విలక్షణ నటుడు చంద్రమోహన్

తెలుగు తెరపై వివిధ పాత్రల్లో నటించి తన వైవిధ్యతను చాటిన ప్రముఖుల్లో నటుడు చంద్రమోహన్ కూడా ఒకరు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, తండ్రి పాత్రల్లో నటించి ఏ పాత్రని అయిన చేయగలడు అని నిరూపించుకున్నారు ఆయన. చంద్రమోహన్ గారు హైట్ ఒక్క అడుగు ఎక్కువగా ఉంటే తెలుగులో హీరోగా సూపర్ స్టార్ అయ్యేవారు అని అంటూ ఉంటారు. కానీ ఆయన నటనకి ఇలాంటివి ఏవి అడ్డం కాదు అని నిరూపించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు.

చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్రావు. చంద్రమోహన్ కృష్ణా జిల్లాలోనీ పమిడిముక్కల గ్రామంలో 1942, మే 23న మల్లంపల్లి వీరభద్రశాస్త్రి, శాంభవి దంపతులకు జన్మించారు. ఈయన బాపట్లలోని వ్యవసాయ కళాశాలలో బి.యస్.సి. పూర్తిచేశారు. కాలేజ్ లో చదువుకుంటున్నప్పుడే చంద్రమోహన్ గారు నాటకాలు వేసేవారు. గుంటూరు, బాపట్లలలో వీరి నాటకాలు ఎక్కువగా ప్రదర్శింపబడేవి. బిఎస్సీ పరీక్షలు రాయగానే ఏలూరులో అగ్రికల్చర్ ఆఫీసర్ గా ఉద్యోగం వచ్చింది. ఆయన ఉద్యోగం చేసుకుంటూనే వీలు చిక్కినప్పుడల్లా నాటకాలు వేసేవారు.

సినీ ప్రయాణం

1964 లో ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకత్వంలో రాబోతున్న తేన మనసులు సినిమా కోసం నూతన నటి నటులు కావలెను అనే ప్రకటన వెలువడింది. ఈ విషయం తెలిసిన కొంతమంది చంద్ర మోహన్ గారి స్నేహితులు ఆయనకి చెప్పారు. దానితో చంద్రమోహన్ గారు తన ఫొటోస్ ని మద్రాస్ కి పంపించారు. కొన్ని రోజుల తర్వాత మద్రాస్ రమ్మని పిలుపు వచ్చింది. చంద్రమోహన్ గారు ఎంతో ఆశగా మద్రాస్ వెళ్లారు కానీ అక్కడ పాత్రకి ఎంపిక కాలేదు. ఆ సినిమాకి కృష్ణ గారిని, సంధ్య గారిని సెలెక్ట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ కన్నె వయసు అనే సినిమాకి ఆడిషన్స్ జరుగుతున్నాయి అని తెలిసి మళ్ళీ తన ఫొటోస్ పంపిన చంద్రమోహన్ గారికి మద్రాస్ లో ఇంకోసారి చేదు అనుభవం ఎదురయింది. ఆయన మళ్ళీ ఏలూరు వచ్చి ఉద్యోగం చేసుకుంటున్నారు. ఆ సమయంలో చంద్రమోహన్ గారి తండ్రి చనిపోయారు. దానితో ఆయన్ని తన తల్లి ఎక్కడికి పంపించలేదు. చంద్రమోహన్ గారికి ఇద్దరు చెల్లలు కూడా ఉండటంతో ఇంటి బాధ్యత అంత ఆయన మీదనే పడింది. ఇక ఆయన సినీ ప్రయత్నాలు చేయడం ఆపేసి ఉద్యోగం చేసుకునేవారు. అయితే ఆయన తేనె మనసులు సినిమాకి ఇచ్చిన ఆడిషన్ ఫొటోస్ చూసి బి ఎన్ రెడ్డి గారు ఒకసారి మద్రాస్ రమ్మని ఉత్తరం పంపారు కానీ ఈసారి చంద్రమోహన్ గారు మద్రాస్ కి వెళ్ళలేదు. అయితే ఒకసారి బి ఎన్ రెడ్డి గారే బెజవాడ వచ్చినప్పుడు ఒకసారి కలవమని చెప్పారు. అప్పుడు చంద్ర మోహన్ గారు తన బావని తీసుకొని ఒక హోటల్ లో కలిశారు. అక్కడ ఆయన చంద్రమోహన్ గారిని చూసి ఆయన షర్ట్ విప్పించి మరి ఆడిషన్స్ చేశారు. అప్పట్లో చంద్ర మోహన్ గారు బాడీ బిల్డింగ్ తో చాలా దృఢంగా ఉండేవారు. స్క్రీన్ టెస్ట్ కోసం మద్రాస్ రాగలరా అని బి ఎన్ రెడ్డి గారు అడిగితే ఆదివారం అయితేనే వస్తా అని చంద్రమోహన్ గారు చెప్పారట. అలా చంద్రమోహన్ గారు తన తల్లిని ఒప్పించి మద్రాస్ వెళ్లారు. అక్కడ వాహిని పిక్చర్స్ ఆఫీస్ కి వెళ్ళాడు. ఆయన్ని స్క్రీన్ టెస్ట్ లో మీకు నచ్చిన ఒక డైలాగ్ చెప్పండి అని అంటే చంద్ర మోహన్ గారు తన నటించిన నాటకంలో ఒక డైలాగ్ చెప్పారు. ఆ విధంగా స్క్రీన్ టెస్ట్ అయిపోగానే కొన్ని రోజుల్లో ఉత్తరం పంపిస్తాం అని చెప్పి చంద్రమోహన్ గారిని ట్రైన్ ఎక్కించారు. అలా చంద్ర మోహన్ గారు మళ్ళీ ఉద్యోగంలో పడిపోయారు. సరిగ్గా నెల తర్వాత బెజవాడ వాహిని డిస్ట్రిబ్యూటర్ కి చంద్ర మోహన్ గారు సెలెక్ట్ అయ్యారు అని ఒక లెటర్ పంపించారు. ఈ విషయం వాళ్లు చంద్ర మోహన్ గారి బావకి చెప్పారు. చంద్ర మోహన్ గారికి వాళ్ళ బావ చెప్పిన ఈ తీపి కబురు ఒక పక్క సంతోషాన్ని ఇంకో పక్క ఉద్యోగం పోతుంది అనే బాధని తెచ్చాయి.

ఈ విషయం చంద్ర మోహన్ గారు వాళ్ళ అమ్మకి చెప్పి అతి కష్టం మీద ఆమెను ఒప్పించారు. అలా ఆయన మొదటి సినిమా 'రంగులరాట్నం’ మొదలైంది. ఈ సినిమా 1966లో విడుదలై సూపర్ హిట్ అయింది. ఆయన నటనకి మంచి పేరు వచ్చింది.. కానీ ఈ సినిమా తర్వాత ఆరునెలల వరకూ మరో సినిమా ఆయనకి రాలేదు. ఆ తర్వాత చంద్ర మోహన్ గారు  ‘మరుపురాని కథ’, ‘బంగారు పిచ్చుక’ చిత్రాల్లో నటించారు. అటుపైన రెండున్నర ఏళ్లవరకూ మళ్ళీ వేషాలే లేవు. ఆయన గురువు బి.ఎన్‌.రెడ్డిగారు హీరోగా తప్ప వేరే పాత్రలు చేయవద్దుని చెప్పడంతో మొదట్లో చిన్న చిన్న వేషాలు వచ్చినా చంద్రమోహన్ గారు ఒప్పుకోలేదు. ఇంటి నుంచి డబ్బు తెప్పించుకోవడానికి మొహమాటం పడి మద్రాసు వెంకటనారాయణ రోడ్డులో ఉన్న పార్కులో పస్తులతో పడుకునే వారు. ఒకదశలో ఆయన మద్రాసు వదిలి వెళ్లిపోదామనే అనుకున్నారు కానీ పట్టుదల పెరిగి అక్కడే ఉండి తేల్చుకుందామని నిర్ణయించుకున్నారు. నన్ను నేను పోషించుకోవాలి ప్రేక్షకులు నన్ను మరిచిపోకూడదు అనే ఆయన సంకల్పంతో హీరోగానే నటించాలనే ఆయన పట్టుదలను సడలించుకోవడంతో  ఆర్టిస్ట్‌గా బిజీ అయ్యారు.

అలా ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేసేసరికి ఆయనకి హీరో వేషం ఇచ్చి నిలబెడదామని కొంతమంది దర్శకనిర్మాతలు ప్రయత్నించారు కానీ ఇంతకుముందు చంద్రమోహన్ గారు పోషించిన పాత్రల ప్రభావం వ్యాపార పరంగా అడ్డుపడింది. దాంతో ఎవరూ ధైర్యం చేయలేకపోయారు. చివరకు చంద్ర మోహన్ అన్నయ్య కె.విశ్వనాథ్‌ ధైర్యం చేసి ‘సిరిసిరిమువ్వ’ చిత్రంలో హీరోగా అవకాశం ఇచ్చారు.

అలాగే చంద్రమోహన్ గారికి మంచి పేరు తెచ్చిన సినిమా ‘ఓ సీత కథ’. ఈ చిత్రం ఉత్తమ చలన చిత్ర విభాగంలో నంది అవార్డు, ఫిల్మ్‌ఫేర్ పురస్కారం గెలుచుకుంది. ఈ సినిమా తరువాత మలయాళం, తమిళ భాషలలో రీమేక్ కూడా చేయబడింది. ఈ సినిమా మలయాళ వెర్షన్ లో కమల్ హసన్ విరోధి పాత్రలో నటించగా, రజనీకాంత్ తమిళ వెర్షన్ లో అదే పాత్రను పోషించాడు. ఈ చిత్రాన్ని తాష్కెంట్‌లో జరిగిన ఆసియా, ఆఫ్రికన్ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించారు. ఇప్పటి ప్రముఖ నిర్మాత సి. అశ్వనిదత్ గారు ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా పని చేసారు.

ఇక  కమల్ హాసన్, సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ హీరోయిన్ శ్రీదేవి కలిసి నటించిన సినిమా పదినారు వయదినలే. లెజెండరీ దర్శకుడు భారతీరాజా తెరకెక్కించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది.  1977లో విడుదలైన ఈ తమిళ చిత్రం అప్పట్లో రికార్డులు తిరగరాసింది. ఇందులో రజినీకాంత్ ప్రతినాయకుడిగా నటించాడు. తెలుగులో ఈ సినిమాను దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు 'పదహారేళ్ళ వయసు' పేరుతో రీమేక్ చేసాడు. ఇక్కడ కూడా శ్రీదేవి హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంతోనే తెలుగులో సూపర్ స్టార్ అయిపోయింది శ్రీదేవి. తెలుగులో కమల్ పాత్రలో చంద్రమోహన్, రజినీ పాత్రలో మోహన్ బాబు నటించారు. చంద్ర మోహన్ గారు ఇందులో కుంటివాడి పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమా తెలుగులో కూడా సంచలన విజయాన్ని అందుకుంది.

ఇక కె.విశ్వనాథ్ గారు చంద్రమోహన్ గారికి ఇంకొక చరిత్రలో నిలిచిపోయే సినిమాలో అవకాశం ఇచ్చారు. అదే శంకరాభరణం. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని ఇండస్ట్రీ హిట్ లు గా నిలిచాయి. మరికొన్ని కలెక్షన్ల సునామీలను సృష్టించాయి. కానీ కొన్ని చిత్రాలు మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్రని వేశాయి. అందులో ఒకటి కె.విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన 'శంకరాభరణం'. ఈ సినిమాని పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ పతాకం పై ఏడిద నాగేశ్వరరావు - ఆకాశం శ్రీరాములు నిర్మించారు. ఈ సినిమాలో మొదటగా సోమయాజులు, అల్లు రామలింగయ్య గార్లను తప్ప మిగితా అందరినీ కొత్తవారిని తీసుకోవాలని కె.విశ్వనాథ్ గారు అనుకున్నారట కానీ అందరూ కొత్తవాళ్ళు ఉంటే సినిమా బిసినెస్ కష్టం అని చంద్రమోహన్ గారిని పెట్టుకున్నారు. ఈ సినిమా షూటింగ్ అంత పూర్తి అయ్యాక డిస్ట్రిబ్యూటర్స్ కి సినిమా చూపిస్తే సినిమా అసలు అడదు అని చెప్పారట. అప్పుడే చంద్రమోహన్ గారికి కూడా రెమ్యూనరేషన్ ఇవ్వలేదు. అయితే ఆయన రెమ్యూనరేషన్ 50 వేలుకి శంకరాభరణం తమిళ రైట్స్ తీసుకోమని నిర్మాత చెప్తే, చంద్రమోహన్ గారు డిస్ట్రిబ్యూటర్స్ కూడా లేని సినిమాని నేను తీసుకొని ఏం చేసుకోవాలని ఆయన అని తనకి రావాల్సిన డబ్బుని మాత్రమే తీసుకున్నారు. ఇక ఈ సినిమా తమిళ హక్కులు వేరే వాళ్ళు 6 లక్షలకి కొంటె అక్కడ కోటి రూపాయల లాభం వచ్చింది. కానీ చంద్రమోహన్ గారు దీని గురించి ఇప్పుడు బాధపడలేదు. ఇక ఇందులో శంకరశాస్త్రిగా సోమయాజులు, తులసి పాత్రలో మంజుభార్గవి నటించి మెప్పించారు. పూర్తి సంగీత ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రం ఎవరూ ఉహించనంతగా సంచలన విజయాన్ని అందుకుంది. ఇది ఒక్క తెలుగులోనే కాదు పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళలలో కూడా అఖండ విజయం సాధించింది. అమెరికాలో రెగ్యులర్ థియేటర్స్ లో విడుదలైన మొట్టమొదటి చిత్రం ఇదే. కమర్షియల్ హంగులు లేకున్నా ఘనవిజయం సాధించి శంకరాభరణం ఒక సంచలనం సృష్టించిందనే చెప్పాలి. 70వ దశకంలో మాస్ మసాలా చిత్రాల వెల్లువలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమా రంగానికి మేలిమలుపు అయ్యింది. ఈ సినిమా విడుదల తరువాత ఎంతో మంది శాస్త్రీయ సంగీతం నేర్చుకోవటం మొదలుపెట్టారు అంటే అర్ధం చేసుకోవచ్చు ఈ సినిమా ప్రేక్షకులకి ఎంత నచ్చిందో. ఈ చిత్ర గాయకులు అయిన ఎస్పీబీ గారికి ఉత్తమ నేపధ్య గాయకుడిగా తొలిసారి జాతీయ అవార్డు, శ్రీమతి వాణిజయరాంకు ఉత్తమ గాయకురాలిగా, కె.వి.మహదేవన్ కు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డులు లభించాయి.

ఈ సినిమా తర్వాత ఆయన నటించిన కొత్త నీరు, రామ్ రాబర్ట్ రహీం, శుభోదయం, మూడు ముళ్ళు లాంటి హిట్ సినిమాల్లో నటించారు. ఇక 1986లో జంధ్యాల గారి దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయి సినిమాలోని కళ్యాణ్ పాత్రలో చంద్రమోహన్ గారు మంచి కామెడీ పండించారు. అలాగే ఆయన దర్శకత్వంలో వచ్చిన జయమ్ము నిశ్చయమ్మురా కూడా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో చంద్ర మోహన్ రాజేంద్రప్రసాద్ ఇద్దరు హీరోస్ గా నటించారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు చాలావరకు హిట్ అయ్యాయి. ఇక చిత్ర విచిత్ర పాత్రలు సృష్టించి ప్రేక్షకులకు నవ్వు అనే యోగాన్ని అందించడంలో సిద్ధహస్తుడైన జంధ్యాల గారు ఈ సినిమాలో కామెడీ తో జనాల్ని బాగా నవ్వించారు. కాంతం ఎవరైనా వారికి ఫలానాది ఇష్టం అని చెప్పగానే చనిపోయిన తన కొడుకుని గుర్తు చేసుకొని "నాన్నా... చిట్టీ" అని కౌగిలించుకొనటం. అప్పుడు భర్త గోపాలం ప్రదర్శించే హావభావాలు ఈ సినిమాకె హైలెట్.

ఇక 90వ దశకంలో చంద్రమోహన్ గారు మెల్లగా సహాయ  పాత్రల వైపు మళ్లారు. ఆయన నటించిన చేసిన గణేష్ సినిమాలో నటనకి చంద్రమోహన్ గారికి మంచి పేరు వచ్చింది. అలాగే చంద్రలేఖ, నిన్నే పెళ్లాడతా లాంటి సినిమాలు ఆయనలోని కొత్త తరహా కామెడీ యాంగిల్ ని కూడా బయట పెట్టాయి. ఈ సినిమాలే కాకా ఇద్దరు మిత్రులు, ఆమె, గులాబీ లాంటి సినిమాలు చంద్ర మోహన గారికి మంచి పేరు తెచ్చి పెట్టాయి.

ఇక 2000 సంవత్సరం నుంచి ఆయన హీరో తండ్రి పాత్రలు ఎక్కువగా చేయడం మొదలుపెట్టారు. అలా వచ్చిన మనసంతా నువ్వే సినిమాల్లో ఆయన పాత్ర పండించిన కామెడీ అంత ఇంత కాదు. ఇక చంద్ర మోహన్ గారి కెరీర్ లో గొప్పగా చెప్పుకోవాల్సిన సినిమా 7జి బృందావన్ కాలనీ. ఈ సినిమాలో చంద్ర మోహన్ గారి పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒక మధ్యతరగతి తండ్రి ఆ సినిమాలో ఆయన నటన అద్భుతం అని చెప్పాలి. ఇంట్లో చదువు సరిగ్గా రాని కొడుకుని ఆయన తన కోపాన్ని చూపించడం లాంటి సన్నివేశాల్లో ఆయన నిజంగానే జీవించాడు అనే చెప్పాలి. నాకు ఉద్యోగం వచ్చింది నాన్న అని కొడుకు చెప్తే తండ్రి పడే సంతోషం చంద్ర మోహన్ గారు బాగా పండించారు. ఈ సినిమాలో చంద్రమోహన్ గారి పాత్రలో అందరూ తమ తండ్రులని చూసుకున్నారు. అలాగే 7జి బృందావన కాలనీ సూపర్ హిట్ అవ్వడమే కాకుండా ఆయన నటనకి చాలా కాలం తర్వాత మంచి గుర్తింపు తెచ్చింది. సెల్వ రాఘవన్ దర్శకత్వం వచ్చిన ఈ సినిమా ఆయన కెరీర్ లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తమిళ, తెలుగు భాషలలో ఒకేసారి నిర్మించబడిన ఈ సినిమా రెండు భాషల్లోనూ అదే రేంజ్ లో హిట్ అవ్వడం నిజంగా విశేషం అనే చెప్పాలి.

అయితే చంద్ర మోహన్ గారికి తండ్రి పాత్రలో అవార్డ్ తెచ్చిన సినిమా అతనొక్కడే. తొలిసారిగా ఆ సినిమా ద్వారా ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థను స్థాపించిన కళ్యాణ్ రామ్, ఈ సినిమా ద్వారా యువ దర్శకుడు సురేందర్ రెడ్డి ని దర్శకుడిగా పరిచయం చేయడం జరిగింది. సింధు తులాని హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించగా రామ్ ప్రసాద్ ఫోటోగ్రఫిని అందించారు. మంచి యాక్షన్ బేస్డ్ లవ్ స్టోరీ తో పాటు ఆకట్టుకునే కథ, కథనాలు ఈ సినిమాకు ప్రధాన హైలైట్. మణిశర్మ అందించిన సాంగ్స్ తో పాటు సురేందర్ రెడ్డి స్క్రీన్ ప్లే, ఎమోషన్స్, యాక్షన్ సీన్స్, ఫైట్స్ వంటివి ఈ సినిమాకు ప్రధాన హైలైట్ అని చెప్పాలి. చిన్నతనంలో కొన్ని అనుకోని ఘటనల వలన విడిపోయిన బావ మరదళ్ళు చివరికి ఒకరిని మరొకరు ఏవిధంగా పలు ఘటనల అనంతరం కలుసుకున్నారు అనే థీమ్ తో సాగే ఈ మూవీ లో హీరో కళ్యాణ్ రామ్ తో పాటు హీరోయిన్ సింధు తులాని కూడా ఎంతో బాగా నటించి ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఈ సినిమా తరువాత ఆమెకు నటిగా మంచి అవకాశాలు వచ్చాయి. ఒకరకంగా ఈ అతనొక్కడే సినిమా నందమూరి కళ్యాణ్ రామ్ మూవీ కెరీర్ ని మలుపుత్రిప్పిన సినిమాగా చెప్పవచ్చు.

రాఖీ సినిమా విజయం గురించి పక్కన పెడితే ఇందులో అందరి నటన చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఒక ఆడపిల్లకి పెళ్లి చేయడానికి తండ్రి పడే తిప్పలు ఈ సినిమాలో చంద్ర మోహన్ గారి పాత్ర ద్వారా చూడొచ్చు. సినిమాలో ఆయన ఏడుస్తుంటే ప్రేక్షకులకి కూడా ఏడుపు వస్తుంది. ఈ సినిమాలో ఆయన ఎమోషనల్ సీన్స్ లో చేసిన యాక్టింగ్ చాలా హృద్యంగా ఉంటుంది. ఒక సమయంలో తెలుగులో హీరో తండ్రి పాత్రలు అంటే చంద్రమోహన్ గారే గుర్తొచ్చే వారు. ఆయన చాలా సినిమాల్లో కామెడీ తండ్రిగా నటించి బాగా నవ్వించారు. అలా వచ్చిన కందిరీగ , లౌక్యం సినిమా సూపర్ హిట్స్ గా నిలిచాయి. కాకపోతే ఆయన ఆరోగ్య పరిస్థితుల వలన చంద్రమోహన్ గారు మెల్లగా సినిమాలు తగ్గించడం మొదలుపెట్టారు.

ఆయన చివరగా ముఖ్య పాత్రలో గుర్తింపు వచ్చిన సినిమా డీజే. టాలీవుడ్‌ స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా మాస్‌ చిత్రాల దర్శకుడు హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రంలో క్రేజీ బ్యూటీ పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మించారు. ఇక బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టిన ఈ చిత్రంలో బన్ని క్యారెక్టరైజేషన్‌ చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమాలో చంద్రమోహన్ గారి పాత్ర సినిమాని మలుపు తిప్పుతుంది. అలాగే బన్నీ మార్క్ కామెడీ, యాక్షన్‌తో పాటు హరీశ్‌ శంకర్ మాస్ కమర్షియల్ టేకింగ్‌తో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అగ్రహారంలో బ్రాహ్మణుడిగా, స్టైలీష్ కిల్లర్‌గా రెండు డిఫరెంట్ పాత్రల్లోనూ ఆకట్టుకున్నాడు.టీవీల్లో, డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌లో ‘డీజే’కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యూట్యూబ్‌లో హిందీ డబ్బింగ్‌ వర్షన్‌లో విడుదలైన ఈ చిత్రం అనేక రికార్డులను కొల్లగొట్టింది.

చంద్రమోహన్ గారు ఎక్కువగా నటించిన హీరోయిన్ జయసుధ. వాళ్ళ ఇద్దరు కలిసి 34 చిత్రాల్లో నటించడం విశేషం. అలాగే లక్ష్మి, వాణిశ్రీ, రాధిక, మాధవి, జయప్రద, విజయశాంతి.... ఇలా చాలా మంది హీరోయిన్లతో నటించారు ఆయన. ఒక్కో హీరోయిన్‌తో పది, పదిహేను చిత్రాలు కూడా చేశారు. చంద్రమోహన్ గారు దాదాపుగా 50 ఏళ్ళకి పైగా తెలుగు సినిమాలు చేస్తూ దాదాపుగా 800లకి వైగా సినిమాల్లో నటించారు. ఆయనకి చిన్న పాత్ర అయిన పెద్ద పాత్ర అయిన కూడా ఎటువంటి మొహమాటం లేకుండా నటించేవాళ్ళు. ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఏం వస్తుంది అని ఒక్క రోజు షూటింగ్ ఉన్న సినిమాలకి కూడా వెళ్ళేవాళ్ళు.

వ్యక్తిగత జీవితం

చంద్ర మోహన్ గారు డాక్టర్‌ గాలి బాలసుందరరావుగారి ఏకైక కూతురు జలంధర గారిని వివాహం చేసుకున్నారు. ఆమె ఒక ప్రముఖ రచయిత్రి. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయి మధుర మీనాక్షి గారికి పెళ్లి జరిగి అమెరికాలో ఉంటోంది. రెండో అమ్మాయి మాధవి చెన్నైలో ఉంటోంది. వారికి ఇద్దరు ఆడపిల్లలు.

చంద్రమోహన్ గారు, కె విశ్వనాథ్ గారు, ఎస్పీ బాల సుబ్రమణ్యం గారు ముగ్గురు వరసకి అన్న తమ్ముళ్లు అవుతారు. ఈ విషయం వీరికి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే వరకు తెలీదు. చంద్రమోహన్ పెద్ద నాన్న గారి కుమారుడు కె.విశ్వనాథ్ గారు. అలాగే చంద్రమోహన్ గారి బావమరిది చెల్లిని బాలసుబ్రహ్మణ్యం అన్నయ్య పెళ్లి చేసుకున్నారు. వయసులో చంద్రమోహన్ గారి కన్నా చిన్న వారు బాలసుబ్రమణ్యం. కుటుంబాలు ఎక్కడెక్కడో స్థిరపడటంతో వీరికి సినిమాల్లోకి వచ్చి చాలా సంవత్సరాలు అయ్యేవరకు కూడా తెలియలేదు. ఒకసారి ఈ విషయం తెలిసాక వాళ్ళు చాలా దగ్గరయ్యారు. చెన్నై లో కె విశ్వనాథ్ గారు, చంద్రమోహన్ గారు పక్కపక్కనే ఇల్లు కూడా కట్టుకున్నారు.

చంద్ర మోహన్ గారికి శోభన్ బాబు గారు మంచి ఫ్రెండ్‌, గైడ్‌ కూడా. శోభన్ బాబు గారి పద్ధతులు చంద్రమోహన్ గారికి చాలా నచ్చేవి. ఇద్దరికి ఏరా అంటే ఏరా అని పిలుచుకొనే అంత సాన్నిహిత్యం ఉంది. చంద్రమోహన్ గారి చెయ్యి మంచిదని ఆస్తి కొన్న ప్రతిసారీ ఆయన దగ్గర పదివేలు తీసుకొనేవాడు శోభన్ బాబు గారు. ఆయన మరణం చంద్రమోహన్ గారి జీవితంలో తీరని లోటు అని చెప్తుండేవారట. అలాగే హీరో కృష్ణ కూడా ఆయనకి మంచి స్నేహితుడు. రెండోవ పెళ్లి విషయంలో కృష్ణకు సపోర్ట్‌ చేయడంలో చంద్రమోహన్ గారిది ముఖ్యం పాత్ర. ఆయన మేకప్‌మ్యాన్‌ మాధవరావు, నిర్మాత రాఘవ, జర్నలిస్టు మోహన్‌కుమార్‌ అందరూ కలసి తిరుమలలో వారి పెళ్లి జరిపించారు.

అలాగే చంద్రమోహన్ గారి పక్కన నటించిన దాదాపు 60 మంది కథానాయికల్లో అత్యధికులు అగ్ర స్థానానికి చేరుకున్నారు. శ్రీదేవి, జయప్రద, జయసుధ, విజయనిర్మల, వాణిశ్రీ, మంజుల, చంద్రకళ... ఇలా ఎంతమందికి ఆయనే తొలి హీరో. చివరికి ‘చంద్రమోహన్‌ పక్కన నటిస్తే టాప్‌ హీరోయిన్‌ పొజిషన్‌ గ్యారంటీ’ అనే సెంటిమెంట్‌ వ్యాపించేలా చేసింది.

చంద్ర మోహన్ గారు ఎంతో సౌమ్యుడు అయినప్పటికీ ఆయనకి కూడా చాలా అవమానాలు జరిగాయి. అందులో ఎక్కువగా వివాదాస్పదం అయింది మాత్రం సీనియర్ ఎన్టీఆర్ గారు నటించిన అన్నదమ్ముల అనుబంధం సినిమా. ఈ సినిమాలో ముందుగా ఎన్టీఆర్ తన తమ్ముళ్లు గా మురళి మోహన్, చంద్ర మోహన్ ని  అనుకున్నారు. ఒక 15 రోజుల పాటు చంద్ర మోహన్ తో డాన్సులు కూడా చేయించారు. అయితే షూటింగ్ రెండు రోజుల ముందు ఎన్టీఆర్ గారు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చంద్ర మోహన్ గారి పాత్రలో ఎన్టీఆర్ కొడుకు బాలకృష్ణ ని పెట్టారు. అయితే ఈ విషయం తెలియకుండా షూటింగ్ కి వెళ్లిన చంద్రమోహన్ గారిని ఎవరూపట్టించుకోలేదు. ఇక షూటింగ్ మొదలైనప్పుడు ఆయన చేయాల్సిన పాత్ర బాలకృష్ణ చేస్తున్నారు అని తెలిసి చంద్రమోహన్ గారు కోపంతో అక్కడ నుంచి వెళ్లిపోయారు. తర్వాత కొన్ని రోజులుకి ఎన్టీఆర్ తన తరుపున ఇద్దరి వ్యక్తులని పంపించి అన్నాగారు ఇంకో సినిమాలో మీకు అవకాశము ఇస్తారు అని వాళ్ళు చెప్పగానే చంద్రమోహన్ గారు కోపంతో  "ఎవరికి కావాలి మీ అన్న గారి అవకాశాలు, తోటి ఆర్టిస్ట్ లని గౌరవించలేని ఆయన సినిమాల్లో నేను నటించడానికి సిద్ధంగా లేను అని చెప్పండి అని ఆయన ధైర్యంగా అన్నారు.

ఆయన ముందు చాలామంది దానధర్మాలు అని, వేరే అలవాటుల వలన చాలా డబ్బు పోగొట్టుకున్నారు , అందుకే నేను ఎవ్వరికీ ఒక రూపాయి ఇవ్వను అలాగే నేను ఏ అలవాటుని చేసుకోలేదు అని చెప్తారు. ఇలాంటి క్రమశిక్షణ ఉండబట్టే చంద్రమోహన్ గారు ఆర్ధికంగా బాగా ఉన్నారు. ఆయనకి చెన్నై లో కూడా ఒక సొంత ఇల్లు అలాగే స్థలాలు కూడా ఉన్నాయి. ఈ మద్యనే ఆరోగ్య కారణాల వలన సినిమాలకి చంద్ర మోహన్ గారు పూర్తిగా విరామం చెప్పారు." 50 ఏళ్లు నిర్విరామంగా సినిమాలు చేసిన నేను ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశాను. ఎవరైనా ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకో అంటే, ‘ఇనుముకు చెదలు పడుతుందా?’ అనేవాణ్ణి. ఆ నిర్లక్ష్యమే నా ఆరోగ్యాన్ని ఇబ్బందుల్లో పడేసింది. ‘రాఖీ’లో ఎమోషనల్‌ సీన్‌ చేసి, బైపాస్‌ సర్జరీ కోసం ఆసుపత్రిలో చేరాను. ‘దువ్వాడ జగన్నాథమ్‌’ అప్పుడు ఆరోగ్యం బాగాలేకపోవడంతో షూటింగ్‌ వాయిదా వేయాల్సి వచ్చింది. అందుకే రిటైర్మెంట్‌ తీసుకోవాలనుకున్నాను. అయితే టీవీలోనో, యూ ట్యూబ్‌లోనో నా సినిమాలు వస్తున్నాయి. గతంలో కన్నా ఇప్పుడు ఫ్యాన్స్‌ ఎక్కువ కావడం ఆశ్చర్యంగా అనిపించినా ఆనందంగా ఉంది. ఈ జన్మకు ఇది చాలు అనిపిస్తుంది. అయితే సినీజీవితం చాలా నేర్పించింది. పేరు, డబ్బు, బంధాలు శాశ్వతం కాదని నేర్పింది. నమ్మకద్రోహులకు దూరంగా ఉండాలని, ఆర్థికంగా జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదమని నేర్పింది. చెప్పుకోలేని చేదు నిజాల్ని ఎలా గుండెల్లో దాచుకోవాలో చెప్పింది" అని ఆయన ఒక ఇంటర్వ్యూలో అన్నారు.

అవార్డ్స్

800లకి పైగా సినిమాల్లో నటించిన చంద్రమోహన్ గారి నటనకి చాలా అవార్డ్స్ వరించాయి. ఆయన మొదటి సినిమా రంగులరాట్నంలో నటనకి గాను 1966లో ఉత్తమ నటుడుగా నంది అవార్డ్ వచ్చింది. అలాగే 1978లో వచ్చిన పదహారేళ్ళ వయసు సినిమాకి గాను ఆయనకి ఫిలింఫేర్ అవార్డ్ లభించింది. ఉత్తమ కమెడియన్ గా చంద్రమోహన్ గారికి 1987లో చందమామ రావే సినిమాకి వచ్చింది. అలాగే బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా 2005 లో అతనొక్కడే సినిమాకి గాను చంద్రమోహన్ గారికి అవార్డ్ వచ్చింది.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.