అందుకోవడంతోపా టు మరిన్ని అవార్డులను సొంతం చేసుకుంది. తమిళంలో సేతు సూపర్‌ హిట్‌ విజయాన్ని సాధించడంతో తెలుగులో శేషుగా, కన్నడలో హుచ్చా, హిందీలో తేరే నామ్‌ పేరుతో రీమేక్‌ చేశారు. బాల దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఇళయారాజా సంగీతం అందించారు

ఆయనకి ఇంకో పెద్ద హిట్ కాశీ సినిమాతో వచ్చింది. కళ్ళు లేని వాడిలాగా ఈ సినిమాలో విక్రమ్ నటన అద్భుతం అని చెప్పాలి. మలయాళం సినిమా రీమేక్ గా వచ్చిన ఈ కాశీ సినిమా విక్రమ్ కి ఒక మంచి హిట్ ఇవ్వడమే కాకుండా నటనలో ఆయనని ఇంకో మెట్టు ఎక్కించింది.

ఇక 2002 లో వచ్చిన జెమినీ సినిమా విక్రమ్ కేరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో విక్రమ్ కు జోడిగా కిరణ్ రాథోడ్ నటించింది. ఈ సినిమాలో ‘ఓ పొడు’ పాట అప్పట్లో సినిమాకి విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చింది. ఈ సినిమా విడుదలైనప్పుడు యావరేజ్ రివ్యూస్ వచ్చాయి. కానీ సినిమా కలెక్షన్స్ ని మాత్రం ఈ రివ్యూస్ అపలేకపోయాయి. ఈ సినిమా ఆ సంవత్సరం విడుదలైన సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత సంవత్సరం వచ్చిన ధూల్, స్వామి లాంటి సినిమాలు విక్రమ్ కి హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చాయి.

ఇక విక్రమ్ నటించే ప్రతీ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అందులో ఒకటిగా పితామగన్. ఈ చిత్రం విక్రమ్ కెరీర్‌లో పెద్ద హిట్ సాధించింది. ఈ పితామగన్ చిత్రాన్ని తెలుగులోకి కూడా అనువదించారు. అయితే సిమమా పేరు మాత్రం 'శివపుత్రుడు'గా పెట్టారు. పేరు ఎలా పెట్టినా.. తమిళ తెలుగు భాషల్లో సూప్ హిట్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో విక్రమ్ నటనకు నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. ఇందులో సూర్య నటన కూడా చాలా అద్భుతం. బాలా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి ఇప్పటికి అభిమానులు ఉన్నారు.

వరసగా సూపర్ హిట్స్ కొడుతున్న విక్రమ్ కి మళ్ళీ ప్లాప్స్ రావడం మొదలయ్యాయి. అయితే ఆయనకి మళ్ళీ సూపర్ హిట్ అపరిచితుడుతో వచ్చింది. ఈ సినిమా విడుదల వరకు చాలా పెద్ద కథనే జరిగింది. బై-పోలార్ దిజార్డర్ ఉన్న వ్యక్తి ముగ్గురిలా ప్రవర్తిస్తుంటాడు . కాసేపు ట్రెడిషనల్. ఇంకా సేపు అల్ట్రామోడ్రన్. మరి కాసేపు రెబల్. ట్రిపుల్ రోల్ కాదు. ఒకే మనిషి ముగ్గురిలా ప్రవర్తిస్తాడు. అతనికి ఉన్న రోగం సమాజానికి పట్టిన రోగాన్ని తొలగిస్తుంది. మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్. ఒకే వ్యక్తి వేర్వేరు వ్యక్తుల్లా వ్యవహరించే ఉన్మాదస్థితి. అతనికి సమాజంపై కోపం కాదు. అతి ప్రేమ.

అతనొక అపరిచితుడు. ఎవ్వరికీ తెలీదు. చివరికి అతనికే తెలీదు. తప్పు చేసిన కేటరింగ్ వాడు కభీంకుపాం. నకిలీ బ్రేక్‌ వైర్ అమ్మినవాడు మిక్రినజంభో. యాక్సిడెంట్ చూసినా పట్టించుకోనివాడు అకూంపధం. శంకర్ అప్పటిదాకా ఏడు సినిమాలు తీశాడు. దేనికీ ఇంత టెన్షన్ పడలేదు. సుజాతా రంగరాజన్ ఈజీగా స్టోరీ రాసిచ్చేశాడు కానీ, దానికి స్క్రీన్‌ప్లే రాయడానికి నాలుగు రెట్ల టెన్షన్ పడుతున్నాడు శంకర్. సీన్లు మారుస్తున్నాడు. క్యారెక్టర్లు మార్చి పారేస్తున్నాడు. ఫస్ట్ ఈ ముగ్గురిలో ఒకడు సర్దార్‌జీ. ఫన్ వస్తుంది. కానీ సౌత్‌ వాళ్లు కనెక్టవుతారా? ఎందుకు... హాయిగా వైష్ణవ బ్రాహ్మణున్ని చేశారు.

హిందీ ‘నాయక్’ అయిపోయింది. వెంటనే ‘బాయ్స్’ తీశాడు శంకర్. మామూలుగా ఒక సినిమా అయ్యేవరకూ ఇంకో సినిమా గురించి ఆలోచించడు. కానీ ‘బాయ్స్’ టైమ్‌లోనే ‘అపరిచితుడు’ గురించి ఆలోచన  చేస్తున్నాడు. అంతలా హాంట్చేస్తోందీ స్క్రిప్టు. రజనీకాంత్ దగ్గరికెళ్లి కథ చెప్పాడు. ‘సారీ’ అన్నాడు రజనీ. ఆయనిలా చెప్పడం రెండోసారి. ఇంతకుముందు ‘ఒకే ఒక్కడు’ కూడా రిజెక్ట్ చేశాడు. రజనీ ‘నో’ అంటే విక్రమ్ దగ్గరికెళ్లిపోదామని ప్లాన్. ఇక చివరికి విక్రమ్ దగ్గరికి వచ్చింది ఈ సినిమా. బడ్జెట్ చాలా అవుతుంది. డేరింగ్ ప్రొడ్యూసర్ కావాలి. ఆస్కార్. వి. రవిచంద్రన్ ఇలాంటి వాటికి ఎప్పుడూ రెడీ. అప్పటికి సౌత్‌లో ‘జీన్స్’ కాస్ట్లీ ఫిల్మ్.

హీరోయిన్‌గా ఐశ్వర్యారాయ్ అయితే బాగుంటుంది. ఆమెకూ శంకర్‌తో చేయడం ఇష్టమే. ‘జీన్స్’తో తనకు గ్రాండ్ సక్సెస్ ఇచ్చిన శంకర్ డెరైక్టర్ కానీ బాలీవుడ్‌లో బిజీ. సిమ్రాన్‌ని అడిగారు. తనకప్పుడే పెళ్లి కుదిరింది. ‘జయం’తో పెద్ద హిట్టు కొట్టిన సదాని వెతుక్కుంటూ వెళ్లిందీ ఆఫర్. ఈ సినిమాకు ఆయన సినిమాలకి సంగీతం అందించిన రెహమాన్ సంగీతం అందించలేదు. తన శిష్యుడు హ్యారిస్ జై రాజ్‌ని తీసుకున్నారు. ఇలాంటి సినిమాకు కెమెరామాన్‌గా పీసీ శ్రీరామ్ అయితే కరెక్ట్. ఆయన ఫుల్ బిజీ ఆయన ప్లేస్ లోకి రవివర్మన్ వచ్చాడు. ఫేమస్ కెమెరామ్యాన్. రవి.కె.చంద్రన్‌కి అసిస్టెంట్. ‘బాయ్స్’కి జెనీలియా ఫొటోషూట్ అంతా అతనే చేశాడు. కానీ శంకర్ అప్పటికే మనికందన్ ని తీసుకున్నారు.

ఇక్కడ ప్రీప్రొడక్షన్ జరుగుతుంటే, అక్కడ విక్రమ్ కేరెక్టర్స్ మౌల్డింగ్ కోసం హోమ్‌వర్క్ చేసుకుంటున్నాడు. అద్దం ముందు రామానుజం గెటప్‌లో ఉన్నాడు. బాడీ లాంగ్వేజ్ చూసుకున్నాడు. అంతా ఓకే. కానీ కొంచెం పొట్ట పెంచాలి. నెక్ట్స్రెమో. అల్ట్రామోడ్రన్‌గా తయారయ్యాడు. వాకింగ్ స్టయిల్ మార్చేశాడు. ఇంకొంచెం బాడీ షేప్ మార్చాలి. ఇప్పుడు ‘అపరిచితుడు’ గెటప్. బాగుంది కానీ, ఇంకా బాగుండాలి. ఫుల్‌గా ఎక్సర్‌సైజ్ చేసి బాడీ బిల్డింగ్ చెయ్యాలి. పగలూ, రాత్రీ ఈ మూడు పాత్రల గురించే ఆలోచన. నిద్ర కూడా సరిగ్గా పోవడం లేదు. విక్రమ్ వైఫ్ శైలజ సైకాలజిస్ట్. ఆమెతో కూర్చుని పర్సనాలిటీ డిజార్డర్ గురించి డిస్కషన్స్ చేసేవాడు.

2004 మార్చి 4. ఉదయం 9.30 గంటలకి చెన్నైలోని ఏవీయమ్ స్టూడియోలో లెవెన్త్ ఫ్లోర్ లో ‘అపరిచితుడు’ ఓపెనింగ్. తమిళంలో ‘అన్నియన్’, హిందీలో ‘అపరిచిత్’. ప్రెస్‌మీట్‌లో శంకర్ మాట్లాడుతున్నాడు. ‘‘ఇది ఫిక్షన్ థ్రిల్లర్. ఆరు నెలల్లో కంప్లీట్ చేస్తా’. జర్నలిస్టులు అయోమయంగా చూశారు. షూటింగ్ జరుగుతూనే ఉంది. షెడ్యూల్ మీద షెడ్యూల్... ప్లానింగ్ మీద ప్లానింగ్. తిరువయ్యూరులో ఏటా త్యాగరాజ మహోత్సవాలు జరుగుతుంటాయి. ఈ సినిమాలో ఆ ఎపిసోడ్ ఉంది. ఏవీయమ్ స్టూడియోలో సెట్ వేశారు. ఫేమస్ వయొలిన్ విద్వాంసుడు కన్నకుడి వైద్యనాథన్, ఫేమస్ సింగర్స్ ఉన్నికృష్ణన్, సుధా రఘునాథన్ తదితరులపై షాట్స్ తీశారు.

వెరీ ఇంపార్టెంట్ యాక్షన్ ఎపిసోడ్. వియత్నాం నుంచి 127 మంది మార్షల్ ఆర్ట్స్ నిపుణులు దిగారు. టేకింగ్ హాలీవుడ్ లెవెల్లో ప్లాన్ చేశారు. ‘మ్యాట్రిక్స్’ మూవీకి వాడిన టెక్నాలజీ. చెన్నైలోని జేబీ ఇన్‌డోర్ స్టేడియంలో సెట్ వేశారు. 25 రోజులు తీశారు. అపరిచితుడు పబ్లిక్‌తో మాట్లాడే సీన్‌ని హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియమ్‌లో తీశారు. గేదెల సీన్‌కి కూడా చాలా కష్టపడ్డారు. పాటల్నీ భారీగానే తీశారు. ‘ఓ సుకుమారి’ పాటను నెదర్లాండ్స్‌లో జరిగే వరల్డ్ ఫ్లవర్ షోలో తీశారు. ఆ టైమ్‌లో అక్కడ చలి చాలా ఎక్కువ. అంత చలిలో, విక్రమ్‌తో సహా డాన్సర్లంతా పంచెకట్టుతోపాల్గొన్నారు. ఆరు నెలలు పూర్తయ్యాయి. ఇంకా షూటింగ్ పార్ట్ చాలా ఉంది.

కెమెరామెన్ మణికందన్‌కి వేరే కమిట్‌మెంట్ ఉంది. రవివర్మన్‌ను రమ్మన్నాడు. అప్పుడే అతను ఓ బెంగాలీ సినిమా కమిట్ అయ్యాడు. ఇక్కడేమో శంకర్ ఆఫర్. బెంగాలీ సినిమా వదిలేసుకుని మరీ ఇక్కడికొచ్చేశాడు. విక్రమ్ పరిస్థితీ అంతే. డేట్ల మీద డేట్లు ఇస్తున్నాడు. ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలీని పరిస్థితి. పెద్ద పెద్ద ఆఫర్లొస్తున్నాయి. అన్నీ రిజెక్ట్ చేస్తున్నాడు. పూర్తిగా ‘అపరిచితుడు’ మైకంలో ఉన్నాడు. చివరికి ఈ సినిమాకి గుమ్మడికాయ కొట్టేశారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా ఎక్కువ సమయం తీసుకుంది. ఇంకో పక్క గ్రాఫిక్స్. ఆస్కార్ రవిచంద్రన్ కోట్లకు కోట్లు పోస్తున్నాడు. ఫైనల్‌గా లెక్క తేలింది. 26 కోట్ల 38 లక్షలు. షాకింగ్ ఫిగర్. సౌత్‌లో హయ్యెస్ట్ బడ్జెట్ ఫిల్మ్.

తెలుగు డబ్బింగ్ రైట్స్ కోసం ఫుల్ కాంపిటీషన్. పెద్ద పెద్ద వాళ్లు అడుగుతున్నారు. రవిచంద్రన్ పెద్ద రేట్లు చెబుతున్నాడు. ‘లక్ష్మీగణపతి ఫిలిమ్స్’ బాడిగ సుబ్రహ్మణ్యం రూ. 6.75 కోట్లకు ఈ సినిమా తెలుగు రైట్స్ అమ్మేశారు. ‘టెర్మినేటర్-3’, ‘స్పైడర్‌మ్యాన్ 2’ లాంటి హాలీవుడ్ డబ్బింగ్‌లు, ‘శివపుత్రుడు’లాంటి తమిళ డబ్బింగ్‌లు చేసినవాడు ఈ దెబ్బతో ఫినిష్ అనుకున్నారు. 2005 జూన్ 17. సమ్మర్ ఎండింగ్‌లో అపరిచితుడు విడుదలయ్యింది. పెద్ద పెద్ద సినిమాలు రిలీజవుతున్నాయి. వీటిమధ్య శంకర్ మ్యాజిక్ వర్కవుట్ అయ్యింది. డివైడ్ టాక్‌తోనే ‘అపరిచితుడు’ సూపర్‌హిట్. 104 ప్రింట్లతో రిలీజ్ చేసిన సినిమా 37 సెంటర్స్‌లో హండ్రడ్ డేస్. పదిహేను కోట్ల వరకూ కలెక్షన్స్. ఈ సినిమాకి నిజంగా విక్రమే హీరో. ప్రాణం పెట్టి పని చేశాడు. మూడు క్యారెక్టర్ల హావభావాలను క్షణాల్లో మార్చి మార్చి చూపించడం చాలా చాలా కష్టం. శంకర్ సినిమాల్లో ఎప్పుడూ సోషల్ అవుట్‌లుక్ కనిపిస్తుంది. ఇందులో మాత్రం పీక్‌కి వెళ్లిపోయింది. ఈ సినిమాకి పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.

అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత విక్రమ్ అంత రేంజ్ లో ఒక్క హిట్ కూడా రాలేదు. ఆయన చేసిన సినిమాలు అన్ని వరసగా ప్లాప్స్ ఇవ్వడం మొదలుపెట్టాయి. ఆయన నటించిన అన్ని చిత్రాల్లో నాన్న సినిమాకి మంచి పేరు వచ్చింది. అలాగే విక్రమ్ మణిరత్నం రావన్ సినిమాతో హిందీలోకి కూడా అడుగుపెట్టాడు. ఈ సినిమా అనుకున్నంత హిట్ కాలేదు.

విక్రమ్ కి మళ్ళీ ఆయన కేరీర్ కాపాడే హిట్  భారీ చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు శంకర్ అందించారు. విక్రమ్,  బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్ హీరోయిన్ గా నటించిన చిత్రం ఐ . శంకర్-విక్రమ్ కాంబోలో వచ్చిన రెండో చిత్రమిది. అంతకుముందు వీరి కాంబినేషన్‌లో ‘అపరిచితుడు’ సినిమా వచ్చింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దీంతో ‘ఐ’ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సాధారణంగానే శంకర్ సినిమా అంటే ఆ స్థాయి వేరేగా ఉంటుంది. ‘ఐ’ సినిమా పోస్టర్లు, ట్రైలర్, విక్రమ్ వేషధారణ చూసి ఇది కూడా సూపర్ హిట్ కావడం ఖాయమనుకున్నారు. కానీ, ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది.

2015 జనవరి 14న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలైన ‘ఐ’ అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది. కాకపోతే ఈ సినిమా తమిళంలో మాత్రం హిట్ అయ్యింది తప్ప మిగతా భాషల్లో ఎక్కువగా ఆడలేదు. అయితే, డైరెక్టర్ శంకర్‌కు ఉన్న క్రేజ్‌తో ఓపెనింగ్స్ అయితే భారీగా రాబట్టింది ఈ చిత్రం. విక్రమ్‌తో ‘అపరిచితుడు’ లాంటి సందేశాత్మక చిత్రం తెరకెక్కించిన శంకర్.. ఈసారి మాత్రం లవ్ అండ్ రివేంజ్ డ్రామాను తెరపై ఆవిష్కరించారు. ఈ రివేంజ్ డ్రామా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. తెలుగులో ప్లాప్ అయిన కూడా ఈ సినిమా బుల్లితెరపై మాత్రం ఘన విజయాన్ని అందుకుంది. ‘ఐ’ శాటిలైట్ రైట్స్‌ను అప్పట్లో స్టార్ మా ఛానెల్ కొనుగోలు చేసింది. ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ను స్టార్ మా ప్రసారం చేసింది.  దీనికి 11.1 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఇన్నేళ్ల తరవాత కూడా ఈ స్థాయిలో టీఆర్పీ రావడం విశేషం.

విక్రమ్ ఐ తర్వాత ఇంకొకడు, స్కెచ్, స్వామి 2, మిస్టర్ కెకె సినిమాల్లో నటించగా స్కెచ్ సినిమా బాగా ఆడింది. ఇక విక్రమ్ ప్రస్తుతం కోబ్రా, ధ్రువ నచ్చిత్రం సినిమాల్లో బిజీగా ఉన్నారు.

వ్యక్తిగత జీవితం

విక్రమ్ 1980 లో శైలజ బాలకృష్ణన్ తో ప్రేమ మొదలయ్యింది. ఆ తర్వాత 1992 లో గురువాయూర్ గుడి లో కొన్ని వందల పెళ్ళిలతో విక్రమ్ శైలజ పెళ్లి కూడా జరిగింది. శైలజ గారి సొంత ఊరు కేరళ లోని తాలసిరీ  అనే గ్రామం. ప్రస్తుతం ఆమె చెన్నై లోని ఒక స్కూల్ లో సైకాలజీ టీచర్ గా పని చేస్తుంది. ఆమె దైవ తిరుమగల్ సినిమాలో విక్రమ్ మతిస్థిమితం లేని పాత్ర కోసం  సలహాలు ఇచ్చి  సహాయం చేసింది.ఇక విక్రమ్ శైలజ దంపతులకి  అక్షిత , ధృవ్ విక్రమ్ సంతానం. 2017 లో కరుణానిధి గారి ముని మనవడి రంజిత్ తో అక్షిత కి పెళ్ళి ఘనంగా జరిగింది. ఇక విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ 2019లో అర్జున్ రెడ్డి రీమేక్ గా వచ్చిన ఆదిత్య వర్మ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

అవార్డ్స్

1.  విక్రమ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన సేతు సినిమాకి ఫిలింఫేర్ స్పెషల్ అవార్డ్, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్ స్పెషల్ ప్రైజ్ విక్రమ్ కి లభించాయి.

2. 2003 లో విడుదలైన పితమగన్ (శివపుత్రుడు) సినిమాలో విక్రమ్ నటనకి నేషనల్ అవార్డ్ బెస్ట్ యాక్టర్ గా రావడం విశేషం. అలాగే ఫిలింఫేర్ అవార్డ్ ,సినిమా అవార్డ్  మరియు తమిళనాడు స్టేట్ అవార్డ్ సైతం విక్రమ్ కి వచ్చాయి.

3. ఇక 2005 లో వచ్చిన అపరిచితుడు సినిమాలో విక్రమ్ నటనకి ఫిలింఫేర్ , ఆసియా నెట్ ఫిల్మ్ అవార్డ్స్ నుంచి బెస్ట్ యాక్టర్ గా అవార్డ్స్ వచ్చాయి.

4. 2015 లో వచ్చిన ఐ సినిమాకి గాను బెస్ట్ యాక్టర్ గా ఫిలింఫేర్ మరియు సైమ అవార్డ్స్ లభించాయి.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.