
అప్పటి వచ్చిన ఫ్లాప్స్ అన్నిటికి పూరి ఒక్క సినిమాతో చెక్ పెట్టారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇలియానా జంటగా నటించిన చిత్రం ‘పోకిరి’. ఈ చిత్రం అప్పటి వరకూ తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అన్ని రికార్డులను తిరగరాసింది. 15 ఏళ్ల క్రితం 2006 ఏప్రిల్ 28న ఈ సినిమా విడుదలైంది. ఈ చిత్రంలో మహేష్ బాబులోని కొత్త యాంగిల్‌ను పూరీ జగన్నాథ్ ఆవిష్కరించాడు. మహేష్ బాబు చెప్పే “ఎవడు కొడితే దిమ్మ దిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు”. లాంటి డైలాగులు ప్రేక్షకుల మదిలో ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఈ చిత్రం ప్రిన్స్ మహేష్ బాబును సూపర్ స్టార్‌గా మార్చింది. మొత్తంగా మహేష్ బాబు కెరీర్‌లో ‘పోకిరి’ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది.

ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ వైష్టో అకాడమీ బ్యానర్‌తో పాటు మంజుల గారి ఇందిరా ప్రొడక్షన్స్ లో సంయుక్తంగా తెరకెక్కించారు. దాదాపు రూ.12 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు రూ. 40 కోట్లకు పైగా షేర్ సాధించింది. ఇంత షేర్ సాధించిన తొలి తెలుగు చిత్రంగా పోకిరి రికార్డులకు ఎక్కింది. ‘పోకిరి’ చిత్రం 200 కేంద్రాల్లో 100 రోజులు పైగా నడిచి ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసింది. అప్పటి వరకు ఒకే మూసలో ఉన్న మహేష్ బాబులోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది పోకిరి చిత్రం. ఈ సినిమాలో మహేష్ బాబు చెప్పిన డైలాగులు, ఇలియానా గ్లామర్, బ్రహ్మానందం కామెడీ, యాక్షన్ సీక్వెన్స్ ఈ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించాయి.

ఈ చిత్రంలో మహేష్ బాబు పక్కా హైదరాబాదీ పోకిరిగా తనదైన శైలిలో నటించి మెప్పించాడు. చాలా చోట్ల ‘పోకిరి’ చిత్రం సంవత్సరానికి పైగా నడిచి కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఈ చిత్రం తమిళంతో పాటు హిందీ, బెంగాలీ, కన్నడ వంటి పలు భాషల్లో రీమేక్ అయింది. అంతేకాదు ఆయా భాషల్లో ఈ చిత్రం సంచలన విజయాలు నమోదు చేయడం మరో విశేషం. ‘పోకిరి’ చిత్రంతో తొలిసారి ఓవర్సీస్ మార్కెట్‌లో తెలుగు చిత్రాల ప్రభంజం మొదలైంది.