
తెలుగు సినిమా గానం అంటే మొదట గుర్తొచ్చే పేరు ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం గారు. దాదాపుగా 35 వేల పాటలు పాడిన ఆయన దేశమంతటా అభిమానులని సంపాదించారు. ఇక సెప్టెంబర్ 25న బాలు గారు చివరి శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మన మధ్య లేకపోయినా గాని ఆయన్ని అభిమానించే వాళ్ళు ఆయన్ని గుర్తు చేసుకుంటూ మంచి పనులు చాలా చేస్తున్నారు. అలా తమిళనాడులోని కోయంబత్తూరులో ‘సిరు తుళి’ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ‘ఎస్.పి.బి. వనం’ పేరిట ఓ ప్రత్యేకమైన పార్కును ఏర్పాటు చేసింది. ఈ మధ్యనే ఈ పార్క్ ని ఘనంగా ఆవిష్కరించారు. బాలు కుమారుడు ఎస్.పి. చరణ్, సోదరి ఎస్.పి. శైలజ లైవ్ వీడియో ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాలు గారు చనిపోయే అప్పటికి ఆయన వయసు 74. అలా ఈ వనంలో మొత్తం 74 మొక్కలు నాటారు. ఒక్కో మొక్కకు బాలు పాడిన ఓ పాటను పేరుగా పెట్టారు. మొక్కలన్నింటినీ సంగీత స్వర చిహ్నం ఆకారంలో నాటారు. అలాగే సంగీత వాయిద్యాలు తయారు చేసే చెట్లకు సంబంధించిన మొక్కల్ని నాటి వారికి ఆయన మీద ఉన్న ప్రేమని చాటుకున్నారు. కోయంబత్తూరు శివార్లలో పచ్చప్పాళయంలో 1.8 ఎకరాల ఈ వనంలో లైబ్రరీ, పిల్లలు ఆడుకోవడానికి పార్క్, ఇంకా ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నామని ‘సిరు తుళి’ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.