తలై అజిత్ కుమార్

తమిళనాడులో తల అజిత్ కుమార్ అంటే అభిమానులకుపిచ్చి. ఆయన క్రేజ్, స్టైల్ అక్కడి ప్రేక్షకులని విపరీతంగా అలరిస్తాయి. అజిత్ కుమార్ ప్లాప్ సినిమా సైతం అక్కడ రికార్డ్ కలెక్షన్స్ కొల్లగొడుతుంది అంటే అర్థం చేసుకోవచ్చు ఆయన రేంజ్ ఏంటో. ఆయన సినిమా వస్తుందంటే తమిళనాడులో పండగ మొదలవుతుంది. అజిత్ కుమార్ కి హీరోగానే కాకుండా ఒక రేసర్ గా కూడా మంచి పేరు ఉంది.

బాల్యం

అజిత్ కుమార్ 1971 మే 1వ తేదీన తెలంగాణలోని సికింద్రాబాద్ లో జన్మించాడు. ఆయన తండ్రి పి.సుబ్రమణ్యం, తల్లి మోహిని. అజిత్ కి అనిల్ కుమార్, అనూప్ కుమార్ అని ఇద్దరు అన్న తమ్ముళ్లు ఉన్నారు..అజిత్ తన పదోవ తరగతి లోనే చదువు మానేశారు.చదువు మధ్యలోనే మానేసిన కూడా అజిత్ కి తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, ఆంగ్ల భాషలను అనర్గళముగా మాట్లాడగలడు. మొదట్లో ఎంఫైల్డ్ కంపెనీలో  మెకానిక్ గా పని చేసిన అజిత్ ఆ తర్వాత ఆయన తండ్రి చెప్పడంతో గార్మెంట్స్ కంపెనీ లో పని చేశారు. ఆ పని చేసేటప్పుడు ఆయన మోడలింగ్ కూడా చేసేవాడు.

నట జీవితం

అజిత్ మొదటగా ఎన్ వీడు ఎన్ కనవేర్ అనే సినిమాలో స్కూల్ కి వెళ్లే పిల్లవాడి పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో పాత్రకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పడంతో అజిత్ ని తీసుకున్నారు. ఆ తర్వాత తెలుగులో ప్రేమ పుస్తకం అనే సినిమాలో నటించినా కూడా ఆ సినిమా డైరెక్టర్ హఠాత్తు మరణంతో ఈ సినిమా ఆగిపోయింది.

ఇక ఆయనకి మంచి గుర్తింపు తెచ్చిన సినిమా మాత్రం 1995 లో వచ్చిన  ఆసాయ్ అనే తమిళ చిత్రం. ఈ సినిమాకి వసంత్ రచన మరియు దర్శకత్వం వహించారు. ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రంలో అజిత్ కుమార్ తో పాటు ప్రకాష్ రాజ్, రోహిణి ముఖ్య పాత్రల్లో నటించారు. దేవా సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలకి అప్పట్లో మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయం సాధించింది.

ఈ సినిమా తర్వాత వచ్చిన కాదల్ కొట్టై సినిమాతో అజిత్ హీరోగా ఇంకా వెనుతిరిగి చూసుకోలేదు. 1996 లో అగథియన్ దర్శకత్వం లో వచ్చిన ఈ చిత్రంలో అజిత్ కుమార్, దేవయాని ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా విడుదలైనప్పుటి నుంచి థియేటర్స్ లో కాసుల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమా బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రీన్ ప్లే గా నేషనల్ అవార్డ్ సైతం రావడం విశేషం. ఈ సినిమా అజిత్ కుమార్ కెరీర్ లో గుర్తిండిపోయే సినిమాగా నిలిచింది.

ఆయనకి వరస హిట్స్ రావడం మొదలయ్యాయి. అయితే ఆ  తర్వాత అజిత్ కి కొన్ని ప్లాప్స్ కూడా వచ్చాయి.అయితే ఆ ప్లాప్స్ నుంచి 1998లో వచ్చిన కాదల్ మన్నన్ సినిమా బయటపడేసింది. శరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. అప్పట్లో తమిళ ఇండస్ట్రీలో స్ట్రైక్స్ నడుస్తున్న సమయంలో ఈ సినిమాని కొనడానికి డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు ముందుకు రాలేదు. అయితే చివరికి ఎలాగోలా మూవీ టీం కష్టపడి 108 ప్రింట్స్ తో ఈ సినిమాని విడుదల చేసారు. ఇన్ని అవాంతరాల మధ్య కూడా ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచి 100 రోజులు ఆడింది. ఈ సినిమాలో సంగీత స్వరకర్త ఎం. ఎస్. విశ్వనాథన్ సహాయక పాత్ర చేశారు.

ఇక తెలుగు లో సూపర్ హిట్ అయిన వడ్డే నవీన్ పెళ్లి సినిమాను. అజిత్ హీరోగా అవల్వరువాలా పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమా కూడా తమిళంలో మంచి విజయం సాధించింది. అలాగే తెలుగు పెళ్లి సినిమా 1991 చిత్రం స్లీపింగ్ విత్ ది ఎనిమీ ఆధారంగా తీశారు.

ఇలా వరస హిట్స్ లో ఉన్న అజిత్ కి వాలి సినిమా ఇంకొక బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసింది. డైరెక్టర్ ఎస్. జె. సూర్య దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం ఈ వాలి. ఈ సినిమా ఆయన మొదటి సినిమా అయిన కూడా అజిత్ ని కొత్త కోణంలో చూపించడంలో ఎస్ జే సూర్య పూర్తిగా సక్సస్ అయ్యారు. ఎస్. ఎస్. చక్రవర్తి నిర్మించిన ఈ చిత్రంలో అజిత్ కుమార్ డబుల్ పాత్రలో హీరోగా మరియు విలన్ గా కనిపించి మెప్పించారు. ఈ సినిమాలో ఆయన పాత్రకి చాలా పేరు వచ్చింది. అజిత్ ఎలాంటి పాత్రనైనా చేయలగడు అని ఈ సినిమా నిరూపించింది. సిమ్రాన్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో పాటలు అప్పట్లో సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా అప్పట్లోనే తమిళనాడులో 270 రోజులు ఆడి రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా షూటింగ్ కి ఎస్ జే సూర్య ఆటోలో వచ్చేవారంట, అయితే అజిత్ ఇది చూసి ఈ సినిమా సూపర్ హిట్ అయ్యాక ఎస్ జే సూర్యకి ఒక కార్ కొనిచ్చారు. ఈ సినిమా అటు అజిత్ కెరీర్ కి ఇటు సిమ్రాన్ కెరీర్ కి బాగా ప్లస్ అయింది.

అజిత్ అప్పట్లో వరస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేవారు. అలా ఆయన 25వ చిత్రం గా వచ్చి సూపర్ హిట్ అయిన చిత్రం అమర్కలం. 1999లో వచ్చిన ఈ సినిమాని శరణ్ రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ సినిమా అజిత్ కి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ లోనే ఆయన ప్రస్తుత జీవిత భాగస్వామి అయిన షాలిని గారిని కలిశారు. ఈ సినిమా షూటింగ్ లోనే మొదలైన వీరి స్నేహం ప్రేమగా మారింది. ఈ సినిమా కూడా విడుదల నుంచి మంచి పాజిటివ్ రివ్యూస్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాని తెలుగులో లీల మహల్ సెంటర్ పేరుతో రీమేక్ చేశారు. అలాగే ఆ సంవత్సరంలో అజిత్ వరసగా 6 హిట్స్ ఇచ్చారు. అయిన విజయాలు ఆ తర్వాత సంవత్సరం లో కూడా కొనసాగింది.

ఇక 2001 లో వచ్చిన ధీన సినిమాతో ఆయనకి యాక్షన్ హీరోగా ఒక రేంజ్ లో పేరు వచ్చింది. ఈ సినిమా తర్వాత ఆయన్ని "తల" అని పిలవడం మొదలుపెట్టారు ఆయన అభిమానులు. ప్రస్తుతం టాప్ డైరెక్టర్ గా ఉన్న ఏ ఆర్ మురగదాస్ ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. అలాగే ఈ సినిమాలో యువన్ శంకర్ రాజా అందించిన పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఆయనకి ఇండస్ట్రీలో బ్రేక్  వచ్చింది కూడా ఈ సినిమాతోనే. మాస్ హీరోగా అజిత్ కుమార్ ని నిలబెట్టిన సినిమా ధీన. ఈ సినిమాని బెంగాలీ లో దేవాగా కన్నడలో ధూమ్ గా రీమేక్ చేశారు. అక్కడ కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయింది.

ఆ సినిమా తర్వాత వచ్చిన సిటిజెన్ సినిమా అజిత్ యాక్టింగ్ కెరీర్ లో మైలురాయి అని చెప్పొచ్చు. ఈ సినిమాలో ఆయన్ని చాలా కొత్త గెటప్స్ లో చూపించారు.ఈ సినిమాని తెలుగులోకి కూడా అదే పేరుతో డబ్బింగ్ చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా బాగా ఆడింది. ఇక అదే సంవత్సరంలో సంతోష్ శివన్ డైరెక్షన్ లో వచ్చిన అశోక లో కూడా అజిత్ షారుఖ్ ఖాన్ తో పాటు కలిసి నటించాడు. ఈ సినిమా అంతా గొప్పగా ఆడలేదు.

2002 లో అజిత్ మూడు సినిమాల్లో నటిస్తే అందులో రెండు ప్లాప్ అయ్యాయి. మూడవ చిత్రం విలన్ లో ఆయన రెండు పాత్రలు చేశారు.ఈ సినిమా షూటింగ్ 39 రోజుల్లో పూర్తి చేసుకొని దీపావళికి విడుదలైంది.ఈ సినిమా మొదటిరోజు నుంచి సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లింది. ఇక ఈ సినిమాని తెలుగులో అదే పేరుతో నటుడు రాజశేఖర్ రీమేక్ చేశారు. కాకపోతే తమిళ సినిమా రేంజ్ లో ఈ సినిమా ఆడలేదు.

అజిత్ హీరోగా స్టార్ స్టేటస్ పొందుతున్న టైంలో ఆయనకి వరస ప్లాప్స్ రావడం మొదలయ్యాయి. ఆ ప్లాప్స్ అన్నిటికి అజిత్  అట్టహాసం హిట్ తో చెక్ పెట్టారు. అజిత్, డైరెక్టర్ శరన్ కాంబినేషన్ లో వచ్చిన మూడవ చిత్రంగా వచ్చిన ఈ సినిమా హ్యాట్రిక్ హిట్ గా నిలిచింది. విడుదల రోజున ఆవేరేజ్ రివ్యూస్ వచ్చినప్పటికీ ఈ సినిమా దాదాపుగా 25 కోట్ల కలెక్షన్స్ ని సంపాదించి అజిత్ స్టార్ డమ్ ని నిరూపించింది.

ఇక ఆయన తర్వాతి సినిమాలు జి, పరమశివన్, తిరుపతి సినిమాలు అంతగా అడకపోయిన కూడా 2006 లో వచ్చిన వరలరు సినిమా ఆయనలోని నటుడిని ఇంకోసారి బయటకి తెచ్చింది. కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అజిత్ మూడు పాత్రలు పోషించారు. షూటింగ్ మధ్యలో జరిగిన ఫైనాన్షియల్ సమస్యల వలన దాదాపుగా రెండు సంవత్సరాలు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతం అందించారు. ఈ సినిమా టైటిల్ మొదటగా గాడ్ ఫాదర్ అని అనుకున్నారు కానీ అప్పట్లో తమిళనాడు ప్రభుత్వం తమిళంలో టైటిల్స్ ఉంటే సినిమా టాక్స్ ని తొలగిస్తాం అని మాట ఇచ్చారు. దీనితో ఈ సినిమాకి వరలరు అని పేరు పెట్టారు. ఇక ఈ సినిమా దీపావళి కి విడుదలై ఆ సంవత్సరంలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

2007లో అజిత్  డైరెక్టర్ విష్ణు వర్ధన్ తో కలిసి 1980 లో వచ్చిన  బిల్లా సినిమాని రీమేక్ చేయాలని అనుకున్నారు. ఈ సినిమాలో నయనతార చేసిన పాత్రకి మొదటిగా శ్రియ శరన్ ని అనుకున్నారు. కానీ ఆమె అప్పటికి రజినీకాంత్ శివాజీ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటంతో ఆమె ఈ సినిమా చేయలేకపోయింది. ఇక ఈ సినిమాకి సంగీతం యువన్ శంకర్ రాజా అందించారు. విడుదలైన పాటలు అన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. 2007లో 250 స్క్రీన్స్ లో విడుదలైన బిల్లా సినిమా మొదటి మూడు రోజుల్లోనే 3 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమా రిలీజ్ అప్పుడు దాదాపుగా కోటి టికెట్స్ అమ్ముడుపోయాయి అంట. ఈ సినిమా కేరళలో అక్కడి మలయాళం సినిమాల కన్నా ఎక్కువ కలెక్ట్ చేసింది.

2011 లో వచ్చిన అజిత్ మన్కథ సినిమాలో ఆయన నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అందరిని అలరించారు. అజిత్ 50వ సినిమాగా వచ్చిన మంకథ 1000 థియేటర్స్ లో ఘనంగా విడుదయ్యింది. ఈ సినిమా అజిత్ కెరీర్ లోనే హయ్యెస్ట్ గ్రాజర్ గా రికార్డ్ సృష్టించింది. అలాగే ఈ సినిమా తమిళ సినిమా చరిత్రలో ఎక్కువ కలెక్షన్స్ సాధించిన లిస్ట్ లో 4వ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా తెలుగులో గ్యాంబ్లర్ పేరుతో విడుదలై తెలుగులో కూడా బాగా ఆడింది.

ఇక అజిత్ నటించిన ఆరంభం, వీరం సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి సూపర్ హిట్స్ గా నిలిచాయి. అలాగే ఆయన గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చేసిన ఎన్నైఆరిందాల్ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఇందులో నెగటివ్ పాత్ర చేసిన అరుణ్ విజయ్ కి మంచి బ్రేక్ వచ్చింది.

అజిత్ కుమార్  డైరెక్టర్ శివ తో వరసగా సినిమాలు సినిమాలు చేయడం మొదలుపెట్టారు. వారి కాంబినేషన్ లో వచ్చిన వేదళం , వివేకం , విశ్వాసం సినిమాల్లో వేదళం, విశ్వాసం సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి.

ఇక హిందీలో సూపర్ హిట్ అయిన పింక్ సినిమాని తమిళంలోకి నెరకొండపార్వై పేరుతో రీమేక్ చేశారు. హిందీలో అమితాబ్ బచ్చన్ చేసిన పాత్రలో తమిళంలో అజిత్ నటించారు. హిందీ పింక్  సినిమాకి కొన్ని మార్పులు చేసి ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.

రేసింగ్ ప్రస్థానం

అజిత్ కి రేసింగ్ అంటే చాలా ఇష్టం. ఆయన ముంబై, ఢిల్లీ లాంటి ప్రదేశాల్లో రేసింగ్స్ లలో కూడా పాల్గొన్నారు. 2003లో ఆసియా ఫార్ములా బి.ఎమ్.డబ్ల్యు ఛాంపియన్ షిప్ లో ఆయన పాల్గొని సత్తా చాటారు. 2010లో జరిగిన ఎఫ్.ఐ.ఏ ఫార్ములా 2 ఛాంపియన్ షిప్ లో అజిత్ ఫైనల్ రౌండ్ వరకు వెళ్లారు కానీ రేస్ ని మాత్రం మెకానికల్ సమస్యల వలన పూర్తి చేయలేకపోయారు. ఈ రేసింగ్ వలన ఆయన గౌతమ్ మినన్ తో చేయాల్సిన సినిమా 6 నెలలు పోస్టుపోన్ అయింది.

వ్యక్తిగత జీవితం

అమర్కలం సినిమా షూటింగ్ లో మొదలైన అజిత్ కుమార్, షాలిని మధ్య మొదలైన ప్రేమ ఏప్రిల్ 2000 సంవత్సరంలో పెళ్లి గా మారింది. పెళ్లి తర్వాత షాలిని మెల్లగా సినిమాలు తగ్గించేసింది. వారికి 2008 లో కూతురు అనౌష్క, మార్చి 2 2015 లో కొడుకు ఆద్విక్ లు జన్మించారు.

అవార్డ్స్

అజిత్ కుమార్ కి వాలి, విలన్ సినిమాల్లో నటనకి గాను ఫిలింఫేర్ ఉత్తమ నటుడు అవార్డ్స్ లభించాయి.

ఇక వరలరు సినిమాకి ఫిల్మ్ ఫేర్, తమిళ నాడు స్టేట్ అవార్డ్, విజయ్ అవార్డ్స్ వచ్చాయి.

నెరకొండపారవై సినిమాకి దాదాసాహెబ్పల్కె మోస్ట్ వర్సటైల్ యాక్టర్ గా అజిత్ అవార్డ్ వచ్చింది.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.