
‘సౌదర్య లహరి స్వప్న సుందరి’ అనే పాట అందరికి గుర్తే ఉండే ఉంటది. శ్రీకాంత్, దీపా భట్నాగర్, రవళి కలిసి నటించిన పెళ్లి సందడి సినిమాలోని ఈ సాంగ్ అప్పట్లో రాష్ట్రం అంతా మారుమోగిపోయింది. ఈ పాట మాత్రమే కాదు సినిమా కూడా చాలా పెద్ద బ్లాక్ బస్టర్. జనవరి 12,1996 న విడుదలైన పెళ్లి సందడి సినిమా ఈ రోజుతో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అప్పట్లో అగ్ర దర్శకులతో ఒకరైన కె. రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ మరియు కథతో వచ్చిన ఈ సినిమాకి విడుదల నుంచి జనాలు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమాలో విజయ్ కృష్ణగా అమాయకంగా కనిపించే క్యారెక్టర్ లో శ్రీకాంత్ నటన అందరిని అలరించింది. అలాగే హీరోయిన్స్ గా చేసిన రవళి, దీప్తి భట్నాగర్ వారి నటనతో, అందంతో తెలుగులో అభిమానులని సంపాదించుకున్నారు. ఇక ఈ సినిమా 29 సెంటర్స్ లో 175 రోజులు ఆడి అప్పట్లో రికార్డ్ సృష్టించింది. ఈ రికార్డ్ తెలుగులో చాలా తక్కువ సినిమాలకి ఉంది. అలాగే పెళ్లి సందడిని హిందీలో మేరే సపునోకి రాణి అని రీమేక్ చేశారు. అలాగే బెంగాలీ లో అదే సంవత్సరం వచ్చి పెద్ద హిట్ అయిన బియర్ పూల్ సినిమా కూడా పెళ్లి సందడి కథని ఆధారంగా చేసుకొని తీసిన సినిమానే. అశ్వినిదత్, అల్లు అరవింద్ కలిసి నిర్మించిన పెళ్లి సందడి ఇప్పటికి చాలా మందికి ఫేవరెట్ సినిమా.