
జంతువులు టైటిల్ పాత్రలో కనబడే చిత్రాలు హాలివుడ్ లో ఎక్కువ. జంగిల్ బుక్, లయన్ కింగ్ లాంటి సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతూనే కమర్షియల్ గా కూడా సక్సస్ అయ్యాయి కాని మన దెగ్గర ఇలాంటి జాన్రాలో సినిమాలు చాలా తక్కువ. ‘ఈగ’ సినిమాతో రాజమౌళి ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారో మనకి తెలిసిందే. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు వస్తున్నా అవి అంతగా ఆకట్టుకోవట్లేదు. ఈ నేపధ్యంలో నిత్యం ప్రయోగాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న యువ కథానాయకుడు రక్షిత్ శెట్టి మరో విభిన్నమైన చిత్రం ‘777 చార్లి’తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.

కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రం విడుదలకు సన్నద్ధమవుతోంది. ఇందులో ఓ కుక్క టైటిల్ పాత్రలో నటించడం విశేషం. రక్షిత్ శెట్టి ఇందులో ప్రధాన పాత్రధారిగా నటిస్తూ జి.ఎస్.గుప్తాతో కలిసి ఈ సినిమాను నిర్మించారు. కిరణ్ రాజ్.కె దర్శకుడు. రక్షిత్ శెట్టి బర్త్ డే సందర్భంగా ఈ సినిమా తెలుగు టీజర్‌ను ఆదివారం నేచురల్ స్టార్ తన వాల్‌పోస్టర్ సినిమా యూట్యూబ్ ఛానల్లో విడుదల చేసి యూనిట్‌కు అభినందనలు తెలిపారు.
ఈ టీజర్ ఇప్పుడు రికార్డ్ వ్యూస్ తో చెలరేగిపోతోంది. టీజర్ చూసేందుకు చాలా బాగుండటంతో ప్రేక్షకుల నుండి విశేష స్పందన వస్తోంది. విడుదలైన దగ్గర నుండి 3.7 మిలియన్స్ వ్యూస్ తో యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. ఇందులో రక్షిత్ శెట్టి ధర్మ అనే పాత్రలో నటిస్తున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. మరి ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలియాలంటే రిలీజ్ వరకూ వేచి చూడాల్సిందే.